Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేరెడ్డి యాదగిరి రెడ్డి కవి, కథా రచయిత, బాల సాహితీవేత్త. వృత్తిరీత్యా మూడున్నర దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయులుగా సేవలు అందించి పదవీవిరమణ పొందారు. మేరెడ్డి యాదగిరి రెడ్డి 9 జులై 1947న నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని గడ్ది కొండారంలో పుట్టారు. శ్రీమతి వెంకటమ్మ, శ్రీ లక్ష్మీనర్సింహరెడ్డి తల్లి తండ్రులు. బాల్యం విద్యాభ్యాసం స్వగ్రామంలో, మండల కేంద్రం తిప్పర్తిలో జరిగింది. తెలుగు సాహిత్యంలో బి.ఎ., అటు తరావాత బి.ఎడ్ చదివారు. 1971లో ఉపాధ్యాయులుగా నియామకమై 2005లో పదవీ విరమణ చేశారు.
ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలకుగాను నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యా పురస్కారంతో పాటు అప్పటి రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. కాంచనపల్లి చిన వెంకట రామారావుతో కలిసి 'యువ రచయితల సమితి' స్థాపించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, 1970, 1974 మరియు 1983లో మూడుసార్లు జిల్లా రచయితల మహా సభలు ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా నిర్వహించారు. 'తెలంగాణ వైతాళికులు' రేడియో ప్రసంగాలు వీరికి పేరుతెచ్చిపెట్టాయి. రచయితగా అక్కినేని లిటరరీ గోల్డ్ మెడల్తో పాటు 'కొలిమి' కథకు వంగూరి ఫౌండేషన్ పురస్కారం అందుకున్నారు. ఇవేకాక దాశరథి రంగాచార్య కథా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, కలహంస పురస్కారం, సాహితీ మేఖల పురస్కారం వీరి ఖాతాలో ఉన్నాయి.
కథా రచయితగా పేరున్న మేరెడ్డి రచనా రంగంలోకి ప్రవేశించింది బాల సాహిత్య రచనతోనే. వీరి తొలి కథ 1966లో 'ప్రజామత'లో 'గుజ్జన గూళ్ళు' శీర్షికన వీరి కథలు వచ్చేవి. అయిదు సంవత్సరాల కాలంలో దాదాపు ముప్పైకి పైగా వీరి కథలు యిందులో అచ్చయ్యాయి. కాంచనపల్లి చినవెంకటరావు, కొడవటిగంటి కుటుంబరావులు తన రచనా వ్యాసంగానికి మార్గదర్శకులుగా చెబుతారు మేరెడ్డి. బహుశా ఆ ప్రభావం వల్లనేకావచ్చు వీరి తెలుగు వాక్యం సరళంగా, సుందరంగా ఉంటుంది. రచయితగా ఇప్పటికీ వీరి 100 కథలు అచ్చయ్యాయి. మరో 100 కవితలు రాశారు. వివిధ విషయాలపైన పలు పత్రికల్లో వ్యాసాలు రాశారు. పాఠకునిగా తనకు నచ్చిన వివిధ పుస్తకాలపైన 20 వరకు సమీక్షలు రాశారు.వీటితోపాటు వివిధ ప్రక్రియల్లోనూ వీరి రచనలు వచ్చాయి. 'నల్లగొండ జిల్లా వైతాళికులు' పుస్తకం త్వరలో రానుంది. 1970లో యువలో కథ ప్రచురణ గురించి ఎంత గొప్పగా చెబుతారో, సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ సారథ్యంలో జరిగిన కార్యశాలలో పాల్గొని తాను రాసిన 'రైతు వాచకం' గురించి అంతే గర్వగా చెబుతారు. రైతు బిడ్డ కదా... ఆయన కథల్లో... కవితల్లో.. నానీల్లో ఆ 'మట్టి' వాసన మనకు కనిపిస్తుంది.
'మట్టి కథలు', 'కొలిమి కథలు', 'బొడ్రాయి కథలు' మేరెడ్డి యాదగిరి రెడ్డి ముద్రిత కథా సంపుటాలు. ఇవేకాక ఆచార్య ఎన్. గోపి కవితా రూప సృష్టి అయిన నానీల ప్రక్రియలో 'రైతు నానీలు' రాశారు. 'మట్టి వాసన' మేరెడ్డి యాదగిరి రెడ్డి కవితా సంపుటి. ఇవేకాక బాలల కోసం, వయోజనుల కోసం మేలిమి రచనలు చేశారీ యన. స్టేట్ రిసోర్స్ సెంటర్ వారి కోసం పది పుస్తకాలు రాశారు. అవి 'రైతు వాచకం, నమ్మకమైన కుక్క, రెండు చిలు కలు, అల్సర్, చదువుకున్న ఇందిర, ఊరు వెలిగింది, నీలినాలుక, పట్టా వచ్చింది, పిసినారి చలపతి, జబ్బవాపు' మొదలైనవి.
కథా రచనలోనే కాదు బాలల కథా రచనలోనూ వీరిది విలక్షణ శైలి. పిల్లల కోసం వాళ్ళ మనసులు హత్తుకునేలా రాస్తారు మేరెడ్డి. 'సహవాస దోషం' అటువంటి కథే. చిలకల ద్వారా మన మీద పరిసరాలు, వ్యక్తులు చూపించే ప్రభావం గురించి ఎంతో చక్కగా చెబుతారాయన. ప్రృకృతిలోని అనేక అంశాల్లో అనేక వైవిధ్యాలు, నూతనత్వాలు ఉంటాయికదా! దానిని నేపథ్యం చేసుకుని అనేక కథలు రాశారు రెడ్డిగారు. బాల చెలిమి తెచ్చిన పెద్దలు రాసిన బాలల కథల్లోని 'చీమలు నేర్పిన పాఠం' కథను చూస్తే ఆ విషయం తెలుస్తుంది. చీమల పని అవి పడే కష్టం, ఆహారాన్ని పోగేసుకోవడం వంటివి మనకు తెలుసు. 'బలవంతమైన సర్పము' అంటూ పద్యం కూడా మనం చదువుకున్నాం కదా! చీమల పనిని చూసి తాను మారి తల్లితండ్రులకు సహాయంగా ఎలా సురేశ్ అనే అబ్బాయి మారిపోయాడో ఈ కథలో చూస్తాం. గేయ రచనలోనూ మేరెడ్డిది మేటి హస్తం. 'కాకి కాకి / ఏమి కాకి/ కవ్వర కాకి / రంగు రంగు / ఏమి రంగు /నలుపు రంగు' అంటూ రంగును పిల్లలకు పరిచయం చేస్తారు. ఇదే కోవలో అరటి ఆకు ద్వారా ఆకుపచ్చ రంగు వంటివి తెలిపే ప్రయత్నం చేస్తారు. 'పిల్లలం మేం పిల్లలం / అరవిరిసే మల్లెలం' అంటూ ఆ పిల్లలు వెలిగే దివ్వెలని, అవకాశమొస్తే ఎవరెస్టైనాఎక్కేస్తారని చెబుతారా ఒక బాల గీతంలో. బాలల కోసం నిరంతరం తపిస్తూ, బాల సాహిత్యాన్ని అత్యంత ప్రేమగా రాస్తున్న బాలల కథల బంగారు కడ్ది మేరెడ్డి గారికి జయహో! జయహో బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548