Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇండియన్ సినిమా షో మేన్'గా పేరొందిన రాజ్‌కపూర్ వెండితెరపై కమనీయ కావ్యాలని, రమణీయ దృశ్యాల్ని పండించిన కలల కర్షకుడు. ప్రేమ కథల్ని కొత్త కోణంలో ఆవిష్కరించి ప్రేక్షకుల చేత కంట తడిపెట్టించి... గుండెల్ని పిండేసిన కరడు గట్టిన దార్శనికుడు రాజ్‌కపూర్. భారతీయ తెరను తన సినిమాలతో సగర్వంగా వెలిగించిన అసమాన నటుడు రాజ్‌కపూర్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చార్లీ చాప్లిన్‌ను అనుకరిస్తూ రాజ్‌కపూర్ 'చాప్లిన్ ఆప్ ది ఇండియా' గానూ పేరొందాడు. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్‌గా, కథకునిగా రాజ్‌కపూర్ తన బహుముఖ ప్రజ్ఞతో హిందీ చిత్రసీమను అలరించాడు. 1948లో రాజ్‌కపూర్ ఆర్కె స్టూడియోస్‌ను నిర్మించి ఎన్నో క్లాసిక్ సినిమాలకు ప్రాణం పోసి, చిత్రరంగానికి అజేయమైన సేవలందించాడు. రాజ్‌కపూర్ రొమాంటిక్ మూవీస్‌లో నటించడమే కాకుండా, సదరు చిత్రాలను దర్శకునిగా తెరకెక్కించడంలోనూ తనదైన బాణీ పలికించాడు. ఆయన బాణీని అనుసరిస్తూ కథానాయికలను అందంగా చూపించి ఆకట్టుకోవడంలో ఎందరో దర్శకులు కృతకృత్యులయ్యారు. రాజ్‌కపూర్ మూడు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు, పదకొండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. రాజ్‌కపూర్ సినిమాలు ఆసియా, ఐరోపా దేశాలతో సహ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1971లో పద్మ భూషణ్ పురస్కారంతో పాటు, చలన చిత్రరంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డును 1987లో ఇచ్చి సత్కరించింది.
రాజ్‌కపూర్ 1924వ సంవత్సరం డిసెంబర్ 14న ఇప్పటి పాకిస్తాన్ పెషావర్ నగరంలో హిందూ పంజాబీ కుటుంబంలో పృథ్వీరాజ్ కపూర్, రాంసరణి దేవికపూర్ దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించాడు. రాజ్‌కపూర్ పాకిస్తాన్లో పుట్టినప్పటికి ఉన్నత చదువుల కోసం ఇండియాకి రావటం జరిగింది. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ కూడా నటుడు, ఇండియన్ సినిమా ప్రారంభంలో నటించిన నటులలలో ఒక గొప్ప నటుడు పృథ్వీరాజ్ కపూర్. ఆయన మూకీల మొదలు టాకీల ఆరంభం దాకా అపురూప పాత్రల్లో నటించి మెప్పించిన మహానటుడు. పృథ్వీరాజ్ కపూర్ తన సినిమా కెరీర్ ప్రారంభంలో చాలా నగరాలకు మారటం వల్ల రాజ్‌కపూర్ కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్, డెహ్రాడూన్, సెయింట్ జేవియర్స్ కాలేజియేట్ స్కూల్, కలకత్తా, ముంబైలలోని వివిధ పాఠశాలలో తన విద్యాభ్యాసం చేయవలసి వచ్చింది. పృథ్వీరాజ్ కపూర్‌కు ఆరుగురు సంతానం, రాజ్‌కపూర్ అందరిలో పెద్దవాడు కాగా ఆయన సోదరులు షమ్మీ కపూర్, శశి కపూర్ కూడా బాలీవుడ్లో మంచి నటులుగా పేరొందారు. రాజ్‌కపూర్ పేరు శిరీష్ నాథ్ కపూర్, తరువాత రణబీర్ రాజ్ కపూర్‌గా, ఆ తరువాత చిత్రసీమలో రాజ్‌కపూర్‌గా వెలుగొంది తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
ఇంక్విలాబ్తో సినీరంగ ప్రవేశం
1935లో రాజ్ కపూర్ తన 11 ఏండ్ల ప్రాయంలోనే 'ఇంక్విలాబ్' చిత్రంలో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తర్వాత దేవికా రాణి నాయికగా రూపొందిన 'హమారీ బాత్' చిత్రంతో పాటు, ''గౌరీ, వాల్మీకి, దిల్కి రాణి, జైల్ యాత్ర, చిట్టూర్ విజరు'' చిత్రాలలో నటించారు. 1947లో కిదార్ శర్మ తెరకెక్కించిన 'నీల్ కమల్' చిత్రం రాజ్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. మధుబాల తొలిసారి హీరోయిన్గా నటించిన ఈ సినిమా రాజ్ కపూర్‌ను నటుడిగా నిలబెట్టింది. రాజ్ కపూర్ ఓ వైపు నటిస్తూనే దర్శకత్వం వహించాలని తపించి, 1948లో తన సొంత స్టూడియో ''ఆర్కె ఫిల్మ్స్'' ను స్థాపించి దర్శకునిగా 'ఆగ్' చిత్రాన్ని నిర్మించగా, ఆ చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే ఈ చిత్ర నిర్మాణంతో ఆ కాలంలో అతి చిన్న వయస్కుడైన చిత్ర దర్శకునిగా రాజ్ గుర్తింపు పొందాడు. 1949లో మెహబూబ్‌ఖాన్ హిట్ చిత్రం 'అందాజ్'లో దిలీప్ కుమార్, నర్గీస్‌తో కలిసి నటించగా ఆ చిత్రం హిట్ సాధించింది. ఆ తరువాత విడుద లైన 'బర్సాత్' సినిమాకు నిర్మాత, దర్శకుడు, కథానాయకునిగా అతను మొదటి విజయాన్ని సాధించాడు. అప్పటి నుంచీ నటదర్శకునిగా తనదైన బాణీ పలికిస్తూ రాజ్ ముందుకు సాగాడు. ''సర్గమ్, జాన్ పెహచాన్, దస్తాన్, బావ్రే నయన్'' చిత్రాలలో రాజ్ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1951లో రాజ్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఆవారా' అనూహ్య విజయం సాధించి, రష్యాలోనూ విజయభేరీ మోగించింది. ''శ్రీ 420, సంగం, జగ్తే రహౌ, జిస్ దేశ్ మే గంగా బెహతీ హై'' వంటి చిత్రాలు సైతం ఎంతగానో అలరించాయి. ఆయన ఎన్నో ఆశలు పెట్టు కుని రూపొందించిన 'మేరా నామ్ జోకర్' పరాజయం పాలయింది. తరువాత నటునిగా అవకాశాలు తగ్గించుకొని, తనయుడు రిషీ కపూర్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'బాబీ' రూపొందించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తరువాత రాజ్ దర్శకత్వంలో ''సత్యం శివం సుందరం, ప్రేమ్ రోగ్, రామ్ తేరీ గంగా మైలీ'' వంటి సినిమాలు తెరకెక్కి జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ''ఆర్కె ఫిల్మ్స్'' భ్యానర్ పై కాకుండా ఇతర నిర్మాణ సంస్థలలో చిత్రాలు ''దస్తాన్, అన్హోనీ, ఆV్‌ా, చోరి, అనారీ, ఛాలియా, దిల్ హారు టు హై'' లలో రాజ్ కపూర్ నటించాడు. సామాజిక చిత్రాలైన ''బూట్ పోలిష్, అబ్ దిల్లీ డోర్ నహిన్'', లను కూడా నిర్మించాడు. 1964 లో, అతను రాజేంద్ర కుమార్, వైజయంతీ మాలతో పాటు రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం 'సంగం' చిత్రాన్ని నిర్మించాడు. దానికి దర్శకత్వం వహించి, అందులో నటించాడు. ఇది అతని మొదటి కలర్ చిత్రం. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. అయితే ఇదే రాజ్ విజయం సాధించిన సిసిమాలలో చివరిది. అతని తరువాతి చిత్రాలు ''దుల్హా దుల్హాన్, అరౌండ్ ది వరల్డ్, సప్నోన్ కా సౌదగర్,'' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అపజయాలు పొందాయి. 1975లో తన కుమారుడు రణధీర్‌తో కలిసి మళ్లీ 'ధరం కరం'లో నటించాడు. ఈ చిత్రానికి రణధీర్ దర్శకత్వం వహించాడు. 70వ దశకం చివరి భాగంలో... 80వ దశకం ప్రారంభంలో మహిళా చిత్రాలను జీనత్ అమన్‌తో ''సత్యం శివం సుందరం, ప్రేమ్ రోగ్'' పద్మిని కొల్హాపురే ''రామ్ తేరి గంగా మెయిలీ, మందకిని'' చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించాడు. 1970 చివరలో 'నౌక్రీ', రాజేష్ ఖన్నాతో, 'అబ్దుల్లా' లో సంజరు ఖాన్ తో పేరున్న సహాయక నటుని పాత్ర పోషించాడు. 'రాజ్ దో జాసూస్', 'గోపిచంద్ జాసూస్' అనే రెండు కామెడీ చిత్రాలలో డిటెక్టివ్ పాత్ర పోషించాడు. రాజ్ కపూర్ చివరి చిత్రం 'వకీల్ బాబు' లో తన తమ్ముడు శశి కపూర్ తో కలిసి నటించాడు. అతను 1982 లో చిత్రీకరించిన, పూర్తి చేసిన చిత్రం 'చోర్ మండలి' ఈ చిత్రంలో తోటి నటుడు అశోక్ కుమార్ సరసన నటించాడు. చట్టపరమైన వివాదం కారణంగా ఆ చిత్రం విడుదల కాలేదు. బ్రిటిష్ నిర్మిత టెలివిజన్ చిత్రం 'కిమ్' లో అతిధి పాత్ర.లో నటించిన చివరి చిత్రం1984 లో విడుదలైంది
మజిలీ చేరని రాజ్‌కపూర్, నర్గీస్‌ల ప్రేమ
రాజ్‌కపూర్ తన సినిమా షూటింగ్ కోసం స్టూడియో వెతుక్కునే ప్రయత్నంలో నర్గీస్ వాళ్ళమ్మ జద్దన్‌బాయి సలహా కోసం వాళ్లింటికి వెళ్ళినపుడు నర్గీస్‌ను చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. నీలి కళ్ల అందగాడైన రాజ్ కపూర్‌ని చూసిన నర్గీస్ సైతం ఆయన పట్ల ఆకర్షితురాలయ్యింది. వారిరువురు ఒకరికొకరు పరిచయమయ్యేనాటికి నర్గీస్ వయసు 20, రాజ్ కపూర్ వయసు 22. అప్పటికే నర్గీస్ ఎనిమిది హిట్ సినిమాలను ఇచ్చింది. రాజ్‌కపూర్ మాత్రం ఇబ్బందిలో ఉన్నాడు. ఆ సమయంలో తను నటిస్తున్న 'ఆగ్' సినిమాలో నర్గీస్ కోసం ఒక పాత్రను సృష్టించాడు. అనంతరం వచ్చిన 'బర్సాత్' సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమానుబంధం బలపడింది. రాజ్‌కపూర్ సొంత నిర్మాణ సంస్థ 'ఆర్ కే ఫిల్మ్స్' ఏర్పాటు చేసి తీసిన అన్నీ చిత్రాల్లో నర్గీస్ నటించింది. ఆ ఇద్దరు జంటగా 16 సినిమాలల్లో నటించి సక్సెస్ జోడీగా గుర్తింపు పొందారు. ఒక దశలో 'ఆర్ కే ఫిల్మ్స్'లో తప్ప బయటి బ్యానర్స్‌లో నర్గీస్ నటించదు అనే అప్రకటిత శాసనాన్ని రాజ్‌కపూర్ అమలు చేశాడని ఇండిస్టీలో చెప్పుకునేవారు. అయితే 'ఆర్కే ఫిల్మ్స్' ఆర్థిక కష్టాల్లో వున్నపుడు రాజ్‌కపూర్ అనుమతితో బయటి సిని మాల్లో నటించి ఆ సినిమాల ద్వారా వచ్చిన పారితో షికంతో పాటు తన నగలను అమ్మి 'ఆర్కే ఫిల్మ్స్' ఖజానాలో జమ చేసేదట. నా పిల్లలకు నా భార్య తల్లి అయితే 'ఆర్ కే ఫిల్మ్స్' కి తల్లి నర్గీస్ అని రాజ్ కపూర్ తరచుగా సినీ పెద్దలతో చెప్పేవాడట. అయితే వీరిద్దరి ప్రేమ ఒకటి కావడానికి రెండు కారణాలు అడ్డు పడ్డాయి. అదివరకే రాజ్ కపూర్‌కి పెళ్ళయి పిల్లలు ఉండటం, నర్గీస్ మతం, ఈ ఇరువురి ప్రేమకి అడ్డంకి అయ్యాయి. రాజ్ తనని గ్రాంట్‌గా తీసుకుని 'శ్రీ 420' చిత్రంలో తనకు ఇచ్చిన గ్లామర్ లేని పాత్రతో అసంతృప్తి చెంది కోపంతో, 'మదర్ ఇండియా' పై సంతకం చేసింది. దీంతో తమ ప్రేమ సుఖాంతం అవుతుందనుకున్న ఇద్దరికీ నిరాశే ఎదురవ్వడంతో నర్గీస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తన డిప్రెషన్ తగ్గడానికి 'మదర్ ఇండియా' సెట్లో తన సహ నటుడు సునీల్ దత్‌ని ఊరటగా మలచుకుని అతనికి దగ్గరవ్వడమే కాకుండా, పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి రాజ్‌కపూర్ 'ఆర్కే ఫిల్మ్స్' కార్యాలయంలో నర్గీస్ ఉపయోగించిన వస్తువులను, గదిని అపురూపంగా చూసుకుంటూ రోజంతా మద్యం సేవించి రాత్రికి ఇంటికి వచ్చి బాత్‌టబ్‌లో ఏడుస్తూ కుమిలిపోయేవాడని, నర్గీస్ తనను మోసం చేసిందని రాజ్ కపూర్ ఎప్పుడూ భావిస్తు.. ఏడుస్తూ గడిపేవాడని అతని భార్య కృష్ణ కపూర్ చాలా సార్లు చెప్పింది. ఇలా ఈ ఇద్దరి ప్రేమ గమ్యం చేరకుండానే ముగిసిపోయింది. అయితే సునీల్ దత్తో నర్గీస్ పెళ్లి గురించి విని రాజ్‌కపూర్ విస్తు పోయాడు. కొన్నాళ్ళ తర్వాత రాజ్ కపూర్ ఎప్పటిలాగే తన కథానా యికలతో ప్రేమ కలాపాలు సాగిస్తూ అటు కుటుంబం దూరం కాకుండా చూసుకు న్నాడు. 1960వ దశకంలో రాజ్ కపూర్ 'సంగం' చిత్ర షూటింగ్ సందర్భంగా వైజయంతి మాలతో ప్రేమలో పడ్డట్లు చెబుతారు. కపూర్‌తో ఎప్పుడూ సంబంధం లేదని వైజయంతి మాల ఖండించింది. కపూర్‌కు దక్షిణ నటి పద్మినితో కూడా సంబంధం ఉందని, 2017లో అతని రెండవ కుమారుడు రిషి కపూర్ తన ఆత్మకథ 'ఖుల్లం ఖుల్లా' లో తండ్రి వ్యవహారాలను ధృవీకరించాడు.
అత్యంత ప్రజారదణ పొందిన రాజ్ కపూర్ పాటలు
ఆ రోజులలో టి.వి మాధ్యమం లేదు. ఉన్నది రేడియో.. అందులో బినాకా గీత్ మాల అత్యంత ప్రజారదణ పొందిన సినిమా గీతాల కార్యక్రమం. ఇందులో రాజ్‌కపూర్ సినీ కెరీర్ లో టాప్‌గా నిలిచిన పాటలు. రొమాంటిక్, భావోద్వేగ, మెలోడీతో కూడిన మధురమైన పాటలు 'శ్రీ 420' చిత్రంలో ''మేరా జూతా హై జపానీ...., ప్యార్ హువా ఇక్రార్ హువా...., రామయ్య వస్తావయ్యా....''తో పాటు, శంకర్ జై కిషన్ సంగీతంలో 'అవారా' చిత్రంలో ముఖేశ్ ఆలపించిన ''అవారా హున్....'', 'అనారీ' చిత్రంలోని ''కిస్ కి ముస్కురహాతో పే....'', 'మేరా నామ్ జోకర్' చిత్రంలోని ''జీనా యహాన్ మర్నా యహాన్.., జానే కహాన్ గయే వో దీన్....'', 'సంగం' సినిమాలోని ''దోస్త్ దోస్త్ నా రహా...., బోల్ రాధా బోల్...'', 'తీస్రీ కసమ్' చిత్రం లోని ''సాజన్ రే ఝాత్ మత్ బోలో....'', 'చోరీ చోరీ' సినిమా లోని ''అజా సనమ్ మధుర్ చాందినీ మే హమ్...., యే రాత్ భీగి భీగి....'', 'ఛలియా' సినిమాలోని ''మేరే తూటే హ్యూ దిల్ సే...'' పాటలు విశేష ప్రజారదణ పొంది శ్రోతలకు వీనులవిందు చేసాయి.
అవార్డులు
భారతీయ చలన చిత్ర రంగానికి రాజ్ కపూర్ అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం ఆయనను 1971లో పద్మభూషణ్ అవార్డుతోనూ, 1987లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతోనూ గౌరవించింది. రాజ్ కపూర్ ముఖ చిత్రంతో ఉన్న తపాలా బిళ్ళను భారత తపాలా శాఖ 2001 డిసెంబర్ 14 న విడుదల చేసి అతనిని గౌరవించింది. 2001లో స్టార్ డస్ట్ ''మిలీనియం ఉత్తమ దర్శకుడు'' అవార్డును ప్రకటించగా, 2002 లో స్టార్ స్క్రీన్ రాజ్ కపూర్ ను ''షోమాన్ ఆఫ్ ది మిలీనియం'' గా ప్రకటించింది. 2002లో రాజ్‌కపూర్‌కు ''ఎన్టీఆర్ జాతీయ అవార్డు''ను ప్రకటించారు. మార్చి 2012 లో ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్ లోని వాక్ ఆఫ్ ది స్టార్స్‌లో రాజ్ కపూర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1965 లో అతను 4 వ మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యునిగా ఉన్నాడు. గత ఏడాది ప్రసిద్ధ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన 'రాజ్ కపూర్-ది మాస్టర్ ఎట్ వర్క్' పుస్తకాన్ని న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
మరణం
రాజ్‌కపూర్ తన చివరి రోజులలో ఆస్తమా వ్యాధితో భాధపడ్డాడు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు తీసుకునే సమయంలో రాజ్‌కపూర్ ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. ఆసుపత్రిలో దాదాపు ఒక నెల చికిత్స తీసుకున్న తరవాత 1988 లో 63 ఏళ్ల వయసులో మరణించాడు. రాజ్ కపూర్ చనిపోయాడని తెలిసిన వెంటనే ఆనాటి దేశప్రధాని రాజీవ్ గాంధీ సెక్యూరిటీ కోసం కూడా చూడకుండా స్వయంగా కారు డ్రైవ్ చేసుకుని హాస్పిటల్‌కి వెళ్ళటం, రన్ వే పై తన మంత్రులతో నిలబడి పార్ధివదేహాన్ని స్వయంగా దగ్గరుండి విమానంలో తరలించడం, భారతదేశంలోని సినిమా హాల్స్ మాత్రమే కాకుండా పాకిస్తాన్‌లోని సినిమాహాల్స్ కూడా గౌరవ సూచకంగా మూసేయటం లాంటి విషయాలు సినీ ప్రేమికుల మనసుల్లో ఆయన స్ధానాన్ని చాటి చెబుతాయి.
రాజ్‌కపూర్ ఇంక్విలాబ్ చిత్రంలో బాల నటుడిగా తెరపై కనిపించి హమారీ బాత్, గౌరీ, వాల్మీకీ, దిల్ కీ రాణి చిత్రాలలో వివిద పాత్రలు పోషించి, 1948 లో ఆర్కే ఫిలిమ్స్ స్థాపించి ఎన్నో వైవిద్యభరితమైన చిత్రాలకు రూపకల్పన చేసి తనదైన శైలిని తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ సాదించారు. ఆయన సినీ కెరీర్ లో ''ఆగ్, ఆవారా, శ్రీ 420, మేరా నామ్ జోకర్, జీస్ దేశ్ మే గంగా బెహతి హై, సంగం, సత్యం శివం, సుందరం'' లాంటి ఎన్నో సినీమాలు బాలీవుడ్ చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచాయి. రాజ్ కపూర్ తెరపైభావోద్వేగాల్ని పతాక స్థాయిలో పండించి హృదయాల్ని ఆవిష్కరించడం, నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్న తాత్వికతను ఆసాంతం అర్థం చేసుకుని తెరపై నవ్వుతూ ప్రేక్షకుల్ని ఏడ్పించడం కూడా రాజ్ కపూర్ కే చెల్లింది.
ఎన్టీఆర్ వలెనే రాజ్ కపూర్ కూడా అభిరుచిగల నిర్మాత. ఎన్టీఆర్ నిర్మించిన 'దానవీరశూర కర్ణ' చిత్ర నిడివి 4 గంటల 17 నిముషాలయితే, రాజ్ కపూర్ నిర్మించిన 'మేరా నామ్ జోకర్' నిడివి మొదట 4 గంటల 24 నిముషాలు కాగా తర్వాత అందులో 40 నిముషాలు తగ్గించారు. ఈ రకంగా అప్పట్లో ఎక్కువ నిడివి గల భారతీయ చిత్రాల నిర్మాతలుగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. ఆ తర్వాత 1987లో తమస్ అనే హిందీ చిత్రం, 2005లో 'తవమై తవమిరుందు' అనే తమిళ చిత్రం ఈ రికార్డును అధిగమించింది. దీని నిడివి నాలుగు గంటల 35 నిమిషాలు. ఎక్కువసేపు సినిమాలయినప్పటికీ ఎన్టీఆర్, రాజ్ కపూర్ ల సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే ముగ్గురు హీరొయిన్ లను పెట్టి తీసిన 'మేరా నామ్ జోకర్' వాణిజ్యపరంగా దెబ్బతింటే, మూడు పాత్రలతో సినిమా ఆద్యంతమూ తానే కనిపించి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'దానవీరశూర కర్ణ' వ్యాపారపరంగానూ విజయవంతమైంది.
- పొన్నం రవిచంద్ర, 9440077499
(డిసెంబర్ 14న రాజ్ కపూర్ జయంతి)