Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మందు మహత్యం అనే మందు కథ చెబుతూ మందుదాసు మరో పిట్టకథ చెప్పాడు. అయ్యో నగరంలో అప్పారావు అనే యువకుడు మందుకొట్టి బైక్ మీద వస్తూ రెండు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. మొదటిసారి పోలీసులు మందలించి వదిలేసారు. రెండోసారి ఫైన్ వేసారు.
అతనికి ఈ మధ్యనే పెళ్ళైంది. పెళ్ళి అయినప్పటి నుంచీ మందు పార్టీ ఇవ్వవలసిందిగా స్నేహితులు అతణ్ణి ఒక్కతీరుగా బలవంతం చేసారు. రోజూ ఏదో కథ చెప్పి అతను తప్పించుకునే వాడు. కానీ ఆ రోజు అతని పప్పులుడకలేదు.
ఒక బార్లో అతను స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు. అర్ధరాత్రి అయ్యింది. బార్ మూసివేయడంతో వాళ్ళు లేవక తప్పలేదు. బైక్ మీద బయల్దేరిన యాదగిరి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. ఈ సారి పోలీసులు అతణ్ని లాకప్‌లో ఉంచారు.
అర్థరాత్రి అయినా భర్త ఇంటికి రాకపోవడంతో అతని భార్య ఆందోళన చెందింది. పరిపరి ఆలోచనల్లో మునిగిపోయింది. తన భర్తకు యాక్సిడెంట్ గాని జరిగిందా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అని ఆమె అనుకొన్నది. అలాంటి ఆలోచనలు రాగనే ఆమె వణికిపోయింది. ఉవ్వెత్తున లేచిన కెరటాల మధ్య చిక్కిన పడవలా ఊగిపోయింది.
ఆమె భర్త ఫొటో తీసుకుంది. పక్కింటి వాళ్ళ అబ్బాయిని వెంటబెట్టుకుని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. సాయంత్రం నుంచి తన భర్త కనిపించడం లేదని ఎస్.ఐకి ఫిర్యాదు చేసింది. భర్త ఫొటో కూడా ఇచ్చింది.
ఎస్.ఐ. ఆ ఫొటోను నిశితంగా పరిశీలించాడు. లాకప్‌లో ఉన్న యువకుణ్ని చూపించి-
'ఇతనేనా నీ భర్త' అని అడిగాడు.
అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భార్యను చూసి యాదగిరి వెలవెలబోయాడు. మొహం ఎక్కడ దాచుకోవాలో తెలియక తికమకపడ్డాడు.
బ్రాంది తాగిన వాడు బ్రహ్మలోకమునకేగు
విస్కీ కొట్టిన వాడు విష్ణు చెంతజేరు
ఏమి తాగని వాడు ఎడ్డినా కొడుకురా
మందు భాగ్యశీల మరి మాటలేల
అంటూ రాగయుక్తంగా మందు దాసు పద్యం పాడాడు. మందు కథ తరువాత భక్తులకు తీర్థం కింద మందు పోసారు.
'మధ్య' ప్రదేశ్ నుంచి సాద్వి నిషాదేవిని దిక్కుమాలిన రాష్ట్రానికి రప్పించారు. మందు ప్రవచనాల్లో ఆమె మందుకొట్టిన చేయి.
అయ్యో నగరంలోని విశ్వభారతిలో నిషాదేవి మందు ప్రవచనాల్ని ఏర్పాటు చేసారు.
మందు తాగితే వానలో తడిసిన వాడు గరం గరం ఛారు తాగినట్టుంటుంది. చలికాలం రగ్గు కప్పుకుని పడుకున్నట్లుంటుంది.
ఎండాకాలం చెట్టు నీడలో నిలబడిన ట్లుంటుంది. మందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎలా అంటారా? ఎవడికైనా డ్యాన్సు చెయ్యాలని ఉంటే ఎవరైనా ఏమనుకుంటారోనని వెనకాడుతాడు. అలాంటి వాడికి రెండు పెగ్గుల విస్కీ తాగించండి. డ్యాన్సు మాట అటుంచి శివతాండవం చేస్తాడు. వాడి ముందు మైఖేల్ జాక్సన్ కూడా తీసికట్టే.
మందు నవ్విస్తుంది. కవ్విస్తుంది.
ఉన్నదంతా ఊడ్పించి జీవిత పరమార్థాన్ని బోధిస్తుంది. మందు మమ్మల్ని ఉదారుల్ని చేస్తుంది. జేబులో ఉన్నదంతా దానం చేస్తారు. కుతుబ్ మినార్ను కొనేస్తానని గప్పాలు కొడతారు. మందు కొట్టినోడు అబద్ధం చెప్పడు. అంతా నిజమే చెబుతాడు'' అని నిషాదేవి ప్రవచించింది.
''రాష్ట్రంలో మందు కథలు, మందు ప్రవచనాలు ఎందుకు చెబుతున్నారు'' అని ఒకడు, పక్కనున్న వాణ్ని అడిగాడు.
'కోవిడ్ వల్ల లాక్డౌన్ పెట్టారు. దాంతో ఎక్సైజ్ ఆదాయం తగ్గింది.' అని పక్కనున్నవాడు చెప్పాడు.
'తగ్గితే ఏమవుతుంది?'
'ప్రభుత్వం మునుగుతుంది'
'అదెలా'
'ప్రభుత్వం ఎవరితో నడుస్తున్నది. ముఖ్యమంత్రితోనా? మంత్రుల తోనా? ఎమ్మెల్యేల తోనా? అధికారులతోనా? పోలీసులతోనా? వీరెవ్వరితో నడవడం లేదు.'
'మరి ఎవరితో నడుస్తున్నది'
'మందుతో నడుస్తున్నది'
ముఖ్యమంత్రి లత్కోర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. 'మందుకొట్టేవారు త్యాగ ధనులు. వారు ఆరోగ్యాన్ని లెక్క చెయ్యకుండా మందు కొడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నారు. మందు బాబులను చులకన చెయ్యకూడదు. వాళ్ళను గౌరవించాలి. వారికి సన్మానం చెయ్యాలి. మందుశ్రీ మందు భూషణ, మందు రతన్న వంటి బిరుదులను మందుబాబులకిస్తాం. తల్లులందరూ శిశివులకు ఉగ్గు పాలకు బదులు ఉగ్గు మందు పట్టాలి.
మందును సుర అని అంటారు. సుర తాగే వరు సురులు సురులుండేదే స్వర్గం. మన రాష్ట్రాన్ని స్వర్గంగా మార్చడానికే నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను' అని ముఖ్యమంత్రి అన్నాడు.
లిలిలి
అది పెద్ద చెరువు.
ఆ చెరువు అమ్మో నగరం నడిబొడ్డులో ఉంది.
దానిలో తామర పువ్వులూ లేవు. కలువ పువ్వులూ లేవు. ఫ్యాక్టరీలు వదిలిన నీళ్ళు ఆ చెరువులోనే కలుస్తాయి. డ్రైనేజీ నీళ్ళు దానిలోకే వస్తాయి.
తలుపు చాటున నిలుచున్న అమ్మాయిలా అవి గుర్రపు డెక్క చాటు నుంటాయి. దాన్ని పీకి పారేసిన తరువాతే అవి కనిపిస్తాయి.
అప్పుడప్పుడూ ఆ చెరువు నుంచి అదో రకం వాసన వస్తూ ఉంటుంది. అది ముక్కు పుటాలను బద్దలు చేస్తుంది. అది ముల్లోకాల్ని చూపిస్తుంది. అది కడుపును కలయ తిప్పేస్తుంది. అది అమాంతం నడక వేగాన్ని పెంచేస్తుంది.
ఆ చెరువులో దోమలు తండోపతండాలుగా ఉన్నాయి. వాటిలో డెంగ్యూ దోమలున్నాయి. మలేరియా దోమలున్నాయి. ఫైలేరియా దోమలున్నాయి. దొడ్డు దోమలున్నాయి. బక్క దోమ లున్నాయి. పిల్ల దోమలున్నాయి. పెద్ద దోమలున్నాయి. పోకిరీ దోమలున్నాయి. పోరంబోకు దోమలున్నాయి. గయ్యాళి దోమ లున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల్లో రకరకాల మనుషులున్నట్లే ఆ దోమల్లో రకరకాల దోమలున్నాయి.
రాత్రి కాగానే ఇవన్నీ నగర సంచారానికి బయల్దేరతాయి. తమ రక్త దాహాన్ని తీర్చుకుంటాయి.
ఒక శుభరాత్రి ఓ దొడ్డుదోమ మహామంత్రి లత్కోర్‌ను కుట్టింది. అదేమి చిత్రమో దానికి మహామంత్రి లక్షణాలొ చ్చాయి. అది అచ్చం లత్కోర్ లాగే ప్రవర్తిస్తోంది. కొన్ని దోమలు మంత్రులను కుట్టాయి. వాటికి మంత్రుల లక్షణాలొచ్చాయి. మరికొన్ని దోమలు ఎంచక్కా ఎమ్మెల్యేలను కుట్టాయి. అవి వారిలాగే ప్రవర్తించాయి.
పోలీసులను కుట్టిన దోమలకు పోలీసుల లక్షణాలూ, డాక్టర్లను కుట్టిన దోమలకు డాక్టర్ల లక్షణాలూ, జెనాలను కుట్టిన దోమలకు జెనాల లక్షణాలూ వచ్చాయి.
కన్నె దోమలు, కుర్ర దోమలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం పాతకాలపు దోమలకు నచ్చలేదు.
అవి బుగ్గలు నొక్కుకుంటూ -
''మన కాలపు దోమలు ఇలా ఉండేవా?''
''ఈ కాలపు దోమలు బరితెగించి తిరుగుతున్నాయొదినా!''
''ఆ ఇకఇకలూ పకపకలూ''
''పిదపకాలం పిదప బుద్ధులు''
''పిల్లలకు బుద్ధి లేకున్నా తల్లిదండ్రులకుండొద్దా?''
''ఇవాళ్రేపు పెద్ద వాళ్ళ మాట ఎవరు వింటున్నారని''
''నువ్వన్నదీ నిజమేననుకో''
''పిల్లల్ని కట్టడిలో పెట్టడానికి మన లత్కోర్ దోమ ఏదైనా చట్టం చేస్తే బాగుండేది''
''చట్టమా చట్టుబండలా''
''అలా అంటావేమిటి వొదినా!''
''మరెలా అనమంటావు అలాటి చట్టం చేస్తే దోమ యువత ఊరుకుంటుందా?''
''ఊరుకోదు. అస్సల్ ఊరుకోదు''
''నిరాహర దీక్షలు చేస్తుంది. ధర్నా లకు దిగుతుంది. ప్రతిపక్షాలు మద్దతు నిస్తాయి. నానా గందరగోళం చేస్తాయి''
''మస్కిటో కాయిల్‌తో తలగోక్కోవడా నికైనా మన మహామంత్రి సిద్ధ పడతాడా?''
''ఎందుకు పడతాడు. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడేమో గాని పదవి వదులుకోడానికి సిద్ధపడడు''
''కండ పుష్టిగల వారుండే ఇళ్ళను కనిపెడతాం. అలాంటి ఇళ్ళలో ఒక్కో ఇంటిని ఒక్కో దోమ కుటుంబానికి ఇస్తామని మన మహామంత్రి చెప్పాడా? లేడా?''
''చెప్పాడు''
''చెప్పాడు కానీ ఇచ్చాడా?''
''ఇవ్వలేదు''
''ఇవ్వకుండా బద్నాం అయ్యాడు''
''అలాంటి వాడు దోమ యువతతో ఎందుకు పెట్టుకుంటాడొదినా?''
''అడగడం మరిచాను. మీ వాడికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా?''
''చూస్తున్నాం. కానీ ఏ ఒక్కటీ కుదరడం లేదు,''
''మీ వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు.''
''ఏం చేస్తే ఏం లాభం. ఈ కాలపు అమ్మాయిల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం. పెద్దబంగళా, కారూ, నౌకర్లూ చాకర్లూ ఉండాలట. ఇంట్లో పాత సామానులేవీ ఉండకూడదట''
''కొత్తవి వస్తుంటే పాతవి ఎవరికి కావాలొదినా?''
''పాత సామానులంటే సామానులు కాదు. అత్తామామలట''
''ఏం చోద్యం. కలికాలం. ఇవాళ పనిమనిషి రాలేదు. ఇల్లూడ్చుకోవాలి. వొస్తా వొదినా!''
తెలిదేవర భానుమూర్తి
9959150491