Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్రం, శిల్పం, సౌందర్య శాస్త్ర ప్రతీకలుగానో, లేదా మనోల్లాసానికి పనికి వచ్చే వస్తువులుగా మటుకే వ్యవహరించ లేదు. మరో పెద్ద బాధ్యత కూడా ప్రాచీన కాలంలో శిల్పం, చిత్రం నేరవేర్చాయి. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం పురాతన కాలంలో విద్యాభ్యాసం అందరికీ అందుబాటులో ఉండేది కాదు. కానీ ప్రతి వారికీ పురాణాలు, ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాల గురించి తెలిసి ఉండేది. మతం, మతార్థాలూ అర్థం అయ్యేవి. ఇందుకు కారణం కళలు తమ భుజాల మీద వేసుకున్న బాధ్యత. వీధి నాటకాలు, జ్ఞానుల ప్రవచనాలు ఒక ప్రకారంగా నడిపి, విషయ బోధన జరిగేది సమాజానికి. కానీ నాటకాలైనా, భాషణలైనా విషయం ముగిసాక సమాప్తి అవుతాయి. నిలిచి ఉండవు. ఇలాటి విషయాలను ఇమారతాలపై చిత్రంలా శిల్పంలా చెక్కినపుడు అవి ఎప్పటికీ నిలిచి ఉండి ప్రజలకు విషయ బోధన చేసేవి. బౌద్ధ బిక్కుల అరామాల వద్ద వారు ధర్మ బోధనలు చేయటం కోసం కొన్ని చిత్రాలు, శిల్పాలు చెక్కించి రాజులు, ప్రజలు ఏర్పాటు చేసేవారు. అలాగే మందిరాలపై రాతి గుహల్లోనూ మనం చిత్రం, శిల్పం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా చిత్రం, శిల్పం, జ్ఞానుల బోధనలలోనూ, అవి తమంతట తాముగానూ సామాన్య ప్రజల జ్ఞాన సంపత్తికి సమాజాభివృద్ధికి పని చేస్తాయి.
మనం ప్రస్తుతం శుంగుల కాలంలోని బారూత్ స్థూపంలోని కొన్ని శిల్పాల గురించి మాట్లాడుకున్నాం. అందులోని కొన్ని శఙల్పాలు ధర్మబోధనలో ఎలా ప్రతీకలుగా నిలుచుకున్నాయో చూద్దాం. ఈ స్థూపంపై ఉన్న శిల్పాలు ఎన్నో విధాలుగా ఉపయోగకారులైనా, కొన్ని ప్రత్యేకంగా ఈ దిశలో పని చేసాయి. ఈ స్థూపం వేదిక చుట్టూ కొన్ని గుండ్రటి లేదా దీర్ఘ చతురస్త్రపు ఆకారాలలో పలకలు చెక్కబడి ఉన్నాయి. వీటిపై కొన్ని నీతి కథలు, ధర్మబోధన జరిపే ప్రవచనాలకు ఆకారాలు ఇచ్చి శిల్పం వివరాలు చెక్కబడ్డాయి. గుండ్రటి పలకాలపై చెక్కబడ్డ కథలని జాతక కథలని అంటారు. సాక్యముని బుద్ధుడు తన పూర్వ జన్మలో బోధి సత్వుడుగా పిలువబడ్డాడు.. పూర్వ జనులలో జంతు రూపాలుగా, మానవ రూపంలోనూ జన్మ ఎత్తి ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఆపై బుద్ధుడుగా ఉత్తమ జన్మ ఎత్తాడని ఈ కథల సారాంశం. ఇవి సుమారు 550 జాతక కథలు, బుద్ధుడి వేరు వేరు జన్మల కథలు. అందరు జ్ఞానులకు వలనే బుద్ధుడికి తన పూర్వ జన్మల గురించి తెలుసు. ఆ కథలని తన శిష్యులకు ధర్మం, నీతిబోధనల కోసం, ఆతను పూర్వ జన్మలలో బోధిసత్వుడుగా చేసిన మంచి పనులను వివరించేవాడు. వీటిని గుండ్రటి బిళ్లలపై చెక్కి శాశ్వత ప్రవచనాలుగా నిలుపబడ్డాయి. వీటి ద్వారా సులభ్య ధర్మ బోధన బిక్కులకూ, ఆపై చిత్ర మార్గం అయింది.
మహా కపి జాతక కథ : తన బంధువుల కోసం ఒక కపి (కోతి) చేసిన త్యాగం, ఈ జాతక కథలోని సారాంశం. సాక్యముని ఒక జన్మలో కపిగా పుట్టి 80,000 కోతులకు రాజయ్యాడు. ఒకసారి ఒక మానవ మహారాజు ఒక అద్భుతమైన రుచి గల మామిడి పండు కోసం వెతుకుతూ ఈ కోతులున్న తోటపై దాడి చేస్తాడు. అప్పుడు బోధి సత్వుడనే ఆ కపీశ్వరుడు తన శరీరాన్ని వంతెనగా వేస్తూ ఆ నది అటూ ఇటూ ఉన్న చెట్లని పట్టుకుని సాగుతాడు. అలా వంతెనగా మారిన కపీశ్వరుడి శరీరంపై నుంచీ దాటి కోతులన్నీ నదికి ఆవలి తీరం చేరుతాయి. రాబోయే కాలంలో నీచమైన బుద్ధి గల దేవదత్తుడిగా జన్మనెత్తిన ఒక కోతి, ఆఖరి కోతిగా బోధిసత్వుడి శరీరం అనే వంతెన దాటుతూ ఆతని నడుముపై గంతు వేసి కావాలనే బోధిసత్వుడి నడుము విరగ గొడతాడు. అది చూసిన ఆ మానవులు ఆ కపీశ్వరుడిపై దయ చూపి, ఒక వస్త్రం పట్టి ఆ కపీశ్వరుడిని కిందకి దింపి ఆరోగ్యం కుదట పడటానికి సాయ పడతారు. అప్పుడు ఆ కపీశ్వరుడు తన పనిలోని ధర్మార్థాన్ని ఆ రాజుకు వివరిస్తాడు. ఈ వివరాలన్నీ చెక్కబడ్డ ఈ మహా కపి జాతక కథ పలక కలకత్తాలోని మ్యూజియం లో భద్రపరచబడింది.
రురు జాతక కథ : ఈ పలక కలకత్తా మ్యూజియంలోనే భద్రపరచబడింది. ఈ పలకపై జంతువులు, 4 రకాల పనులలో నిమగమై ఉంటాయి. ఇందులో మంచి ఏమిటో ఊహించుకోవలసిన బాధ్యత మనమీదే ఉంటుంది. ఒక జింక తన వెన్నుపై మనిషిని ఎక్కించుకుని నది దాటిస్తూ ఉంటుంది. ఒక బలమైన పెద్ద జింక ఏ పనీ చేయక ఊరికనే కూర్చుని ఉంటుంది. ఒక గువ్వ అవసరం ఉన్నా లేకున్నా నీరు తాగుతూ ఉంటుంది. ఒక రాజు ఎక్కుపెట్టిన బాణం చూసి పరుగెడుతున్న నాలుగు ఆడ జింకలు, చివరగా గొప్ప సాయం చేసిన జింకకు నమస్కరిస్తున్న మానవులూ చెక్కి ఉన్న జాతన కథ పలక ఇది.
ఛద్దంత జాతక కథ : ఈ పలక బారూత్ నుంచీ తీసుకెళ్లి కలకత్తా మ్యూజియంలోనే భద్రపరచబడింది. ఈ జాతక కథకి సంబంధించి రకరకాల కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం చెక్కిన ఈ పలకలో 6 దంతాలు ఉన్న ఒర ఏనుగు వేటగాడి బాణం తగిలి, అతను తన తీసుకోవటం కోసం ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటుంది. పక్కన చెక్కిన తామర పువ్వు చూపుతూ ఒక స్త్రీ ఏనుగు చూపబడుతుంది. సబ్బ బద్ధ అనే స్త్రీ ఏనుగు ఆ పురుష ఏనుగుకు ప్రియమైనదని, ఆ తామర పువ్వు అర్థం చెబుతుంది. బౌద్ధంలోనూ, జ్ఞానం అనే అర్థం తామర పువ్వుకుంది. అలాగే ఆ స్త్రీ ఏనుగూ మంచి బుద్ధిగలదనే అర్థం వస్తుంది. మరో పక్కగా సుబద్ధ అనే ఈర్ష్య ఉన్న మరో స్త్రీ ఏనుగూ చెక్కబడింది.
ససజాతక కథ ప్రకారం ఒక కుందేలు ఒక మానవుడి కోసం తన జన్మ త్యాగం ఎలా చేస్తుందో చెప్పే కథ ఇది. వేసాంతర జాకత కథ ప్రకారం ఒక రాజ కుటుంబపు ఏనుగు దానం కథ ఇది. ఈ జాతక కథలకూ, పంచ తంత్ర కథలల్లోని నీతి కథలకూ సామ్యం కనిపిస్తుంది. బారూత్ స్థూపం వేదిక చుట్టూ జాతక కథలే కాదు కొన్ని బౌద్ధుల నమ్మకమైన పుణ్య తీర్థాల కథలను కూడా చెక్కించారు. అందులో ఒకటి సాంకన్య అనే పుణ్య స్థలం. క్రీ.పూ. 3వ శతాబ్దంలో అశోకుడు కూడా ఈ తీర్థాన్ని దర్శించాడట. బౌద్ధ నమ్మకం ప్రకారం సాక్యముని బుద్ధుడు తామ్రత్రింస అనే లోకం వెళ్లి, ఆ పరలోకంలో ఉన్న తన దివంగత తల్లికి, ఒక పవిత్ర వృక్షం కింద కూర్చుని ప్రవచనం ఇచ్చాడు. ఆ పై సాంకస్య అనే స్థలంలో ఆ పరలోకిం నుంచీ భూలోకానికి దిగాడట. ఆ సాంకస్యలో అందుకు గుర్తుగా ఒక వృక్షం నాటబడింది. ఈ కథ వివరం కోసం ఒక దీర్ఘ చతురస్త్రాకారపు పలక చెక్కబడింది. దానిపై ఆ వృక్షం చెక్కబడింది. బుద్ధుడు దిగిన నిచ్చెన, అలాగే బుద్ధుడితో పాటూ పక్కన ఇంద్రుడు, బ్రహ్మ దిగారనీ, మరో రెండు నిచ్చెనలు, బుద్ధుడు దిగిన నిచ్చెనకు అటూ ఇటూ చెక్కి ఉంటాయి.
మరో పలక జేత అనే యువరాజు అత్యాశ, అనంత పిండద అనే బౌద్ధం నమ్మే మానవుని దానం గురించిన కథ. స్రవస్తిలోని జేత అనే రాజు వద్ద, అనంత పిండద ఒక తోట కొని, అందులో గంథకూటి, కోసంచి అనే రెండు భవంతులు కట్టి బౌద్ధ సంఘానికి విరాళంగా ఇచ్చాడు. ఈ కథలన్నింటా మానవ ఆకారాలు చెక్కటం ముఖ్యం కాదు. కథల నీతికి ముఖ్య స్థానం ఇచ్చి చెక్కబడ్డాయి. ఇందుకు కారణం ముందర మరో రకంగా అర్థం చేసుకున్నారు.
ఇలాంటి ధర్మబోధనలు ఒక బారూత్లోనే కాదు, ఎన్నో బౌద్ధ స్థలాల్లో చెక్కబడ్డాయి. బౌద్ధంలో మొదటి దశ, హీనాయనమనీ, అందులో బౌద్ధ చిత్రం, శిల్పం పనికి రావనీ అనుకున్నారు పరిశోధకులు. తరువాతి దశ అయిన మహాయానమే చిత్రం శిల్పం చెక్కడానికి అంగీకరించారనీ అనుకున్నారు. కానీ తరువాత జరిగిన పరిశోధనల ప్రకారం, హీనాయాన, మహాయానాలు రెండూ సమాంతరంగా, వృద్ధి పొందాయనీ అర్థం చేసుకున్నారు.
అలాగే పాళీ భాషలో రాసిన థేరవాదం (Theravad) ప్రకారం, హీనయానంలో ఎక్కడా చిత్రం, శిల్పం చిత్రించటానికి అడ్డు చెప్పలేదనీ తెలిసింది. హీనయానంలో చిత్రం, శిల్పం కనపడక పోవడానికి కారణాలు వేరని అర్థం చేసుకున్నారు. బహు:శ అప్పటికి చిత్రం, శిల్పం చేయటం పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. ఈ విధంగా చూసినా చిత్రం, శిల్పం ధర్మబోధనలో ఎంతో ఉపయోగపడ్డాయి.
- డా|| ఎం.బాలమణి, 8106713356