Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్‌నగర్ జిల్లా బాల సాహిత్యంపై పరిశోధన చేస్తున్న దుగ్గి గాయత్రి ఇటీవల ఒక పాఠశాల వార్షిక సంచిక పంపింది. అది మహబూబ్ నగర్ జిల్లా కేతేపల్లి ఉన్నత పాఠశాల 1963లో ప్రచురించిన పాఠశాల సంచిక. దాని హితవరి ప్రసిద్ధ బాల సాహితీవేత్త డాగోజీరావు. అరవై యేండ్ల కిందనే 'వెలుగు' ద్వారా విద్యార్థులతో వ్యాసాలు, గేయాలు, కథలు రాయించి వాటిని ప్రచురించిన శక్తి ఆయనది. కమలేకర్ డాగోజీరావు అగస్టు 02, 1932న మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ తాలూకా కేతేపల్లిలో పుట్టారు. నన్నూబాయి, నాగోజీరావు వీరి తల్లిదండ్రులు. ఎం.ఎ., బి.ఎల్., బి.ఎడ్ చదివారు. హిందీ సాహిత్యం, భాషపై మక్కువతో హిందీలో విద్వాన్, సాహిత్యరత్న ఉపాదులు పొందారు. 1991 అగస్టులో జూనియర్ లెక్చరర్‌గా పదవీ విరమణ చేశారు..
1950 నుండి రచనా రంగంలో ఉన్న డాగోజీరావు 'హిమకర్' కలం పేరుతోనూ రచనలు చేశారు. 'మానవతా వాద కవి', 'జానపద కవిరాజు', 'ఆచార్య' వీరి బిరుదులు. కవి, కథా రచయిత, బాల వికాసకర్త, బాల సాహితీవేత్త డాగోజీరావు. ఇరవై అయిదుకు పైగా రచనలు చేయగా వాటిలో పద్నాలుగు అచ్చయ్యాయి. 'శ్రీ హనుమాన్ చాలీసా', 'శ్రీ దుర్గా చాలీసా', 'నారద భక్తి సూత్రావళి', 'భజగోవిందమ్' వీరి ఆధ్యాత్మిక రచనలు. 'కృష్ణవేణి' కవితా సంపుటి. 'మన భారతి', 'భక్తిమాల' దేశభక్తి గేయాల సంపుటాలు. జానపద పక్కీలో రాసిన గేయాలు 'నారాజు కతలు'. ఇవేకాక 'శివ శబ్ధ తరంగిణి-1', 'శివ శబ్ధ తరంగిణి-2', 'ప్రేమ యొక్క మహిమ', 'చింతన', 'శ్రీ గురుగీత' వీరి ఇతర రచనలు. తెలుగులో 'కబీరువాణి', 'రవీంద్రుని రమ్య గీతాలు', 'జ్ఞాపకాలు' (నానీలు), 'ఝర సంగీత్ (హిందీ)' వంటి మరో పదకొండు రచనలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ లెక్చరర్‌గా పురస్కారాలతో పాటు 'విద్యా మార్తాండ', 'హిందీ మార్తాండ' సత్కారాలు అందుకున్నారు.
బాల సాహితీవేత్తగా డాగోజీరావు రచనలు ఆనాటి బాల, గోలకొండ పత్రిక మొదలుకుని జాగృతి, ప్రజామత, ఊయల, అక్షరాంజలి మొదలగు పత్రికల్లో, వెలుగు వంటి సంచికల్లో అచ్చయ్యాయి. పిల్లల కోసం గేయాలు, కథలు, నాటికలు రాసిర కమలేకర్ డాగోజీరావు 'పూలబాల' పేరుతో బాల గేయ సంపుటి ప్రచురించారు. 'పాపలూ-పండుగలూ' రాశారు. ఇవేకాక స్కౌటు పిల్లల కోసం 'కిశోర గీతాలు' తెచ్చారు. 'దేశం కోసం', 'చెప్పినట్లు చేస్తారా' వీరు రాసిన బాల నాటికలు. ముఖ్యంగా పిల్లల్లో మానవీయ విలువలు నెలకొనాలన్న సంకల్పంతో పలు సాంఘిక నాటికలు, ఏకపాత్రలు, బుర్ర కథలు రాసి ప్రదర్శనలు ఇప్పించారు. వీరి రచనల్లో నన్ను ఆకర్శించిన వాటిలో 'రావూజీ గణితమాల' ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే ఇది మనం చినప్పుడు చదువుకున్న ఎక్కాల పుస్తకం వంటిదే. కానీ పిల్లలకు సులభంగా లెక్కలు, ఎక్కాలు అర్థమయ్యేందుకు ముఖ్యమైన విషయాలు, మానములు ఇందులో చెప్పడం బాగుంది. కథకులుగా బాలల కోసం స్ఫూర్తిదాయకమైన కథలు రాశారు డాగోజీరావు. వాటిలో 'సహవాస ఫవలము', 'ధైర్యము విడువరాదు', 'ప్రతిజ్ఞా పాలనము', 'కర్ణ రహస్యం' వీరికి పేరు తెచ్చిన కథలు. 'పాపమే యెరుగని / పసిపాపలమ్ము / దోసమే చేయని / దేవతలమూ!...' అంటూ అన్నెం పున్నెం ఎరుగని బాలల గురించి చెప్పిన కమలేకర్ డాగోజీరావు కేవలం సాహితీవేత్తగానే కాక బాల సాహిత్య వికాసకారులుగా కూడా ప్రసిద్ధులు. తాను పనిచేసిన ప్రతి చోట పిల్లలను సాహిత్యం, రచనలవైపు ప్రోత్సహించడమేకాక వాటిని పుస్తక రూపంలోకి తెచ్చేందుకు కృషిచేశారు. పైన చెప్పిన 'వెలుగు' సంచిక అటువంటిదే. ఈ వెలుగు పత్రికతో పాటు విద్యార్థుల రచనలు వెలుగులోకి వచ్చేందుకు పాఠశాలలో గోడ పత్రికను నిర్వహించారు. విద్యార్థులను వక్తలుగా తీర్చిదిద్దేందుకు, వారి లోని సభా కంపం పోయేందుకు వక్తృత్వ పోటీలు, తరగతులను కూడా నిర్వహించారు. గేయాలను అందంగా రాయడం డాగోజీరావుకు తెలుసు. ఒక పిల్లవాడు నాగు పాముతో ఆడుకుంటూ పాడుకుంటే ఎలా ఉంటుందో ఒక గేయంలో రాస్తారాయన. అది, 'నీ వాడుచుండగ / నేనాడ వచ్చెద / నేనాడు చుండగ / నీవాడ రావా? / మన మాడుచుండగ / మనయాట జూడ / బాల లొచ్చేరు/ గోల చేసేరు'. ఇదే కోవలో పిల్లల కోసం ఉద్భోద గీతాలను సైతం రాశారు కమలేకర్ డాగోజీరావు. 'బంధువులము మనము / హిందు సభ్యత మనది' అంటూ చక్కని సంస్కార బోధనా గీతం రాసిన వీరు 'శని సోమవారాలు / మన పర్వ దివసాలు/ శివరాత్రి ఏకాదశి / పవిత్రమగు వ్రతాలు' అంటూ 'ధర్మోత్తిష్ట' చేస్తారు. నిరంతరం బాలల కోసం తపిస్తూ, బాల సాహిత్యాన్ని సృజన చేస్తున్న బాల సాహితీవేత్త, పాలమూరు ఆణిముత్యం శ్రీ కమలేకర్ డాగోజీరావు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548