Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాసరలో అష్టతీర్థాలున్నాయి. వాటిలో ఇంద్రతీర్థంగా పిలువబడే కుక్కుటేశ్వరాలయానికి కుక్కలగుడి అనే పేరున్నది. అతి పురాతనమైన ఈ గుడిలో జైనశాసనదేవత విగ్రహాన్ని కొత్తతెలంగాణ చరిత్రబందం చరిత్రాన్వేషి, బాసర చరిత్ర పరిశోధకుడు బలగం రామ్మోహన్ గుర్తించాడు.
'ఈ శిల్పంలో ప్రతిమ చతుర్భుజి. సుఖాసనస్థితయైన మూర్తి పర(వెనక వైపు) హస్తాలలో శంఖం, అంకుశాలు, నిజ (ముందు వైపు) హస్తాలతో కుడిచేయి అభయహస్తంగా, ఎడమచేతిలో ఫలంతో కనిపిస్తున్నది. తలపై కిరీటమకుటం, తల వెనక ప్రభావళి, చెవులకు పెద్ద కుండలాలు, గొంతుమీద జైన తీర్థంకరులకు కనిపించే త్రివళితాలు, మెడలో కంఠిక, హారం, కాళ్ళకు కడియాలు, చేతులకు కంకణాలతో నిండైన విగ్రహం కనిపిస్తున్నది. శైలిని బట్టి ఈ శిల్పం 9,10వ శతాబ్దాలకు, రాష్ట్రకూటశైలికి చెందినది. ప్రతిమా లక్షణాలను బట్టి జైన శాసనదేవత చక్రేశ్వరి అని, చక్రేశ్వరికి అప్రతిచక్ర, విద్యేశ్వరి అనే పేర్లు కూడా వున్నాయి కనుక బాసర జైనుల సరస్వతి గచ్ఛగా, విద్యా కంద్రంగా వుందని చెప్పవచ్చునని కొత్త తెలంగాణ చరిత్రబందం కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. జైన ప్రతిమా లక్షణ గ్రంథం 'జైన రూప మండన'లో చక్రేశ్వరి ప్రతిమా లక్షణాలలో వైవిధ్యాలు వివరించబడ్డాయి. జైనధర్మంలో దిగంబర, శ్వేతాంబర శాఖాభేదాలు రెండింటిలోను చక్రేశ్వరి ఆరాధింపబడుతున్నది. చక్రేశ్వరి చక్రం ఆయుధంగా, ఫలం, వరద ముద్రలతో, గరుడవాహనంతో కనిపిస్తుంది. మథుర మ్యూజియంలో బాసరలో లభించిన శిల్పంవలె అరుదుగా శంఖం ధరించి, అభయముద్రతో కనిపిస్తుంది.
క్షేత్ర పరిశోధకుడు, చరిత్రకారుడు
బలగం రామ్మోహన్, బాసర, 9989040655, కొత్తతెలంగాణ చరిత్రబందం
ప్రతిమా లక్షణ విశ్లేషణ, గుర్తింపు
శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కొత్తతెలంగాణ చరిత్రబందం