Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎరుపు, తెలుపు రంగు దుస్తులు.. పొడవాటి తెల్లని గడ్డం.. తలపై ఎర్ర టోపీ.. భుజాన పెద్ద సంచి.. అందులో అనేక బహుమతులు.. ఇంకా చెప్పేదేముంది క్రిస్మస్ తాతయ్య (శాంటాక్లాస్). ఈ తరహా శాంటాక్లాస్లు కనిపిస్తే చాలు డిసెంబర్ మాసం వచ్చినట్టే. క్రైస్తవుల ఆరాధ్యుడైౖన యేసుక్రీస్తు జన్మదినాన్నే పండగ పర్వదినంగా ప్రపంచ దేశాల్లో జరుపుకుంటారు. పేరుకు క్రిస్టియన్ల పండగే అయినా సర్వ మానవాళీ ఉత్సాహంగా నిర్వహించుకునే రోజు ఇది. మతాలకతీతంగా అందరూ ఆనందంగా పాల్గొనే పండగగా క్రిస్మస్కు పేరు. పరస్పరం అభినందించుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చు కోవడం, క్రైస్తవుల ఇండ్లను సందర్శించి శుభాకాంక్షలు తెలుపుకోవడం ద్వారా సోదరాభావం పెంపొందుతోంది. పైగా శీతాకాలంలో పండగ రావడం వల్ల అనుకూల వాతావరణం, అనుభూతులకు ఆలవాలంగా ఉంటోంది. భౌగోళిక ప్రాంతాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు అన్వయించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఒకే రకంగా జరుపుకునే పండగ క్రిస్మస్. ఈ పండగ సాంప్రదాయాల వైవిధ్యాల కలబోతే ఈ వారం 'సోపతి' అందిస్తున్న ప్రత్యేక వ్యాసం...
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25ను యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పేరుతో వేడుక జరుపుకోవడం మనకి తెలుసు. క్రీస్తు జననానికి సంబంధించిన ఘట్టాలను ఆవిష్కరిస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం, కథలు వినడం పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఓ మెర్రీ టైమే. మతపరమైన విశిష్టత కాసేపు పక్కన పెడితే క్రిస్మస్ అంటే ఇవ్వడం, కుటుంబ, బంధు, మిత్రుల కలయిక, అందమైన అలంకరణలు, ఆహ్లాదమైన సంగీతం, ఆనందమైన ఆహారం. ఈ క్రమంలో ఇంటి ముందు కాంతులీనే నక్షత్రం, ఇంటి లోపల అలంకరించిన క్రిస్మస్ చెట్టు, ఘుమఘుమలాడే క్రిస్మస్ కేక్ మామూలే. ఈ మధ్యలో 'శాంటా క్లాస్' అనే ఒక క్రిస్మస్ తాత. దుప్పులు పూనిన మంచు రథం ఎక్కి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ, ఇండ్ల పొగ గొట్టాల గుండా లోపలి జారి, అక్కడి క్రిస్మస్ చెట్టుకి వేలాడదీసిన సాక్స్ (మేజోళ్ళ)లో కోరుకున్న బహుమతులు పెట్టి వెళ్లి పోతాడని ఒకప్పటి నమ్మకం. ఎరుపు దుస్తులు వేసుకుని తెల్లగడ్డం పెట్టుకున్న శాంటా క్లాస్‌ను ఇప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గర కూర్చుని పిల్లలకు చాక్లెట్లు అవీ ఇస్తూ సంతోష పరుస్తుంటారు. ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ చాలా చోట్ల దర్శనం ఇస్తున్నారు. ఈ పండగలో భాగంగా ఒక రెండు వారాల ముందు నుండే బృందాలుగా ఇంటింటికీ వెళ్లి పాటలు (కేరల్స్) పాడటం కూడా ఒక సందడే. విశేషమేమంటే, ఈ పండగకు 'మా ఇంటికి రండీ' అని పిలవక్కరలేదు. క్రైస్తవులు తమ మిత్రుల ఇండ్లకు వెళ్లి, కేక్ ఇచ్చి, వారు ఇచ్చిన కేక్ తిని, బహుమతులు ఇచ్చి పుచ్చుకుని, శభాకాంక్షలు తెలిపి రావడం ఒక అందమైన మైత్రీ బంధ వ్యక్తీకరణ. అందరినీ ప్రేమించడం, అందరితోనూ ఆనందంగా ఉండటం వేడుకల్లో కనిపిస్తుంది. అమెరికాలో అయితే నవంబర్ మూడవ గురువారం ప్రాంతంలో వచ్చే కృతజ్ఞతా దినం (థ్యాంక్స్ గివింగ్ డే) తరువాత మొదలయ్యే క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా కొత్త సంవత్సరం వరకూ కొనసాగుతాయి.
క్రిస్మస్ చెట్టు
క్రిస్టమస్‌కి ఒక చెట్టుని అలంకరించడం పదహారవ శతాబ్దంలో జర్మనీలో ప్రారంభమైంది. ఫర్ చెట్టుకి యాపిల్ పండ్లు, కొవ్వొత్తులు, రంగు కాగితాలు అలంకరిచేవాళ్ళు. ఈ సాంప్రదాయాన్ని ఇంగ్లాండ్‌కి విక్టోరియా రాణి భర్త, ఆల్బర్ట్ తన స్వస్థలం జర్మనీ నుంచి తీసుకువచ్చాడు. క్రీస్తు జన్మించక ముందు నుండే పచ్చని మొక్కలు ప్రజల జీవనంలో భాగంగా ఉండేవి. క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ చెట్టుని అందంగా అలంకరించి ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడైతే అనేక రకాల కృత్రిమ క్రిస్మస్ చెట్లు అందుబాటులో వున్నాయి గానీ, తొలుత, నిత్యం పచ్చగా వుండే పైన్ చెట్లను మాత్రమే అలంకరించే వాళ్ళు. యూరప్, ప్రాచీన ఐగుపులు, చైనీయులు, హెబ్రీయులు పచ్చని చెట్లను అలంకరించి, వాటిని పూజించే వాళ్ళు. దుష్టశక్తులను నిరోధించే శక్తి పచ్చని చెట్లకు వుందని వాళ్ళు విశ్వసించే వాళ్ళు. వాళ్ళు క్రైస్తవులుగా మారిన తరువాత కూడా క్రిస్మస్ పండగ సంబరాలలో అదే అలవాటుని కొనసాగించారు. అసలు క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకోవడం అనేది జర్మన్ల నుంచి పుట్టింది. మధ్యయుగంలో జర్మన్లు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఈడెన్ తోటలో ఆడం, ఈవ్‌కి గుర్తుగా ఫర్ చెట్టుకి ఆపిల్ పండ్లని కట్టేవారు. ఆ చెట్టుని వాళ్ళు పారడైస్ చెట్టుగా పిలుచుకునే వాళ్ళు. ఆ తరువాత క్రమేపీ క్రిస్మస్ చెట్టు ఆచారం బ్రిటన్‌లోకి పాకింది. అక్కడ ఆ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు, మిఠాయిలు, ఇతర వస్తువులతో అలంకరించడం ఆరంభమయ్యింది. అయితే అందరూ పచ్చని చెట్లనే క్రిస్టమస్ చెట్లుగా వాడరు. జార్జియాలో చిచిలాకీ అనే చెట్టుని రూపొందిస్తారు. చెట్ల కొమ్మలను చెక్కి, ఆ వచ్చిన చెక్క పొట్టుతో ఒక ఫర్ చెట్టులాగా తయారు చేస్తారు. విశేషం ఏమిటంటే, జార్జియన్లు క్రిస్మస్ను జనవరి ఏడున జరుపు కుంటారు. క్రిస్మస్ చెట్టు ఆచారం పుట్టింది ముందు జర్మనీలోనే. ఆ తరువాతి శతాబ్దంలో అమెరికాకు పాకింది. సాధారణంగా ఇండ్లలో అలంకరించుకునే క్రిస్మస్ చెట్లు ఇరవయ్యో శతాబ్దంతో పాటు ఇండ్ల బయటకు ప్రవేశించాయి. అమెరికాలో అనేక బహిరంగ ప్రదేశాలలో, కూడళ్ళలో భారీ క్రిస్మస్ చెట్లను అమర్చడం మొదలు పెట్టారు. 1923 నుంచి అమెరికా శ్వేత భవనం దక్షిణ పచ్చికలో వారి జాతీయ క్రిస్మస్ చెట్టు అమర్చడం ఆరంభమైంది. ప్రతి ఏడాది, ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమ వుతాయి.
క్రిస్మస్ కారల్స్, శాంటా క్లాస్
క్రీస్తు శకం 129లో మొట్ట మొదటి కారల్, 'ఏంజెల్ హిమ్'ని ఒక రోమన్ బిషప్ క్రిస్మస్ రోజున పాడాలని ఆదేశించాడు. 'హార్క్! ది హేరా ఎంజెల్స్ సింగ్' అనే పాట 1739 కంటే ముందు రాసిందని అంటారు. బాగా ప్రాచు ర్యం పొందిన 'సైలెంట్ నైట్ పాటని జోసెఫ్ మోర్ అనే జర్మన్ రాసాడు, జేవియర్ గరూబర్గ్ సంగీతం కూర్చాడు. దాన్ని డిసెంబర్ 24, 1818న ఆస్ట్రియాలో మొదటిసారి ఆలపిం చారు. ఇప్పటికి ఆ పాట 44 భాషలలో తర్జుమా చేయబడింది. ప్రస్తుతం పాడుతున్న కారలు చాలా వరకూ 1843-1883 మధ్య ప్రాంతంలో రాసినవి.క్రిస్మస్ ముడిపడి వున్న మరో అంశం శాంటాక్లాస్. ఎరుపు, తెలుపు దుస్తులతో, పొడవాటి తెల్లని గడ్డం, తలపై యెర్ర టోపీ, భుజాన పెద్ద సంచి, అందులో అనేక బహుమతులు... ఈ ఆహార్యంతో ఉండే శాంటా క్లాస్లా ఇప్పుడు మన దేశంలో కూడా క్రిస్మస్ సమయంలో చాలామంది కనిపిస్తుంటారు. క్రిస్మస్ తాతగా ప్రసిద్ది చెందిన శాంటాక్లాస్ రూపురేఖలు, హావ భావాలు కైమెంట్ మూర్ అనే కవి 1823లో రాసిన పద్యం 'ఎ విజిట్ ఫ్రం శాంటా క్లాస్'లో వివరించాడు. ''లావుగా, బొద్దుగా, ఆనందంగా వుండీ'', ఎగిరే అడవి దుప్పులు లాగే వాహనంపై తిరుగుతూ, ఇండ్ల పొగ గొట్టాల గుండా దిగి, పిల్లలు వేలాడ దీసిన మేజోళ్ళలో బహుమతులు పెట్టి వెళ్ళిపోతాడని నమ్మకం.
డిసెంబర్ 25నే ఎందుకు?
వాస్తవానికి డిసెంబర్ 25నే యేసుక్రీస్తు జన్మించాడు అనటానికి చారిత్రక ఆధారాలు లేవంటారు. ఆ మాట కొస్తే అసలు ఆ రోజునే యేసు జన్మించాడని ఎవరికీ తెలీదు. బైబిల్లో కూడా ఆ తేదీ ప్రస్తావన లేదు. బహుశ క్రీస్తు పుట్టుక క్రీస్తు శకం ఒకటవ సంవత్సరంలో కాక కాస్త ముందుగానే అంటే క్రీస్తు పూర్వం 2-7వ సంవత్సరాల మధ్య జరిగి ఉండవచ్చని కొందరి అంచనా. మన కాలమానంలో క్రీస్తు శకం '0' సంవత్సరం లేదు, నేరుగా క్రీ. పూ. 1 నుండి క్రీ. శ.1కి వెళుతుంది. మొట్టమొదటి క్రిస్టమస్ క్రీ.శ. 336వ సంవత్సరంలో, మొట్టమొదటి క్రైస్తవ రోమన్ చక్రవర్తి కాన్స్టాంటిన్ ఆధ్వర్యంలో జరిగింది అనడానికి నిదర్శనాలు వున్నాయి. కొన్నేళ్ల తరువాత, క్రీ.శ. 350లో మొదటి పోప్ జూలియస్ అప్పటి రోమ్ బిషన్గా ఉండేవాడు. డిసెంబర్ 25న జరుపుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది ఆయనే. అసలు క్రీస్తు పుట్టిన రెండు వందల ఏండ్ల తరువాతే మొట్టమొదటిసారి డిసెంబర్ 25 ప్రస్తావన కనిపిస్తుంది. అదీ, అప్పటి రోమన్ల 'సాటర్నేలియా' అనే ఒక కోత పండగకు దీటుగా తొలి క్రిస్మస్ పండుగ జరుపుకున్నారని చెబుతారు. క్రైస్తవం రోమా సామ్రాజ్యంలో అధికారిక జాతీయ మతంగా ఎదిగిన తరువాత, క్రీస్తు శకం 529 ప్రాంతంలో, జస్టినియన్ చక్రవర్తి క్రిస్టమస్‌ని సెలవు దినంగా ప్రకటించాడు అని ఒక వివరణ వుంది. మన దక్షిణ భారతంలో పంట కోతకు వచ్చిన సమయంలో పండగ చేసుకునే సాంప్రదాయం వంటిదే ప్రపంచ వ్యాప్తంగా వుంది. అటువంటి ఒక సంతోషకరమైన సందర్భమే క్రిస్టమస్‌కి మూలం అంటారు కొందరు. యూదులకు హనుక్కా అనే పండుగ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఘనంగా జరుపుకుంటారు. క్రీస్తు కూడా యూదుడే. అందువల్ల కూడా డిసెంబర్ 25ని ఎంచుకుని ఉండవచ్చు. అయితే ఈ సంక్లిష్ట మూలాల జోలికి పోకుండా వుంటే, క్రిస్టమస్ అనగానే ఒక ప్రపంచ వ్యాప్త వేడుక అనిపిస్తుంది.
భారత్‌లో వేడుకలు భళా
భారత దేశంలోను తాహతు మేరకు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు అధికం. అందుకే అక్కడ ఈ పండగ హడావుడి ఎక్కువ. చర్చిలకు, ఇండ్లకు కొత్తగా రంగులు వేసి, దీపాలతో అలంకరించడం ఇక్కడి అలవాటు. చర్చిలలో పండగకు కొద్ది రోజుల ముందు నుంచే 'ఆడ్వెంట్ సీజన్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రిస్మస్కి సరిగ్గా ఒక నెల ముందు 'సపోస్డ్ క్రిస్మస్' లేదా 'సెమీ క్రిస్మస్' పేరుతో ముందస్తు వేడుకలు జరుపుతారు. క్రీస్తు జననం ఇతి వత్తంగా నాటికలు, పాటలతో కోలాహలం ఉంటుంది. ఆ తరువాత చర్చి సభ్యులు బందాలుగా విడిపోయి ఒక్కో ప్రాంతంలోని కుటుంబాల ఇళ్ళకు వెళ్లి క్రిస్మస్ పాటలు (కారల్స్) పాడతారు. కొన్ని చర్చిలలో క్రిస్మస్ ఈవ్ (క్రిస్మస్ ముందు రోజు సా యంత్రం) ప్రత్యేక వేడుకలు వుంటాయి. కొన్ని చోట్ల రాత్రి ప్రార్ధనలు వుంటాయి. యధావిధిగా క్రిస్మస్ రోజు ప్రార్థనలూ వుంటాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం సందడిగా వుంటుంది. క్రైస్తవేతరులు తమ క్రైస్తవ స్నేహితుల ఇండ్లకు వెళ్లి మరీ వారిని అభినందించడం విశేషం.ఇతర పండగలలాగే కొత్త బట్టలు వగైరా మామూలే. చాలా మంది ఇండ్లకు స్టార్ లైట్లను అలంకరిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్ చెట్టు కూడా అలంకరిస్తారు. ఇప్పుడు చాలా వరకూ కత్రిమ క్రిస్మస్ చెట్లను అలంకరించుకుంటారు. గానీ, కొన్ని ప్రదేశాలలో స్థానికంగా లభించే అరటి, మామిడి చెట్లను అలంకరిస్తారు. కొందరు మామిడి ఆకుల తోరణాలు కూడా కడతారు. కొందరు విద్యుత్ దీపాలు పెడితే కొంతమంది దీపావళిలాగా ప్రమిదలతో అలంకరించుకుంటారు. సాధారణంగా క్రిస్మస్ చెట్టు, ఇంటి ముందు క్రిస్మస్ నక్షత్రం వంటి అలంకరణలు మరో వారం వరకూ, అంటే కొత్త సంవత్సరం ఆరంభం వరకూ ఉంచుతారు.ఆలయాలకి వెళ్ళడం, కొత్త దుస్తులు ధరించడం చుట్టపక్కాలు వచ్చి శుభాకాంక్షలు తెలపడం, కేక్, ఇతర పిండి వంటలు ఇరుగు పొరుగు వారికి పంచడం వంటి సంబరాలతో క్రిస్మస్ రోజు కోలాహలంగా వుంటుంది. పండగ రోజుకి నెల ముందు నుండే కొన్ని బృందాలు రాత్రి వేళల్లో ఇంటింటికీ వెళ్లి క్రిస్మస్ గీతాలను పాడటం (కారల్స్), ఆ ఇంటి వారు వాళ్లని సాదరంగా ఆహ్వానించి ఆదరించడం ఒక వేడుక. ఇక అన్ని పండగల లాగే, క్రిస్మస్ పండగ రోజు రాత్రి స్నేహితులతో, చుట్టాలతో విందు భోజనం సాధారణంగా జరిగేదే. మొత్తానికి ఒక నెల పాటు క్రైస్తవులకూ, క్రైస్తవేతరులకూ కూడా క్రిస్మస్ సందడి వుంటుంది.
ఏసుక్రీస్తు జననం
ఏసుక్రీస్తు జననం గురించి బైబిల్లో ఇలా రాశారు. జనాభా లెక్కల కోసం తన సామ్రాజ్యంలోని ప్రజలంతా రోమ్‌లోని బెత్లేహేమ్‌కు రావలసిందిగా రోమ్ చక్రవర్తి పీజర్ అగస్టీన్ ఆదేశిస్తాడు. జనాభా లెక్కల కోసం తమ పేరును నమోదు చేసుకోవటానికి మేరి, జోసప్లు బెత్లేహేమ్‌కు చేరుకుంటారు. అప్పటికే మేరి నిండు గర్భిణి. అప్పటికీ ప్రజలంతా బెత్లెహేమ్కు రావటంతో మేరి జోసప్లకు ఉండటానికి ఎక్కడా స్థలం దొరకదు. ఇంతలో మేరీకి నొప్పులు ప్రారంభం అవడంతో ప్రక్కనే ఉన్న పశువుల పాకలోకి మేరీ జోసప్లు వెళ్తారు.. అక్కడ పశువుల మధ్యలో కొంత స్థలం చూసుకొని అక్కడే మేరి కొడుకు డిసెంబర్ 24న అర్థ రాత్రి దాటిన తరువాత జన్మనిస్తుంది. డిసెంబర్ నెలంతా చలికాలం కావటంతో అప్పుడే పుట్టిన బిడ్డకు పక్కనే ఉన్న పశువుల శ్వాసద్వారా వెచ్చదనాన్ని కలిగిస్తాయి. బాల ఏసుని ముందుగా దర్శించుకున్నది గొర్ల కాపర్లు ఏసు క్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో వెలుగులు జిమ్ముతాయి. ఒక పెద్ద నక్షత్రం గొర్ల కాపర్లకు కనిపిం చింది. అంతలోనే కండ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో ఒక దేవదూత వారి ముందు ప్రత్యక్షమై లోకరక్షకుడైన ఏసు జన్మించాడు మీరు వెళ్ళి దర్శించికోండని చెబుతుంది. అయితే ఇంత పెద్ద పట్టణంలో ఏసు ఎక్కడ జన్మించారో ఎలా తెలుసుకోవటం అని అడగ్గా అదిగో ఆకాశంలోని ఆ పెద్ద నక్షత్రమే మిమ్మల్ని అక్కడికి చేర్చుతుంది. అని దేవదూత చెబుతుంది. వెంటనే గొర్ల కాపర్లు కొన్ని రగ్గులు (గొంగళ్ళు) పండ్లు, పాలు తీసుకొని నక్షత్రం చూపిన చోటకు వచ్చి బాల ఏసుని దర్శించుకొంటారు. అదే విధంగా తూర్పు దేశాల నుంచి మరి కొంత మంది రాజులు కూడా నక్షత్రం చూపిన ,ఓటకు వచ్చి బాల ఏసుని దర్శించుకొంటారు. అదే విధంగా తూర్పు దేశాల నుంచి మరి కొంత మంది రాజులు కూడా నక్షత్రం ఆనవాలుతో ఏసుక్రీస్తును దర్శించు కుంటారని బైబిల్లో చెబుతుంది.అందుకే లోకరక్షకుడు జన్మించడాన్ని తెలియచేసే నక్షత్రం (స్టార్) ప్రతిక్రైస్తవ కుటుం బం తమ ఇంటి మీద స్టార్‌ని అమర్చుతుంది. ఏసు 24న అర్థరాత్రి దాటిన తరువాత జన్మించడంతో 25న క్రైస్తవులంతా పెద్ద ఎత్తున పండగను జరుపుకుంటారు.
ఆసియాలో అతిపెద్దది మెదక్ చర్చ్
ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ తెలంగాణ రాష్ట్రం మెదక్‌లో నిర్మించారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో, మెదక్ జిల్లాలో కరువు సంభవించింది. అప్పుడు మిషనరీ, రెవెరెండ్ . చార్లెస్ వాకర్ పోస్నెట్ చర్చి నిర్మాణం తలపెట్టి, ''పనికి ఆహార పథకం'' ప్రవేశపెట్టాడని చరిత్ర. 'గ్రామస్తులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో, వారికి ఆహారం ఇవ్వబడుతుంది.' అని చెప్పారు. 'మెతుకులు' అనగా అన్నం, అందుకే ఆ ప్రాంతానికి 'మెదక్'అని పేరు వచ్చింది. అలా ఈ చర్చి నిర్మాణం 1914 నుంచి 1924 వరకు కొనసాగింది. ఇది ఆసియాలోనే అతి పెద్దది కావడం విశేషం. ప్రపంచంలో, వాటికన్ చర్చి తరువాత, అతి పెద్దదైన ఈ చర్చి వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్.పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం, ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండు నుండి, మేస్త్రీలను బొంబాయి నుండి తెప్పించారు. ఇంకా పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. వారానికొక సారి, నేలను, అద్దాలను కిరోసిన్ కలిపిన కొబ్బరినూనెతో తుడుస్తారు. కిటికీ రంగుటద్దాలపై రాయబడిన వాక్యాలు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషలలో కనిపిస్తాయి. మొదట వాక్యాలు హిందీలో లేవు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఈ చర్చిని సందర్శించినప్పుడు, జాతీయభాష అయిన హిందీలో రాయించారు.
వివిధ దేశాల్లో వేడుకలు..ఫ్రాన్స్‌లో ఘనంగా..
ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలు సెయింట్ నికోలస్ దినంగా భావించే డిసెంబర్ 6 నుంచి ప్రారంభ మౌతాయి. మొత్తం నగరాలన్నీ శోభాయమానంగా దీపాలతో అలంకరిస్తారు. పిల్లలకు స్వీట్లు, బహుమతులు అందిస్తారు. పిల్లలు తమ బూట్లను పాలిష్ చేసి మరీ తమ ఇంట్లోని చిమ్నీల దగ్గర ఉంచుతారు. ఇలాగైనా శుచీ శుభ్రత పిల్లలకు ముందు నుంచే అలవడతాయనేమో. పిల్లల సరదా మాత్రం వేరు. క్రిస్మస్ తాత వాటి నిండా స్వీట్లు నింపుతాడని వారి నమ్మకం. క్రిస్టమస్ రోజు కుటుంబాలన్నీ ఒకచోట చేరి విందు చేసుకుంటాయి, బహుమతులిచ్చి పుచ్చుకుంటాయి.
ఇటలీలో ఇలా..
ఇటలీలో శాంటా క్లాస్ బదులు 'లా బెఫానా' అనే మంచి మంత్రగత్తె పిల్లలకి బహుమతులు పంచి పెడుతు ందని నమ్మకం. ఆమె పొడవాటి చీపురు కర్రపై వస్తుందని చెడ్డ పనులు చేసిన పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తుందని నమ్మకం. చిన్నారుల్ని గాడిలో పెట్టేందుకు ఇదో మంచి సందర్భం కావడం మంచిదే కదా. మరో మాట.. ఈ సంబరమంతా ఇటలీలో జనవరి 6వ తేదీన జరుగుతుంది.
నెదర్లాండ్‌లో ఇచ్చిపుచ్చుకోవడం..
నెదర్లాండ్‌లో శాంటాక్లాస్‌ని సిమ్లర్క్లాస్ అంటారు. ఆతను వారికి ఎక్కడో ఉత్తరధవంపై కాక స్పెయిన్‌లో నివసిస్తాడని, అక్కడి నుంచి మర పడవలో, బ్లాక్ పీటర్ అనే సహాయకుడిని తీసుకుని వస్తాడని ప్రజలు భావిస్తారు. వారి సంస్కతిలోని కొన్ని లోపాలు, చారిత్రకంగా అందివచ్చిన భావజాలాల వల్ల బ్లాక్ పీటర్ బానిసపాత్ర వచ్చినా ప్రస్తుతం మాత్రం క్రిస్మస్ వేడుకల్లో అంతా సంతోషమే కనిపిస్తోంది. తమకు గిఫ్ట్‌లిచ్చే పాత్రల పుట్టుపూర్వోత్తరాల కన్నా కూడా ఇచ్చిపుచ్చుకోవడంలోని ఆనందాన్నే ఎక్కువ వెతుక్కుంటున్నారు.
జర్మనీలో అట్టహాసంగా..
జర్మనీలో కూడా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఎక్కడ బడితే అక్కడ ప్రత్యేకంగా దుకాణాలు తెరుస్తారు. వాటిలో క్రిస్మస్కి సంబంధించిన వస్తువులు అమ్ముతారు. ఈ సీజన్లో ప్రత్యేకంగా గ్లూవైన్ అనే పానీయం అందుబాటులోకి తెస్తారు. దట్టంగా మంచు పట్టి వున్న సమయంలో ఈ పానీయం తాగి సంబరం చేసుకుంటారు. ఈ పానీయం కేవలం క్రిస్మస్ రోజుల్లో మాత్రమే తయారు చేస్తారు.
లండన్‌లో నెలంతా..
లండన్‌లో క్రిస్మస్ ఒక నెల రోజుల ముందే వేడుకలు మొదలవుతాయి, జనవరి మొదటి తారీఖు వరకూ కొనసాగుతాయి. ఆ రోజులలో నగరమంతా విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. త్వరగా చీకటి పడటంతో వేడుకలు తెల్లవారుజాము వరకూ జరుగుతాయి. దాదాపు ప్రతి కూడలిలోనూ క్రిస్మస్ చెట్లు ఆకర్షనీయంగా అలంకరించబడి అలరారుతుంటాయి.