Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని దోమలు బొచ్చె పార్టీ నాయకులను కుట్టాయి. వాటికి వారి లక్షణాలొచ్చాయి. మరికొన్ని దోమలు కొత్తిమీర కట్ట నాయకుల్ని కుట్టాయి. అవి అచ్చం ఆ పార్టీ నాయకుల్లాగే ప్రవర్తించడం మొదలెట్టాయి. ఈ రెండు పార్టీల మధ్య సోపతి ఉంది. 'యే దోస్తీ హమ్ నహీ చోడేంగే' అని ఈ దోమలు పాడుతుంటాయి. రెక్కలు కలుపుకుని తిరుగుతుంటాయి.
పల్లేరు గాయల పార్టీ నాయకులను కొన్ని దోమలు కుట్టాయి. దాంతో వాటికి వారి లక్షణాలొచ్చాయి. ఈ దోమల్లో ఏ దోమ కా దోమ తనే మొనగాణ్ని అనుకుంటుంది. అందరూ తన మాటే వినాలంటుంది. తను చెప్పినట్టే అందరూ ఆడాలంటుంది.
ఈ మధ్య గలీజ్ గల్లీ విషయంలో ఈ దోమలు కొట్లాడుకున్నాయి. ఆ గల్లీలోని పిల్ల దోమలకు సంగీత పాఠాలు చెప్పాల్సి ఉంది.
'డెంగీ దోమలను పంపిస్తే బాగుంటుందని' ఒక యువ దోమ అంది.
'అదెలా కుదురుతుంది. మలేరియా దోమల్ని పంపాలి' అని నడి వయసు దోమ అన్నది.
ఈ పార్టీకి చెందిన పెద్ద దోమ చెరువుకు ఆవలి ఒడ్డున ఉంది. ఆ దోమే ఈ దోమల తగవులను తీరుస్తుంటుంది.
ఆ దోమ మాటని ఈ దోమలు వింటాయి.
కుట్టమంటే కుడతాయి.
వద్దంటే ఊరుకుంటాయి.
మనసులో మంట దాచుకుని పైకి మాత్రం నవ్వుతుంటాయి. మొన్నటి దాకా దిక్కుమాలిన రాష్ట్రంలో ఈ ప్రభుత్వమే ఉండేది. కానీ తెరలు అడ్డుపడటంతో ఈ మధ్యనే నిట్టనిలువుగా కూలిపోయింది.
బొచ్చెపార్టీ దోమలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. అధికారంలోకి వచ్చాయి. ఎలాగైనా పల్లేరు గాయల దోమల్ని మల్ల లెవ్వకుంట దెబ్బ తీయాలనుకున్నాయి. వాటి దగ్గరకు వెళ్లాయి.
'రండీ పుణ్యాత్ములారా! మా లత్కోర్ భజనకు రండీ ధర్మాత్ములారా! మనమందరం గూడి లత్కోర్ భజన చేయుదాము' అంటూ పాడాయి.
'వస్తాం గాని మాకేం లాంభం?' అని పల్లేరు గాయల ఎమ్మెల్యే దోమలడిగాయి.
'తలా రెండు సీసాల నెత్తురిస్తాం'
'అంతేనా?'
'ఇంకేం గావాలె?'
'ఇసుంట రమ్మంటే ఇల్లంత మాదంటె ఎలా? ముందు మా పార్టీలో దూకండి. తరువాత మంత్రి కుర్సిల గురించి ఆలోచిద్దాం'
'అదేం కుదరదు'
'ఇలా బేరం ఆడితే ఎలా?'
'రాజకీయాలంటేనే బేరసారాలు. గుర్రాలు మారడాలు'
ఐదారు పల్లేరుగాయల దోమలు బొచ్చెపార్టీలోకి మారి మంత్రులయ్యాయి. దాంతో ఎప్పటినుంచో మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న బొచ్చె పార్టీ దోమలు రెక్కలు విదిల్చి మండిపడ్డాయి.
'గలీజ్ గల్లీలకు వెళ్ళాం.
మురికి కాలువలను కనిపెట్టాం.
దోమ జనాభా పెంపు కోసం కష్టపడ్డాం.
ఫాగింగ్ అని చూడకుండా పార్టీ కోసం శ్రమించాం.
ఇంత చేసినా మాకు గుర్తింపు లేదా?
నూర్రోజులాడిన సినిమా కన్నా ప్లాప్ సినిమానే ఎక్కువా?' అని బొచ్చె దోమలు అసమ్మతి రాగమాలపించాయి.
ఆ రోజు దోమ మంత్రి వర్గ సమావేశం.
ఒకట్రెండు దోమలకు జరూర్ పని ఉన్నా అవి కూడా మంత్రి వర్గ సమావేశానికొచ్చాయి. రాకపోతే మహామంత్రి లత్కోర్ దోమ ఎక్కడ రెక్కలు కత్తిరిస్తుందోనని వాటి భయం.
దోమ మంత్రులన్నీ చెరువులోని గుర్రపు డెక్కల మీద కూర్చున్నాయి.
వాటి చర్చలిలా ఉన్నాయి.
'ఇప్పటిలాగే రోడ్ల మీద చెత్త కుప్పలుండేటట్లు చూడాలి' అని లత్కోర్ దోమ అన్నది.
'ఎవరైనా చెత్తకుప్పలు ఎత్తడానికి ప్రయత్నిస్తే ఏం చెయ్యాలి' అని ఆరోగ్య మంత్రి దోమ అడిగింది.
'మన పోలీస్ దోమల్ని పంపుదాం. అవి కుట్టు చార్జి చేసి వారిని వెళ్లగొడతాయి' అని హోంమంత్రి దోమ అన్నది.
'ఫాగింగ్తో మనల్ని వెళ్ళగొట్లాలని చూస్తున్నారు'
'అలాంటి వాళ్ళ కంట్లో నలుసులమవ్వాలి'
'కాయిల్స్, ఆలౌట్ వంటి వాటితో మనల్ని చంపాలని చూస్తున్నారు'
'వాటికి మనమెప్పుడో అలవాటు పడ్డాం. ఇప్పుడవి మననేమీ చేయలేవు'
'మురిక్కాలవలు మురిక్కాలవల్లాగే ఉండేటట్లు చూడాలి'
'గుత్తేదార్లు వాటిని పైపైనే బాగు చేస్తారు. రెండ్రోజులైతే ఎలాగూ వాటి మేకప్ పోతుంది.'
'డ్రైనేజీల సంగతీ అంతేనంటావా?'
'అక్షరాలా అంతే'
'నాయకులు చీపుళ్ళు తీసుకుని రోడ్ల మీద చెత్త నూడుస్తున్నారు.' అని మున్సిపల్ మంత్రి దోమ అన్నది.
'మనుషుల్ని కుట్టడం మూలంగా మన వాళ్ళకు కొత్త కొత్త రోగాలొస్తున్నాయి. వాటిని తగ్గించడానికి మన దోమ డాక్టర్లు పొద్దుగూకులా పని చేస్తున్నాయి. కొన్ని రోగాలకు మందులు కూడా లేవు. వాటికి మందులు కనుక్కోవటానికి దోమ శాస్త్రవేత్తలకు చెప్పాను. అవసరమైతే విదేశీ దోమ శాస్త్రవేత్తల సహాయం తీసుకోమన్నాను' అని మహామంత్రి దోమ అన్నది.
'దోమ డాక్టర్ల సంఖ్య పెంచాల్సి ఉంది. అందుగ్గాను కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాలి.' అని ఆరోగ్య మంత్రి సలహా ఇచ్చింది.
'అలాగే పెడదాం'
'మన దోమలన్నీ పౌష్టిక రక్తాన్నే తాగాలి. దాని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగు తుంది.'
'దోమ మంత్రులందరూ వీధుల్లో దోమ యాత్రలు చెయ్యాలి. అలా చేస్తేనే మన ప్రజల సమస్యలు తెలుస్తాయి' అని దోమ రవాణా మంత్రి అన్నది.
'బ్లడ్ బ్యాంకులో పేరుకుపోయిన నెత్తురును తీసుకొస్తా. తల ఒక సీసా వంతున రక్తాన్ని పంచుతా.
బడుగు దోమలకు గలీజ్ గల్లీలు ఇస్తా,
దోమస్తాన్ను నంబర్ వన్ చేస్తా.
తాగు తాగు నెత్తురు తాగు. ఊగు ఊగు ఉయ్యాలలూగు మన జాతీయ గీతం.
ఈ గీతం రాసిన దోమ కవికి ఈ ఏడు దోమ విభూషణ్ బిరుదునిస్తాం.
పాడుతూ పని చేస్తాం.
అందరినీ సమానంగా చూస్తూ
విమానాల్లా ఎగురుతాం.
మన పని కానిస్తాం' అని లత్కోర్ దోమ అన్నది.
దోమ జాతీయగీతాలాపనతో మంత్రి వర్గ సమావేశం ముగిసింది.
******
ఆ పండుగ ఇత్తడినిక పుత్తడిగా భ్రమింపజేస్తుంది.
మాటల కోటలు దాటేసి మత్తులో ముంచేస్తుంది.
రంగుల కలలో తేల్చి వరాల వల వేస్తుంది.
అది పటాకులు కాల్చే దీపావళి పండుగ కాదు.
అది జమ్మి ఆకు చేతిలోపెట్టి అలరుబలరు తీసుకునే దసరా కాదు.
అది ముగ్గులూ, గొబ్బెమ్మలతో మురిపించే సంక్రాంతి కాదు.
అన్ని పండుగల్లాగ అది యాడాదికోసారి రాదు.
వస్తే ఒకట్రెండు రోజులకే పరిమితం కాదు.
ఆ పండుగకో ప్రత్యేకత ఉంది.. అదొస్తే సందడే సందడి. అందరికీ చేతినిండా పని. ఐదేళ్ళకొకసారి ఒక్కోసారి అంతకంటే ముందే అది వొచ్చేస్తుంది. దిక్కుమాలిన రాష్ట్రంలో ఆ పండుగే. అదే ఎన్నికల పండగే వొచ్చింది.
- తెలిదేవర భానుమూర్తి
99591 50491