Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2022 చివరలో టాలీవుడ్ లోవరుస విషాదాలు... తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దిక్కులాంటి ఇద్దరు హీరోలు, ఇద్దరు క్యారెక్టర్ నటులు కన్నుమూశారు. తొలితరం నటులైన కృష్ణంరాజు, కృష్ణ మరణించిన కొంత కాలానికే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణ వార్త. ఆ వార్త మరచిపోక ముందే టాలీవుడ్లో మరో సీనియర్ నటుడు చలపతిరావు చనిపోవటంతో తెలుగు చిత్ర పరిశ్రమ షాక్‌కి గురైంది.
''అద్భుతమైన నటన, విలక్షణ పాత్రలతో సినీ పరి శ్రమకు పేరు తెచ్చిన టాలీవుడ్ నట శిఖరం కైకాల సత్య నారాయణ ఐదు తరాల హీరోలతో సిని మాలు చేసి, నవసర నటనా సార్వభౌమగా కీర్తించబడ్డారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో కైకాల సత్య నారాయణ ఒదిగిపోయిన తీరు మహా అద్భుతం. ఎన్టీఆర్ 'యమగోల' నుంచి రవితేజ 'దరువు' వరకూ పలు చిత్రాల్లో యముడిగా నటించారు. సినిమాల్లో యముడు అంటే కైకాల అనే రీతిలో ముద్ర వేసుకున్నారు. గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, అబ్బురపరచే ఆంగికంతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పారు కైకాల. వీర, రౌద్ర, బీభత్స రసాలను అటు పౌరాణిక జానపదాల్లోను, ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాలలోను తనదైన శైలితో మెప్పించిన గొప్ప నటుడు సత్యనారాయణ. నిలువెత్తు విగ్రహంతో యన్.టి. రామరావు కృష్ణుడైతే, సత్యనారాయణే సుయోధనుడు. రామా రావు రాముడైతే, సత్యనారాయణ రావణాసురుడుగా పోషించిన పాత్రలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఆయన దాదాపు ఎనిమిది వందల సినిమాలతో అరవై ఏళ్ల నటనానుభవాన్ని, అన్నిటినీ మించి అసాధారణ జీవితసారాన్ని ఆపోసన పట్టిన మహామేధావి. 1959లో 'సిపాయి కూతురు' అనే చిత్రం ద్వారా ఇండిస్టీలోకి అడుగుపెట్టి, 2019లో 'మహర్షి' సినిమాలో చివరిసారిగా కనిపించిన సత్యనారాయణ 2022, డిసెంబర్ 23 న తుది శ్వాస విడిచారు.
సత్యనారాయణ తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళకు పుట్టారు. తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు. ఆయన కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో 1935 జులై 25న జన్మించారు. గుడివాడ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సత్య నారాయణ.. నటనపై ఉన్న ఆసక్తితో అప్పటి నుంచే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. స్టేజీపై సత్యనారాయణ టాలెంట్‌ను చూసిన నిర్మాత డీఎల్ నారాయణ 'సిపాయి కూతురు' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అనేక పౌరాణిక, జానపద, కమర్షియల్ సినిమాల్లో సత్యానారాయణ విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.
హీరోగా సినిమారంగానికి పరిచయమయినా.. ఆ సినిమా నిరాశపర్చడంతో విలన్‌గా మారడానికి తటపటాయించలేదు. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఎన్నెన్నో జానపద చిత్రాల్లో సత్యనారాయణ విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత సోషల్ పిక్చర్స్‌లో కూడా విలన్ పాత్రలు వచ్చాయి. సత్యనారాయణ నవ్వు పాపులర్ విలనీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిదశలోనే ఆయనకి పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించింది. 'లవకుశ'లో భరతుడిగా.. 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో కర్ణుడిగా.. 'నర్తనశాల'లో దుశ్శాసనుడిగా నటించారు. 'శ్రీకృష్ణ పాండవీయం'లో ఘటోత్కచుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్ళీ 1995లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఘటోత్కచుడు' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
దుర్యోధనుడు.. యముడుగా గుర్తింపు
'శ్రీకృష్ణావతారం' చిత్రంలో తొలిసారి దుర్యోధనుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత 'కురుక్షేత్రం'లో దుర్యోధనుడిగా అద్భుతంగా రక్తి కట్టించారు. అలాగే రావణాసురుడిగా 'సీతా కళ్యాణం'లో.. భీముడిగా 'దాన వీర శూర కర్ణ'లో.. మూషికాసురుడిగా 'శ్రీ వినాయక విజయం' చిత్రాల్లో నటించారు. చాలా మందికి తెలియని విశేషమేమిటంటే 'కథానాయిక మొల్ల'లో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించారు. యమధర్మరాజు అంటే తెలుగు తెరకి సత్యనారాయణ తప్ప మరొకరు గుర్తురారు. 'యమగోల' సినిమాతో ప్రారంభమైన ఈ పాత్ర జైత్రయాత్ర 'యముడికి మొగుడు', 'యమలీల', 'రాధామాధవ్', 'దరువు' చిత్రాల వరకూ సాగింది.
విలన్ నుంచి కేరక్టర్ నటుడుగా..
యస్.వి.రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీర పాత్రలు ఎక్కువగా సత్యనారాయణనే వరించాయి. దాంతో కేరక్టర్ నటునిగా తనని తాను మలుచుకునే అవకాశం సత్యనారాయణకు దక్కింది. 'మోసగాళ్ళకు మోసగాడు', 'దొంగల వేట' మొదలైన సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు మర్చిపోలేనివి. 'ఉమ్మడి కుటుంబం', 'దేవుడు చేసిన మనుషులు', 'శారద' చిత్రాలతో ఆయన ఇమేజ్ మారింది. సాత్వికమైన పాత్రలకు కూడా సత్యనారాయణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు. 'తాత మనవడు', 'సంసారం-సాగరం', 'రామయ్య తండ్రి', 'జీవితమే ఒక నాటకరంగం', 'దేవుడే దిగివస్తే', 'సిరి సిరి మువ్వ', 'తాయారమ్మ బంగారయ్య', 'పార్వతీ పరమేశ్వరులు' మొదలైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుంచి బయటపడి.. కుటుంబ ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు.
'మొరటోడు' సినిమాతో హీరోగా...
కమెడియన్ నగేష్ డైరెక్టర్‌గా.. స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు నిర్మించిన 'మొరటోడు' చిత్రంతో హీరోగా మారారు కైకాల. 'నా పేరే భగవాన్', 'ముగ్గురు మూరు?లు', 'ముగ్గురు మొనగాళ్ళు', 'కాలాంతకులు', 'గమ్మత్తు గూఢచారులు', 'తూర్పు పడమర', 'సావాసగాళ్ళు' లాంటి చిత్రాల్లో హీరోతో సమాంతరమైన పాత్రలు పోషించారు సత్యనారాయణ. 'చాణక్య చంద్రగుప్త'లో రాక్షసమంత్రిగా న భూతో న భవిష్యత్ అన్నట్లు నటించారు. 'నా పిలుపే ప్రభంజనం'లో ముఖ్యమంత్రి పాత్రతో విస్మయపరిచారు. ఒకటా.. రెండా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
బాలీవుడ్లో విలన్‌గా..
సుభాష్ ఘారు డైరెక్ట్ చేసిన హిందీ సినిమా 'కర్మ'లో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర ధరించారు. ఒకటీ రెండు తెలుగు డైలాగ్స్ కూడా ఆ సినిమాలో చెప్పారు సత్యనారాయణ. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ నటించారు.
నిర్మాతగా.. రమా ఫిలిమ్స్
వృత్తి మీద సత్య నారాయణకున్న అంకిత భావమే ఆయనను నిర్మాతగా మార్చింది. రమా ఫిలిమ్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి, 'గజదొంగ', 'ఇద్దరు దొంగలు', 'కొదమ సింహం', 'బంగారు కటుంబం', 'ముద్దుల మొగుడు', వంటి ఎనిమిది ప్రయోజనకరమైన చిత్రాలు తీసి విజయం సాధించారు. కొన్ని చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
పురస్కారాలు
పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో వైవిధ్య భరితమైన నటన ప్రదర్శించినందుకు సత్యనారాయణకు అనంతపురం, గుడివాడ పట్టణాలలో 'నటశేఖర' బిరుదు ప్రదానం చేశారు. కావలి విశ్వోదయ సాంస్కృతిక సంస్థ వారు 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించారు. ఇక 'నవరస నటనా సార్వభౌమ' బిరుదు సార్వజనీనకంగా అమరినదే. 'తాత మనవడు', 'సంసారం సాగరం', 'కచదేవయాని' సినిమాలకు ఉత్తమ నటునిగా నంది బహుమతులను అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. కైకాల సత్యనారాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. కెరీర్లో 800కు పైగా సినిమాల్లో నటించిన కైకాల సత్య నారాయణ.. చివరిగా మహేశ్‌బాబు నటించిన 'మహర్షి' సినిమాలో కనిపించారు. అనారోగ్యం కారణంగా ఆయన అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. కైకాల సత్యనారాయణకు 2017లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు, 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించాయి. ఇక సత్యానారాయణ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కానీ ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో చాలామంది సినీనటులు రాజకీయం బాటపట్టారు. అప్పటికే కొంతమంది రాజకీయాల్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయినవాళ్లున్నారు. అయితే ఎన్టీఆర్, తెలుగుదేశం వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి తెలుగు నటులు చాలామంది వచ్చారు. అలా వచ్చినవారిలో కైకాల సత్యనారాయణ ఒకరు. ఆయన అలా రాజకీయాల్లోకి రావడమే కాదు.. ఏకంగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు కూడా. అలా ఆయన జీవితంలో సినిమా, రాజకీయాలు రెండూ ఉన్నాయి.
చలపతిరావు
సహాయ నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా 12 వందలకు పైగా సినిమాల్లో చలపతిరావు నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న మహా నటుడు. ఎన్టీఆర్ చొరవతో సినీ ఇండస్టీ లోకి అడుగుపెట్టిన విలక్షణ నటుడు చలపతిరావు. 'కథా నాయకుడు'తో మొదలైన ఆయన నట ప్రస్థానం... ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలతో సుదీర్ఘంగా కొనసాగింది. మూడు తరాల నటులతో కలిసి నటించిన చలపతిరావును సినీ పరిశ్రమలో చలపతిరావును అంతా బాబారు అని ఆప్యాయంగా పిలుచు కుంటారు. ఆయన యన్టీఆర్కీ, బాల కృష్ణకీ, జూ.యన్టీఆర్ కుటుంబానికి వీరాభిమానిగా ఉండేవారు. వృద్ధాప్యం తో కొంతకాలంగా సినిమాలు తగ్గించిన చలపతిరావు 78 ఏళ్ల వయసులో సొంతింట్లో ఈ నెల 25న గుండె పోటుతో కన్నుమూశారు. ఈయన కుమారుడు నటుడు, దర్శకుడు రవిబాబు ఇండిస్టీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.
చలపతిరావు 1944 వ సంవత్సరం మే 8 వ తేదీన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో మణియ్య, వియ్యమ్మ దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆయనల నటుడు కావాలన్న కోరికతో మద్రాసు వెళ్ళాడు. 22 ఏండ్లకే అనగా 1966 లో సినీ రంగంలోకి వచ్చిన చలపతిరావు సూపర్‌స్టార్ కృష్ణ నటించిన 'గూడచారి 116' ద్వారా ఇండిస్టీకి పరిచయ మయ్యారు. ఆ తర్వాత 1967లో 'సాక్షి' చిత్రంలో పాత్ర పోషించిన ఈయనకు రెండు సంవత్సరాల పాటు అవకాశాలు రాలేదు. మళ్లీ 1969లో 'బుద్ధిమంతుడు' సినిమాలో నటించారు. ఎన్టీఆర్ ప్రోత్సా హంతో చలపతిరావు మున్సిపల్ కమిష నర్ పాత్రను పోషించిన ''కథానాయ కుడు'' చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఐదారు ఏండ్ల పాటు ఆయన సినిమాల్లోనే నటిం చారు. ఇక అప్పటినుంచి ఆయన వెను తిరిగి చూసుకోలేదు. వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోయిన చలపతిరావు విలనిజంలో తనదైనశైలితో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. సహాయనటుడిగా, విలన్‌గా, కమెడియన్ గా 1200కు పైగా సినిమాల్లో నటిం చారు. మహానటుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి వెండి తెరపై ఒక వెలుగువెలిగారు. ''సాక్షి, సంపూర్ణ రామాయణం, యమగోల, దానవీరశూర కర్ణ, వేటగాడు, కొండవీటి సింహం, ఖైదీ, బొబ్బిలి బ్రహ్మన్న, అల్లుడా మజాకా, సిసింద్రీ, ఆపరేషన్ ధుర్యోధన, కిక్, బెండ్ అప్పారావు ఆర్ఎంపీ, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ'' వంటి సినిమాలు ఎన్నింటిలోనో నటించారు. కెరీర్ ప్రారం భంలో ఆయన దాదాపు 90కి పైగా రేప్ సీన్స్‌లలో నటించారు. ''దాన వీర శూర కర్ణ'' చిత్రంలో 5 పాత్రలు పోషించిన చలపతిరావు, 'నిన్నే పెళ్ళాడుతా..' చిత్రం లో నాగార్జునకు తండ్రిగా నటించడం ఆయన కెరీర్‌కు ప్లస్‌పాయింట్ అయింది.
వైవిధ్యంతో కూడిన పల రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటించిన చలపతి రావు, తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేశారు. నటుడిగా, నిర్మాతగా మూడు తరాల నటులతోనూ పనిచేసిన చలపతిరావు. మూడు తరా లకు చెందిన కథా నాయకులతో కలిసి నటించిన చలపతిరావు, కొద్ది కాలంగా చిత్రాల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. ఎక్కువగా నెగిటివ్ క్యారక్టర్లతో పరి చయం అయిన చలపతిరావు అన్ని రకాల పాత్రల్లోనూ నటించి వైవిధ్యం చాటారు. తండ్రి, బాబాయి, మామయ్య, విలన్, సైడ్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ నటించారు. బంగార్రాజు సినిమాలో చలపారు అంటూ నాగర్జున చేత పిలిపించుకున్నా, బాలకృష్ణ చేత సత్తిరెడ్డీ అంటూ పిలిపిం చుకున్నా.. ఆది సినిమా యన్టీఆర్ కేర్ టేకర్‌గా నటించినా... సై సినిమాలో నితిన్ తండ్రిగా జీవించినా.. అల్లరి నరేశ్ తో కలసి కామెడీ చేసినా.. పాత్ర ఏదైనా ఒదిగిపోవడం చల పతి రావు ప్రత్యేకత.
నిర్మాతగా..
చలపతిరావు 'ఆర్ సి క్రియేషన్స్' అనే బ్యానర్ స్థాపించి ఏడు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 'కలి యుగ కృష్ణుడు, పెళ్లంటే నూరేళ్లపంట, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి' వంటి చిత్రాలతో పాటు కొన్ని టివి సీరియల్స్ ఆయన నిర్మించారు. జీ5 ఓటీటీలో ప్రసారమైన చదరంగం వెబ్ సిరీస్ లో కూడా చలపతిరావు నటించారు. ఆయన కొడుకు రవిబాబు కూడా నిర్మాత, దర్శకుడు, నటుడిగా సినిమా రంగంలో ఉన్నారు.
-పొన్నం రవిచంద్ర, 9440077499