Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రీ.పూ. 3, 2, 1వ శతాబ్దాల గురించీ తూర్పు, మధ్య భారతంలో బౌద్ధం వల్ల నిర్మించిన స్థూపాలు, వాటిపై చెక్కిన శిల్పాల గురించీ ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకున్నాం. దాని అర్థం ఆ కాలానికీ, ఆ ప్రాంతాలకు మటుకే బౌద్ధ శిల్పం పరిమితం కాదు. ఆనాడు బౌద్ధం వల్ల కళలు, కళల వల్ల బౌద్ధం భరతఖండం అంతా వ్యాపించాయి. అందుకు కారణం బౌద్ధం అవలంభించిన చక్రవర్తి అశోకుడు. ఈతను బౌద్ధానికి గొప్ప ప్రచారకుడు, రాయబారి అయ్యాడు. నిజానికి బౌద్ధం, బుద్ధుడు జీవనకాలం క్రీ.పూ. 5వ శతాబ్దం నుంచీ దేశంలో ప్రబలినా అశోకుడి కాలం నుంచీ విశేష ప్రచారం జరిగింది.
అశోకుడు క్రీ.పూ. 3వ శతాబ్దంలో కళింగ యుద్ధం చేసాడు. భీకరమైన ఆ యుద్ధంలో జరిగిన రక్తపాతం చూసి శస్త్ర సన్యాసం చేసాడు. శాంతియుత జీవనం కోసం బౌద్ధం అవలంభించాడు. తన కుటుంబ సభ్యులనే బౌద్ధ ప్రచారకులుగా దేశం నలుమూలలకు పంపాడు. అశోకుడి బౌద్ధ దూతలు సింహళ రాజ్యం కూడా చేరారని మనకు చిన్న నాటి చరిత్ర పాఠాలు చెప్పాయి. ఈ దూతల మార్గంలో తెలుగు ప్రాంతాలూ ఉన్నాయి. స్తంభాలు, శిల్పాల ద్వారా అశోకుడి ప్రచారం జరిగింది.
అయితే తెలుగు ప్రాంతాల బౌద్ధ మతం గురించి పురాతత్వ శాస్త్రజ్ఞుల ఆలోచన మరొకటి కూడా ఉంది. తెలుగు ప్రాంతాల్లో అశోకుడి కాలం కంటే ముందే బౌద్ధం చేరిందనీ అందుకు కొన్ని రుజువులూ చెప్పవచ్చని శాస్త్రజ్ఞుల మాట. తెలుగు ప్రాంతాల్లో బౌద్ధ శిల్పాలు ఒక ప్రత్యేకతతో కనిపిస్తాయి. అందుకు కారణం గ్రీకు, రోమనుల చెక్కడాల పద్ధతిలో అమరావతి, నాగార్జున కొండలోని శిల్పాల పోలికలు కనిపించడం. అశోకుడి తాత చంద్రగుప్త మౌర్యుడి కాలంలో వచ్చిన గ్రీకు వాడు అలెగ్జాండర్. భారతంలో కొద్ది కాలమే ఉన్నా అతని దూతలు, రాయబారులు ఇక్కడే ఉండి పోయి ఇక్కడి రాజ్యపాలనలో పరిణామాలు తెచ్చారు. దేశంలో వారు చేసిన ప్రయాణాల వల్ల కళలు, సంస్కృతి ఒక ప్రాంతం నుంచీ మరో ప్రాంతానికి పాకాయి. అందులోని భాగమే ఇటు తెలుగు ప్రాంతంలోనూ, ఉత్తరంలో మధుర వద్ద, బౌద్ధ శిల్పాలల్లో గ్రీకుల, రోమనుల కళా పద్ధతులు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద బౌద్ధం మన దేశంలో బుద్ధుడి కాలం క్రీ.పూ. 5వ శత్బాదం నుంచీ, క్రీ.శ. 5వ శతాబ్దం వరకూ, దాదాపు 1000 సం||లు ప్రబలి ఉంది. అందులో కళలు, నిర్మాణాలు మౌర్యుల కాలం క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచే కనిపిస్తాయి.
తెలుగు ప్రాంతాల్లో ఎన్నో బౌద్ధ ఆరామ, స్థూపాలు కనుగొన్నారు. భట్టిప్రోలు, గోలి, ఘనపూర్, ఘంటసాల, సూర్యాపేట, అమరావతి, నాగార్జునకొండ వంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి అమరావతి, నాగార్జునకొండ, ఇక్కడి శిల్పాలు రూపురేఖలు తెలుగు వారు బౌద్ధాన్ని ఆదరించిన పద్ధతి తెలుపుతాయి. అశోకుడి కంటే ముందే బౌద్ధం తెలుగు ప్రాంతాలకు చేరిందని, ఈ శిల్పాలే మనకు తెలియజేస్తున్నాయి. తెలుగు ప్రాంతంలో క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచీ క్రీ.శ.2వ శతాబ్దం వరకూ శాతవాహనుల పాలన జరిగింది. వారు నిర్మించినదే అమరావతి స్థూపం. వారి రాజధాని అమరావతి. దానినే ధాన్యకటకం లేదా ధరణికోట అని కూడా పిలిచారు. 1797వ సం||లో కోలిన్ మెకంజిస్ అనే బ్రిటిష్ గవర్నరు దీపాల దిమ్మె వద్ద ఒక పురాతన స్థూపం చూసి, ప్రభుత్వానికి తెలియజేసి తన పనిపై వెళ్ళిపోయాడు. 1816లో మళ్ళీ చూసినపుడు అక్కడి శిల్పాలను, పలకలను ప్రజలు తీసుకుని వేరే నిర్మాణాలకు వాడుకోవడం చూసి, ఆ చెక్కిన పలకల శిల్పాలను మద్రాసు, బ్రిటిష్ మ్యూజియంకు తరలించారు. అదే శాతవాహనులు నిర్మించిన అందమైన శిల్పాలున్న బౌద్ధ స్థూపం. ఇది తెల్లటి పాలరాతితో చెక్కబడింది. ఈ నిర్మాణం శాతవాహనుడైన వశిష్ఠీపుత్ర పులమావి (130 - 159 బి.సి.) కాలం నుంచీ, యజ్ఞశ్రీ శాతకర్ణి (174 - 203 ఏ.డి.) కాలం వరకూ జరిగాయని శాసనాల గుర్తులు తెలిపాయి.
శాతవా హనులు, మౌర్యుల పాలన నుంచీ స్వతంత్రం ప్రకటించి తమ విశాలమైన రాజ్యం ఏర్పరుచుకున్నారు. మధ్య భారతంలోని సాంచి స్థూపం కూడా వీరు నిర్మించినదే. అమరావతి స్థూపం మరింత ఆర్భాటంగా చెక్కబడిన స్థూపం. చిన్న పలకలపై కూడా లోతుగా శిల్పం చెక్కి, చక్కటి అంగ సౌష్ఠవం చూపించే అందమైన బొమ్మ ఇది. సాంచీకి మల్లే ఇక్కడ ద్వారాల వద్ద తోరణాలు, స్తస్తిక్లు ఉండవు. స్థూపం, దానిపై బౌద్ధ చిత్రాలు చూపరులకు నిరాటంకంగా కనిపిస్తాయి. ఇక్కడ స్థూపమే ముఖ్యమై కనిపిస్తూ, ద్వారాల వద్ద పెద్ద సింహాలు, స్థూపంపై అందంగా చెక్కిన శాక్యముని బుద్ధుడి పూర్వజన్మల గురించే చెప్పే జాతక కథలు అందంగా అలంకరించబడి ఉంటాయి. ఒక దీర్ఘ చతురస్రపు పలకలో మరో చిన్న స్థూపం చెక్కి దానికి ఎంతో మంది భక్తులు నమస్కరించి నివాళులర్పిస్తున్నట్టు కథనం చెక్కి ఉంటుంది. ఇది రాబోయే కాలాలకు బొమ్మ ద్వారా, అది ఎంత గౌరవనీయ స్థానమనీ చెప్పకనే చెప్పే పాఠమే కదా!
అమరావతి శిల్పం సహజసిద్ధతకు దగ్గరగా కనిపించే అందమైన శిల్పం. 1వ శతాబ్దంలో తూర్పు దేశాలకు, రోమనులకు వ్యాపార సంబంధా లుండేవి. అది కూడా ఒక కారణం కావచ్చు. అక్కడి కళా సంస్కృతి కూడా ప్రయాణించ డానికి ఇక్కడి స్థూపం మధ్య భారతంలోని బారూత్ స్థూపం కంటే కూడా భిన్నంగా, శిల్ప కళ వృద్ధి పొందింది అని చెప్పక చెపుతుంది. ఇక్కడ ఒక గుండ్రటి పలకపై వజ్రాసనం అనే పీఠం చెక్కి, దానిపై బుద్ధుడు జ్ఞానం పొందిన బోధి వృక్షం, లోతుగా చెక్కి, చూపరులకు ఒక కథలా సహజ రూపాలకు దగ్గరగా, ప్రాణం పోసుకున్న బొమ్మల్లా కనిపిస్తాయి. బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడిన ఇక్కడి మరో పలక, మాయాదేవి స్వప్నం, బుద్ధుడి జననం గురించే చెప్పే విషయం. రోమన్ పద్ధతిన ఈ పలక మధ్యన గోడల్లా విభజించి ఒక్కో గదిలో ఒక్కో విషయం వరుసగా చెపుతూ, మనకు ఆ కథా విషయం తెలుపుతాయి. ఇలా గ్రీకు, రోమనులతో సంబంధాలు చెప్పే మరికొన్ని శిల్పాలు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాయి. బలంగా చెక్కిన ఒక బుద్ధుడి శిల్పం, ఒక భుజంపై ఉన్న అంగ వస్త్రం, వస్త్రానికి చెక్కిన అందమైన అలల వంటి మడతలు ఇందుకు నిదర్శనం. ఇక్కడి బుద్ధుడి శిల్పాలు కనిపిస్తాయి కానీ, బోధిసత్వుడి శిల్పాలు కనిపించవు. గోలి స్థూపంలో, కుడిచేతిలో కమలం, గొడుగు కింద నిల్చున్న పద్మపాణి బోధిసత్వుడి శిల్పం చెక్కబడింది. అమరావతి శిల్పం అంతం, శాతవాహనుల కాలం అంతరించటంగా గుర్తించవచ్చు. అమరావతిలో ఈ నాడు ఆ పురాతన ఇటుకల స్థూపం ఆనవాలు కోసం సంరక్షించినా, మరో కొత్త స్థూపాన్ని సున్నపు రాయితో చెక్కి మన రాబోచే కాలల కోసం పున:నిర్మాణం చేయబడి భద్రపరచబడింది ఒక మ్యూజియంలో 3వ శతాబ్దపు మొదటి భాగంలో శాతవాహనుల కాలం అంతం అయి, ఇక్ష్వాకుల కాలం మొదలై, వారి రాజధాని విజయపురిగా, నాగార్జున కొండవారి కళా ప్రపంచంగా మారింది. మహాయాన బౌద్ధాన్ని విశ్వసించిన ఆచార్య నాగార్జునుడు, క్రీ.శ. 1 లేదా 2వ శతాబ్దంలో ఈ కొండపై నివసించటంతో ఈ కొండకు ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో క్రీ.శ. 2 నుంచీ 4వ శతాబ్దాల మధ్య కనీసం 30 బౌద్ధ ఆరామాలు కనుగొన్నారు. అక్కడ దొరికిన శిల్ప పలకల ప్రకారం ఆ ప్రాంతంలో 4 రకాల బౌద్ధ శాఖలు నివసించాయని తెలుసుకున్నారు. ఈ శాఖలు వివిధంగా బౌద్ధ ఆరామాలు, స్థూప, శిల్ప నిర్మాణాలు జరిపించాయి. అజంతా గుహలలోని ఒక స్థూపం, నాగార్జున కొండ బౌద్ధ శిల్పం, అమరావతి ఆఖరి దశ నుంచీ, కళా నైపుణ్యంతో మరికొంచెం ముందుకు నడిచిందనీ తెలియజేస్తాయి. ఇక్ష్వాకుల కాలంలో రాజులు హైందవులు, రాణివాసపు స్త్రీలు బౌద్ధులు. ఈ స్త్రీలు ఎన్నో విరాళాలిచ్చి బౌద్ధ శిల్పాలు, స్థూపాలు నిర్మించారని ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. ఈ మధ్యకాలంలో నాగార్జున కొండ లోయను నీటి వనరుల డ్యాంగా మార్చినపుడు, ఈ లోయ అంతా పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వించి బౌద్ధమతానికి సంబంధించిన అక్కడి కళా వస్తువులన్నీ పక్కనే కొండపై ఒక మ్యూజియం తయారు చేసి భద్రపరిచారు. 2, 3 శతాబ్దాలలో ఇక్కడ బౌద్ధం ఎంతగానో ప్రబలినా హైందవ కట్టడాలూ కొన్ని కనిపిస్తాయి. 3వ శతాబ్దం నాటి ఒక పొడుగు పలక వంటి శిల్పంపై, నరసింహ అవతారాన్ని పోలిన శిల్పం, పక్కన పంచ పాండవులని గుర్తించిన ఐదుగురు పురుషుల శిల్పాల్ని గుంటూరులోని పురావస్తు కార్యాలయంలో భద్రపరచబడింది. కూర్చుని ఉన్న ఈ సింహం, చేతులు ఎత్తి గద, చక్రం పట్టుకుని ఉంటుంది. ఇది నరసింహ అవతారానికి మొదటి రూపం అనుకోవాలా, లేక యుద్ధంలోని ఒక వ్యూహంలా గుర్తించాలా అని కూడా అనుమానం ఉంది. ఒక శిలా శాసనం ప్రకారం క్రీ.శ. 278లో నాగార్జున కొండపై వైష్ణవాలయంలో చెక్కతో చేసిన అష్ఠభుజ విష్ణు విగ్రహం ప్రతిష్టించబడింది. అది బహుశ శిథిలమై దొరకలేదు. అలాగే ఉండవల్లి (గుంటూరు వద్ద) లోనూ హైందవి నిర్మాణాలున్నాయి. ఇక్ష్వాకు రాజులు హైందవులవటం వల్ల బౌద్ధ ప్రాబల్యం ఉన్నా, హైందవ నిర్మాణాలూ జరిగి ఉండవచ్చు. కొన్ని శిథిలమై ఉండవచ్చు. ఈ హైందవ నిర్మాణాలు, బౌద్ధం ప్రాబల్యం ఎక్కువగా జరిగిన దక్షిణ ఆసియా ఖండంలో మొదటగా కనిపించే హిందూ శిల్పాలు. బహుశా క్రీ.శ. 5వ శతాబ్దం నుండే గుప్తుల కాలంలో హిందూ మత శిల్పం ప్రబలినపుడు, దానికి క్రీ.శ. 3వ శతాబద్దపు ఈ శిల్పాలే ఆధారమై ఉండవచ్చు. ఇవి చిత్రం, శిల్పం అందించే రుజువులు.
మరో మాట, అమరా వతి, నాగార్జున కొండ ఆనాటి తెలుగు వారు మనకు ఇచ్చిన కళా సంపదలు. అమరా వతిని శిథిలావస్థలో బ్రిటిష్ గవర్నరు చూస్తే, నాగార్జున కొండని 1926లో సూరపరాజు వెంకట రామయ్య అనే ఉపాధ్యాయుడు, అక్కడ ఒక స్తంభాన్ని గమనించి సర్కారు వారికి తెలియజేసాడు. కళలు మూగగా నిల్చుని మనకు రుజువులు ఇవ్వటమే కాదు, విషయ ప్రచారాలకూ బలమైన ఆధారాలయ్యాయి.
- డా|| ఎం.బాలమణి, 8106713356