Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సినిమాపై హాలివుడ్ ప్రభావం చాలా ఉంది. ఒక రిత్విక్ ఘటక్ తప్ప పూర్తి భారతీయ ఆత్మతో సినిమాను తీసిన దర్శకులు మన దగ్గర ఇంచుమించు లేరనే సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ మధ్య అసామీ భాషలో వస్తున్న సినిమాలు ఆ కొరతను తీరుస్తాయని అనిపిస్తుంది. సినిమా అంటే కనిపించే దృశ్యాలు, పాత్రల నడుమ నడిచే సంభాషణలు మాత్రమే కాదని వీటితోనే కాకుండా వీటి మధ్యన కూడా ప్రభావంతంగా కథను నడిపించవచ్చని తెలిసిన దర్శకులు అతి తక్కువ మంది. ఓ పాత్రని స్క్రీన్ పై చూపే విధానంలో, ఆ పాత్రతో నడిపించే అడుగులతో కూడా కథను చెప్పవచ్చు. దీన్ని నిజం చేసిన సినిమా అసామీ భాషలో వచ్చిన ''హాన్దుక్''. అసామీ ప్రాంతంలో మోరాన్ భాషలో హాన్దుక్ అంటే ఇంట్లోని ఓ చీకటి మూల. ఓ తల్లి మనసులోని ఓ చీకటి మూలను తాకే ప్రయత్నం చేసిన సినిమా ఇది.
ఈ సినిమాలో నటించిన వాళ్లు ఫ్రొఫెషనల్ నటులు కాదు. సినిమా మొదటి షాట్ లో ఓ పల్లెటూరి ముసలి స్త్రీ ఓ పెద్ద వెదురు చెట్టుని నరుకుతూ కనిపిస్తుంది. ఆ పెద్ద చెట్టుని నరికి తనతో పాటు లాక్కుంటూ తీసుకువెళుతుంది. ఈ షాట్ నిడివి సుమారు ఆరు నిముషాలు ఉంటుంది. కెమెరా అస్సలు కదలదు. ఈ ఒక్క షాట్‌తో సినిమా మూడ్‌ని చూపిస్తారు దర్శకులు. ఆ తల్లి జీవితంలో ఏ ఉత్సాహం లేదు, ఏ జీవం లేదు. కదులుతున్న ప్రాణం లేని శరీరం అది. ఆ తల్లి పాత్ర సినిమాలో ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆమె జీవం లేని కళ్లు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లున్న ఆమె ముఖం, ఏ గమ్యం లేని ఆమె శరీర కదలికలు ఆమె జీవితంలోని విషాదాన్ని సూచిస్తుంటాయి.
ఆ స్త్రీ పేరు హర్మోని. ఆమె కొడుకు ముక్తి మిలిటెంట్లలో చేరి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాడు. అతను బతికి ఉన్నాడో లేదో కూడా ఆ తల్లికి ఏ సమాచారం లేదు. బుల్లెట్లు నిండిన ఓ శరీరాన్ని ఆమె కొడుకుదిగా నిర్ణయించడం వల్ల హార్మోని ఆ శరీరానికి అంతక్రియలు చేస్తుంది. తరువాత ఖర్మ కూడా నిర్వహిస్తుంది. కాని ఇంతలో ఆ శరీరం తన కొడుకుది కాదనే మరో అనుమానం మొదలవుతుంది. సెవాలి, ముక్తి బాల్య స్నేహితురాలు, ప్రియురాలు కూడా. ఆమె కూడా ముక్తి ఏదో ఓ రోజు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు స్త్రీలకు జీవించడానికి మరో కారణం ఉండదు. కాని ముక్తి అంతక్రియలు, ఆ తరువాత వచ్చిన అనుమానంతో తమ మనసులను ఎలా సమాధాన పరుచుకోవాలో ఆ ఇద్దరికీ అర్థం కాదు. సినిమాలో ఈ పాత్రల పేర్ల ద్వారా కూడా దర్శకులు చాలా చెప్పే ప్రయత్నం చేశారు. ముక్తి బతికి ఉన్నాడో లేడో తెలీదు. ముక్తి అంటే స్వాతంత్య్రం, ఇది ఈ సమాజంలో ఉందో లేదో తెలియని పరిస్థితి.
అదే గ్రామంలో బిప్లబ్ అని ఇంకో యువకుడు ఉంటాడు. ఉద్యమబాటలో కొన్నాళ్లు ప్రయాణించి తరువాత ప్రభుత్వానికి లోంగిపోయి జనజీవన సవ్రంతిలో కలిసిపోతాడు. కాని ఆ ఉరిలో ఇదివరకులాగా జీవించలేక సతమతమవుతూ ఉంటాడు. విప్లవాన్ని వదిలి వచ్చిన వారిని తమ పిల్లలకు నమ్మక ద్రోహం చేసిన వారిగా విప్లవంలో పిల్లలు ఉన్న పెద్దలు చూస్తూ ఉంటారు. ఈ లొంగిపోయిన మిలిటెంట్‌కు బిప్లబ్ అన్న పేరు పెట్టడంతో విప్లవం లొంగిపోయి అయోమయపు స్థితికి చేరి నమ్మకం పోగొట్టుకున్న నైజం ప్రతిఫలిస్తుంది. ఈ పాత్రకు ఈ పేరు పెట్టి దర్శకులు ప్రస్తుతం విప్లవ స్థితిని చూపించే ప్రయత్నం చేసారనిపిస్తుంది.
ఒక్క మాట మాట్లాడని ఆ తల్లి సినిమాలో ఎక్కడా కూడా ఓ కన్నీటి బొట్టు రాల్చదు. కాని ఆమె ప్రతి కదలికలో ఆమె జీవితంలోని విషాదం కనిపిస్తూ ఉంటుంది. కొడుకు అంతక్రియలు చేసాక అతను కొడుకు కాదని తెలిసినప్పుడు అతని క్షేమాన్ని కాంక్షిస్తూ ఆమె తరువాత ఊరిలోని స్త్రీలందరితో పాటు మరో పూజ నిర్వహిస్తుంది. రెండు సందర్భాలలో కూడా అదే విషాదం ఆమె ముఖం పైన, అదే నిర్వేదం కనిపించి ప్రేక్షకులకు ఓ రకమైన భయం కలుగుతుంది.
సినిమాను ఎటువంటి ఆర్భాటాలు, గోల లేకుండా నడిపిస్తారు దర్శకులు జైచంగ్ జై దొహోటియా. ఈశాన్య ప్రాంతాలలోని మిలిటెంట్లకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని కథా వస్తువుగా తీసుకునున్నా, ఎక్కడా యుద్ధ చాయలు, గన్ షాట్లు ఈ సినిమాలో కనిపించవు. ఆ పోరాట పరిస్థితుల కారణంగా ఓ చిన్న మారుమూల పల్లెటూరిలో జీవం కోల్పోయి జీవిస్తున్న సగటు స్త్రీలను చూపించడం మాత్రమే అతని ఉద్దేశం. కొడుకు ఉన్నాడో, లేడో తెలీదు, పోయాడని అతని కోసం ఏడవాలో తెలీదు. అసలు ఆ కొడుకుది అనుకున్న శవం అతనిదా కాదా అన్న మీమాంస. మళ్లీ అతని క్షేమం కోసం చేసే ప్రార్ధనలో కూడా ఓ అనుమానం. దేన్ని నమ్మాలో నమ్మకూడదో, ఏది నిజమో అబద్దమో అర్ధం కాని అయోమయంలో ఓ తల్లి పడే వేదన ఈ సినిమా అంతా ఆక్రమించుకుని ఉంటుంది. అలాగే తాను ప్రేమించిన వ్యక్తి కోసం ఎదురు చూడాలో లేదో తెలియని అయోమయంలో భవిష్యత్తు లేని జీవితాన్ని లాక్కు వచ్చే మరో యువతి ఒంటరితనాన్ని కూడా చూపిస్తుంది ఈ సినిమా.
ఈశాన్య ప్రాంతాలలో మారుమూల పల్లెటూర్లలో ఇంకా రోడ్లు కరెంటూ లేని ఓ చిన్న ఊరులో ఈ కథను నడిపిస్తూ అక్కడి ప్రకృతిలో మమేకమైన విషాదాన్ని కూడా పట్టుకుంటారు దర్శకులు. సినిమా అంతా కూడా సహజమైన వెలుతురులోనే తీసారు. గాలి చేస్తున్న చప్పుడు, ఆకుల రాపిడి, అడుగుల చప్పుడు కూడా వినిపించే అంత గొప్పగా సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నీళ్ళల్లో కనిపించే నాచు నుంచి ఏపుగా పెరిగిన వృక్షాల దాకా అంతా పచ్చదనమే కాని వాటిలో కూడా విషాదం పరుచుకుని కనిపిస్తుంది. చివరికి శవానికి కప్పి ఉన్న ప్లాస్టిక్ షీట్ కూడా పచ్చగా భయం గొల్పేలా ఉంటుంది. ఇంట్లో వెలిగే గుడ్డి దీపం కూడా చావును గుర్తుకు తెస్తూ, శవం వెనుక పెట్టిన దీపంలా అనిపిస్తూ ఉంటుంది. సినిమా చివర్లో బిప్లబ్ తన పరపతి ఉపయోగించి ముక్తి గురించి కనుక్కుంటాడు. జవాబుగా అతనికి మిలిటెంట్ స్నేహితుల నుండి ఓ ఉత్తరం వస్తుంది. అది అతను తెరవడు. దాన్ని హర్మోని ఇంటి బైట వదిలి వేస్తాడు. ముక్తి బతికి ఉన్నాడో లేదో ప్రేక్షకులకు తెలియదు. ఆ తల్లి మళ్లీ దేనికి సిద్ధపడాలో దర్శకులు చెప్పరు. ఇంత దాకా వచ్చాక అది తెలుసుకోవడం అవసరం అనిపించదు. ముక్తి లోటుతో ఆ తల్లి అనుభవిస్తున్న విషాదం కన్నా మరో పెద్ద విషాదం ఉండదని, ముక్తి బతికి ఉన్నాడా లేదా అన్నది ఆ సందర్భంలో అప్రస్తుతం అని ప్రేక్షకులకూ అనిపిస్తుంది. ఆ తల్లి ఏ ఆనందాలకూ, విషాదాలకూ స్పందించని స్థితిలో గడుపుతున్న జీవితంలో ఎటువంటి వార్త అయినా పెద్ద తేడా తీసుకురాదు. ఏ స్పందనలూ మనసుకు అంటని స్థితికి చేరుకోవడం కన్నా మనిషి జీవితంలో మరో విషాదం ఏం ఉంటుంది. దేశ రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు ఎందరి తల్లులను ఈ స్థితిలోకి నెట్టివేస్తున్నాయో అన్నది ఆలొచిస్తే, మనసు భారం అయిపోతుంది.
సినిమాని టిక్నికల్గా విశ్లేషించే వారు ఇందులో ఉపయోగించిన ఫోర్ గ్రౌండ్ షాట్ల గురించి చర్చిస్తారు. కెమెరాకు అతి దగ్గరగా ఉన్న వస్తువు మీదనే పూర్తి దృష్టితో తీసే ఈ షాట్లు సాధారణంగా సినిమాలకు వాడరు. కాని ఈ సినిమా అధికశాతం ఫోర్ గ్రౌండ్ షాట్లలోనే తీయడం వేశేషం. హింసను స్క్రీన్‌పై చూపకుండా, సినిమా కథ అంతా కూడా హింసను ప్రస్తావించడం మరో విశేషం. ఈ సినిమాను, ఇటువంటి వాతావరణంలో జీవిస్తూ ఆ హింసను ప్రతి నిత్యం అనుభవిస్తున్న వారి మధ్య, వారితోనె తీయడం మరో విశేషం. అసాం ప్రాంతాలలో మోరాన్ భాష మాట్లాడే వారిపై ఇప్పటి దాకా ఏ చిత్రమూ రాలేదట. పైగా అదే భాషలో సినిమా రావడం కూడా ఇదే మొదటి సారి. అంతే కాకుండా సినిమాలో చూపించిన ఖర్మకాండలు, పూజలు, అన్నీ కూడా అక్కడి ప్రజల జీవితంలోని నిజాలు. వాటిని పూర్తిగా యధావిధిగా చిత్రీకరించి ఆ ప్రాంతపు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ప్రయత్నం చేసారు దర్శకులు. సినిమాలోని ఆ తల్లి పాత్ర విషాదం మాత్రం మనలను చాలా రోజులు వేధిస్తుంది.
- పి.జ్యోతి
9885384740