Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిమ యుగం నుండి మొదలుకొని మానవుడు భాషను కనిపెట్టిన నాటినుండి నేటి వరకు మానవ అభివృద్ధి చరిత్ర మొత్తం పుస్తకాలలో భద్రపరచబడింది. ప్రపంచంలో జరిగే అభివృద్ధి క్రమ వికాస పరిణామం, మనిషి లోపలి ప్రపంచపు లోతుపాతులు అన్ని అక్షర రూపంలో ఆవిష్కృతమై ఉన్నాయి. కాబట్టి పుస్తక ప్రియులు ఆనాటి మానవుడుతోనే గాక ఈనాటి మానవుడితో ,రేపటి మానవుడితో కూడా పరిచయం ఏర్పరుచుకోగలిగారు. మానవ సమాజ క్రమ వికాస పరిణామం లో మనిషి ఎదుర్కొంటున్న జీవితపు ఆటుపోట్లు, బాధలు ,ఆనందాలు, జయాపజయాలు ఒకటేమిటి మొత్తం వేల సంవత్సరాల మానవ నాగరికత అంతా కూడా పుస్తక రూపంలో పొందుపరచబడి ఉంది.
వేలాది సంవత్సరాల చారిత్రిక కళా సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సామాజిక శాస్త్రీయ రంగాలకు సంబంధించిన లక్షలాది గ్రంధాలు, గ్రంథాలయాల్లో భద్రపరచబడి ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి, చదివి తెలుసుకోవడానికి ఒక మనిషి జీవితకాలం చాలకపోవచ్చు. అయినా కానీ ఆసక్తి కల వ్యక్తులు తమ జీవిత కాలంలో మానవ చరిత్రను అంత అధ్యయనం చేయవచ్చు, చేస్తున్నారు కూడా.
ఒక మంచి పుస్తకం చదువుతున్నామంటే ఆ రచయిత జీవితాన్ని, అనుభవ సారాన్ని మనం అవగాహన చేసుకుంటున్న మాట. ఆ అవగాహన మనోవికాసానికి తోడ్పడకపోతే ఆ లోపం తప్పనిసరిగా పాఠకుడిదే. ఎందుకంటే ఆ రచయిత ఆలోచన సరళితో ఏకీభవించని వారికి ఆ రచన నచ్చకపోయే ప్రమాదం ఉంది. రచయితతో, రచనతో తాదాప్యం చెందిన పుస్తకమే మన ఆలోచన సరళికి పదును పెడుతుంది. అది మనకు సంస్కార వంతమైన ఆలోచన శక్తిని అందివ్వగలుగుతుంది.
ప్రఖ్యాత విమర్శకుడు సర్దేశాయి తిరుమల రావు ఆజన్మ బ్రహ్మచారి. వారు కొన్ని వేల గ్రంథాలను కొని భద్రపరిచారు. రోజులో కనీసం 18 గంటలు చదివేవారాయన.. నడుముకు శక్తి సన్నగిల్లాక పడుకొని చదువుతూ ఉండేవారు. 1940లో చిలుకూరి నారాయణరావు కూడా అలాగే చదివే వారట. మార్క్స్ లాంటి మేధావి, వివేకానందుడి వంటి సాంస్కృతిక ప్రచారకుడు, అరవిందుడు వంటి దార్శనికుడు, మహాత్ముని వంటి రాజ నీతిజ్ఞుడు -వీరందరూ దశాబ్దాల పాటు గ్రంథ పఠనం చేసిన వారే. అందుకే వారు అత్యద్భుతమైన రచనలు చేయగలిగారు. ఉపన్యసించగలిగారు .సమాజానికి ఒక కొత్త ఊపిరి ఊది సమాజ గతిని మార్చగలిగారు.
ఈ స్పీడ్ యుగంలో ఒక భాషలోని సాహిత్యాన్ని, ఒక రంగంలోని విజ్ఞానాన్ని గుడ్డిగా విశ్వసించి, బావిలోని కప్పలాగా ఉండిపోతే లాభం లేదు. విశ్వజనీన స్థాయిలో విజ్ఞాన వీచికలు వీస్తున్న ఈ రోజుల్లో గ్రంథ పఠనం అనివార్య ప్రక్రియ. అందుచేత పాఠకుడు గ్రంథాన్ని తన మస్తక భూషణం గానే భావించాలి.
యువకులు క్రమంగా పత్రికలు, పుస్తకాలు చదివే అలవాటును పోగొట్టుకున్నారు. విజువల్ మీడియా ప్రబలి ఈనాడు అన్ని టీవీల ద్వారా సెల్ఫోన్ల ద్వారా చూసేస్తున్నారు. అంతా తొందరగానే మరిచిపోతున్నారు కూడా. గ్రంథ పఠనం మీద ఆసక్తి పోవడానికి ఇది కొంత కారణం అవుతుంది.
ఆంగ్లేయుల కాలంలో గ్రంధాలయాలు స్థాపించాక అవే అన్ని ఉద్యమాలకు నిలయమయ్యాయి. జ్ఞానాభివృద్ధికి కారణమ య్యాయి. మనం స్వతంత్రులం అయ్యాక పౌర గ్రంథాలయ స్థాపనకు ప్రభుత్వమే పూనుకుంది. అందుకే ఈనాడు నగరాల్లో పట్టణాల్లోనే కాక పల్లెపల్లెల్లోనూ గ్రంధాలయాలు, శాఖా గ్రంధాలయాలు వెలిశాయి. విజ్ఞాన వినోదాలకు ఈనాటికి ఉపకరిస్తున్నాయి. గ్రంథాలే కాక దిన, వార మాసపత్రికలు అన్ని రకాల, అన్ని భాషలలోనూ లభిస్తున్నాయి. పిల్లలకు పెద్దలకు లింగ వివక్ష లేక వర్ణ, వర్గ, కుల, మతాతీతంగా ఈ గ్రంథాలయాలు ఆధునిక యుగంలో ఉపకరిస్తున్నాయి. సామాన్య అంశాలే గాక అత్యాధునిక శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ప్రజలకు అందిస్తున్నాయి. విద్యార్థులు పోటీపరీక్షలకు సిద్ధం కావడానికి ఈ గ్రంథాలయాలు చేసే ఉపకారం ఇంతింత అని చెప్పలేం. ఈనాడు నియత విద్యా విధానంలోనే గాక అనియత విద్యా విధానంలోనూ ఎంతగానో ఈ గ్రంథాలయాలు సహకరిస్తున్నాయి. అలాగే అక్షర జ్యోతి కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యత నిర్మూలనకు గ్రంథాలయాలు పట్టుగొమ్మలుగా ఉన్నాయి. అందరూ అన్ని పుస్తకాలు కొనలేరు. వ్యక్తిగత గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకోలేరు. తగిన ధనం అవకాశం వీటికి అవసరం. అందు వల్లనే ఈ పౌర గ్రంథాలయాలు మనకెంతగానో ఉపకరిస్తూ, మానవ జ్ఞాన తృష్ణ తీర్చడానికి సమర్థమై ఒప్పుతున్నాయి.
- కోట్ల వేంకటేశ్వరరెడ్డి