Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడపట్ల సురేష్
8328365729
కొండకోనల మధ్య కొలువైన ఈ ఆలయ పరిసరాల్లో అడుగు పెడితే గిరిజన సంప్రదాయం ఉట్టి పడుతుంది. ఆదివాసుల ఇలవేల్పు.. ఆరాధ్యదైవంగా భావించే నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచింది. సంస్కృతి, సంప్రదాయాలే ప్రాణంగా.. అనాదిగా వస్తున్న ఆచారాలను తూచ తప్పక పాటించే ఆదివాసులకు నాగోబా జాతర అతి పెద్ద పండుగ. పతి ఏటా పుష్యమాసంలో అమావాస్య రోజున సంప్రదాయ పూజలతో ప్రారంభమయ్యే నాగోబా జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతరగా పిలువబడుతున్న జాతర ఈ నెల 21తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ జాతరకు తెలంగాణ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసులే కాకుండా గిరిజనేతరులు కూడా తండోపతండాలుగా వస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించి జాతర నిర్వహిస్తుండటం విశేషం.
గిరిపుత్రులందరికీ నాగోబా ఆరాధ్య దైవం. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున అత్యంత వైభవంగా నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఈ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఉంది. మెస్రం వంశస్తులు వారి ఆచారం ప్రకారం అమావాస్య అర్ధరాత్రి రోజు నాగోబాకు సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తారు. అప్పట్నుండే ఆలయ పరిసరాల్లో సందడి మొదలవుతుంది. అమావాస్యకు రెండు వారాల ముందు నుండే గిరిజనుల్లో సంబరం మొదలవుతుంది. జాతర సందర్భంగా కెస్లాపూర్‌కు స్థానిక గిరిజనులే కాకుండా వివిధ ప్రాంతాల నుండి మెస్రం వంశస్థులు తరలి వస్తుంటారు. దీంతో కెస్లాపూర్ గ్రామం గిరి'జన' సంద్రమవు తుంది. పగలూ రాత్రి పూజలతో మార్మోగుతుంది. తరతరాలుగా నాగోబా జాతర సంస్కృతి, సంప్రదా యాలకు నిలువుటద్దంగా నిలుస్తోంది. విశేషాల సమాహారంగా కొనసాగుతోంది. ఈ యేడాది మాత్రం జనవరి 21 నుండి నాగోబా జాతర ప్రారంభమైంది. మెస్రం వంశస్తులు ఆనవాయితీ ప్రకారం ఐదు రోజుల కోసం జాతర ప్రారంభమ వుతున్న వారం రోజుల వరకూ కొనసాగు తుంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదా యాలకు అద్దంపట్టే ఈ జాతరకు మహా రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా వివిధ తెగలకు చెందిన ఆదివాసీలు తరలివస్తుంటారు. నాగోబా జాతరకు ఐటీడీఏ తరపున ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతకాలం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తుండగా ఇటీవల శాశ్వత నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.
ప్రచారంలో నాగోబా కథ
అనాదిగా మెస్రం వంశస్తులు నాగోబాను తమ దైవంగా కొలుస్తున్నారు. శ్రద్ధతో పూజిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం నాగేంద్రుడు మెస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి - రాణి దంపతులకు కలలో కనిపించి సర్పం రూపంలో జన్మిస్తానని చెప్పాడట. ఆ తర్వాత కల నిజమైందని గిరిపుత్రులు విశ్వసిస్తారు. కొంత కాలానికి నాగేంద్రుడి తల్లి తన తమ్ముని కూతురు గౌరితో సర్ప రూపంలో ఉన్న నాగేంద్రుని వివాహం జరిపిందట. అత్త ఆజ్ఞ మేరకు గౌరి భర్త అయిన నాగేంద్రున్ని బుట్టలో పెట్టుకుని గోదావరికి పయనమైనట్టు గిరిజనులు చెబుతుంటారు. ప్రయాణం మధ్యలో పాము ఒక చోట ఉడుము రూపంలో కన్పించగా ఆ ప్రాంతం ఉడుంపూర్‌గా మారింది. ఉడుంపూర్ పేరుతో గ్రామం కడెం మండలంలో ఉంది. అనంతరం ధర్మపురి నదిలో గౌరి స్నానం చేస్తుండగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషిగా మారాడట. పేరు ప్రతిష్టలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమని నాగేంద్రుడు అనగా గౌరి సంప్రదాయాలను కాదని పేరు ప్రతిష్టలు కోరుకోగా, మనిషి తిరిగి పాముగా మారినట్టు కథనం. తదనంతరం ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు వెతికిన గౌరి గోదారి నదిలో సత్యవతి గుండంలో కలిసి పోయిందని ప్రచారంలో ఉంది. గౌరి వెంట నాగేంద్రుడు ఉంచిన ఎద్దు బండగా మారింది. తర్వాత ప్రతి జంటకు బెటికొరియాడ్ (నాగోబా సమక్షంలో కొత్త జంటలను కలపడం) తన సన్నిధిలోనే జరగాలని చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని కథ చెబుతుంటారు. కాలక్రమేణా అదే కెస్లాపూర్ గ్రామంగా రూపుదిద్దుకుంది. నాగేంద్రుడు వెళ్లిన పుట్ట వద్ద నాగోబా ఆలయం వెలిసింది. ప్రతి యేటా పుష్య అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గోండుల ప్రగాఢ విశ్వాసం.
కొత్త కోడళ్ల బేటింగ్
ప్రతి యేడాది కొత్తగా పెండ్లి చేసుకున్న మెస్రం వంశీయుల కోడళ్లను ఆ వంశం పెద్దలకు పరిచయం చేస్తారు. దీన్ని బేటింగ్ అంటారు. నాగోబాకు మహాపూజ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మెస్రం సంప్రదాయం ప్రకారం బేటింగ్ జరిగాకే ఆ మహిళలు నాగోబాకు పూజలు చేయడానికి అర్హులవుతారు. పూజలు, భేటింగ్ తర్వాతి రోజు ఆలయం వెనుక ఉన్న పెర్సాపేన్‌కు పూజలు చేస్తారు. ఈ పూజలను కేవలం పురుషులు మాత్రమే నిర్వహిస్తారు. పూజలు జరుగుతున్న సమయంలో ప్రధాన్‌లు సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తుంటారు. తర్వాత మట్టితో భాన్ దేవత విగ్రహాలను తయారు చేసి పూజలు చేస్తారు. గోవాడ్ వద్ద మెస్రం వంశీయుల్లో ఉన్న 22 కితల (వివిధ వర్గాలు) వారీగా సంప్రదాయ పూజలు చేస్తారు. కుండల్లో వంటకాలను తయారు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేస్తారు.
గిరిజన దర్బార్
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రతి యేటా నాగోబా జాతర సందర్భంగా దర్బార్ నిర్వహిస్తుంటారు. 1946లో మానవ పరిణామ శాస్త్రవేత్త హెమన్‌డార్ఫ్ ఈ దర్బార్‌కు శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచి అధికారికంగా దర్బార్ నిర్వహిస్తు న్నారు. ఆ రోజు జిల్లాకు చెందిన మంత్రులతో పాటు గిరిజన శాఖ మంత్రి, ఇతర గిరిజన ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులంతా కెస్లాపూర్ లో కొలువు దీరుతారు. వివిధ తెగలకు చెందిన గిరిజనులు సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేస్తారు. వాటిని అక్కడికక్కడే పరిష్కారమయ్యే విధంగా ఈ వేదిక ఏర్పాటు చేశారు. అయితే యేటా గిరిజనులు సమస్యలపై అర్జీలు పెట్టుకుంటున్నా పరిష్కారం కాకపోవడంతో దర్బార్ పట్ల వారు అసంతృప్తితో ఉన్నారు. దర్బార్ అనంతరం ఆదివాసుల బేతాల్ పూజ ఉంటుంది. కులపెద్దలు బేతాల్ నృత్యాలు చేస్తారు. కర్రసామును పోలిన ఈ నృత్యాలు అందరినీ అలరిస్తాయి. తదనంతరం మండగాజిలింగ్ పూజలతో నాగోబా జాతర ముగుస్తుంది. ఈ మండగాజిలింగ్లో జాతరకు వచ్చిన కానుకలు, నైవేద్యాలను కితల వారిగా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక నృత్యాలతో జాతరకు ముగింపు పలుకుతారు.
ఆలయాభివృద్ధికి రూ.10కోట్లు
కెస్లాపూర్‌లోని నాగోబా జాతరకు తెలంగాణ ప్రభుత్వం నిధుల వర్షం కురిపించింది. జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో అభివృధ్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.10కోట్లు కేటాయించింది. ఎస్డీఎఫ్ నిధులు రూ.5కోట్లతో కెస్లాపూర్‌లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.1.80కోట్లతో ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణం, కేస్లాపూర్ నుంచి మల్లాపూర్ వరకు మరో రూ.90లక్షలు రోడ్డు నిర్మాణానికి కేటాయించింది. రూ.95లక్షలు దర్బార్ హాల్ నిర్మాణానికి, కోనేరు నిర్మాణం కోసం రూ.90వేలు, ల్యాండ్ లెవలింగ్ కోసం రూ.కోటి కేటాయించింది. వీటితో పాటు ఆలయం ఆవరణలో నాలుగు గోపురాల నిర్మాణం కోసం మరో రూ.5కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఆయా పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగతా నిధులతో ఆలయ పరిసరాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీటితో పాటు మరో రూ.5కోట్లతో ఆలయ పరిసరాల్లో నాలుగు గోపురాల నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో ఒక గోపురం నిర్మాణం కోసం మరో మూడు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు మరో రూ.7.50కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సహకారం : జె.బాలాజీ, ఇంద్రవెల్లి
కాలినడకతో గంగాజలం
నాగోబాను గంగాజలంతో అభిషేకిస్తారు. జలాలను గోదావరి నది నుంచి కాలినడకన తీసుకొస్తారు. అమావాస్యకు 15 రోజుల ముందుగా నీళ్ల కోసం బయల్దేరుతారు. వెళ్లి రావడానికి సుమారు వంద కిలో మీటర్లకు పైగా నడుస్తారు. ఉట్నూర్, దంతన్‌పల్లి, బీర్సాయిపేట్, ఉడుంపూర్, ఇంధన్‌పెల్లి, కలమడుగు మీదుగా గోదావరి నదికి వెళ్తారు. హస్తిన (అత్త) మడుగు వద్ద నది నీళ్లు తీసుకుంటారు. ఈ దారిలో ఉన్న గిరిజన గ్రామాల్లో బస చేస్తారు. వెంట తీసుకువెళ్లిన ఉప్పుడు బియ్యాన్ని వండుకుని నైవేద్యం పెట్టి, సామూహిక భోజనాలు చేస్తారు. అనంతరం గంగా జలాన్ని తీసుకుని నాగోబా ఆలయానికి కాలినడకన బయల్దేరుతారు. గంగాజలాలు తీసుకొని తిరుగు ప్రయాణంలో ఆచారం ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కొలువైన ఇంద్రాదేవికి పూజలు చేస్తారు. అక్కడి నుంచి కెస్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న మర్రిచెట్టు వద్దకు చేరుకుంటారు. మర్నాడు రాత్రి మృతి చెందిన మెస్రం వంశీయుల పేరుతో తూం పూజలు చేస్తారు. మూడు రోజుల పాటు సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలు డోల్, పిప్రి, కాలికోంల చప్పుళ్ల నడుమ గంగా జలంతో ఆలయానికి చేరుకుంటారు.
ఆలయం నిర్మించిన మేస్రం వంశస్తులు
నాగోబా నూతన ఆలయాన్ని మేస్రం వంశస్థులు సొంత నిధులతో నిర్మించడం విశేషం. వరుసగా అయిదేండ్ల పాటు మేస్రం వంశస్తుల నుంచి విరాళాలు పోగు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. మేస్రం వంశ ఉద్యోగులు ఏడాదికి రూ.10వేల చొప్పున, ఆ వంశంలోని వ్యవసాయదారులు రూ.5వేల చొప్పున, ప్రజాప్రతినిధులు రూ.7వేల చొప్పున, కూలీలు, వ్యవసాయం లేని వారు వారికి తోచిన విరాళం అందించారు. ఆ వంశస్థులు సేకరించిన రూ.5కోట్ల నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయానికి అవసరమయ్యే రాతి స్తంభాలను కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి నాగోబా విగ్రహాన్ని తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెప్పించారు. ఈ జాతర నిర్వహణ మెస్రం వంశస్తులు ప్రతిష్టమైనదిగా భావిస్తారు. నెల ముందుగానే ఏర్పాట్లలో ఉంటారు. సమావేశమై చేపట్టాల్సిన పనుల గురించి చర్చిస్తారు. ఎడ్లబండి(ఛకడ)లో కటోడా (పూజారి), ప్రధాన్ (పూజలకు సలహాదారుడు) కలిసి ముందుగా మహాపూజకు అవసరమైన కుండల తయారీకి కుమ్మరులకు ఆర్డర్ ఇస్తారు. కుండలను ఇచ్చోడ మండలం సిరికొండ గ్రామంలో తయారు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం ఏడు రోజుల పాటు కటోడా, ప్రధాన్‌లు కలిసి ఎడ్ల బండ్లపై మెస్రం వంశీయులున్న ఏడు గ్రామాలను సందర్శిస్తారు. జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు.
జాతరకు అన్ని సౌకర్యాలు
నాగోబా జాతర ఆదివాసులకు చాలా ప్రత్యేకమైన జాతర. నాగోబా దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేస్రం వంశస్తులకు కూడా అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఇటీవల కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన జరగడంతో ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారని అనుకుంటున్నాం. జాతరలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ నిధులు రూ.5కోట్లతో ఇప్పటికే వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ పనులన్ని తుది దశకు చేరుకున్నాయి.
- వరుణ్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ
మేస్రం వంశీయుల కల నెరవేరింది
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసించే మేస్రం కుటుంబాలతో పాటు ఉద్యోగుల నుంచి విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టాం. ఒక్కో కుటుంబానికి ప్రతి ఏటా రూ.3వేల నుంచి రూ.5వేల వరకు విరాళాలు సేకరించాం. గర్భగుడి నిర్మాణాన్ని మేస్రం వంశీయులే నిర్మాణం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ కల ఇప్పుడు నెరవేరింది. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన కెస్లాపూర్ నాగోబా జాతరకు ఏడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. గిరిజన కళాకారులతో పెద్ద ఎత్తున సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు ఆర్భాటంగా చేపట్టనున్నాం.
- మేస్రం శేఖర్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు