Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా ఏడాదికి కాలాలు మూడు. అవి మండేకాలం, వణికేకాలం, తడిసేకాలం. అయితే ప్రతి ఐదో సంవత్సరానికి నాలుగవ కాలం కూడా వస్తుంది. అదే 'ఎన్నికల కాలం' అని ఓ దగ్గుదగ్గాడు స్వామీజీ.
అవును స్వామీ ఆ కాలంలో మండటం, వణకడం, తడవడం అన్నీ కల్సికట్టుగా వచ్చి నానా రకాలుగా హింస పెడుతున్నాయి. దీనికి తరుణోపాయం తమరే సెలవివ్వాలి అన్నాడు స్వామీజీకి ఎదురుగా కూచొని ఉన్న భక్తుల్లో ఒకడు.
తప్పకుండా అందుకే కదా మేమున్నది. జనోద్ధరణ మీవంతైతే మిమ్మల్ని ఉద్ధరించడం మావంటి స్వాముల కర్తవ్యం అన్నారు స్వామీజీ.
ఆయన ఎదురుగా కూచున్నవారు సామాన్య జనమేం కాదు. అందరూ కాకలు తీరిన రాజకీయ యోధులే. కొందరుమాజీలు కొందరు పదవలో ఉన్నవారు, కందరు ప్రతిపక్షంలో ఉండి కారాలు మిర్యాలు నూరుతున్నవారు. మొత్తానికి అందరూ వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కించుకున్నందుకు తెగ ఆరాటమూ, హైరానా పడుతున్నవారే. స్వామీజీ వీరందరికీ దైవ సమానులు. వారు తల్చుకుంటే ఉన్న పదవులు మళ్లీ వస్తాయన ఇఊడిన పదవులు మళ్లీ పుడతాయని లేని పదవులు వచ్చి పడతాయని నమ్మే భక్త బృందం అక్కడ ఉన్నది.
అందరివైపూ ఒకసారి చూసి, బారెడు గడ్డాని అరచేత్తో రాచి పైకపఉపకేసి చూసి తన ప్రసంగం కొనసాగించాడు స్వామిజీ.
నాయనలారా! ప్రజా సేవ అనేది ఒక ఆషామాషీ వ్యవహారం కాదు. అందరికీ అది దక్కేది కాదు. ఎవరైనా ఏదైనా పదవిని పొందగలిగారూ అంటే అది పూర్వజన్మ సుకృతమే తప్ప మరొకటి కాదు. పోయిన పూర్వజన్మలో చేసుకన్న పుణ్యం ఈ జన్మలో పురుషార్థం అవుతుందన్నమాట అన్నారు స్వామిజీ.
అదేమిటి స్వామీ అలాంగటారు. మీదంతా చాదస్తం. అనేక రకాల వాగ్దానాలు, హామీలు ప్రకటిస్తే తప్ప ఓట్లు రాలడం లేదు అన్నాడు ఓ భక్తుడు సాహసించి... తమరు ఆగ్రహించకండి స్వామీ పథకాల పేరిట ఉద్యోగాలకు జీతాలు కూడా ఇవ్వకుండా ఖజానా ఖాళీ చేస్తున్నా గెలుపు ఖాయం అని అనిపించడం లేదు అన్నాడు మరో భక్తశిఖామణి.
చెప్పిందే చెప్పి చేసిందే చేసి లాభం లేదు. ప్రజలు ఉపన్యాసాలు నమ్మేస్థితి దాటిపోయారు. ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పే మాటల్ని 'సొల్లు' అనుకుంటున్నారు. డబ్బు ఇచ్చి బలవంతంగా లారీలు ఎక్కిస్తే తప్ప సభలకు రావడం లేదు అని విన్నవించాడు వెనక ఎక్కడో కూర్చున్న మరో భక్తుడు.
అసలు ఓటు విలువ పూర్తిగా పడిపోయింది అని గాబరా పడ్డది ఒకరైతే ఎవడ్రా నువ్వు ఓటు విలువ విపరీతంగా పెరిగిపోయింది. వేలుపోసి కొనాల్సి వస్తుంది అనరిచారింకొకరు.
అన్ని పార్టీల వారి దగ్గరా డబ్బు డిమాండ్ చేస్తున్నారు ఓటర్లు. అందరి దగ్గరగా ముక్కుపిండి వస్తున్నారు అన్నారొకరు.
ఏ వ్యాపారానికైనా పెట్టుబడి అవసరం కాదా. పెట్టిందంతా తిరిగి వసూలు చేసుకుంటున్నారు కదా అని అరిచారెవరో.
గందరగోళం కేకలు కాస్సేపు కంటిన్యూ అయ్యాయి. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. స్వామిజీ చేయి ఎత్తి హుశ్.. హుశ్ అని అదిలించారు.
ఊరుకోండి ఊరుకోండి! అన్నారెవరో.
అంతా గప్‌చుప్ అయ్యారు.
నాయనలారా కాబోయే నాయకులారా సావధానంగా వినండి. యుగాల వల్ల, ప్రచారాల వల్ల, పథకాల వల్ల, పంకాల వల్ల, కొనుగోళ్లవల్ల, ఏమీ జరగదు.అసలు రహస్యం చెబుతా వినండి. మనది కర్మభూమి దేనికైనా కర్మ సిద్ధాంతమే వర్తిస్తుంది. అసలు ఈ ఎన్నికల తంతే ఒక పెద్దమాయ. దీనికోసం ఎన్నికల సంఘం, ఉద్యోగులు, ఈవీఎంలు, పోలింగ్‌బూత్‌లు, కౌంటింగులు, సర్వేలు, టీవీల్లో చర్చలు చెబుతూ పోతే ఎన్నో ఉన్నవి. ఇదతా డబ్బు దండగా వ్యవహారం తప్ప మరోటి కాదు. నా సలహా పాటిస్తానంటే చెప్పాతను అని స్వామివారు 'గ్యాప్' ఇచ్చారు.
పైసా ఖర్చు కాకుండా మనం ఎన్నికయ్యే ఉపాయం చెబుతున్నారు స్వామీజీ వినండి వినండి అన్నాడు స్వామీజీ శిష్యుడు. అందరూ కనుబొమలు ముడివేసి చెవులు రిక్కించి వినసాగారు.
వినండి. ఇందాక కర్మ సిద్ధాంతం అని ఓ మాట చెప్పాను కదా. అదే ఇప్పుడు మనకు అవసరం. కర్మలను బట్టే మన చేతిలో గీతలు, తలరాతలు, గ్రహాల గతులు. ఎన్నికల పేర లక్షల కోట్ల రూకలు ఖర్చు చేసే పనిలేదు. ఏ ఎన్నికయినా, ఏ పదవైనా మనిషి జాతకంలోని గ్రహాలమీద ఆధారపడేదే. నామాట విని ముందు ఎన్నికల సంఘాన్ని రద్దు చేయండి. మనదేశం పుణ్యదేశం. బహు పురాతన దేశం. దేశం నిండా జ్యోతిష్యులే. వారు తలచుకుంటే ఎన్నికల ఖర్చు వుండనే ఉండదు. పదీపాతికా దక్షిణతో ఎన్నికల తంతు ముగుస్తుంది. గ్రహాలు అనుకూలించిన వారు ఎన్నికవుతారు అన్నారు స్వామీజీ ఊపిరి పిల్చుకుంటూ.
స్వామి వారి శిష్యుడు 'మైకు' అందుకుని మీ సెల్ఫోన్లలో 'యూట్యూబ్'లో అనేకమంది స్వామీజీ శిష్యులు గ్రహాల అడ్రసు బాగా తెల్సినవాళులన్నారు. ఏ గ్రహం ఏ ఇంట్లో ఉన్నదో ఏ ఇంట్లోకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో చెబుతారు. అందువల్ల ఎన్నికల హైరానా వదిలేసి మీరందరూ నామినేషన్లతో పాటుమీ జన్మకుండలి 'కాపీ'ని అందజేస్తే చాలు. అవి లేనివారు పుట్టినతేదీ అదీ తెలీని వాఉ ఇష్టమైన పూవుపేరో పండుపేరో చెబితే చాలు వారం రోజుల్లో ఎన్నికల రిజల్లు రడీ. ముఖ్యమంత్రి ఎవరు కావాలో, మంత్రులెవరో కూడా గ్రహాల అనుకూలతను బట్టి వారే నిర్ణయిస్తారు అన్నాడు.
శుభం భూయాత్ అని చేయి ఎత్తి అందర్నీ ఆశీర్వదించారు స్వామీజీ.
-చింతపట్ల సుదర్శన్, 9299809212