Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం బౌద్ధం గురించి క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచీ క్రీ.శ. 2వ శతాబ్దం వరకూ, తూర్పు భారతం, మధ్య భారతం, తెలుగు ప్రాంతాల వరకూ ఎన్నో బౌద్ధం ప్రబలిన ప్రదేశాల గురించీ అక్కడి కళల సంపద గురించీ మాట్లాడాం. కానీ ఉత్తర భారతంలోని మధుర గురించీ అక్కడ కుషానులు నిలబెట్టిన కళల సంపద గురించీ మాట్లాడకపోతే క్రీ.శ. 2వ శతాబ్దపు ఒక ముఖ్య కళాస్థావరం గురించి మనం మరిచిపోయినట్టే. ఈ మధుర శ్రీకృష్ణ జన్మస్థానంగా హైందవం నమ్ముతుంది. ఈ దిక్కుకి బుద్ధుడు ప్రయాణించలేదు. కానీ ఇక్కడ కొన్ని ముఖ్య శిల్పాలు మరో కొత్త పద్ధతిలో చెక్కబడ్డాయి. అంటే ఇక్కడ కళలు వికసించటానికి బౌద్ధం ఒక విషయమే అయింది. ఇక్కడ బౌద్ధం కోసం కళలు కాదనేగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే కదా మనం అజంతా గురించి కూడా ఆలోచన చేసింది.
ప్రాచీన కాలం గురించి మాట్లాడేట ప్పుడు క్రీ.పూ. 4వ శతాబ్దపు అలగ్జాండర్ దండ యాత్రల వివరణ మధ్య మధ్య తీసుకు రావలసి వస్తుంది. భరత ఖండం చేరటానికి ఆసియా మీదుగా అతని ప్రయాణం జరిగింది. ఒక విధంగా ఇతని దండయాత్రలు కళా సంస్కృతిని అన్ని ప్రదేశాలకు మార్పిడి చేర్పులు చేయుటకే కాక, వ్యాపార సంబంధాల కోసం మార్గం సులభం చేసింది. పశ్చిమ ఆసియా నుంచి కూడా వ్యాపారులు రావడం మొదలు పెట్టారు. క్రీ.పూ. 130లో మధ్య ఆసియా నుంచి 'శక' అనే ఒక కొత్త తెగ వారు దండెత్తి వచ్చి సుమారు ఉబెకిస్తాన్ ప్రాంతాల నుంచీ ఉత్తర భారతంలోని మధుర వరకూ ఆక్రమించి కొంతకాలం వారే ముఖ్యులుగా పరిపాలన చేసారు. వారి పాలన భరతఖండంలో ఒక శకం మొదలై చరిత్రకాల చక్రానికి శక సం|| అనే మైలురాయి మొదలైంది. వీరి రాజ్యంలో ఆసియా నుంచీ మధుర మధ్యలో ఎన్నో చిన్న రాజ్యాలు ఉన్నా, ప్రస్తుత పాకిస్తాన్ లోని తక్షశిల రాజధానిగా ఉన్న గాంధార ముఖ్య ప్రదేశం. ఇక్కడ గ్రీకు రోమనుల శిల్ప పద్ధతులతో పాటూ భరతఖండ శిల్ప పద్ధతులూ కలిపిన శిల్పం కనిపిస్తుంది. ఒక సామ్రాజ్యంలో కొన్ని బుద్ధ శిల్పాలు కనిపిస్తాయి. వీటిలో మధ్య భారతంలోని సాంచీ, బారూత్ శిల్పాల దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మేరు పర్వతం 5 మెట్లలా చెక్కి. ఆ మెట్లని తిరగతిప్పి గద్దెలా చెక్కి దానిపై బుద్ధుడి విగ్రహం చెక్కబడింది. మేరు పర్వతం ఈ సృష్టికి విశ్వాసానికి గుర్తు. ఆభయముద్ర, వజ్రపర్వం కాసనలో ఉన్న బుద్ధ విగ్రహం లోతు తక్కువగా చెక్కబడింది. తూర్పు పడమర దేశాల మధ్య నిలిచిన ఈ శక సామ్రాజ్యం ప్రయాణీకులకు, వ్యాపారులకు మధ్య ప్రాంతమై వీరి బౌద్ధ శిల్పం అన్ని వైపులకూ పాకింది. వీరి కాలంలో కొద్ది శిల్పాలే చేయబడ్డాయి. గాంధార, మధుర ప్రాంతాలలో తరువాత కుషానుల వల్ల ఎన్నో శిల్పాలు, ఎంతో కళా సంపద కూర్చబడింది.
కుషానులు అనే తెగ వారు ఆగేయ చైనా నుంచీ వారి రాజ్య విస్తారం కోసం పశ్చిమ దిశగా దండెత్తి వచ్చారు. క్రీ.శ. 1వ శతాబ్దం నుంచీ వారి రాజ్యం దక్షిణ ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతం, బంగ్లాదేశ్ వరకూ విస్తారం చెందింది.
ఆపై విమాకడఫైసిస్ ఇండస్ నది వరకూ ఆపై వచ్చిన కనిష్క-1 మరింత ముఖ్యుడై విశాల సామ్రాజ్యం ఆక్రమిం చాడు. క్రీ.శ. 78 నుంచీ 144 వరకూ కుషానుల యుగమైంది. వారు బౌద్ధాన్ని మరింత బలపరుస్తూ చైనా వరకూ తీసుకువెళ్లారు. కనిష్కుడు బౌద్ధం అవలంభించక పోయినా కళలను ప్రోత్సహిస్తూ, అతని రాజధాని కనిష్కపుర (పెషావర్ వద్ద) ఒక పెద్ద స్థూపం కట్టించాడు. కాశ్మీర్లో 4వ బౌద్ధ సమా వేశం జరిపించాడు. బౌద్ధ సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. ఈతని కాలంలో కొన్ని ముఖ్యమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఉత్తర భారతంలోని మధుర, కుషానుల దక్షిణ రాజధాని.
మధురలో గ్రీకు, రోమను, ఇరాన్, భారత పద్ధతుల కలగలుపు శిల్పం కనిపిస్తుంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో కుషా నుల కళ ఇక్కడ ఎంత గానో వికసించింది. వీరు ముద్రించిన నాణేలపై ఉన్న కుషాన రాజుల చిత్రాలు చూసినా, శిలా పలకలు చూసినా, రాజులు విగ్రహాలు పెట్టి కట్టిన మందిరాలు చూసినా వారిని వారు దేవీపుత్రులని, రాజుని భగవంతుని రూపం గానూ చూపించా రని అర్థం అవుతుంది. మధురకు 14కి.మీ, దూరం లో టోక్రితిల వద్ద ఒక మందిరము, అందుమూల స్థానంలోని దేవస్థానంలో విమకడఫెసిస్ విగ్రహం కనుగొన్నారు. క్రీ.శ. 126కు చెందిన విగ్రహం పేరు 'మహారాజో రాజాతిరాజో దేవపుత్రో కుసానపు' అని వ్రాయబడిన శిలా లేఖనం ఉంది. అక్కడి శిల్పాలు మరికొన్ని చూసినా, వాటి కట్టు, బట్ట, తీరు, సింహాసనం అంతా విదేశీ పద్ధతి అనీ, కాలిబూట్లు చెక్కడం గ్రీకు పద్ధతి అనీ కూర్చున్న తీరు ఒక రాజు ఆసీనుడై కూర్చున్న విగ్రహమనీ తెలుస్తుంది. అయితే చెక్కిన కళాకారులు అక్కడి మధుర శిల్పాగారం వారు, ఆ ప్రాంతపు సిక్రీ రాతితో చెక్కారనీ తెలుస్తుంది. ఇంకో పొడవు తక్కువ, నిలుచుని ఉన్న శిల్పం గద, కత్తి పట్టి దొరికింది. ఈ రెంటికీ శిరస్సు లేదు. ఈ రెండు శిల్పాలనూ మధుర మ్యూజియంలో భద్రపరిచారు. శిరస్సు విడిగా ఒకటి దొరికింది అక్కడ. అది ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంచారు. ఆ శిరస్సుకి పెద్ద కళ్లు, నవ్వు ముఖం, ఎత్తైన కనుబొమ్మలు ఉన్న నునుపైన శిల్పం. దీనికి ఉన్న టోపీపై పూసలు, ముత్యాలు చెక్కబడి, అలాగే ఆ శిల్పాలకూ ఉన్న వస్త్రంపై ఇవే వరుస ముత్యాలు, పూసలు చెక్కబడటం వల్ల ఈ శిరస్సు ఆ శిల్పాలలో ఒక దానిదని అర్థం అవుతుంది.
ఈ ప్రాంతానికి అశోకుడికాలంలో బౌద్ధం చేరింది. ఇక్కడ ఎన్నో కళాకర్మాగారాలు, రకరకాల పద్ధతులున్న వేర్వేరు ప్రాంతాల కళాకారులు వచ్చి పని చేసారని అక్కడి బౌద్ధ స్థూపాలు, శిల్పాలు చూస్తే అర్థం అవుతుంది. కుషానులు కళలకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చినందువల్ల పని వెతుకుతూ ఎంతో మంది కళాకారులు దూరప్రాంతాల నుంచీ చేరి ఉండవచ్చు. ఇక్కడి స్థూపంపై గొడుగుల వరుసలు అమర్చినట్టు పొడవుగా కనిపిస్తే, సహజ రూపాలకు దగ్గరగా శిల్పం కనిపిస్తుంది.
గ్రీకు రోమనులకు లోహపు నాణేలు, పెట్టెలు ముఖ్యం. అలాటి ఒక వింతైన లోహపు పెట్టె ఇక్కడ దొరికింది. ఇది పెషావరు మ్యూజియంలో భద్రపరచ బడింది. నిలుచున్న కాండంపై ఉన్న కమలంలో బుద్ధుడు అభయముద్రలో కూర్చుని ఉండగా, అతని రెండు పక్కల ఇంద్రుడు, బ్రహ్మ నమస్కారం చేస్తున్నట్టు నిలుచుని ఉంటారు. ఇది కనిష్కుడు, తను ఈ ప్రపంచపు జీవితం నుంచీ దేవలోకం చేరుతూ విజయం పొందిన శిల్పంగా అర్థం చెప్పారు. ఈ విధంగా బౌద్ధ వివరణలో ఎన్నోసార్లు వైదిక హైందవ దేవతలకి కొత్త అర్థాలిస్తూ, బుద్ధుడి రూపాన్ని ప్రాముఖ్యంగా చూపిస్తూ వివరించబడింది.
ఈ 2వ శతాబ్దపు కుషానుల శిల్పాలల్లో నిలుచున్న బౌద్ధ శిల్పాలు ఎన్నో కనిపిస్తాయి. 15 సెం.మీ.ల పొడవున్న ఒక బౌద్ధ శిల్పం లాహోరు మ్యూజియంలో భద్రపరచబడింది. ఈ శిల్పాలన్నీ నిల్చున్న పద్ధతి, వాటి వస్త్రధారణ, వేళ్ళ ముద్ర, లక్షణం, తల వెనుక ష్ట్రaశ్రీశీ పొడవైన చెవులు, ఆభరణాలు లేకుండా ఒక భుజం లేదా రెండు భుజాలు అంగవస్త్రం కప్పబడి అన్నీ ఇంచుమించు ఒకే పద్ధతిన చెక్కబడ్డాయి. ఇవన్నీ బోధిసత్వుడు ఈ ప్రపంచ సుఖాలు, తన రాజ కుటుంబం వదిలి జ్ఞానమార్గం కోసం సన్యసించిన దశలోని శిల్పాలు. నిజానికి బుద్ధ సాహిత్యంలో ఎన్నో స్థితులల్లో బుద్ధుడిని వివరిస్తారు. ఆ స్థితిని, ఆ కథని వివరించటానికి శిల్పం చెక్కినపుడు, ఆతను నిలుచున్న, కూర్చున్న ఆసనంపై ఆ కథని చెక్కుతారు. ఆ గుర్తులను బట్టీ అది ఏ బౌద్ధరూపమో మనం తెలుసుకోవచ్చు. అలాగే శిరోజాలు, ఉంగరాలూ చెక్కారు. అలలుగా చెక్కారా, నిలువుగా చెక్కారా, వస్త్రం మడతలు ఎలా చెక్కారు, వేలాడుతున్న వస్త్రం చెక్కారా, వంచి పెట్టిన కాలు, సహజ రూపాలు చెక్కారా, ఇది పరీక్షించి ఎక్కడి కళాకారులు చెక్కారు, చిత్రించారు అని తెలుసుకోవచ్చు.
పెషావరు మ్యూజియంలో ఒక గమ్మత్తైన శిల్పం ఉంది. బోధిసత్వుడు సిద్ధార్థుడనే రాజకుమారుడిగా ఉన్నప్పుడు రైతుల నాగలి దున్నే పోటీ జరుగుతున్నప్పుడు అది గమనించటం కోసం నేరుడు చెట్టు కింద ఈ యువకుడిని కూర్చోబెడతారు. అందరూ వెళ్లిపోయినాక మొదటిసారిగా యోగనిద్రలో శ్వాస నిలుపుతాడు. సూర్యుడి ఎంద దిశమారి, చుట్టుపక్కల చెట్లనీ నీడ దిశ మార్చినా ఈ తన కూర్చున చెట్టు నీడ నిలకడగా ఉన్న చోటన ఉంటుందట. ఆ కథ శిల్పంగా చెక్కి, వేదికపై నాగలి దున్నే వివరాలు కూడా చెక్కారు.
నిరాహారంతో చిక్కి శల్యమైన బుద్ధ విగ్రహం లాహోర్ మ్యూజియంలో ఉంది. జ్ఞానసిద్ధి పొందాక బుద్ధుడు మొదటి ప్రవచనం వారణాసిలోని సారనాథ్‌లో, జింకల వనంలో ఇచ్చాడు. ఈ శిల్పం పాట్నా మ్యూజియంలో ఉంది. ఈ శిల్పం వేదికపై అతని బోధన గుర్తు ధర్మచక్రం, జింకలు చెక్కబడి అభయముద్రలో బుద్ధుడు కనిపిస్తాడు. బుద్ధుడి పరి నిర్వాణ, ఆఖరి దశ శిల్పం కుడి పక్కకు తిరిగి ఉంటుంది. ఇది కొలకత్తాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది.
కుషానుల రాజ్యంలో మధురలో, జైన హిందూ శిల్పాలు కూడా చెక్కబడ్డాయి. మధుర మ్యూజియంలో ఇవి ఎన్నో భద్రపరిచారు.
- డా. ఎం.బాలామణి
810671 3356