Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పాస్‌పోర్ట్' కథా సంపుటి రచయిత్రి మాచిరాజు సావిత్రి తన తొమ్మిదవ ఏటనే అమెరికాలో స్థిరపడ్డారు. తొలితరం తెలుగు రచయిత్రిగా పేరు తెచ్చుకు న్నారు. కవితలు, కథలు వ్యాసాలతో తన ప్రతిభను నిరూపించుకుంటూ, తానా, ఆటా లాంటి సాంస్కృతిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. సప్తతి పూర్తి చేసుకున్న వీరి విద్య, ఉద్యోగం ఉద్యోగ విరమణ అన్నీ అమెరికా, కెనడా దేశాల్లో జరిగాయి. ప్రస్తుతం అమెరికాలోస్థిరపడ్డారు.
నిర్దిష్ట భౌగోళిక మూలాల నుంచి దూరంగా ఉంటున్న వారిని సూచించడా నికి 'డయాస్పోరా' అనే పదాన్ని వాడ తారు. తెలుగులో ఈ పదానికి సమా నార్థం 'ప్రవాసి' అనవచ్చుననుకుంటాను.
ఇరవయ్యేళ్ళ ప్రాయంలోనే తన రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. కొన్ని తరాలుగా అమెరికా వస్తోన్న తెలుగు వారిని పరిశీలిస్తున్నారు. మూడు తరాల ప్రవాసులను గమనిస్తోన్న వీరి కథల్లో నాటి అనుభవాలు, నేటి తరం తెలుగు వారితో పంచుకుంటున్నారు.
'పాస్‌పోర్ట్' మరికొన్ని డయాస్పోరా కథలు' సంపుటిలో 12 కథలున్నాయి. మొట్టమొదటి కథ 'సక్సెస్ స్టోరీ' 1991 లో రాశారు. ఒక ప్రవాసిగా అటు అమె రికా, కెనడా దేశాల్లోని ఇటు నాటి ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆలోచనా సరళిని వివరిస్తుంది ఈ కథ. డాక్టర్ మూర్తి విద్యాభ్యాసం ఇండియాలో పూర్తి చేసుకుని, అమెరికాలో స్థిరపడిన వ్యక్తి. సుధాకర్ తన ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళి, అక్కడే స్థిరపడాలని కలలు కనే విద్యార్థి. భర్త పోయిన తర్వాత సరస్వతి ఏ దిక్కు అల్లాడుతూ ఉంటే దూరపు బంధువు సాయంతో అమెరికా చేరి ఢక్కాముక్కలు తిని, ధైర్యం చేసి అక్కడే ఓ రెస్టారెంటు నడుపుతోన్న వయోధికురాలు. ముగ్గురూ బొంబాయి (ప్రస్తుత ముంబాయి) ద్వారా వచ్చి కొన్నాళ్ళు ఇండియాలో ఉండి, తిరిగి అమెరికా వెళతారు. ఈ ముగ్గురి జీవితాల్ని, అమెరికాలో, ఇండియాలో వారు ఎదుర్కొన్న అనుభవాలు, వారి గురించి బంధుమిత్రుల ఆలోచనలు ప్రోదిపెట్టిన కథ ఇది.
తాను సముపార్జించిన విజ్ఞానాన్ని మాతృదేశానికి పంచుదామనుకున్న డా|| మూర్తికి నిష్టతో రీసెర్చి చేసి, దేశ ప్రగతికి సాయపడదామనుకన్న సదాశయానికి గండి కొట్టబడి నిరాశతో తిరిగి అమెరికా పయనం అవుతాడు. సరస్వతికి ఎదరైన అనుభవం ఇంచు మించూ అంతే! అమెరి కాలో స్థిరపరడడానికి తన భార్యా బావ మరుదులు ఆధారం అవ్వాలని ఆశ పడుతూ వెళ్ళే సుధాకర్ వీరంతా ఆశోప హతులు! 30 ఏండ్ల కింద రాసిన ఈ కథలోని పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంకా అలానే ఉన్నాయని పాఠకులకు అవగతమవుతుంది. ఆశ్చర్యం వేస్తుంది.
కథకుడు, రావు, శర్మ అమెరికా ప్రవా సులు. కథకుడికి చిన్నతనంలో వాళ్ళ అమ్మమ్మ తాగించే తరువాణి, దాని రుచీ గుర్తుకు వస్తుంది. మిత్రులు రావు, శర్మ లను సంప్రదిస్తాడు. వారికే తరువాణి ఇష్టమే. బాల్యస్మృతుల్లోని తరువాణి తయారీకై గంజి, కుండని, నిమ్మ ఆకులు తో మొదట ౖఫెయిల్ అయినా 'సాకె' అనే జపనీస్ వైన్‌తో చేసి సంతృప్తి పడతారు. తరువాణి కేంద్రం కథలో.
కొత్తగా పెళ్ళయి కెడనాకు విజయ, వినాయకచవితిని ఇండియాలోలా జరుపు కోవాలనుకుంటుంది. గరికపత్రి దొరకదు. కెనడాలో దొరికే ఆకులు అలములతోనే పూజ అయిందనిపిస్తారు విజయ, శేఖర్ దంపతులు 'సర్వవిఘ్నోపశాంతయే!' కథలో. దేశ కాలపరిస్థితులబట్టి ఆహారం తయారీ, పూజా విధానం మార్చుకో వాలనీ చెబుతాయీ పై రెండు కథలు.
మిగతా అన్ని కథల్లోనూ రచయిత్రి 'నోస్టాల్జియా' (బాల్యస్మృతులు) ప్రధానంగా కథలు అల్లారు. వర్ణ వివక్షత ప్రపంచం అంతా ఉంటుందని 'నన్ను కాదు' కథలో వివరించటం పాఠకుల్లో ఆలోచనల్ని రేకె త్తిస్తుంది. అభివృద్ధి, నాగరికత, శాస్త్రీయ విజ్ఞానం వేపు ప్రపంచం పరుగెడుతున్నా మనిషి అంతరాళాల్లో కుల, మత, వర్ణ వివక్షత చెరిగిపోదని ఏదో ఓ సందర్భం లో అది బయట పడుతుందని చెబుతారు సావిత్రి. 'విశ్వనరులమ'ని, వసుధైక కుటుంబమని, ఎంతా మనకు మనం వీపులు చరుచుకున్నా, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వివక్షత ఉండటం దు:ఖదాయకం. 'హెన్రీ డేవిడ్ థూరూ' అనే తత్త్వవేత్త 'ఎంత నాగరికుడినని విర్రవీగే మనిషినైనా, 'స్క్రాచ్' చేసి చూడు, ఆదిమ మానవుడు కనిపిస్తాడు' అంటాడు. రచయిత్రి అంత విపులంగా చెప్పలేదు కానీ అందరమూ అంత:శోధన చేసుకోవాల్సిన అవసరం ఉందని తోస్తుంది.
సంభాషణల్లో అంతర్లీనంగా కనిపించే హాస్యము, రెండు దేశాల ఆంతర్యాలకు వారధిలా అనిపించే ఆలోచనలు, పాత్రల ద్వారా బయల్పరిచిన అభిప్రాయాలు మాచిరాజు సావిత్రి సునిశిత, కుశాగ్రబుద్ధికి నిదర్శనాలు. కథల్లో కొంచెం సాగదీత ఉంది. కొత్త విషయాలు వింటున్నామన్న సంబరంలో పాఠకుడికి ఈ విషయం తోచకపోవచ్చునేమో! రచయిత్రి తన మున్ముందు రచనల్లో ఈ విషయాన్ని విస్మరించకుండా ఉంటే బావుంటుంది.
ప్రతి కథ చిరవన 'ముక్తాయింపు' అని కథ పూర్వాపరాలు ఇవ్వటం బావుంది. మూలాల్లోకి వెళితేగాని సందర్భాసందర్భాలు తెలియవు. అవతలి గట్టున ఉన్న కలల ప్రపంచాన్ని నేలకు దింపారు రచయిత్రి.
'వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' వారు నిర్వహిస్తున్న సాహిత్య, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రచురించారు ఈ సంపుటి. తెలుగు సాహిత్యానికి వెన్నుదన్నై నిలుస్తున్న పబ్లిషర్ చిట్టెం రాజుకు అభినందనలు.
పాస్‌పోర్ట్ (మరికొన్ని డయాస్పోరా కథలు),
రచన : మాచిరాజు సావిత్రి,
వెల : రూ.150/-, (25 డాలర్లు)
ప్రతులకు : జ్యోతివలబోజు (ఇండియా), సెల్ : 8096310140; నవోదయ బుక్ హౌస్)
- కూర చిదంబరం
8639338675