Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రీ.శ. 3వ శతాబ్దపు చివరి దశ వచ్చేటప్పటికీ, దక్షిణ ఆసియాలో అన్ని దిక్కులా బౌద్ధం ప్రబలింది. కొత్త పద్ధతులలో, లేదా కలగలుపు పద్ధతులలో ఎన్నో కొత్త ప్రయోగాలతో అందమైన కళలు చెక్కబడ్డాయి. అయితే ప్రతి కళా స్థావరంలోనూ ఈ సమయంలో బౌద్ధంతోపాటూ కొన్ని హిందూ శిల్పాలూ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అది అజంతా అవనీ, కుషానుల ప్రదేశం అవనీ. క్రీ.శ. 4వ శతాబ్దంలో పరిస్థితులు మారినవి. ఈ శతాబ్దంలో గుప్తులు రాజ్యం ఆక్రమించి మధ్య భారతంలో విదీషను ముఖ్య పట్టణం చేసుకున్నారు. ఆనాటి వరకూ అంకురాలుగా ఉన్న హిందూ కళలు వీరి ప్రోత్సాహంలో మొలకలై, వృక్షాలైనాయి. రాజుల రాజ్యాలు అస్థవ్యస్థంగా ఉన్నప్పుడు, కళలూ అస్థవ్యస్థంగానే ఉంటాయి. రాజులు కుదుటపడ్డాక, రాజుల కళాప్రేమ ఎన్నో కళలకు ఆధారమౌతుంది. క్రీ.శ. 5వ శతాబ్దంలో గుప్తుల కళలు ఎంతో వికసించి భారతీయ కళా ప్రపంచానికి ఒక స్వర్ణయుగం తెచ్చాయి. ఇదే మధ్యయుగానికి నాంది యుగమైంది.
క్రీ.శ. 4వ శతాబ్దం నుంచీ 6వ శతాబ్దం వరకూ గుప్తులూ వారి సామంతులూ కలసి, మధ్య భారతం, ఉత్తర, ఈశాన్య దిక్కుల వరకూ విశాల సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. సుమారు క్రీ.శ. 319లో చంద్రగుప్తుడు రాజ్య పరిపాలన మొదలెట్టాడు. క్రీ.శ. 335 - 375 వరకూ అతని కొడుకు సముద్ర గుప్తుడు పాలించాడు. అతను అశ్వమేధ యాగం చేసిన నాణెం, నేపాల్ సరిహద్దులలో దొరికింది. అలాగే ఒక గుర్రం శిల్పం దొరకగా దానిని లక్నో మ్యూజియంలో భద్రపరిచారు. ఈ గుర్రం చేసిన పద్ధతిలో ఇంతకు ముందు రాజులైన కుషానుల మధుర నగర శిల్పాల పద్ధతి కనిపిస్తుంది. రామగుప్తుడు (క్రీ.శ. 376 -380) కాలంలో విదీష వద్ద 3 జన శిల్పాలు కన్పిస్తాయి. ఇవి జ్ఞాన బుద్ధుడి శిల్పాల పోలికలో ఉంటాయి. అంటే అప్పుడు జైనం కూడా ఉండేదనేగా అర్థం.
రెండవ చంద్రగుప్తుడు (క్రీ.శ. 380 -415), గుప్తుల కాలంలో ముఖ్యుడు. విదీష ఈ సమయంలో ముఖ్య కళాస్థావరమైంది. విదీషకు దగ్గరలో ఉన్న ఉదయగిరిలో సుమారు 20 రాతి గుహల చెక్కడాలు, అక్కడ రెండవ చంద్రగుప్తుడి శిలా శాసనాలు కనుగొన్నారు. ఈ గుహలలోని శిల్పం చూస్తే, ముందు ముందు వికసించిన హిందూ కళలకు ఇవిముఖ్యమైన మొదటి మెట్లు అని అర్థం అవుతుంది. 6వ గుహ ద్వార బంధాలు, గడపలు అందంగా చెక్కబడ్డాయి. ద్వారానికి అటూ, ఇటూ గంగ, యమున స్త్రీ రూపంలో చెక్కబడ్డాయి. గంగ, మకరం మీద నిల్చుని ఉండగా పైన మామిడి చెట్టు, యమున తాబేలు పై నిల్చుని ఉండగా పైన అశోక చెట్టు చెక్కారు. బలమైన శరీరాలతో, ఒత్తైన శిరోజాలతో ద్వార పాలకులు ఒక చేయి నడుముపై, మరో చేయి ఆయుధంపై ఉంచి నిలుచున్నారు. ఈ శిల్పం చెక్కిన పద్ధతి గుప్తుల గుర్తుగా, ముందరి రాజుల పద్ధతికి తేడాగా కనిపిస్తుంది. ద్వారం పక్కగా ప్రదక్షిణ చేసే దారిలో, గణపతి, రెండు విష్ణు శిల్పాలు, 12 చేతులతో మహిషాసుర మర్ధిని శిల్పం ఉంటాయి. దుర్గాదేవి రూపమైన మహిషాసుర మర్ధిని, అందరు దేవతలూ ఇచ్చిన ఆయుధాలు పట్టుకుని, మహీషుడనే రాక్షసుడిని చంపటంలో నిమగమై ఉంటుంది. ఈ శిల్పం ఒక నాటకంలోని దృశ్యంలా కనిపిస్తుంది. ఈమె రూపం విజయానికి చిహ్నం. ఈ శిల్పం తలపై గుప్తుల శాసనం ఉంటుంది. చరిత్ర పూర్వపు రాతి యుగంలోనూ దేవీ రూపాలు మనం చూసాము. ఇప్పుడూ చూస్తున్నాము.
4 చేతుల విష్ణురూపాలు ఇక్కడ కిందకు చేతులు వేలాడేసి నిల్చున్న రూపాలు. వెనుక చేతులు, ఒక చేయి గదాదేవి, మరో పక్క చేయి చక్ర పురుషుడిపై ఉంటాయి. ఇక్కడ ఈ ఆయుధాలు మానవ రూపంలో ఉంటాయి. సుమారు క్రీ.శ. 8వ శతాబ్దం వరకూ ఈ ఆయుధాలు ఇలాగే చెక్కబడ్డాయి. విష్ణువు పెద్ద కిరీటం, పొడవుగా మోకాళ్ళ వరకూ ఉన్న తులసిమాలతో చెక్కిన రూపం ఇది. ఈ 6వ గుహలో సప్తమాతృకలూ చెక్కబడ్డాయి. ఇవి మహిషాసుర మర్ధినికి ఎదురుగా, ఇదీ విజయానికి, జ్ఞానానికి గుర్తుగా చెక్కిన రూపాలు. శివుడికి అంధకాసురుడుని చంపడానికి, దేవతలు తమ అంశని స్త్రీ రూపంలో సాయం పంపుతారు. ఇవే సప్తమాతృకలు, బ్రహ్మణి, ఇంద్రాణీ, మరి ఇలాంటి రూపాల పేర్లవి. అంటే ఆ నాటికే మన పురాణాలను దృశ్యాలుగా చెక్కడానికి ఆలోచనలు, ప్రణాళికలు సిద్ధం అయ్యాయన్నమాట.
5వ నంబరు గుహ లోతు తక్కువగా ఉండి, వరాహావతారానికి సంబంధించిన కథనం చెక్కబడి, వరాహ గుహగా పిలుస్తారు. ఈ వరాహుడికి శరీరం మానవాకారం, శిరస్సు వరాహ రూపం. విష్ణువు దశావతారాల్లో వరాహరూపం, భూమిని సముద్రంలో మునిగిపోకుండా పైకెత్తి కాపాడుతాడు. స్త్రీ రూపంలో ఉన్న భూమి, వరాహుడి దంతం పట్టుకుని వేలాడుతుండగా సముద్రం నుంచి ఎత్తి నిల్చుని ఉన్నట్టు చెక్కిన రూపం ఇది. హుందాగా నిల్చున్న వరాహరూపం కుడి చేయి నడుముపై, ఎడమకాలు ఎత్తిపెట్టి మడతలుగా చెక్కిన పెద్ద నాగ దేవతపై ఉండగా, ఎడమ చేయి, ఎడమ మోకాలిపై ఆన్చి నిల్చున్న బలమైన శిల్పమిది. ఆ నాగశిల్పం నమస్కారముద్రలో ఉండగా, గుహ గోడపై అలలుగా సముద్రపు నీటి అలలు, ఆపై ఎంతో మంది ఋషులు నమస్కారం చేస్తూ నిల్చుని కనిపిస్తారు. గంగ, యమున రెండు గోడలపై స్త్రీ రూపంలో చెక్కబడ్డాయి. ఇది వరాహావతారం కథ అని తెలుసుకోవచ్చు. దక్షిణ ఆసియాలో చూపే కళలలో మరో అర్థం వచ్చేటట్టు చెక్కే అలవాటుంది. కళలను సామాజిక విశేషాలుగా కూడా చూపి చెక్కుతారు లేదా చిత్రిస్తారు. ఈ గుహ గుప్తుల రాజ్యంలో చెక్కబడింది. ఇది గంగ, మమునల మధ్య విస్తరించిన రాజ్యమని, చంద్రగుప్తుడు, వరాహరూపంలాగా ఆ ప్రాంతాన్ని, తన రాజ్యాన్ని, కుషానులపై, నాగాలపై గెలిచి కాపాడిన రాజ్యమనీ మరో అర్థం చెప్పటం కోసం చెక్కిన కథనం అనీ పరిశోధకుల వాక్కు.
5, 6, 7 గుహలు కలిసి ఒకే వరుసగా ఉంటాయి. 5 వైష్ణవ గుహగా వరాహరూపం చెక్కి ఉంటే, 4వ గుహ ఏక ముఖ లింగం చెక్కబడిన శైవ గుహ. సరళమైన, ముడిపడిన శిరోజాలు, తక్కువగా ఆభరణాలు, ఈ శిల్పం క్రీ.శ. 5వ శతాబ్దపు మొదటి భాగంలోనిదని ఆలోచన. ఎందుకంటే ఆ సమయంలో గుప్తుల కంటే ముందు రాజ్యం చేసిన కుషాన శిల్పాల పద్ధతి కన్పిస్తుంది. క్రీ.శ. 5వ శతాబ్దపు చివరి దశ వచ్చేనాటికి కళల నైపుణ్యం మరెంతో పెరిగింది. క్రీ.శ. 3, 4 శతాబ్దాలలో కళలు వృద్ధి చెందాయా, లేదా లేకపోతే ఇంత నైపుణ్యం క్రీ.శ. 5వ శతాబ్దంలో ఎలా వచ్చిందీ అని మనం ప్రశ్నిస్తే, అసలు క్రీ.శ. 3, 4 శతాబ్దాల్లో ఎక్కువ కళలు కన్పించవు. ఈ రెండు శతాబ్దాలూ కళా చరిత్రకారులకు ఎప్పుడూ ప్రశ్నగానే మిగిలాయి. బహుశ ఆ సమయం రాజులు, దండయాత్రలు, రాజ్యాల మార్పిడిలో కళళు రాజాశ్రమానికి దగ్గరై ఉండవు. కార్ఖానాలలో, రూపు, నైపుణ్యం దిద్దుకుంటూనే ఉండిఉంటాయి.
గుప్తుల కాలంలో ఎన్నో హిందూ శిల్పాలు కనిపిస్తాయి. హరిహర శిల్పం, ఎడమపక్క విష్ణు రూపం, కుడిపక్క శివరూపం ఉన్న శిల్పం చేతులు లేని శిల్పం అవటం వల్ల ఆయుధాలు కూడా చేతులతో పాటు విరిగిపోయి ఉంటాయి. ఈ శిల్పం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంది. వారణాసి వద్ద గోవర్ధన గిరిని ఎత్తిన కృష్ణుడి శిల్పం దొరకగా దానిని, భారత కళా భవన్, వారణాసి మ్యూజియంలో ఉంచారు. ఇంద్రుడి కోపానికి గురైన వృందావనం తుఫాను వర్షానికి తట్టుకోలేక పోయినపుడు ఎడమ చేతి చిటికిన వేలిపై కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి దాని కింద ఆశ్రయమిచ్చి గ్రామ ప్రజలని కాపాడుతాడు. శిల్ప కారులు ఈ శిల్పాన్ని ఎంతో అందంగా ఎడమ చేయి ఎత్తిన గోవర్ధనం, కుడిచేయి తన వస్త్రంపై వేసిన భంగిమలో నిల్చున్న కృష్ణుడిగా చూపారు. కృష్ణుడి రూపం, చిన్న పిల్లవాడైనా, భయపెడితే భయపడే వాడు కాడు అనే పురాణ కథకి, రూపం ఇచ్చి చెక్కాలి గదా శిల్పకారులు. ఈ పురాణ కథలకి ఒక్కో శిల్పకారుడు ఒక్కో రకంగా దృశ్యాన్ని ఊహిస్తూ ఒక్కో రకంగా చెక్కు తారు, చిత్రిస్తారు. వారు అందులో ముఖ్య మైన ముద్దా ఏది అనుకుంటారో, దానికి దృశ్యం ఊహించుకుని, అది చిత్రిస్తారు. అది వారి వారి ఊహపై, సృజనాత్మకతపై ఆధార పడి ఉంటుంది. అందుకే ఈ గోవర్థనగిరి ధారి శిల్పం, చిత్రం, ఎంతో మంది కళా కారుల చేతిలో ఎన్నో రకాలుగా కనిపి స్తుంది. ఒక్క కృష్ణుడి శిల్పమే కాదు, ఏ శిల్పం, చిత్రం అయినా కళాకారుల కథనం వారి ఊహనే.
గుప్తుల రాజ్యంలోని విదీషకు 80 కి.మీ. దూరంలో ఎరాన్ అనే ప్రదేశంలో ఎన్నో వైష్ణవ మందిరాలు, క్రీ.శ. 5వ శతాబ్దాల ఆఖరి దశ నుంచి క్రీ.శ. 6వ శతాబ్దం వరకూ కట్టబడ్డాయి. ఆపై గుప్తుల రాజ్యం అంతరించి వారి కళలూ లేవు. ఎరాన్‌లో మరో వరాహ శిల్పం దొరికింది. ఇది మధ్యప్రదేశ్‌లోని సాగర్ మ్యూజియంలో ఉంచారు. ఈ వరాహ రూపం, ఉదయగిరి 5వ నంబరు గుహ కంటే ఇంకొంత నైపుణ్యంతో చెక్కబడింది. భంగిమ, కథా రూపం అలాగే ఉన్నా, బలమైన ఈ శిల్ప రూపానికి మరింత ప్రాణం పోసారు శిల్పకారులు. ఇదీ 5వ శతాబ్దందే.
గుప్తుల కాలంలో బౌద్ధ శిల్పం కూడా మరింత నాణ్యత పెంచుకుంది. శాతవాహ నుల సామంతులైన శుంగులు కట్టించిన సాంచీ స్థూపం మళ్ళీ వెలుగులోకి తెచ్చి అక్కడ ధూపదీపాలు ఏర్పాటు చేయటమే కాక, మరిన్ని కొత్త మందిరాలు, ఆరామాలు పెంచారు. వారణాసి వద్ద ఉన్న సారనాథ్‌ని వీరు బౌద్ధానికి ప్రముఖ స్థానంగా పెంపొం దించారు. సారనాథ్‌లోని బుద్ధుడి మొదటి ప్రవచనం ఇవ్వబడింది. ఈ ప్రపంచ శిల్పం, గుప్తుల కాలంలో చెక్కబడిన అందమైన శిల్పం, సారనాథ్ మ్యూజియంలో ఉంచబ డింది. ఈ శిల్పానికి, పొడవైన చేతులు, పొడవైన రూపంతో పాటు ఒక అనిర్వచనీ యమైన శాంతి చూపుతూ చెక్కాడు శిల్పి.
గుప్తుల కాంలో జైన శిల్పాలూ చూసాం. వీరి కాలం కళలకు పుట్టిల్లు, అందమైన శిల్పాలలకు అద్దాల మేడలై, సర్వమత సమానమై, స్వర్ణయుగానికి నిర్వచనం తెలిపింది.
- డా. ఎం.బాలామణి, 810671 3356