Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిసరాలకనుగుణంగా కొన్ని జంతువులు తమ శరీరపు రంగును మార్చుకుంటాయి. శత్రువుల కళ్ళు గప్పేందుకు తనను తాను రక్షించుకునేందుకు తాము ఉన్న ప్రదేశంలో కలిసిపోయేందుకు జంతువులు వాటిలో కొన్ని మార్పులు చేసుకుని రంగులు మారతాయి. మనందరికి బాగా తెలిసిన ఉదాహరణ ఉసరవెల్లి. అయితే ఈ విధంగా చెట్లు రంగులు మార్చుకుంటాయని తెలుసా? అయితే ఇది ఏ విధమైన ఆత్మరక్షణ చర్య కాదు. చెట్లలోని పువ్వులు ఒక రోజులోనే నాలుగైదు రంగుల్లోకి మారుతుంది. ఏదో కొద్దిగా రంగు తేడా కాదు. పూర్తి తెలుపు రంగులో ఉన్న పువ్వు లేత గులాబీ, గులాబీ, ఎరుపు, లావెండర్, పర్పుల్ రంగుల్లోకి మారుతుంది. బెంగుళూరులోని అపార్టుమెంట్లో ఈ చెట్టును చూసిన దగ్గర నుంచి మీకెప్పుడు చెబుదామా అని ఆతతగా ఉన్నాను. నేను డిగ్రీ చదివినప్పుడు బాటనీలో ఈ పూల గురించి విన్నట్లుగా అనిపించటం లేదు. వీటిని పరిశీలించటం మొదలెట్టాక ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయని తెలిసింది.
హైబిస్కస్ మ్యుటాబిలిస్, బ్రూనే షెల్సియా, లాటిపోలియా, హైడ్రాంజియా మాక్రోఫిలియా, లాంటునా కోమారా, పుల్మానేరియా స్పైక్, డెల్ఫినియం, మిరా బిలిస్ జలపా, మార్నింగ్ గ్లోరీ, క్లైటో రియా టేర్నేషియా వంటి అనేక రకాల చెట్లు తమ పువ్వుల్ని రంగులు మారు స్తాయి. పోయిన్ సెట్టియా మొక్కలు పూలను మార్చుకోవు కానీ తమ ఆకుల్నే పూలుగా కనిపించేలా చేస్తాయి. కొమ్మల పై భాగంలో ఉండే ఆకులు ఎరుపు రంగులో పువ్వుల వలే భ్రమింప చేస్తాయి. ఒకటి రెండు వారాల పాటు ఈ మొక్కను 10,12 గంటల పాటు చీకటిలో ఉంచినట్లయితే ఇలా ఆకుపచ్చ ఆకులు ఎరుపు రంగులోకి మారతాయి. 'హైడ్రాంజియా' పూలు గుత్తులుగా పూస్తాయి. ఇవి వికసించి నప్పుడు నీలం రంగులో ఉండి తర్వాత గులాబీ రంగులోకి మారతాయి. ఇవి నక్షత్రాకారపు పూల సమూహాలు. 'మిరా బిలిస్' పూలు నాలుగ్గంటల కొకసారి తమ రంగును మార్చుకుంటాయి. 'పుల్మ నేరియా' అనే చెట్టు పూలు ఎరుపు రంగు లో పూసి నీలం రంగులోకి మారతాయి. 'డెల్ఫినియం' పూలు పాడుగ్గా స్పైక్ లుగా పూసి నీలం రంగులోకి మారతాయి. తర్వాత నీలం రంగు నుంచి లేత గులాబీ లేదా తెలుపు రంగులోకి మారతాయి. బ్రున్ ఫెల్సియాలు మూడు రోజులు మూడు రంగుల్లోకి మారతాయి. మనమీ రోజు 'హైబిస్మస్' అనే శాస్త్రీయ నామం కలిగిన 'కార్ఫిడరేట్ రోజ్' అనే పువ్వుల గురించి తెలుసుకుందాం ! దీనికి చాలా పేర్లున్నాయి. చైనీస్ రోజ్, చేంజింగ్ రోజ్, కాటన్ రోజ్ మెల్లా, లాండ్ లోటస్, లోటస్ బెండి, మెడో లోటస్ అని ఎన్నో పేర్లున్నాయి. వీటి ఆకులు పత్తిచెట్టు ఆకుల్లా ఉండటం వల్ల కాటన్ రోజ్ అంటారు. యుద్ధక్షేత్రాల్లో ఎర్రగా రక్తంలో ముంచినట్లుండే ఈ పూలు ఉన్నందున వీటిని 'కాన్ఫిడరేట్ రోజ్' అంటారు. ఈ పూలను అస్సామీ, బెంగాలీ భాషల్లో 'శాలపద్మ' అనీ, కన్నడ భాషలో చంద్ర కాంతి గిడ అనీ, కాశ్మీరీ భాషలో 'స్థల పద్మమనీ', కొంకణి భాషలో సూర్యకాంతి అనీ పిలుస్తారు. హిందీ భాషలో బాల, దష్టికత, దేవ, పద్మ, పద్మచారిణి, పుండ రీయక్, సాధు పుష్ప, పాల పుష్ప, స్థల, కదుల్ అని ఎన్నో పేర్లున్నాయి. వీటి పేర్లలో గులాబీ అని కమలం అనీ పేర్లు న్నప్పటికీ ఆయా కుటుంబాలకు చెందిన మొక్కలు కావు. ఇవి మందార జాతికి చెందిన మొక్కలు మాల్వేసి కుటుంబానికి, మాల్వేలిన్ క్రమానికి చెందిన మొక్కలు.
కాటన్ రోజ్ పుట్టిల్లు చైనా దేశం. ఇది చిన్న చిన్న కొమ్మ లున్న పెద్ద పొద. ఇది 15 అడుగుల పొడవు దాకా పెరుగు తుంది. పొదలాగా ఉండే దీని వెడల్పు పది ఫీట్లు వెడల్పు వరకు ఉంటుంది. పువ్వులు ముద్ద మందారాల వలె ఉంటాయి. ఈ మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. వేసవి చివరి నుంచి పూస్తూనే ఉంటాయి. కటింగ్ రూట్ ద్వారా వీటిని పెంచడం సులభం. మంచి సారవంతమైన నేల, నీళ్ళు త్వరగా పోయే వీలున్న చోట బాగా పెరుగుతుంది. ఎండ బాగా పడేచోట పెంచితే పూలు బాగా పూస్తాయి.
ఈ పువ్వులు రంగులు మార్చడానికి ఉష్ణోగ్రత కారణమని ప్రయోగాల వల్ల తెలిసింది. ఆంధో సయనిన్ అనే వర్ణ ద్రవ్యాలు ఒకే చోట ఉండి పోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తున్నది. సయనిడిన్, 3 - సాంబు బయోసైడ్ ఆనే వర్ణకాలు కూడా ఆంధో సయనిన్కు సహాయం చేస్తాయి. అంతే కాకుండా నేలలోని ఆమ్ల పదార్థాన్ని బట్టి కూడా రంగులు మారతాయి. నేలలో 5-5 వరకు PH ఉన్నట్లయితే పూలు నీలం రంగులో ఉంటాయి. అదే 6-5 నుండి 7 PH వరకు ఉన్నపుడు గులాబీ రంగుకు మారతాయి. గంటల తేడాతో రోజుల తేడాతో రంగులు మార్చే పువ్వులిచ్చే చెట్లు మనకు ఆహ్లాదాన్ని కలగజేస్తాయి.
- డా. కందేపి రాణిప్రసాద్