Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గోల్కొండ కోట' ఒక చారిత్రక కట్టడం. భాగ్యనగరానికే గర్వకారణం. హైదరాబాద్‌లోని ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ కోటను మొదట 'మంకల్'గా పరిగణించేవారు. ఆ తర్వాత కాలక్రమేణా పరిపాలనలో వచ్చిన మార్పులు, అనేక దండయాత్రల అనంతరం ఈ కోట 'గోల్కొండ' గా ప్రసిద్ధి చెందింది.ఈ కోటను మొదట 11వ శతాబ్దంలో కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు మట్టిగోడలతో నిర్మించాడు. ఆ తర్వాత 1518లో 'కులీకుతుబ్‌షా' దీనిని భారీకోటగా రూపాంతరంగావించాడు. అసలు 'గోల్కొండ' అంటే గొర్రెల కాపరి కొండ అని అర్థం. ఈ గోల్కొండ కోటను పూర్తిగా వీక్షించాలంటేఒక రోజు పడుతుంది. ఈ కోట గ్రానైట్ చుట్టుకొలత 5 కి.మీ. కాగా, బయట గోడ 7 కి.మీ. వుంటుంది. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఎనిమిది నెలల ముట్టడి అనంతరం 1687లో ఈ కోట శిథిలావస్థకు చేరుకుంది.
గోడ లోపల కోట నగరం వజ్రాల వ్యాపారానికి గతంలో ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఏదయినా వజ్రం దొరకక పోతుందా అని పర్యాటకులు ఆశపడుతూ ఉంటారు. అందుకే గోల్కొండ కోటలో పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థ వుంటుంది. 1948 వరకు హైదరాబాద్‌ను పరిపాలించిన నిజాం నవాబుకు ఈ గోల్కొండలోని వజ్రాల గనులు అంతులేని, అపార సంపదను చేకూర్చిపెట్టాయి.
ఈ కోటలో అలనాటి ఫిరంగులు ఎన్నో కన్పిస్తాయి. రాణి మహల్ ప్రత్యేక ఆకర్షణ. కోటలోని సింహద్వారం వద్దనున్న ఒక ప్రదేశంలో చేతితో చప్పట్లు కొడితే, అవి పైనున్న కోటలో ప్రతిధ్వనించటం ఆనాటి నిర్మాణ కౌశలానికి తార్కాణంగా నిలుస్తుంది. కుతుబ్షాహి రాజుల సమాధులు శిథిలావస్థకు చేరుకున్నాయి.
గోల్కొండ వజ్రాలు, డైమండ్స్‌కు అంతర్జాతీయంగా నేటికీ ఖ్యాతి లభిస్తోంది. కోహినూర్ వజ్రాన్ని చాలా కాలం ఇక్కడ భద్రపరిచారు. ఈ గోల్కొండ కోట ఎనిమిది గేట్వేలతో విస్తరించి వుంటుంది.
ఈ గోల్కొండనెఱఉ సందర్శించిన మొదటి యూరోపియన్ 'అఫనాసినికితిన్' అని చరిత్ర చెబుతోంది. ఈ కోటలోపల మెట్లు ఎక్కితే పై భాగంలో వున్న 'భక్తరామదాసు' బందిఖానా ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తోంది. అలాగే దర్బారు హాలు, తారామతి మసీదులు చరిత్రకు దర్పణాలు. ప్రతి ఏటా ఆషాడ బోనాలు ఈ గోల్కొండ పై భాగంలో గల జగదాంబికా టెంపుల్లో అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు.
యునైటెడ్ స్టేట్స్‌లోని ఇల్లినాయిస్లో వున్న ఒక నగరానికి, అదే దేశంలోని నెవడాలో గల మరో నగరానికి 'గోల్కొండ' పేరు వుండటం విశేషం. ఈ గోల్కొండ 2014లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
నిత్యమూ పర్యాటకులతో, వారాంతాల్లో అయితే కిక్కిరిసి సందడిగా వుంటుంది ఈ కోట.
- పంతంగి శ్రీనివాసరావు
9182203351