Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల్లుట్ల సునీత, 7989460657
విద్యా సంస్థల్లో వేధింపులు ఈ నాటివి కావు. ఇటీవలే జరిగిన ప్రీతి మృతి ఘటన కావచ్చు.. ఇటీవల ఇరాన్‌లోని టెహ్రాన్ కొమ్లో వందలమంది విద్యార్థినులపై జరిగిన విష ప్రయోగం వంటివి స్త్రీ శక్తిని నిర్వీర్యం చేసేవే. ఇలా స్త్రీలు పని చేసే ప్రతి చోట నేలరాలిపోతున్నారు. దేవతలుగా కొలవవలసిన స్త్రీమూర్తిని అంగడి సరుకుగానే భావిస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. సమాజ నిర్మాణంలో ఆమెదే మొట్టమొదటి పాత్ర అని అందరూ గుర్తించాలి.
'స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం' అనే నినాదంతో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ''యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతా'' ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అన్న ఆర్యోక్తిని అడుగడుగునా మననం చేసుకుంటూ ఇందులోని స్త్రీ విలువను తెలుసుకుని ఆమెను గౌరవించినట్లయితే ఆ కుటుంబం సమాజం దేశం అభివద్ధి పథంలో నిలుస్తాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మహిళల హక్కులు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోవడం సమాజానికి ఒక సవాల్ విసిరిన ప్రశ్నలా మారింది.
ఆధునిక భారతంలో అన్నింట్లో అబివృద్ధి సాధిస్తున్నప్పటికీ స్త్రీ సాధికారతలో వెనకబడే ఉండడం సమాజ విస్ఫోటనంగా తోస్తుంది. అన్నీ మారినా మహిళల పట్ల ఆలోచనా ధోరణి అలాగే ఉన్నది. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో విజయాలు సాధించి ముందుకు వెళ్తున్న క్రమంలో కూడా ఇంకా స్త్రీలపై ఆగని లైంగిక దాడులు, అంతరాలు, ఆడ, మగ అనే అసమానతలు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం.. దేశాన్ని పాలించే అధినేత్రిగా కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న ధీర వనితలు వాణిజ్యంలో వెలుగొందుతున్న అతివలు క్రీడారంగంలో కాంతులీనే మహిళామణులు, కుటుంబాన్ని నడిపించే అమ్మలు, అంతరిక్షంలో ప్రయాణిస్తున్న మగువలు, ఇలా ప్రతి ఒక్క రంగంలో నారీమణుల తెగువని చూస్తే అతివల విజయాలకు హద్దులు లేవని మనం చెప్పుకుంటున్నప్పటికీ ఈ విజయాలు అందరికీ సమానం కావు.
నగరం, పట్టణ మహిళలను చూసి గర్వపడటం కాదు అనాగరికపు అంచుల్లో అతివలని గుర్తించాలి. వారి శ్రమశక్తిని, గౌరవించాలి. సమాన అవకాశాలు వచ్చేలా చూడాలి. సమాన పని దినాలకు సమాన వేతనం లభించేలా, వారి హక్కులను పరిరక్షించేందుకు జాతీయ మహిళా సామాజిక మండలి ఏర్పాటు చేయాలి. అన్ని రంగాల్లో కొంతవరకు ఇప్పుడు ముందున్నారు, విజయాలు సాధిస్తున్నారు. అదే మహిళా సాధికారత అనుకుంటే పొరపాటే. స్థితిగతులు బాగుపడనిది సమాజ అబివృద్ధి చెందదని అందరూ గుర్తించాలి.
అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ఇంకా లింగ, వ్యక్తిత్వ, వేతన, భద్రత, సమానత్వం అనే అంశాలలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు. చిన్నచిన్న దేశాలు సైతం స్త్రీ శక్తిని వినియోగించుకొని అభివృద్ధి వైపు దూసుకెళ్తుంటే మన దేశంలో మాత్రం ఇంకా ఇంటి పనులు, వంట పనులు, చేపిస్తూ ఆమె శక్తిని వినియోగించుకోక కుటుంబం, సమాజం అనే కట్టుబాట్ల సంకెళ్ళలో బంధించే ఉంచుతున్నారు.
సమాజంలో స్త్రీలు స్వశక్తితో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తమకు తామే ఎదిగి ఆర్థిక అవసరాలను ఆర్థిక స్వతంత్రంతో తీర్చుకోగలగాలి. నిర్ణయాలు చేయగలిగే స్వేచ్ఛ ఉండాలి. ఇప్పటికే నిరంతర జీవనాధారాలను స్వయంగా నిర్మించుకోగలిగే స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చాటుతూనే ఉన్నారు. విద్యారంగంలో రాజకీయరంగంలో వైద్యరంగంలో క్రీడలు అంతరిక్షం పరిశోధనలో టెక్నాలజీ వాణిజ్యం పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు మానవ వనరుణాలు సంపూర్ణ వినియోగంలో స్త్రీల పాత్ర కీలకంగా ఉందని చెప్పవచ్చు
రంగం ఏదైనా ఉన్నత శిఖరాలు చేరుకొని ఇంటి పనులకు వంట పనులకు పరిమితం కాదు అని పురుషులకు ఎందులోనూ మేము తక్కువ కాదని ప్రతి రంగంలో పోటీపడుతూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. ఏడాదిలో ఒక్కరోజు గౌరవిస్తే సరిపోదు. ప్రతి పనిలోనూ ప్రతి విజయంలోను ఆమెను గౌరవించి అభినందించాలి. స్త్రీ లేనిదే సష్టి మునగడలేదు.అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి.
ఎక్కడ చూసినా స్త్రీ వంచనకు, అవమానాలకు, లైంగిక దాడులకు, వరకట్నానికి, గృహహింసకు, వివక్షతకు, సామాజ హింసకు, గురవుతూనే ఉంది. సభ్య సమాజం చైతన్యాన్ని సామాజిక బాధ్యతలను సవాల్‌చేస్తూ విజయాలు సాధిస్తున్న ఆఘాయిత్యాలు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన నిర్విర్యమే నీరు గారి పోతున్నాయి. దానికి సహకారం ఎంతో అవసరం వివిధ రంగాల్లో ఆమె ఎంచుకున్న ఏ పనైనా కావచ్చు ఆ రంగాల్లో విజయాలు సాధించడానికి కుటుంబం నుంచి సపోర్ట్, ప్రోత్సాహం, అందించాలి అలాగే సమాజం నుంచి కూడా ఆమె ఎంచుకున్న ఆశయాల, లక్ష్యాలను గమ్యాలను, చేరుకోవడానికి సహకారం అందించాలి. అప్పుడే ఆమె అనుకున్న ఆశయాల కోసం లక్ష్యాలను సాధించి కృషి చేసి పట్టుదలతో శక్తిని చాటుతూ విజయాలను సాధిస్తుంది.
దీని వల్ల సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, రుగ్మతలు, లింగ వివక్షత పోయి ఆరోగ్యమైన సమాజం తయారవుతుంది. తద్వారా దేశం, కుటుంబం ప్రగతి పథంలో సాగుతుంది. విజయాలు మాత్రమే చెప్పుకోవడం కాదు లింగ వివక్షత ఎందుకు వస్తుంది ఎక్కడ ప్రారంభమైంది అని చర్చించుకోవాలి. దాని కోసం మనం ఏమి చేయాలి. సమాజంలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి అందరినీ అవగాహన పరచాలి. న్యాయంగా మహిళ హక్కులు సరైన రీతిలో అమలయ్యేలా చూడాలి. సమాజం, పాలనాధికారులు న్యాయాధికారులు చర్యలు తీసుకోవాలి.
విద్యా అధికారులు పాఠశాలలోనూ కళాశాలలోనూ అక్కడ యాజమాన్యాలు స్త్రీలపై జరిగే సమస్యలు, సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి. న్యాయ వ్యవస్థను సంప్రదించడం కానీ కంప్లైంట్ ఇవ్వడం గానీ చేయాలి. ఘటనలకు పాల్పడిన వారిపై వేటు వేస్తూ వారు చదువుతున్నటువంటి డిగ్రీని రద్దు చేసేలా యూనివర్సిటీలు చర్యలు తీసుకోవాలి. విద్య అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఎంతోమంది ఆడపిల్లలు, ఆశయాలు జీవితాలు మట్టిలో కలిసిపోతున్నాయి. జ్ఞాన జ్యోతులను వెలిగించాల్సిన విద్యాలయాల్లో కొడిగట్టిన దీపాల్లా ఆడవారి జీవితాలు అంతమవుతున్నాయి.
అధికారులు ఇలాంటి సమస్యల పట్ల ఆత్మ విమర్శ చేసుకోవాలి. గౌరవించడం అలవర్చుకోవాలి ముందుగా మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. అది కుటుంబం నుంచి ప్రారంభం కావాలి రెండవ కుటుంబం పాఠశాల, సమాజం మూడవ కుటుంబం ఆమె పని చేసే ప్రతి చోట ఆమె ప్రాధాన్యతను ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి. దీని వలనఎన్నో బాధ్యతలను సమర్థవంతంతో చాకచక్యంగా నిర్వర్తిస్తుంది. ఆమెను కించపరచడం తక్కువ చేసి మాట్లాడడం.అనే భావన మానుకోవాలి. మహిళ సెక్షన్స్ హక్కులు గురించి కూడా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు పాలకులు గ్రామాల నుంచి పట్టణాల వరకు పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు మహిళల హక్కులు, సెక్షన్స్ గురించి అవగాహన పరచడం వల్ల ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరినీ కూడా సమానత్వంతో పెంచడానికి తల్లిదండ్రులకు ఒక అవగాహన వస్తుంది. దాని వల్ల సమానత్వంతో పెంచుతారు. మహిళలు కూడా ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు వారి హక్కులు చట్టాల గురించి తెలుసుకున్నప్పుడు. పలానా సెక్షన్స్ ఉంటాయని తెలుసుకొని వారి సమస్యలను వారు పరిష్కరించుకొని న్యాయం పొందుతారు. అప్పుడే ఆమెకు ప్రశ్నించే శక్తి హక్కుల నుంచి ఆమెకు వస్తుంది.
దీనిపై అవగాహనా సదస్సులు పెట్టడానికి ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించి అమలు పరచాలి. మన్నించడం కూడా ఆమె పట్ల నేర్చుకోవాలి పనిచేసే కార్యాలయం కావచ్చు కుటుంబం కావచ్చు శ్రామిక స్థలం కావచ్చు, ఆమె పట్ల తప్పు చేసినప్పుడు మేము పెద్ద హౌదాలో ఉన్నామనే అహంకార ధోరణితో ఉండొద్దు. గర్వాన్ని వీడనాడి స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని భావిస్తూ క్షమాపణలు చెప్పే మంచి ఆలోచనలు ఆశయాలని అలవర్చుకోవాలి. అప్పుడే నిజమైన సహకారం, స్త్రీకి ప్రోత్సాహం అందించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యం అవుతుంది.