Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగన్నాథం పేరు జగన్నాథమే కాని అయోమయం జగన్నాథం మాత్రం కాదు. జగన్నాథం స్కూల్ విద్య వెలగబెడుతున్న రోజుల్లో జగన్నాథం అనే పేరుకి ముందు అయోమయం చేరింది. తర్వాతి కాలంలో అయోమయం జగన్నాథం అని పిలవబడ్డ జగన్నాధం ఉత్తి అయోమయంగా మిగిలిపోయాడు.
అసలు ఈ అయోమయం జగ న్నాథానికి తుమ్మబంకలా అంటుకుం దుకు కారణం స్కూల్లో జగన్నాథం ప్రవర్తనే. అసలు ఈ లోకంలో ప్రశ్నలూ, సందేహాలూ లేని వాడెవ డుంటాడు చెప్పండి. క్లాస్‌లో టీచర్ పాఠం అయిపోగానే విద్యార్థులను అర్థమయిందా అనడుగుతాడు. నలభైమందికి ముప్పయి తొమ్మిది మంది చాలా బాగా అర్థమైంది సార్ అంటారు. ఒక్కడు మాత్రం లేచి తనకో సందేహం ఉందంటాడు. అదేమిటో చెప్పమని టీచర్ అడుగుతాడు. ఆ ఒక్కడు అదేమిటో చెప్తాడు కానీ అది ఎవరికీ అర్థం కాదు టీచర్‌తో సహా. ఆ అడిగే ఒక్కడు జగన్నాథమే. అతని సందేహం అందరికీ అయోమయమే. అలా పేరుకు అయో మయం తగిలించుకున్న జగన్నాథం ఎన్నేళ్ళ యినా దాన్ని వదిలించుకోలేకపోయాడు.
నిత్యం అనేక అనుమానాలతో, సవాలక్ష యక్ష ప్రశ్నలతో సతమతమయ్యే జగన్నాథాన్ని ఓ ప్రశ్న వేధించసాగింది. రాచిరంపాన కొయ్యసాగింది. ఇదేం కొత్త ప్రశ్న కాదు. దీనికి ఆర్కిమిడిస్ యూక్లిడు లాంటి మేధాయోధులు కూడా జవాబు చెప్పలేరు. అయితే లోకంలో 'ఫ్రీ'గా గాలి పీలుస్తున్న ప్రతివాడికీ ఈ సందేహం రాకపోదు. లోకంలో ఒకరికంటే ఒకరు తెలివైనవారు కనుక దీన్ని పెద్దగా పట్టించుకోరు. అవసరమా అని తన్ని తగలేస్తారు.
జగన్నాథ అందరిలాంటి వాడు కాదు మరి. అయోమయం కదా! ఆ ప్రశ్నకి సమాధానం కోసం కంటి మీద కునుకులేకుండా ప్రయత్నం మొదలుపెట్టాడు. ఏ క్షణాన ఏ అద్దం ముందు నిలబడి ముఖం చూసుకుంటుంటే ఆ ప్రశ్న అయోమయంగా అయోమయం మెదడులోకి జొరబడ్డదో మరి!
ఇంత పెద్ద భూగోళంలో ఇన్ని ఖండాలూ సముద్రాలూ ఉన్న లోకంలో తెలుపూ నలుపూ ఎరుపూ పొడుగూ పొట్టీ లావూ సన్నం మనుషుల్లో ఈ మతం, ఆ కులం గుర్తింపున్న జనంలో ఈ వృత్తి ఆ వృత్తి అనేక వృత్తుల జనాభాలో తన సందేహ నివృత్తి చేసేవాడెవడూ ఉండడా అని కనిపించిన వాడినల్లా ఏ మాత్రం సిగ్గూ మొహమాటం లేకుండా అడిగేయసాగాడు.
ఒక ఉద్యోగి తను ఆ ఉద్యోగం చెయ్యడానికే పుట్టానని తను లేకపోతే ఆఫీసు అంగుళం ముందుకు కదలదని చెప్పాడు. ఓ వ్యాపారి వేలని లక్షలు, లక్షల్ని కోట్లు చెయ్యడం కోసమే తన జన్మ అని చెప్పుకొచ్చాడు. ఒక పంతులు పాఠాలు చెప్పడానికని ఒక డాక్టరు అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు చేసి బస్తాల కొద్దీ మందులు కొనిపించి తను పని చేసే కార్పొరేట్ దవాఖానా ఖజానా నింపడం కోసం అని ఓ కవి పత్రికల్లో అచ్చుకావడం లేదని తన కవితల్ని వాట్ప్ఆప్లో చదివి వినిపించి చెవులు మూయించడానికని, ఒకడు బ్యాంకుల్ని దివాలా తీయించడానికికని ఒకడు భూ కబ్జాలకోసమని రకరకాలుగా జవాబులు చెప్పారు. కానీ జగన్నాథం అమయోమయం సంతృప్తి పడలేదు. తన ప్రశ్నకు పండితులు కాని పామరులు కాని ప్రవచన కర్తలు కాని, ఆస్తికులు కాని నాస్తికులు కాని సమాధానం చెప్పలేరు అనుకున్నాడు.
ఊళ్ళోకి ఎక్కడ్నించో ఓ బవిరిగడ్డం బాబా వచ్చాడని ఆయన అందరి సందేహాలూ చిటికెలో తీర్చేస్తున్నాడని విన్న జగన్నాథం 'ఆఘమేఘాల మీద' వెళ్ళలేడు కనుక కళ్ళు బైర్లు కమ్మే బస్సు చార్జీలు పెట్టుకుని ఆయన ముందువాలాడు. సవినయంగా తన సందేహం చెప్పాడు. గ్యారంటీగా సమాధానం వస్తుందని ఆశ పడ్డాడు. కానీ ఆ సన్యాసి, ఆ స్వామి, ఆ బైరాగి ఆ సర్వసంగ పరిత్యాగి తానూ ఆ ప్రశ్నకు సమాధానం కోసమే చెట్లూ పుట్టలూ అడవులూ కొండలూ, బావూలూ, తీర్థాలూ తిరిగానని కాళ్ళు అరిగాయి కానీ గడ్డం పెరిగింది కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదని ఏడ్చి మొత్తుకున్నాడు.
అయోమయం వీడని జగన్నాథం నిరాశగా వెనక్కి తిరిగి వస్తుంటే ఓ చోట ఏదో సభ జరుగుతున్నది. ఒక నాయకుడు మైకులో ప్రసంగిస్తున్నాడు. ఏం చెప్తాడో విందామని నిలబడిపోయాడు. ప్రసంగం పూర్తయ్యాక ముందు వరుసలో నిలబద్ద జగన్నాథం చేయి పైకి ఎత్తి 'అయ్యా నాది ఓ జవాబు తెలియని ప్రశ్న. అడగనా?' అన్నాడు జగన్నాథం.
'అడుక్కో' అన్నాడు నాయకుడు మైకు వదలకుండా.
'నేనేందుకు పుట్టాను??' అని బిగ్గరగా అరిచాడు జగన్నాథం.
మైకు ముందున్న నాయకుడు ఏ మాత్రం షాక్ అవకుండా 'నువ్వు పుట్టింది నాకు ఓటు వేయడానికే' అన్నాడు. 'ఇప్పటిదాకా నేను చెప్పిందంతా విన్నావు కదా. నువ్వు పుట్టింది నేను చెప్పింది అదెంత చెత్తయినా వినడానికన్న మాట పిచ్చివాడా! వేల సంఖ్యలో ఉన్న మేం ఓట్లు వేయించుకోవడానికై, కోట్ల సంఖ్యలో ఉన్న మీరు ఓట్లు మీరు ఓట్లు వేలు మీద చుక్క వేయించుకోవడానికై పుట్టారన్న మాట' అని ముగించాడు.
ఈ లోకంలో మసిపూసి మారేడు కాయను చెయ్యగలిగిన రాజకీయ నాయకులు మాత్రమే ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలకు జవాబు చెప్పగలరన్న మాట అనుకున్నాడు జగన్నాథం అయ్యోమయం!!
- చింతపట్ల సుదర్శన్, 9299809212