Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ విషయమైనా దృశ్యరూపం అంటే చిత్రం, శిల్పం, ఛాయాచిత్ర రూపంలో చూసినపుడు, అది మనసులో ఎక్కువగా హత్తుకుపోతుంది. కిందటి సంచికలో ధర్మం గురించి మాట్లాడుతూ, కళాకారులు శాస్త్రాలు తెలియచెప్పిన ధర్మ మార్గానికి చెందిన విషయాలను కళా రూపం ఇచ్చారనీ, శిల్పంగా, చిత్రాలుగా చిత్రించారని మాట్లాడుకున్నాం. రాజ్యాలు పాలించిన రాజులు, వారు ఏ ధర్మాన్ని నమ్మితే ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రచారం చేయాలని ఆలోచించారు. అది హిందూ, జైన, బౌద్ధ ధర్మాలు ఏవైనా సరే. రాజులు తమ కట్టడాలు, నిర్మాణాలు, చిత్రం, శిల్పాల ద్వారా ప్రజలందరికీ విషయం అందించగలిగారు. సాహిత్యం అయితే చదవగలిగిన వారు మటుకే తెలుసుకుంటారు. నాటక రూపం అయితే తాత్కాలికం మాత్రమే. శిల్పం, చిత్ర రూపం అయితే ఆ సందేశాలు శాశ్వతంగా నిలిచిపోతాయి కదా!
పురాతన యుగాల్లో హిందూ, బౌద్ధ, జైన శిల్పాలను చూస్తే, చెక్కిన తీరు, పద్ధతి ఒకటేలాగా కనిపిస్తుంది. ఒకవేళ విష్ణు రూపమో, శివ రూపమో చెక్కితే, ఆ రూపాలకు సంబంధించిన గుర్తులు, ముద్రలతో చెక్కుతారు. అలాగే బౌద్ధ, జైన రూపాలు చెక్కితే ఆ ముద్రలతో చెక్కబడతాయి. కానీ ఆ రూపాల్లో పోలికలూ కనిపిస్తాయి. ఎందుకంటే చెక్కే కళాకారులు ఒకే కోవ వారు కదా! అలాగే ఈ ధర్మబోధన చేసే ఈ కథల మధ్య పోలికలూ కనిపిస్తాయి.
పంచతంత్ర కథలకూ, బౌద్ధంలోని జాతక కథలకూ పోలికలు కనిపిస్తాయి. మహాభారతంలో విదురుడి పేరు, జాతక కథలలో విదుర పండిత జాతక కథ కనిపిస్తుంది. మహా భారతంలో నకుల సహదేవుల తల్లి పేరు మాద్రి, ఆ పేరు బౌద్ధంలోనూ కనిపిస్తుంది. అలాగే చెక్కిన శిల్పాలు ముద్రలు పోలికలు చూస్తే, యోగ నారాయణుడి శిల్పం, యోగ ముద్రలోని శివుడి శిల్పం, ధ్యాన ముద్రలో ఉన్న జైన తీర్థంకర, బౌద్ధ శిల్పాలు ఒకటే లాగా కనిపిస్తాయి. అరచేయి ఒడిలో పెట్టుకుని, పద్మాసనంలో కూర్చుని, కంటి చూపు ముక్కు మీద నిలిపి, నిటారుగా తపస్సులో కూర్చునే ఏ రూపమైనా సరే తెలిపే భావం ఒకటే కదా! జాతి గుఱ్ఱాలు, ఐరావతం అనే ఏనుగు, శిబిచక్రవర్తి కథ, ఇంద్రుడు సగం సింహాసనం ఇచ్చిన మాంధౄత అనే యోగ్యుడి కథ, హిందూ, బౌద్ధ కథలు రెంటిలోనూ కనిపిస్తాయి. సి.శివరామమూర్తి అనే కళా చరిత్రకారుడు, భారతీయ కళలు, సాహిత్యం మధ్య అందమైన పోలికలు గురించి రాస్తూ ఈ విషయాలను రాసాడు.
ఇక కళలు, కళాకారుల విషయానికొస్తే, 5వ శతాబ్దం వరకూ కొండ తొలచి గుహలు నిర్మించి అందులో చిత్రాలు, శిల్పాలు చెక్కారు. అది అజంతా అయినా, బాగ్ గుహలైనా సరే. ఈ 5వ శతాబ్దం వరకూ మనకు స్వతంత్రంగా నిలుచోగల మందిర నిర్మాణాలు కన్పించలేదు. గుప్త రాజుల రాజ్యంలో మందిర నిర్మాణమూ మొదలైంది. క్రీ.శ. 319లో గుప్తుల రాజ్యం మొదలై వారు, వారి సామంతులూ కలిసి, ఉత్తర, మధ్య భారతంలో బౌద్ధ, జైన మతాలకు ప్రోత్సాహం ఇస్తూ హిందూ మత ప్రాపకం చేస్తూ శిల్పం, మందిర నిర్మాణం కూడా మొదలుపెట్టారు.
క్రీ.శ. 5వ శతాబ్దానికి ముందు మందిర నిర్మాణం తెలియదో, లేక నిర్మాణ నైపుణ్యం లేక పడిపోయాయేమో తెలియదు కానీ మనకు క్రీ.శ. 5వ శతాబ్దం దశ, లేక క్రీ.శ. 6వ శతాబ్దపు మొదటి దశకు చెందిన ఒక విష్ణు మందిరం ఉత్తర ప్రదేశ్లోని దేవఘర్లో కనిపిస్తుంది.గర్భగుడిలో ఏ విగ్రహమూ లేకపోవటం వల్ల, విష్ణు దశావతారాల రూపాలు కొన్ని కనిపించటం వల్ల దీనిని దశావతార మందిరంగా పిలుస్తారు. శిఖరం పడిపోయి గర్భగుడి ఒక అరుగుపై కట్టిన విష్ణు పంచాయత మందిరము ఇది. మధ్యన ముఖ్య మందిరమూ, దానికి నాలుగు పక్కల నాలుగు చిన్న మందిరాలు ఉండవలసింది. కానీ అవి శిథిలమయ్యాయి. అర్ధ చంద్రాకార మెట్లు, లతలు, మిథున రూపాలతో చెక్కిన ద్వారబంధమూ కనిపిస్తాయి. మకరంపై గంగ, తాబేలు పై యమున, స్త్రీ రూపాలుగా చెక్కబడి ద్వారానికి అటు ఇటూ కనిపిస్తాయి. ద్వారం పై భాగాన మధ్యలో లలాట బింబం స్థానంలో పడగవిప్పి ఆది శేషువు గొడుగులా పట్టగా లక్ష్మీ నారాయణ రూపం, నృసింహ, వామన అవతారాలతో సహా కనిపిచటం వల్ల ఇది విష్ణు మందిరం అని గుర్తించవచ్చు. మందిరానికి మూడు పక్కలా, ఒక గోడపై శేష శయనంపై విశ్రమించిన విష్ణు అనంతశయనమూర్తి, దక్షిణ గోడపై నర నారాయణులు, ఉత్తర గోడపై గజేంద్ర మోక్షం, బయట ప్రదక్షిణ చేసే వైపు కనిపిస్తూ చెక్కబడ్డాయి. గణేశ రూపం ఏ మందిరమైన మొదటిలోనే దర్శనమౌతుందనుకోండి. అలాగే ఇంద్రుడు, నెమలి వాహనంపై కార్తికేయుడు బ్రహ్మకు కుడి పక్క ఉండగా, ఎడమ పక్క నంది వాహనంపై శివపార్వతులు, అలాగే ఆ అనంతశయన శిల్పానికి కింద మధుకైటభులు, చక్ర పురుషుడు, గదాదేవి, ధనుష్ పురుషుడు, ఖడ్గ పురుషుడు కనిపిస్తారు. ఆయుధాలను ఈ విధంగా మానవాకారంలో చూపటం మనం ఇంతకు ముందు సంచికలోమ ఉదయగిరి గుహల గురించి మాట్లాడుతూ కూడా చూసాం. ఆ గుహలు మధ్య భారతదేశంలోనివి. గుప్తుల రాజ్యంలో చెక్కిన క్రీ.శ. 5వ శతాబ్దపు మొదటి దశ గుహలు. అంటే మనకు ఒక విషయం స్పష్టమౌతుంది. గుప్త రాజుల కాలంలో, మొదటి దశ శిల్పాలలో, ఆయుధౄలను మానవ ఆకారాలలో చెక్కారనీ, ఆ తరువాత శతాబ్దాలలోనే ఆ పద్ధతి మారిందనీను.
తూర్పు గోడపై దైవ సందేశంలా భక్తి, ప్రేమకు గుర్తుల్లా ఉన్న సిద్ధ పురుషులు నరనారాయణులు. వారు 'ధర్మం', ఆయన భార్య అహింసకు పుత్రులు. ఉత్తరం వైపు ఉన్న గోడపై చెక్కిన గజేంద్ర మోక్షం శిల్పం కూడా ఒక చక్కని భాగవత కథకు సంబంధించినదే. ఒక రాజు శాపం వల్ల ఏనుగుగా జన్మనెత్తుతాడు. ఆ ఏనుగు ఒక తామర కొలనులో తిరుగుతున్నప్పుడు ఒక మొసలి ఆ ఏనుగు కాలు పట్టుకుంటుంది. ఆ మొసలికి, ఏనుగుకి ఎంతో ఎంతో కాలం పెనుగులాట జరుగుతుంది. చివరికి ధైర్యం తగ్గిన ఏనుగు విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. పరుగున వచ్చిన విుష్ణుమూర్తి తన చక్రంతో మొసలిని ఖండించి ఏనుగును విడిపిస్తాడు. ఆ మొసలి కూడా ఒక నాగరాజు. ఆ విధంగా విష్ణుమూర్తి చేతి చక్రం వల్ల ఆ మొసలి, ఏనుగు ఇద్దరూ మోక్షం పొందుతారు. ఇది భక్తి మార్గం గురించి తెలిపే కథ. ఈ కథని ఆ దేవఘర్ మందిర గోడలపై శిల్పంలా చెక్కటం వల్ల, భక్తులకు భక్తి మార్గం గురించి చెప్పకనే తెలియచేయటం అవుతుంది. శిల్పం అలా ఎన్నో కాలాల పాటు నిలిచి ఉంది. తన సందేశాన్ని అందిస్తుంది.
గజేంద్ర మోక్షం గురించి మాట్లాడుతూ ఉంటే మరో మాట గుర్తుకు వచ్చింది. బమ్మెర పోతన మహా భాగవతాన్ని సంస్కృతం నుంచీ తెలుగులోకి అనువదించాడు. గొప్ప కవి. ఆయన క్రీ.శ. 15వ శతాబ్దం ఆఖరి దశలో జీవించి ఉన్నాడు. ఆయన జన్మస్థలం ఓరుగల్లు అనీ, జనగామలోని బమ్మెర గ్రామం అనీ రెండు మాటలూ ఉన్నాయి. ఆయన బావమరిది శ్రీనాథ కవి. కర్ణాట రాజుల ప్రాపకంలో ఉండి ఎన్నో గొప్ప కావ్యాలు రాసాడు ఈయన కూడా. పోతన తన భాగవతాన్ని శ్రీరాముడికి అంకితమివ్వదలిచాడు. ఎంత మంది రాజులనడిగినా నిరాకరించాడు. ఆ భాగవతాన్ని కర్ణాట రాజులకిప్పించాలని శ్రీనాథుడు భాగవతంలో రాసిన గజేంద్ర మోక్షం విషయంగా ఒకసారి ఎగతాళి చేసాడు. పోతన గజేంద్ర మోక్షం గురించి రాస్తూ ముసలి నోట తన కాలు చిక్కిన ఏనుగు తామర కొలనులో నిల్చుని విష్ణుమూర్తి వచ్చి తనని కాపాడమని ఆర్తిగా ప్రార్థించిందనీ, అప్పుడు భక్తుల కోసం ఎంతో దయ చూపే విష్ణుమూర్తి వెంటనే పరుగు పరుగున రావటంతో తన భార్య శ్రీలక్ష్మితో చెప్పలేదు. తన ఆయుధౄలను తీసుకోలేదట. ఏ ఆలోచనా లేక అలా భక్తితో పిలుస్తున్న ఏనుగు కోసం పరుగెడుతుంటే శ్రీ లక్ష్మికి ఏమీ తోచక తనూ వెళ్లాలా లేదా అని సందేహంలో నడిచి, నడవక నిల్చుందట. ఆయన శంఖ, చక్రాలు ఆయన వెంట పరుగెత్తాయట. పదం ప్రాస కలిపి కవిత రాసే పోతన ఈ సందర్భాన్ని ఎంతో గొప్పగా వివరించాడని ఎంతో మంది తెలుగు పండితులు ఆనందించారు. అయితే ఆనాడు శ్రీనాథుడు తన బావ అయిన పోతన మీద ఒక పరాచికం విసిరాడట. 'శంఖం, చక్రాలు ఆయుధాలు తీసుకోకుండా నీ విష్ణుమూర్తి ఎలా కాపాడదామని పరుగెత్తాడు బావా?' అన్నాడట. వెంటనే ఏమీ మాట్లాడని పోతన వారిద్దరూ కలిసి కూర్చుని ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు, పోతన కొడుకు మల్లన్న, శ్రీనాథుడి కొడుకు బావిలో పడిపోయాడని పెద్దగా అరిచాడట. అన్నం తింటూ అదే చేత్తో అలాగే పరిగెత్తాడట శ్రీనాథుడు. కానీ అది అబద్ధమట. పోతన తన కొడుకు మల్లన్న చేత ఊరికినే అలా అరవమన్నాడట. అప్పుడు పోతన తన బావమరిది శ్రీనాథుడిని చూసి, తాడు కూడా తీసుకోకుండా పరుగెత్తుకుని వచ్చావు ఎలా కాపాడుతామనుకున్నావు బావా నీ కొడుకుని, అని నవ్వి, విష్ణుమూర్తి తన భక్తులని తన సొంత పిల్లలకు మల్లెనే ప్రేమిస్తాడు. అందుకే అలా పరుగెత్తాడని జవాబు చెప్పాడట. ఇది పిట్టకథ అయినా అయి ఉండవచ్చు. కానీ పిల్లలకు సమయస్ఫూర్తి, భక్తులకు భక్తి మహత్మ్యం తెలుపటం కోసం అల్లిన కథ అయింది.
ఇక దేవఘడ్లోని విష్ణుమందిరం దగ్గరికి వస్తే పెద్ద పెద్ద రాళ్లు ఉపయోగించి కట్టిన ఈ మందిరానికి శిఖరం పడిపోయింది. బ:హుశా ఆనాటి ప్రత్యేక మందిర నిర్మాణం ఇంకా నైపుణ్యం అందుకోలేదు. కానీ శిల్పం ఎంతో ముందడుగు వేసిందని తెలుస్తుంది. కొద్ది ఆభరణాలతో, నునుపైన శరీర సౌష్టవంతో, ముఖాలలో శాంతి భావంతో హుందాగా చెక్కటమే కాదు ఆనాటికి కథా వస్తువు కూడా అంతే హుందాగా కళలో వివరించారని అర్థం అవుతుంది.
- ఎం. బాలమణి, 8106713356