Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ జిల్లా నుంచి బాల సాహిత్యం రాస్తున్న నేటి తరం బాల సాహిత్యకారుల్లో కవి, రచయిత, బాల సాహితీవేత్త, కార్యకర్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ఒకరు. 'కొబురె'గా సాహితీవేత్తలకు పరిచితుడైన వీరు వృత్తిరీత్యా ఆంగ్ల ఉపాధ్యాయుడైనా, రచయితగా తెలుగు పిల్లల కోసం సాహిత్య సృజన చేస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్న బుచ్చిరెడ్డి కార్యకర్త కూడా.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి జూన్ 16, 1969లో నల్లగొండ జిల్లా మేళ్ళదుప్పలపల్లిలో పుట్టారు. తల్లితండ్రులు సత్తెమ్మ, మల్లారెడ్డి. ఎం.ఎ., బి.ఇడితో పాటు న్యాయశాస్త్రంలో పట్టా పొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చండూరులో టీచర్‌గా పని చేస్తున్నారు. కవి, కథా రచయిత, వ్యాసకర్త, బాల సాహితీవేత్త అయిన బుచ్చిరెడ్డి విద్యాశాఖలో మండల రిసోర్స్ పర్సన్‌గా, స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా పనిచేశారు. పదేండ్లు రిసోర్స్ పర్సన్‌గా పనిచేసి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రిసోర్స్ పర్సన్‌గా విద్యాశాఖ మంత్రి చేతులుమీదుగా పురస్కారం అందుకున్నారు. విద్యాశాఖ నడిపిన బాలల మాస పత్రిక 'జాబిలి' సంపాదకవర్గ సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు. నల్లగొండ జిల్లా బాలలు రాసిన సాహిత్యానికి వేదికగా నిలిచిన ఈ పత్రిక వందలాది మంది బాల రచయితలకు వేదికగా నిలిచింది. ఈ జిల్లా నుంచి సేకరించి పంపిన రచనలు 'లేత గులాబీలు'గా వెలువడ్డాయి.
బాలల సాహిత్య వికాసం ఇవ్వాళ్ళ తెలంగాణలో విస్తృతస్థాయిలో జరుగుతోంది. వందలాది మంది బాల బాలికలు కవులు, రచయితలుగా తమ రచనల ద్వారా పరిచయం అవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఈ ఉద్యమం సాగుతోంది. కార్యకర్తగా పలువురు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పనిచేస్తున్న కార్యకర్తల్లో బుచ్చిరెడ్ది ఒకరు. వందలాది పిల్లలచే రచనలు చేయించడమేకాక వాటిని అచ్చువేసుకోవడంలో తోడ్పడుతున్నారు. బాలచెలిమి ఇటీవల తెచ్చిన తెలంగాణ బడిపిల్లల కథలలో బుచ్చిరెడ్డి పాఠశాల చండూరు విద్యార్థులు మల్లీశరి, కార్తీక్‌లు రాసిన కథలు అచ్చయ్యాయి.
ఉపాధ్యాయునిగా పిల్లల కోసం తపించే బుచ్చిరెడ్డి పిల్లల చేతిరాత అందంగా ఉండేందుకు శిక్షణను ఇవ్వడమేకాక, పిల్లల కోసం 'మార్గదర్శి' పేరుతో అందమైన చేతిరాత వికాసం కోసం పుస్తకం రాశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన కవితలను 'ఢమరుకం' పేరుతో సంకలనం చేసి ప్రచురించారు. ఇది నాలుగు వందల తెలంగాణ కవుల స్వర ఢమరుకం. కవిగా బుచ్చిరెడ్డి తెచ్చిన కవితా సంపుటి 'ధీరుల మొగసాల'. ఇదే కాక 'మనం-మన బతుకమ్మ' పేరుతో రాసిన పాటలు వీరికి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా మన ప్రాచీన ఆటల గురించి రాసిన 'అష్టా-చెమ్మ', 'ముక్కుడు గిచ్చుడు', 'దాగుడు మూతలు' వంటివి ప్రాచుర్యం పొందాయి. ఉపాధ్యాయునిగా, రచయితగా పలు గౌరవాలు, సత్కారాలు అందుకున్న వీరు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయునిగా, ఖమ్మం కలెక్టర్ ద్వారా ఉగాది పురస్కారం వంటివి అందుకున్నారు.
బాలల కోసం, బాలల సాహిత్య వికాసం కోసం నల్లగొండ కేంద్రంగా పనిచేస్తున్న కొమటిరెడ్డి బుచ్చిరెడ్డి పిల్లల కోసం మూడు వందలకు పైగా కథలు, బాల గేయాలు, వ్యాసాలు, సమీక్షలు రాశారు. సాహిత్య, సామాజిక రంగాల్లో సమానంగా పని చేస్తున్న బుచ్చిరెడ్డి కథలు, కవిత్వంతో పాటు పిల్లల కోసం రాసిన గేయాలు, కథల్లోంచి ఎంపికచేసిన కథలతో తెచ్చిన బాలల కథా సంపుటి 'మొలకలు'. ఇది ముప్పై రెండు కథల సంపుటి. ఇందులోని కథలన్నీ మీవి, మావీ అంటూ చెబుతారు రచయిత. ఇందులోని 'బుగ్గ-బుడత' కథ పిల్లల్ని అతి గారాబం చేసే తల్లితండ్రుల గురించి అతి సున్నితంగా చెప్పిన కథ. ఇందులోని బుడతడు గాలి బుగ్గలు కావాలని మారాం చేయగా, ఆరు కొనిస్తారు. గాలి వచ్చి వాడు ఎగిరిపోతాడు. కొబురె సమయ స్ఫూర్తి, కథా కల్పనకు ఇదే సంపుటిలోని 'కోడి-గద్ద' కథ చూడవచ్చు. ఇందులో కోడి-గద్దల జాతి వైరాన్ని గురించి చెబుతాడు రచయిత.
ఈ కథల్లోని వస్తువు విషయంలో, ఎంచుకున్న పాత్రల వంటి వాటిలో వైవిధ్యాన్ని చూడవచ్చు. ఒక్కో కథలో నీతి, పిల్లలకు బోధించాలన్న తపన మనకు కనిపిస్తాయి. 'తెలివి ఒకరి సొత్తుకాదు' కథలో ఒక జిత్తులమారి నక్కకు తన తెలివితో బుద్ధి చెప్పి చిలుక కథ యిది. ఇదే కోంలో రాసిన మరో కథ 'తెలివైన చిన్నోడు'. ఇది పిల్లల్లోని సమయస్ఫూర్తికి నిదర్శనం. ఇందులోని పిల్లవాడు తన తెలివితో పెద్దలందరిని రప్పించి, చిరుతను జూ అధికారులకు అప్పగించడం కథ. కవి, రచయిత, ఉపాధ్యాయుడు, బాల వికాస కార్యకర్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి బాలల కోసం రాసిన గేయాలు, వ్యాసాలు త్వరలో అచ్చులోకి రావాలని మనమూ కోరుకుండాం. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548