Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్తుకొస్తున్నాయి. మస్తిష్కంలో జ్ఞాపకాలు సుళ్ళు తిరుగుతున్నాయి. మార్చి 19 రానే వచ్చింది. సంవత్సరకాలం ఎలా గడిచిపోయిందో. అప్పుడే స్వరాజ్యం మనల్ని అందరిని వదిలి సంవత్సరం పూర్తయిపోయింది. జగమెరిగిన నేత మల్లు స్వరాజ్యం. ఆమె గురించి తెలిసినవారు, విన్నవారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని రాసిన అదొక గ్రంథం. ఆమె జీవితమే ఒక గ్రంథం. ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆమెను సాక్షాత్కరింపచేస్తారు.
కానీ మొత్తంగా ఆమెను ఆవిష్కరించాలంటే మనం చాలా తెలుసుకోవాలి. ఆమె జీవితపు లోతుల్లోకి వెళ్లాలి. అంతకన్నా ముందు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది అదేమంటే ఒకటి ఆమె పుట్టి పెరిగిన కాలం, కుటుంబ నేపథ్యం, అప్పటి తెలంగాణ సమాజపు తీరుతెన్నులు, వేల ఎకరాల దొరల పాలనలో నలిగిపోయిన సాధారణ ప్రజల, స్త్రీల జీవితాలు, నలిచివేయబడ్డ ప్రజలు బాధలు తట్టుకోలేక తిరగబడి పోరాడిన వైనం, ప్రజల తిరుగుబాటుకు దారి తీసిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ పోరాటంలో ఆమె పాత్ర, పోరాట విరమణ తర్వాత ఆమె జీవితం. ఆమెతో పాటు ఎందరో మహిళల జీవితాలు, ఆ తదనంతర కాలంలో కుటుంబ జీవితం, ఒక రైతు మహిళగా కాడి భుజాన వేసుకోవటం ఒక్కటి మినహాయిస్తే అన్ని పనులు తన నెత్తిన పెట్టుకొని భూమిని నమ్ముకుని, దాన్ని సాగు చేసుకుని పిల్లల్ని సాకుతూనే నిరంతర రాజకీయ అధ్యయనంతో తనలో ఉన్న నాయకత్వ పరిణతికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ఒక రాజకీయవేత్తగా ఎదిగిన తీరు, అలా ఎదిగి శాసనసభలోకి అడుగుపెట్టి శాసన సభ్యురాలుగా ఆమె చేసిన కఅషి, ఆ శాసనసభ సభ్యత్వాన్ని, శాసనసభను వేదికగా చేసుకుని ప్రజా సమస్యల్ని గళమెత్తి వినిపించడంతోపాటు ప్రజలకు అండగా, పెత్తందారుల దౌర్జన్యాలను - అది నడిరోడ్డు కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా కానీ జడ విసిరి సవాలు చేసిన ధీరోదాత్తత - ఇవన్నీ మనం తెలుసుకోవాలి.
నాయకులకే నాయకుడుగా ఎదిగిన ఆమె సామర్థ్యం
1930 దేశ స్వాతంత్రం కోసం ప్రజలు ఉరుకులు పెట్టే రోజులు. 1930 లోనే మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. గుజరాత్ రాష్ట్రంలో సముద్రతీరంలోని దండి అనే ప్రాంతంలో ప్రభుత్వ నిషేధం ధిక్కరించి ఉప్పు తయారు చేయడం కోసం సాగిన ఉప్పు సత్యాగ్రహం అది. వందల మంది మహిళలు పాల్గన్నారు. ఇది దేశం మొత్తాన్ని, స్త్రీలను ఉర్రూతలూగించింది.
మన స్వరాజ్యం జన్మించింది. దేశ స్వాతంత్ర ఉద్యమానికి ఉత్తేజితులైన తల్లిదండ్రులు భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మలు ఆమెకు స్వరాజ్యం అని పేరు పెట్టారు. స్వరాజ్యం పుట్టిన ఊరు సూర్యాపేట దగ్గరలో తుంగతుర్తి తాలూకాలోని కరివిరాల కొత్తగూడెం గ్రామం. తండ్రి చిన్న భూస్వామి జనం భాషలో చెప్పాలంటే దొరోడు. అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పట్లో ఆంధ్ర మహాసభ నాయకుడు.
అప్పటికే దొరలపాలనలో ఉన్న తెలంగాణ రగులుతోంది. వందల, వేల ఎకరాల దొరలు... ఇంకా చెప్పాలంటే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అనే దొరోనికి లక్షకు పైగా ఎకరాలు ఉండేది అంట. ఇటువంటి దొరలు సాధారణ ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేశారు. స్త్రీల పట్ల, అట్టడుగు కులాల పట్ల వాళ్ళ దౌర్జన్యాలు ఇన్ని అన్ని కాదు. దొరవానికి గాని, దొర ఇంటికి వచ్చిన చుట్టానికి గాని కళ్ళల్లో ఏ ఆడదైనా పడ్డదని అంటే దాని జీవితం అయిపోయినట్లే. ప్రముఖ దర్శకుడు బి నరసింగరావు నిర్మించిన 'మా భూమి' చిత్రం నాటి తెలంగాణ పోరాటానికి అద్దం పట్టే చిత్రం. అది ఇప్పటికీ యూట్యూబ్లో దొరుకుతుంది. ఈ స్థితిలో దేశ స్వాతంత్ర ఉద్యమం ఒకవైపు మరోవైపు ఆంధ్ర మహాసభ ఇచ్చిన ఉత్తేజంతో తెలంగాణ ప్రజలు రగిలిపోయారు. చేతి కందిన రాయి, రప్ప, ఒడిసెల గుత్ప ఏది దొరికితే అది పట్టుకుని దొరల గడియల మీద పడ్డారు. భూమికోసం పోరాడిన పాలకుర్తి ఐలమ్మ వుదంతం మన కళ్ళ ఎదుట నిలిచిన సత్యం. ఐలమ్మ ఆనాటి తెలంగాణ ప్రజల తిరుగుబాటు తత్వానికి నిదర్శనం. ఈ పోరాటం అన్నిట్లోనూ అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డితో పాటు స్వరాజ్యం ఉన్నది. 11సంవత్సరాల బాలికగానే అన్న ప్రోత్సాహంతో తన స్వగ్రామంలోనే బంధువుల భూమిలో కూలీలను సమీకరించి పోరాటం చేయించింది.
దిక్కుమొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్ని కణాలై సింహనాదంతో తిరగబడ్డారు.
ఆ విధంగా 1946 నుండి 51 వరకు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మల్లు స్వరాజ్యం ఒక ముఖ్య నాయకురాలు. 14 సంవత్సరాల వయసులో దేవరుప్పలలో ఉన్న మేనత్త ఇంటికి చేరి అక్కడ నుండి పాలకుర్తి ఐలమ్మ భూ పోరాటంలో పాల్గని, అక్కడినుండి వెనుతిరిగి చూడలేదు. సూర్యాపేట, జనగామ, మానుకోట తాలూకాలు, ఖమ్మం జిల్లా పిండిప్రోలు ప్రాంతం దగ్గర్నుండి అటవీ ప్రాంతమైన ఏటూరునాగారం, ములుగు నుంచి దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బెల్లంపల్లి వరకు ఆమె రంగస్థలం. ఆ విధంగా ప్రజల్ని మేల్కల్పుతూ, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా సమీకరిస్తూ ప్రత్యక్షంగా పోరాటాల్లోను పాల్గన్నది. 1948లో పటేల్ -నెహ్రూ సైన్యాలు దిగాక వారి ఆగడాలకు అంతుపొంతు లేదు. అటవీ ప్రాంతంలో కోయ ప్రజలను సమీకరించి కోయ జనాల్లో కలిసిపోయి వాళ్ళకి అండగా నిలబడి ఆ రకంగా దళాల్లో పనిచేసింది.
వి.యన్. గారితో స్వరాజ్యం అనుబంధం
'స్వరాజ్యం, వి.ఎన్ సంసారం ఎలా ఉండేదంటే, పైకి కనిపించేది గయ్యాళి గంపలాగా నోటితో అదరగొట్టే స్వరాజ్యం, నిమ్మకు నీరెత్తినట్టు ఉండే కామ్రేడ్ వియ్యన్. కానీ వారిద్దరి మధ్య ఉన్న బంధం అతి సమీపంలో ఉండి చూసిన వాళ్లకే అర్థమయ్యేది. ఎవరు ఎక్కడున్నా, ఏ బాధ్యతలో ఉన్న ఒకరి పట్ల ఒకరికి ఉండే శ్రద్ధ తెలుస్తుంది. నిజంగా వారు' గొప్ప ప్రేమికులు'. జీవితాన్ని ప్రేమించిన వాళ్లే పరస్పర ప్రేమికులు కాగలరు. జన జీవితాన్ని ప్రేమించిన వాళ్ళకే ప్రేమ విలువ తెలిసేది. ప్రేమకు అర్థం డ్యూయెట్లు పాడుకోవటం మాత్రమే కాదు. ఒకరి లక్ష్యం పట్ల మరొకరికి శ్రద్ధ, నిబద్ధత అవసరం. అది లేకపోతే ఆ బంధం నిలవదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే దాంపత్యం అయితే ఆ ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు ఆ బంధం విడిపోవడం ఖాయం. ఉన్నా అందులో సారం ఉండదు.
తెలంగాణ పోరాటంలో మహిళల పాత్రకు మల్లు స్వరాజ్యం కఅషి ఒక నిదర్శనం. ఈ పోరాటంలో మగవాళ్ళతో పాటుగా ఏమాత్రం తీసిపోకుండా మహిళలు చేసిన కఅషి, త్యాగాలు, వారి రాజకీయ పరిణతి మాటల్లో చెప్పేది కాదు. ఎందరో మహిళలు భూస్వాముల దాడులకు, రజాకార్లు, పోలీసు, మిలిటరీ సైన్యాల దురాగతాలకు బలి పశువులు అయ్యారు. అయినా ధైర్యం విశ్వాసం కోల్పోలేదు. అంతేకాక దళాల్లో ఉన్న మహిళలు చంటి బిడ్డ ఏడుపు వింటే ఎక్కడ దళం పట్టుబడుతుందో అన్న భయంతో బిడ్డలను త్యాగం చేశారు. అందుబాటులో ఉన్న ప్రజలకి పెంచుకోమని ఇచ్చారు. వారి జీవితాంతం వారి బిడ్డలు ఎక్కడున్నారో తెలియని పద్మలు ఎంతోమంది ఉన్నారు. ఆ రకంగా ఇప్పటికి తెలంగాణ గ్రామాల్లో ఊరుకొక స్వరాజ్యం, ఊరుకొక పద్మ మనకు వెతికితే కనపడుతుంది వాళ్లకు ఈనాటి తరం రుణపడి ఉంటుంది.
1951లో సాయుధ రైతాంగ పోరాట విరమణ జరిగింది. అయితే పోరాటంలో పాల్గన్న జనానికి ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలకు పోరాట విరమణ అనంతరం బ్రతుకే ఒక పెద్ద పోరాటం అయింది. గెరిల్లా పోరాటాన్ని మించిన పోరాటమైంది. స్వరాజ్యం పరిస్థితి కూడా అదే. ఇక్కడ స్వరాజ్యం వ్యక్తిగత వివాహ జీవితం చెప్పుకోవాలి కదా. తన దళంలోని తోటి సభ్యుడుగా ఉన్న వెంకట నరసింహారెడ్డితో పోరాట అనంతరం పోరాట నాయకుల్లో ఒకరైన రావి నారాయణరెడ్డి సమక్షంలో వివాహం జరిగింది. ఆ తర్వాత జీవితంలో స్థిరపడాలి కదా. భూమిని నమ్ముకుని నానా కష్టాలు పడి భూమిని సాగులోకి తీసుకొచ్చి జీవనం సాగించింది. భార్యాభర్తల మధ్య ఒక అవగాహన. అదేమంటే పోరాట విరమణ అనంతరం పరిస్థితుల్లో వచ్చిన మార్పుల్ని అర్థం చేసుకొని ప్రజాసంఘాల, ఉద్యమాల నిర్మాణం కోసం అందరూ ప్రేమగా' వి యన్' అని పిలుచుకొనే కామ్రేడ్ వెంకట నరసింహారెడ్డి ఉద్యమానికి అంకితం అయితే, కుటుంబ బాధ్యతతో పాటు రాజకీయ జీవితాన్ని కూడా కొనసాగించింది.
కష్టాలు కన్నీళ్లకు వెరవక, సుఖాలు భోగాలకు లంగక జన రాజకీయ ఉద్యమ ప్రస్థానాన్ని సాగించిన స్వరాజ్యం జీవితం నేటి తరానికి దిక్సూచి.
- ఎస్. పుణ్యవతి,
ఐద్వా జాతీయ కోశాధికారి