Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ గుడ్డిదే కాదు మూగదీ చెవిటిదీ కూడా. ప్రేమ ప్రేమను తప్ప దేన్నీ లెక్కచెయ్యదు. ప్రేమ ప్రేమలో పడ్డప్పుడు ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించదు. కనుక ప్రేమ కళ్ళులేని కబోది. ప్రేమకు భాషలేదు కనుక మాటలూ లేవు. ప్రేమ ప్రేమలో పడ్డప్పుడు ప్రేమ తప్ప ఇంకేమీ పలుకడానికి గొంతు పెగలదు కదా. అందుకే ప్రేమ మాటలు రాని మౌనం. ప్రేమను ప్రేమగా ప్రేమించడం అందరికీ సాధ్యం కాదు. ప్రేమ ప్రేమలో పడ్డప్పుడు ఒద్దు అన్నా, కాదు కూడదు అన్నా ప్రేమకు వినిపించదు కనుక ప్రేమ ఒక సౌండు ఇంజనీర్. అనగా ఎవరు ఏమి అన్నా వినిపించుకోని చెవిటిమేళం అన్నమాట.
అయితే లోకంలో వున్న ప్రతి సంగతికీ ఒక 'ఎక్స్పైరీ' తేదీ వుంటుంది. అలాగే ప్రేమ అనే పదానికి కొత్త అర్థం వచ్చి చేరడాన్ని మనం కాదనలేం. ఒకప్పుడు ప్రేమ ప్రేమను మాత్రమే ప్రేమించేది. ప్రేమ కోసం ప్రేమ కళ్ళూ, గొంతూ చెవీ మూసుకునేది. ప్రేమ తత్వమే వేరుగా వుండేది.
ప్రేమను ప్రేమగా ప్రేమించడానికి, ప్రేమను చంపుకోకుండా వుండడానికి ప్రేమికులు తమను తాము చంపుకునేవారు. ప్రాణత్యాగం చేసైనా ప్రేమను బతికించుకునేవారు. ప్రేమే దైవం, ప్రేమే సర్వం అనుకుని సర్వస్వం వదులుకుని ప్రేమ కథల్లో శాశ్వత స్థానం సంపాదించేవారు.
ఇప్పుడు ప్రేమ ఉనికి, సైసర్గిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. వాతావరణ కాలుష్యం భూగోళాన్నే కాదు మనుషుల మనస్తత్వాన్నీ కాటేస్తున్నది. ఇప్పుడు ప్రేమ సెల్ఫోనుల్లో వినిపిస్తుంది. వాట్సప్పుల్లో కనిపిస్తుంది, ఫేస్బుక్కుల్లో వెల్లివిరుస్తుంది, మెరుస్తుంది. ఇప్పుడు ప్రేమ ప్రేమను ద్వేషిస్తుంది. ప్రేమ ప్రేమను కోపిస్తుంది. ప్రేమ ప్రేమను శపిస్తుంది. ప్రేమ ప్రేమను ముక్కలుగా కోస్తుంది. కాల్చి బూడిద చేస్తుంది. ఇప్పుడు ప్రేమ పగ అవుతుంది. ప్రేమ పిచ్చిదవుతుంది. ప్రేమ మరణశాసనం రాస్తుంది.
ప్రేమ కథలిప్పుడు గతంలోలా సుదీర్ఘంగా సాగవు. అనేక మలుపులు తిరగవు. మూడు నాల్గు ఎపిసోడ్లలో ముగిసిపోతయి. రిజల్టు తొందర్లోనే తేలిపోతుంది. అయితే 'బ్రేకప్' లేదా 'ప్యాకప్' అంతే!
అతను నూతన్, ఆమె హిమ. వాళ్ళ మధ్య ప్రేమ కాలేజీలో చిరురేసి మొగ్గేసింది. కాలేజీ బెంచీల మీద వుండాల్సిన వారు పెద్ద పెద్ద మాల్సులో సీనియర్ సిటిజన్లు కూర్చోవలసిన బెంచీల్లో తిష్ట వేసేవారు. రాత్రిళ్ళు మొబైల్ చాటింగ్ అయితే, పగళ్ళు ఫేస్బుక్ చాటింగ్. ఎవరూ లేనప్పుడు నూతన్ చెయ్యి ఆమె భజమ్మీద పడేది. హిమ 'వద్దు' అన్నట్టు చూసేది కానీ 'వద్దనేది' కాదు. క్యాలెండర్లో కాగితాలు చిరిగేయి. వాళ్ళ ప్రేమ వృక్షం అవ్వాలి కానీ నూతన్ నూతనంగా మరో అమ్మాయిని ఇష్టపడ్డం మొదలుపెట్టాడు. హిమ పేరులో వున్న చల్లదనం మాయమై మండిపోయింది. నూతన్ని నిలదీసింది. 'దిసీజ్ టూ మచ్' అంది. 'త్రీమచ్' అనుకున్నా పర్లేదు. నా టేస్టు మారింది అన్నాడు నూతన్ మొహమాటం లేకుండా ముఖంలో మార్పు లేకుండా.
ఈ కాలంలో ఏ ప్రేమయినా ప్రేమను పట్టుకుని ఎంతోకాలం వేళాడలేదు. హిమ నూతన్‌కు బ్రేకప్ చెప్పేసింది. వీళ్ళ ప్రేమ 'బ్రేకప్' కోసం వెయిట్ చేస్తున్న శివకృష్ణ ఎన్నాళ్ళగానో సైలెంట్ కిల్లర్‌లా తనను చంపేస్తున్న ఒన్‌సైడ్ ప్రేమను హిమ ముందు మోకాళ్ళ మీద కూచుని రోజా పువ్వును అందిస్తూ 'ప్రపోజ్' చేశాడు. నూతన్ ప్రేమ బ్రేకప్‌తో జ్వాలాముఖి అయిన హిమ 'అపోజ్' చెయ్యలేదు.
కథ ఇక్కడ మలుపు తిరగకపోతే బాగుండేది. కానీ విధి బలీయమైనది కదా! తన క్లాస్మేట్ తన ఫ్రెండ్ తనకు బ్రేకప్ చెప్పిన హిమ, శివకృష్ణతో మెట్రో రైల్లో పక్క పక్కనే కూచుని తిరగడం, ఫుడ్ వరల్డ్‌లో కల్సి 'సిజ్లర్' తినడం ఏమాత్రం నచ్చలేదు. నూతన్ శివకృష్ణకు నయంగా భయంగా చెప్పిచూశాడు. 'ఐ డోంట్ కేర్' అన్నాడు శివకృష్ణ. అటునుంచి నరుక్కు వద్దామని 'సెల్లు'లో వేధించాడు హిమని నూతన్. తనకు బ్రేకప్ చెప్పి శివకృష్ణతో భుజమ్మీద తల పెట్టుకు నడస్తున్న హిమ మరింత బ్యూటిఫుల్‌గా కనిపించింది 'ఐ వాంట్ హర్' అనుకున్నాడు నూతన్. ఆ మాటే శివకృష్ణతో అన్నాడు. 'మిడిల్ డ్రాప్' అయిపొమ్మని బతిమాలాడు. పోట్లాడాడు.
'బ్రేకప్ అయినా తనను నూతన్ వేధిస్తున్నాడని కన్నీళ్ళు కార్చింది హిమ. శివకృష్ణ రక్తం మరిగిపోయింది. తన ప్రేమను బతికించుకోవాలనుకున్నాడు. తను ఓ 'గుడ్ బారు' అనిపించుకోవాలనుకున్నాడు. నూతన్ మీద కసి పెంచుకున్నాడు. ఒక జానపద కథలో ప్రేయసి మొసలి కోసం కోతి గుండెను తేవడానికి ప్రయత్నించి ఫెయిలయిన మొసలిలా కాక, నమ్మించి గొంతు పిసికి, రొమ్ము చీల్చి నూతన్ గుండెను వాట్సప్ కానుకగా హిమకు పంపించాడు.
ఇలా ఓ ప్రేమ కథ నెత్తుటితో తడిసిపోయింది. కాలి బూడిదైపోయింది. టీవీ ఛానళ్ళకు 'బ్రేకింగ్ న్యూస్' అయింది.
ప్రాణాలతో నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ఆడుకోవడం, ప్రాణాలు తీసి తప్పించుకోవడం చూపిస్తున్న టీవీ షోలు మనుషుల్ని మృగాలుగా మారుస్తున్నాయని, మనిషిని మనిషి చంపే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయని గ్రహించకపోతే భవిష్యత్తు ప్రేమ కథలన్నీ 'క్రైమ్ స్టోరీస్' అయ్యే ప్రమాదం పొంచి వుంది.
- చింతపట్ల సుదర్శన్, 9299809212