Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆస్కార్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ 'నాటు నాటు' సత్తా చాటిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం బెస్ట్ డాక్యుమెంటరి షార్ట్‌ఫిల్మ్ విజేత 'దిఎలిఫెంట్ విస్పరర్స్' రెండు ఆస్కార్లతో భారతీయులకు డబుల్ ధమాకా తెలుగు సినిమా రేంజ్ పెంచిన విక్రమార్కుడు.. పాన్ ఇండియా వసూళ్ల వర్షం కురిపించిన మగధీరుడు.. తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకెళ్లిన బాహుబలి.. అతడే.. దర్శక ధీరుడు రాజమౌళి. మనసు - మమతతో అరంగేట్రం.. అన్నమయ్యతో జాతీయ పురస్కారం.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ కీర్తి కిరీటం.. అతడే.. మరకతమణిని పేరులోనే పెట్టుకున్న కీరవాణి. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని అనే స్ఫూర్తి.. మౌనంగానే ఎదగమని అని చెప్పిన జీవిత సత్యాన్వేషి.. నాటు నాటుతో ప్రపంచ సినిమాను ఏలిన రచయిత.. అతడే.. ఇప్పుడు తెలుగు పాటల బాస్.. చంద్రబోస్. మంగళ్‌హాట్, ధూల్‌పేట గల్లీల కుర్రాడు.. వినాయక ఉత్సవ మండపాల్లో పాటగాడు.. అతడే.. హైదరాబాదీ యాసలో మైమరపించే సిప్లిగంజ్. దండాలయ్యా అంటూ ప్రేక్షకుల మనసు దోచాడు.. నాటు నాటుతో ఆస్కార్ వేదికపై వీరంగం వేశాడు.. అతడే.. కీరవాణి తనయుడు కాలభైరవ.
ఆస్కార్ వేదికపై కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శన
వారి పాటకు కాలు కదిపిన హాలీవుడ్ నృత్యకళాకారులు
'నాటు నాటు'కు అవార్డు ప్రకటించగానే పెద్దగా అరుపులు
పాటయ్యాక లేచి నిలబడి కరతాళధ్వనులతో అభినందన
విశ్వవేదికపై మరోసారి భారతీయ సినీ పతాక రెపరెపలాడింది. దేశ వ్యాప్తంగా ఆర్. ఆర్. ఆర్. సినిమాలోని 'నాటు.. నాటు' పాటకి ఆస్కార్ వస్తుందా? లేదా? అని యావత్ భారతావని ఉత్కంఠ.. ఉద్విగతల నడుమ ఎదురుచూస్తున్న భారతీయులకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాటకు ఆస్కార్ పురస్కారం ప్రకటించడంతో అంతవరకు టీవీల్లో వీక్షిస్తున్న కోట్లాది భారతీయుల గుండెలు ఉప్పొంగిపోయాయి. ఈ పాటతో పాటు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ట్ ఫిల్మ్ విభాగంలో మనదేశం నుంచి నామినేట్ అయిన 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీ ఆస్కార్ ను దక్కించుకుంది. భారతీయ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం. సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ఆర్. ఆర్. ఆర్ సినిమాలోని ''నాటు.. నాటు'' పాటతో పాటు, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీ ఈ కలను సాకారం చేసాయి. ఈ అకాడమీ వేడుకల్లో ఒకే చిత్రం వివిధ కేటగిరీల్లో ఏడు పురస్కారాలను సొంత చేసుకోవడం కొసమెరుపు. 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' అనే హాలీవుడ్ చిత్రానికి ఈ గౌరవం దక్కడం విశేషం.
ప్రపంచ ప్రసిద్ధ నటీనటులందరూ తమ జీవితంలో ఒక్కసారైనా సాధించాలనుకుని, కలలు కనే పురస్కారం అదే అద్వితీయ ఆస్కార్. ఆస్కార్ వేదిక నుంచి ఈ ఏడాది రెండు శుభ వార్తలు. ఒకటి.. 'నాటు నాటు' పాటకు వచ్చిన అవార్డు కాగా, మరొకటి మనదేశానికి చెందిన కార్తీకి గొన్సాల్వెజ్, గునీత్ మోంగా తీసిన 'ద ఎలిఫెంట్ విష్పరర్స్'కు ఉత్తమ డాక్యుమెంటరీ లఘుచిత్రం విభాగంలో అవార్డు రావడం.
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికా లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో తారల తళుకుబెళుకుల నడుమ అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాతో పాటు ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' చిత్రానికి సైతం ఆస్కార్ వరించింది. ఈ ఏడాది రెండు పురస్కారాలతో ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటింది. 'నాటు నాటు' పాటకు సంగీత దర్శకత్వం వహించిన ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ భుజంభుజం కలిపి వేదికనెక్కి పురస్కారాలను అందుకున్న దృశ్యం.. 'పుట్ మి ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్' అంటూ కీరవాణి పాడిన పాట. అంతకుముందు ఆస్కార్ అవార్డుల వేదికపై నాటు నాటు పాటను లైవ్ ఫెర్ఫార్మెన్స్లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి ఆలపిస్తుండగా.. హాలీవుడ్ నటులు లయబద్ధంగా కాలు కదిపిన తీరు కనులవిందు చేసింది. పాట ముగియగానే డాల్బీ థియేటర్ లో ఆసీనులైన ప్రతి ఒక్కరూ లేచి నిల్చొని చప్పట్లు చరిచిన అపూర్వ దృశ్యం భారతీయుల ప్రతిభను, ప్రతిష్టను మరింత ఇనుమడింప జేసింది. బాలీవుడ్ అందాలభామ దీపికా పదుకోనే వేదికపై నాటునాటు పాటను ప్రపంచానికి పరిచయం చేశారు.
బెస్ట్ డాక్యుమెంటరి షార్ట్‌ఫిల్మ్ విజేతగా 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 95వ అకాడమీ వేడుకల్లో బెస్ట్ డాక్యుమెంటరి షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' విజేతగా నిలిచింది. ఈ చిత్రాన్ని గురునీత్ మోంగ నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని కార్తీక్ గోన్స్లేవ్స్ డైరెక్ట్ చేశారు. హాల్ ఔట్, మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్లతో ది ఎలిఫెంట్ విస్పరర్స్ పోటీ పడి ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఈ ఏడాది భారత దేశం తరపున తొలి అవార్డు ఈ షార్ట్ ఫిల్మ్ దక్కించుకోవటం విశేషం. మదుమలై నేషనల్ పార్క్ బ్యాక్‌డ్రాప్‌లో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' తెరకెక్కిన ఈ డాక్యుమెంటరి 2022లో నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైంది. బొమ్మన్, బెల్లీ అనే దంపతులు ఓ ఏనుగు పిల్లను పెంచుకుంటారు. దానికి రఘు అనే పేరు పెట్టుకుంటారు. ఈ సినిమాలో వారి మధ్య అనుబంధాన్ని, ప్రేమను తెలియజేస్తు, అడవి అందాలను ఈ డాక్యుమెంటరి లో అద్భుతంగా చూపించారు. దర్శకురాలు కార్తీక్ గోన్స్లేవ్స్ అటవీ ప్రాంతంలో పుట్టి పెరగడంతో ఆమెకు వన్య ప్రాణులపై ఎక్కడ లేని అవగాహన, ప్రేమ ఉంది. పర్యావరణం, వన్యప్రాణులు, ప్రకృతి చిత్రాల ద్వారా జీవావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంగా మొత్తం 42 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రంలో కనిపించేది కేవలం రెండు ఏనుగులు, ఇద్దరు వ్యక్తులు మాత్రమే. ఇందుకోసం కార్తికి ఏకంగా 450 గంటల ఫుటేజీని చిత్రీకరించారు. అంతర్జాతీయ పురస్కారం అందుకున్నా ఈ 'షార్ట్ ఫిల్మ్ నిర్మాత గునీత్ మోగ. ఈమె కూడా ఓ మహిళే కావడం గమనార్హం.
'నాటు నాటు'తో పోటీ పడిన పాటలు
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలోని ''నాటు నాటు'' పాటకు ఆస్కార్ అవార్డ్ అంత తేలికగా రాలేదు. గట్టి పోటీని ఎదుర్కొవాల్సి వచ్చింది. ముఖ్యంగా లేడీ గాగా, రిహన్నా వంటి టాప్ సింగర్స్ పోటీలో ఉండడంతో ఆఖరి క్షణం వరకూ ''నాటు నాటు'' పాటకు ఉత్కంఠ తప్పలేదు. టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' చిత్రంలో సోఫియా కార్సన్ పాడిన 'అప్పల్య్యేజ్' పాట, 'బ్లాక్ పాంథర్ ..వకండా ఫరెవర్' చిత్రంలో రిహానా పాడిన ''లిఫ్ట్ మీ అప్'', 'టాప్ గన్ మార్విక్'లో లేడీ గాగా పాడిన ''హౌల్డ్ చై హాండ్'', 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ల్ ఎట్ వన్స్' చిత్రంలో రేయాన్ లాట్ పాడిన ''దిస్ ఈజ్ ఎ లైఫ్'' పాటలు గట్టి పోటీ ఇచ్చినా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలోని ''నాటు నాటు'' పాట ఆస్కార్ సాధించి, తెలుగు సినిమా సత్తా చాటింది.
ఆస్కార్ అవార్డు వెనుక కార్తికేయ
ఆస్కార్ కంటే ముందే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ''నాటు.. నాటు'' పాట ఇంకొన్ని అవార్డులు కూడా సాధించింది. అయితే ఆస్కార్ అవార్డు తీసుకుంటూ కీరవాణి కార్తికేయకు ప్రత్యేక కతజ్ఞతలు ఎందుకు చెప్పాడనేది సర్వత్రా ఆసక్తిని కలిగించింది. అయితే కార్తికేయ ఎవరో కాదు. దర్శకుడు రాజమౌళి కుమారుడు. ఈ సినిమా సెకండ్ యూనిట్ దర్శకుడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాను 'ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌కు ఎంపిక చేయలేదు. దాంతో 'ఆర్ఆర్ఆర్' టీమ్ నిరాశకు లోనైంది. భారతదేశం నుంచి అధికారికంగా ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కాకపోవడంతో కార్తికేయ రంగంలో దిగాడు. దేశం నుంచి ఎంపిక కానప్పుడు సొంతంగా ఫారిన్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. కార్తికేయ 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఫారిన్ ఎంట్రీలో ఆస్కార్ నామినేషన్‌కు పంపించాడు. అంతేకాకుండా, బెస్ట్ ఒరిజినల్ కేటగరీలో ''నాటు నాటు'' పాటను ప్రత్యేకంగా పంపించాడు. పంపించి వదిలి వేయకుండా.. 'ఆర్ఆర్ఆర్' సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నాడు. అమెరికాలో అత్యధికులకు ఈ సినిమా చేరేలా మార్కెటింగ్ స్ట్రాటెజీలు అవలంభించాడు. ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కేలా చేశాడు. ఈ అవార్డు ఆధారంగా క్యాంపెయినింగ్ మరింత ముమ్మరం చేశాడు. ఆస్కార్ తుది నామినేషన్స్‌కు వెళ్లడం ఆ తరువాత మిగిలిన పాటల్ని వెనక్కి నెట్టి అవార్డు సాధించేవరకూ చాలా వర్క్ చేశాడు కార్తికేయ. ఓ గొప్ప సినిమాను తండ్రి తెరకెక్కిస్తే.. ఆ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో కొడుకు కీలకపాత్ర పోషించాడు. అందుకే కీరవాణి ఆస్కార్ వేదికపై కార్తికేయకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
'ఆర్ఆర్ఆర్'ను భారత ప్రభుత్వం అధికారికంగా పంపలేదు
ఉత్తరాది సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యతను భారత ప్రభుత్వం దక్షిణాది సినిమాలకు ఇవ్వడం లేదనే విమర్శను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్.ఆర్.ఆర్ సినిమాను అధికారికంగా ఆస్కార్ కు పంపించలేదు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమాను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా తరపున ఎంపిక చేయకుండా, ఎఫ్ఎఫ్ఐ ప్రతినిధులు. ఆర్.ఆర్.ఆర్ సినిమా స్థానంలో గుజరాతీ సినిమా 'ఛెల్లో షో'ను ఎంపిక చేసింది. ఈ గుజరాత్ సినిమా 'ఛెల్లో షో' ను ఆస్కార్‌కు భారత ప్రభుత్వం అధికారికంగా పంపించిన అ చిత్రం ఆస్కార్ ఎంట్రీ కూడా పొందలేక పోయింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇండియా తరపున నామినేట్ కాకపోవడంతో ఫారిన్ ఎంట్రీ కింద ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఈ సినిమా నిర్మాతలే సొంతంగా పంపించుకున్నారు. ఇక ఆ తరువాత అన్ని దశలు దాటి ఈ చిత్రంలోని ''నాటు.. నాటు'' పాట ఆస్కార్ కైవసం చేసుకుంది.
'ఎవ్రీథింగ్'... సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులు
ఈ ఏడాది మొత్తం 11 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమా.. ఏడు విభాగాల్లో పురస్కారాలు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో నటించిన మిషెల్ యో (ఈవిడ మలేషియన్ నటి) ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఒక ఆసియన్ నటికి ఆస్కార్ ఉత్తమనటి పురస్కారం రావడం ఈ అవార్డుల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతేకాదు.. గడిచిన 20 ఏళ్లలో ఒక శ్వేత జాతేతర మహిళకు ఈ అవార్డు రావడం కూడా ఇదే ప్రథమం. ఉత్తమ సహాయనటుడు, సహాయ నటి అవార్డులు కూడా ఆ చిత్రంలో నటించినవారికే వచ్చాయి. 'ద వేల్' సినిమాలో ఉత్తమ నటన కనబరిచినందుకుగాను ఈ ఏటి ఉత్తమ నటుడు విభాగంలో ఆయనకు ఆస్కార్ వచ్చింది. ఇక.. 'ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్' చిత్రం నాలుగు విభాగాల్లో ఆస్కార్లు సాధించడం విశేషం.
భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులు పొందిన వారు
ఆస్కార్.. ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డు. ఏ దేశానికి చెందిన యాక్టర్ అయినా.. డైరెక్టర్ అయినా.. సినిమాలకు చెందిన ఇతర టెక్నీషియన్ అయినా.. ఆస్కార్ సాధించాలని, ఆస్కార్ అవార్డు అందుకోవాలని లేదా.. కనీసం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు 94 ఆస్కార్ వేడుకలు జరగ్గా.. ఈ వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నటులు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లు అవార్డులను దక్కించుకున్నారు. అయితే భారతదేశం నుంచి ఇంత వరకు ఐదుగురు మాత్రమే ఆస్కార్ అవార్డును సాధించారు. భాను అథియా, ఏఆర్ రెహమాన్, గుల్జార్, రెసూల్ పోకుట్టి ఈ అవార్డును సాధించినప్పటికీ.. వారు పనిచేసింది భారతీయ చిత్రాలకు కాదు. ఉదాహరణకు.. బ్రిటన్‌కు చెందిన నటుడు, దర్శకనిర్మాత రిచర్డ్ అటెన్‌బరో తీసిన 'గాంధీ' చిత్రానికిగాను ఉత్తమ 'కాస్ట్యూమ్ డిజైనర్'గా పనిచేసిన భాను అథియా.. 'జాన్ మొల్లో'తో కలిసి సంయుక్తంగా ఆస్కార్‌ను అందుకున్నారు. ఆ సినిమా నేపథ్యం మన గాంధీ మహాత్ముడిదే అయినా, నిర్మాత, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు అత్యధికులు ఆంగ్లేయులే! మిగతా మూడు 'ఆస్కార్' అవార్డులూ 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి పనిచేసిన ఏఆర్ రెహమాన్, గుల్జార్, రెసూల్ పోకుట్టికి వచ్చాయి. అయితే.. ఆ సినిమా కూడా పూర్తిగా బ్రిటిష్ సంస్థ తీసినదే! ఇక దర్శక దిగ్గజం 'సత్యజిత్ రే'కు కూడా ఆస్కార్ వచ్చినప్పటికీ అది గౌరవ పురస్కారం మాత్రమే. ఆ లెక్కన చూసుకుంటే.. ఇప్పటిదాకా పూర్తిగా భారతీయ చిత్రానికి ఆస్కార్ రావడం ఇదే తొలిసారి.
భాను అథియా ( బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్)
మన దేశం నుంచి ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి భాను అథియా. 1982లో రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వంలో తెరకెక్కిన 'గాంధీ' చిత్రంలోని ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలో 1983లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. 100 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన భాను అథియా ఎంతో మంది బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసింది.
ఆస్కార్ అవార్డుల ప్రస్థానం
ఆస్కార్ అవార్డులు 1929 నుంచి ఆరంభించినప్పటికీ, ఈ పోటీలకు మనదేశం తరపున ఎంట్రీలను పంపడం 1957 నుంచే ప్రారంభమైంది. అంతకుముందు ఈ అవార్డులను బ్రిటిష్ వలసవాద భావజాలానికి సంకేతాలుగా భావించడం వల్లనో, హలీవుడ్ స్థాయి సినిమాలను సృష్టించలేమనే భావన వల్లనో, అసలు ఈ వేడుకల్లో పాల్గొనాలనే ఆలోచన కూడా లేకపోవడం వల్లనో.. మొత్తంమీద భారతీయ సినిమా ఈ పోటీల్లో పొల్గొనలేదు. కానీ ఇన్ని ఆటంకాలను అధిగమించి ఆస్కార్‌లో భారతీయ ముద్రను చూపించాలనే దిశగా తొలి అడుగు వేసింది 'మదర్ ఇండియా' చిత్రం. ఈ సినిమా 1957లో ఆస్కార్ అవార్డుల విదేశీ చిత్ర కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయిన అయిదు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అప్పటినుంచీ ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డుల కోసం మనదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఒక సినిమాను ఎంపిక చేసి పోటీలకు పంపించడం ఆనవాయితీగా మారింది. ఇక ఆనాటి నుండి ఆస్కార్ పురస్కారం కోసం భారతీయ చిత్రాలనూ పోటీ పడుతూనే ఉన్నాయి. వాటిలో 1988లో మీరానాయర్ దర్శకత్వంలో వచ్చిన 'సలాం బాంబే' సినిమా. ముంబై రెడ్‌లైట్ ఏరియాలు, మురికివాడల్లోని బాలల జీవనస్థితిగతులను వాస్తవ దృశ్యంగా మలిచిన ఈ సినిమాలోని ప్రధాన పాత్ర అయిన బాలనటుడి కోసం మీరా.. ముంబై ధారవి ప్రాంతంలోని అనాథ బాలుడినే ఎంపిక చేసి, శిక్షణనిచ్చి ఆ పాత్రలో నటింపజేసింది. సలాం బాంబే తర్వాత చాలా ఏళ్లకు 2001లో మళ్లీ ఓ భారతీయ సినిమా ఆస్కార్ పోటీల్లో షార్ట్ లిస్ట్ అయి నామినేషన్ సాధించింది. అదే...'లగాన్'. ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్రిటీష్ కాలం నాటి పీరియడ్ డ్రామాగా దేశభక్తిని, గ్రామీణ జీవన పోరాటం, క్రికెట్ ఆటనేపథ్యంగా తెరకెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారతీయ ప్రేక్షకుల కోసం పాటలు, నత్యాలతో కూడిన ఈ సినిమాని ఆస్కార్ పోటీల కోసం వాటన్నిటీ తొలగించి పంపించారు. అయితే విదేశీ చిత్ర విభాగంలో ఇప్పటివరకూ మనదేశం నుంచి మూడు సినిమాలు మాత్రమే నామినేషన్ సాధించనప్పటికీ ఒక్క సినిమాకు కూడా అవార్డు దక్కకపోవడం తీరని వెలితే! అయితే కథాచిత్రాల విభాగంలోనే కాక షార్ట్‌ఫిలిం కేటగిరీల్లో కూడా మన భారతీయ సినిమాలు నామినేషన్స్‌ను సాదించాయి. ఈ కేటగిరీలో ఇప్పటివరకూ నాలుగు సినిమాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. 2008లో 'స్మైల్ పింకీ' అనే లఘు చిత్రంతో ఈ ప్రస్థానం అందరి దృష్టినీ ఆకర్షించింది. మారుమూల పల్లెలో గ్రహణ మొర్రితో జన్మించిన ఓ బాలిక సర్జరీ కోససం నగరానికి రావడంలో జరిగిన సంఘటనలే ఈ లఘుచిత్ర కథ. అలాగే 2005లో 'లిటిల్ టెర్రరిస్ట్', 2010లో 'కవి' అనే షార్ట్ ఫిలింస్ ఆస్కార్ షార్ట్ ఫిలిం కేటగిరిలో నామినేషన్‌ను సాధించాయి. 2012లో 'రాజు' అనే సినిమా ఈ అరుదైన ఘనతను సాధించింది. రంగస్థల దర్శకురాలు తరుణ్‌జీత్ కౌర్ దర్శకత్వం వహించిన ఈ లఘు చిత్రం కోల్‌కతా మురికివాడల్లోని ఓ అనాథ పిల్లాడిని దత్తత తీసుకునే జర్మన్ దంపతల కథగా తెరకెక్కింది. అయితే ఇవేవీ ఆస్కార్ అవార్డును సాధించలేక పోయాయి.
తెలుగు సినిమాలకు ఆస్కార్ రావాలని ప్రేక్షకులు ఎన్నో కలలు కన్నారు. ఆ కల నిజం కావడానికి ఇన్నేళ్లు పట్టింది. అయితే ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలకు ఆస్కార్ దిశగా అడుగులు పడే అవకాశముంది. టాలెంట్ ఉన్న ఎంతోమంది దర్శకులు తమ సినిమాలకు కూడా ఆస్కార్ అవార్డ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఆస్కార్ లో తెలుగు సినిమాల హవా మొదలైనట్టేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడంతో ప్రతి తెలుగోడు గర్వించే సమయం ఇదేనంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్ మన దేశ కీర్తి ప్రతిష్టలను సైతం మరింత పెంచింది. కమర్షియల్ సినిమాలతో ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకోవచ్చని నాటు నాటు సాంగ్ ప్రూవ్ చేసింది.
సత్యజిత్ రే (హానరీ అవార్డు)
భారతీయ సినిమాకు తొలిసారిగా అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడంతోపాటు, బెంగాలీ సినిమా రంగంలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన సత్యజిత్ రే సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా అకాడెమీ సత్యజిత్ రే కు 1992లో ఆస్కార్ లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ గౌరవ పురస్కారం అందించింది. పాథేర్ పంచాలీ సినిమాతో ఫిల్మ్ఇండిస్టీలో డైరెక్టర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన ఆయన.. ఎన్నో విజయవంతమైన... అద్భుతమైన సినిమాలను రూపొందించారు.
గుల్జర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)
ప్రపంచాన్నే ఊపేసిన స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలోని 'జయహౌ' పాటను ప్రముఖ రైటర్ గుల్జర్ రాశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ రాసినందుకు గాను, గుల్జర్ 2009 లో ఆస్కార్ అవార్డును అందుకున్నారు.
ఏఆర్. రెహమాన్ (ఒరిజినల్ స్కోర్, ట్రాక్)
'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాకు గానూ ఏ.ఆర్ రెహమాన్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. డైరెక్టర్ డానీ బోయెల్ తెరకెక్కించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమా 81వ ఆస్కార్ ఉత్సవాల్లో ఒరిజినల్ స్కోర్, ట్రాక్ విభాగాల్లో 'జయహౌ' పాటకు ఏ.ఆర్ రెహమాన్ 2009లో రెండు ఆస్కార్లను సొంతం చేసుకున్నాడు.
రెసూల్ పూకుట్టి ( బెస్ట్ సౌండ్ మిక్సింగ్)
ఇక 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి సౌండ్ ఇంజనీర్ గా పని చేసిన రెసూల్ పూకుట్టి.. 81వ ఆస్కార్ ఉత్సవాల్లో బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకున్నారు.
-పొన్నం రవిచంద్ర,
9440077499