Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నివాళి' యెన్నా శ్రీనివాసరివు' అన్న టైటిల్ గల 64 పేజీల చిన్న పొత్తం, అట్టమీది బొమ్మ చూడగానే, ఆత్మీయతా భావం కలుగుతుంది. శాంతి కాసారాల్లాంటి కళ్ళు, వాటిలో కనిపించే స్వచ్ఛత అమాయకంగా కనిపిస్తూ ఆకట్టుకుంటారు. లోపలి అట్టపై ఆయన నిలువెత్తు బొమ్మ భుజాన ఖాదీ సంచి, రెండు మడతలు పైకి మడిచిన స్లీవ్స్, కొద్దిగా ఎడం వేపు తల వంచి చిరునవ్వు చిందిస్తోన్న ఆయన ఎన్నాళ్ళ నుండో పరిచయం ఎన్న వ్యక్తిలా కనిపిస్తారు.
ఆయన ఓ జర్నలిస్టు అని, నిబద్దత, నిఖ్ఖచ్చితనం, నిస్వార్థత, సాటివారి యెడ ప్రేమ, భూతదయ, పై అధికారుల పట్ల గౌరవం, అయినా, తల వంచనితనం కనబరిచే మానవతావాదిగా లోపలి పేజీల్లో తెలుసుకుంటాం.
జర్నలిజంలో కాకలు తీరిన ఎం.వి.ఆర్. శాస్త్రి, నరేస్ నున్నా, పి. విజయబాబు, కల్లూరి భాస్కరం లాంటి ఇరవయి ఆరుగురు అక్షర యోధులు చిత్రీకరించిన ఆయన వ్యక్తిత్వాన్ని, జీవన విధానాన్ని, వృత్తి బాధ్యతల పట్ల చూపే గౌరవాన్ని వివరిస్తూ, 55 ఏళ్ళ పిన్న వయసులో 2021 లో కరోనాకాటుకు బలైన శ్రీనివాసరావు గురించి చదివిన పాఠకుడి గుండె తడి అవక తప్పదు.
'వైయస్సార్' అని ప్రేమ భక్తి భావంతో, తోటి జర్నలిస్టుల చేత పిలవబడే శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వెలివరించ బడిన 'నివాళి' చదివిన పాఠకులకు చేస్తున్నది ఏ ఉద్యోగమైనా, వృత్తి అయినా, వ్యాపార, వ్యాపకమైనా ఎలా నిర్వహించాలో తెలుస్తుంది.
కోవిడ్ వల్ల వైయస్సార్ కన్ను మూసారని తెలియగానే కొంతమంది మిత్రులు ఆయనతో తమ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ జ్ఞాపకాలను ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా, ఆయన మిత్రుడు నర్రే గంగాధర్ చిలుకూరి రమణారావు గార్లు ఈ పుస్తక రూపంలో అక్షర బద్దం గావించి ఎన్నా శ్రీనివాసరావుగారికి తరతరాలకూ నిలిచి పోయేలా చేసారు.
ఈ 'నివాళి' చరివిన పాఠకులకు వైయస్సార్ గురించి నమ్మిన సిద్ధాంతాలకు, విలువలకు ఎలా కట్టుబడి ఉండేవారో ఆయన కర్మయోగి తత్వం స్థిత ప్రజ్ఞత గురించి తెలుస్తుంది.
శ్రీనివాసరావుగారి ప్రత్యేకతలు
పాతికేళ్ల క్రితం అటల్ బిహారీవాజ్పేయి హైద్రాబాద్ లో కొద్ది సేపు ఆగారు. వైయస్సార్ ఆయనతో ఇంటర్వూకు పట్టుపట్టారు. అయిదే నిమిషాలు ఇచ్చారు వాజ్పాయిగారు. అయిదు నిమిషాల సంభాషణ తరువాత మరో అయిదు నిమిషాలిచ్చారు వాజ్పాయి గారు ''మీ సమయం విలువైనది నాకు ఈ అయిదు నిమిషాలు చాలు'' అన్నారు రావుగారు. ఆ తరువాత వాజ్పారు ఇష్టుడిల్లో శ్రీనివాసరావు ఒకరయ్యారు.
వీరు బి.జే.పీ ఆరెస్సెస్ మితవాది ఏమీ కాదు. నిబద్దతగల ఆర్య సామాజికుడు. అందరికీ సాయపడే వాడే కానీ ఎవరైనా సాయానికి ముందుకు వస్తే సున్నితంగా తిరస్కరించే వారు.
అందరి పట్లా వినయంగా ఉండేవారు, ఎవరైనా తనను అసభ్యంగా తూలనాడితే, పై ఉద్యోగి అయినా, చీల్చి చెండాడే వారు. ఏ ప్రెస్ మీట్ కి వెళ్ళినా వెంట తెచ్చుకున్న అహారాన్ని మాత్రమే తీసుకునేవారు.
వృత్తి నిర్వహణలో ఎంతటి ఛాలెంజ్నైనా స్వీకరించి ఎంతటి అసాధ్యాన్నయినా సుసాధ్యం చేసేవారు. రిపోర్టులు ప్రామాణిరంగా, సొగసుగా సాధికారంగా రాస్తారు. ఎంతటి పెద్ద వ్యక్తి గురించి అయినా, నిజాలను నిర్భీతిగా బయట పెట్టేవారు.
అంతర్ముఖుడు తాత్విక చింతన గలవాడు తన లోతుచూపు ఆలోచన ఏమిటన్నవి ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు.
ఓసారి అర్ధరాత్రి స్కూటర్లో పెట్రోలు అయిపోయింది తోసుకుంటూ వెళ్ళి కాసేపటికి తోసుకుంటూ వచ్చారు. దోవలో ఎవరో క్షుదార్తికి తనవద్దనున్న 60 రూపాయలూ ఇచ్చివచ్చారు.
జర్నలిజమే కాదు ఆయుర్వేదమూ తెలుసు. తరుచుగా శ్రీశైలం ఆడవులకు వెళ్ళి మూలికలు సేకరించేవారు. స్వయంగా ఒక గిరిజన అమ్మాయిని దత్తత తీసుకుని నీడనిచ్చి చదువు చెప్పించారు.
హిందూ పురాణేతి హాసాలు ఎంత బాగా తెలుసో, అంతే బాగా గ్రీకు దేవతల గురించి తత్త్వవేత్తల గురించి తెలుసు. సంస్కృతంలో మంచి పట్టు ఉంది.
ఆయన రాతలు కుతంత్ర జీవితాల ఆంతర్యాలు ఎత్తి చూపేవి. మేధో వర్గాల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించేవి.
ఓ ముస్లిం పండగ సందర్భంలో వధ నిమిత్తం రాజస్థాన్ నుంచి ఒంటెల బిడారు వస్తున్న సంగతి తెలిసిన వీరు జహీరాబాద్ ప్రాంతంలోనే ఆపించారు. బిగారుతో వచ్చిన వారివద్ద తినటానికి కూడా డబ్బులు లేవని తెలిసి తన పర్సులో ఉన్న మొత్తమూ దానం చేసారు.
ఆయన వెంట ఎప్పుడూ కొన్ని బిస్కెట్ పేకెట్లు ఉండేవి. దోవలో కనిపించిన వీధి కుక్కలకు, అన్నార్ధులకు పంచేవాడు.
ఇందరితో ఇంతటి ఆత్మీయంగా ఉన్నా తన వ్యక్తిగత జీవితం ఎవరికీ తెలియదు. ఒకవేళ అడిగినా చిరునవ్వుతో దాట వేసేవారు. ఈ రసప్లావిత జీవిత విషయాలు చదువుతూ చివరిపేజీకి వచ్చే సరికి పాఠకుడి గుండె బరువెక్కుతుంది. మనసు ఆర్థ్రమవుతుంది. ఇలాంటి వారు ఇంకా లోకంలో ఉన్నారు కనుకనే ధర్మం ఈ మాత్రం మిగిలిఉంది అని విశ్వసిస్తాడు.
- కూరచిదంబరం, 8639338675
(నివాళి యెన్నా శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా తెచ్చిన జ్ఞాపకాల సమాహారం, వెల ఇవ్వలేదు. ప్రతులకు వర్రే నాగేందర్
ఫోః 9492433318)