Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏళ్లుగా ఎన్నో కళా ప్రదర్శనలకు చిరునామాగా మారిన రవీంద్రభారతి వేదిక ముందు హౌస్‌ఫుల్ బోర్డు చూసి ఎన్నాళ్లవుతోంది..? అదీ యువకుల నాటక ప్రదర్శనకు..! అవును నిజమే, అంత మంది జనమొస్తున్నారు. నాటకమంటే కనిపించే వయోధికులు కాదు అంతా యువతే. చూసే వాళ్లు, చేసేవాళ్లూనూ.. ఇదొక్కటే కాదు రంగ భూమి, లమాకాన్, ఆవర్ సాక్రెడ్ స్పేస్, ఫీనిక్స్ ఎరీనా.. ఇలా అన్ని వేదికలూ కళకళలాడుతున్నాయి. మూసధోరణి కథలకు ముగింపు చెప్పి సరికొత్త సాంకేతికతలతో, ఆధునికతను జోడించి సమాజానకి దగ్గరయ్యే కథలతో ముందుకొస్తున్నారు రచయితలు, నటీనటులు.
హెచ్.సియూ, తెలుగు యూనివర్సిటీ, నిజాం కళాశాలలు థియేటర్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాయి. ఇక్కడి ఒక్కో కేంద్రం నుంచి ఏటా 50 మంది విద్యార్థులు పీజీ, ఎంఫిల్ పట్టాలతో బయటికొస్తున్నారంటే వీటికి ఎంత ఆదరణ ఉందో అర్ధంచేసుకోవచ్చు. సినిమాలు, లఘుచిత్రాల్లోనూ వీరికే విస్తత అవకాశాలు దక్కుతున్నాయి.
నవ్యతకు ప్రాణంపోస్తున్న సాహిత్యకారులు
గతంలో నాటకమంటే మూసధోరణిలో సాగే పౌరాణికాలే తెలుసు. కానీ, ఇప్పుడు వాటికి తెలుగు సాహిత్యకారులు, కవులు, రచయితలు కొత్త కథలతో జీవం పోస్తున్నారు. మహ్మద్ ఖదీర్ బాబు, మెర్సీమార్గరెట్, ఇండ్ల చంద్రశేఖర్, అనంతు చింతలపల్లిలాంటి రచయితలెందరో వీటిలో భాగమై బతుకు పాఠాలు చెబుతున్నారు. అసమర్థుడు, గొల్లరామవ్వ, న్యూబాంబే టైలర్స్, లాంటి కథల్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు.
ఎన్నో కేంద్రాలు: కళా ప్రదర్శనలంటే రవీంధ్రభారతి ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు నలు మూలలా తక్కువ ఖర్చులోనే వేదికలొస్తున్నాయి. గచ్చిబౌలి రంగభూమి, ఫీనిక్స్ ఎరీనా, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సికింద్రాబాద్ అవర్ సాక్రెడ్ స్పేస్, లమాకాన్, నత్య ఫోరం ఫర్ పర్ఫామింగ్ ఆర్ట్స్, సప్తపర్ణి లాంటి ఎన్నో కళావేదికలవుతున్నాయి.
'క్రియేటివ్ థియేటర్' సంస్థను 2016లో స్థాపించి నాటక రంగంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాడు యువకుడు అజరు మంకెనపల్లి. తానే స్వయంగా నాటకాలు రచించి దర్శకత్వం వహించి థియేటర్ అభివద్ధికి కషి చేస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ సహకారంతో నాటకరంగంలో పరిశోధన చేస్తున్న అజరు, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాటకాల్లో శిక్షణనిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన గొల్ల రామవ్వ కథను నాటకీకరించారు. అంతేకాదు, ఆ నాటకానికి దర్శకత్వం వహించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. రఘుబాబు జాతీయ నాటకోత్సవాలలో గొల్ల రామవ్వ నాటకానికి ఉత్తమ ప్రతినాయకుడు, బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్‌గా రెండు అవార్డులు అందుకున్నారు. ఎన్నో నాటకాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 500 మందికి పైగా నేటి తరం నూతన నటీనటులకు శిక్షణ ఇచ్చి నటనపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. నాటకరంగం లోనే కాకుండా తనదైన ముద్రను సినిమారంగంలో ఉండేలా అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సీటీలో పీహెచ్.డి. చేస్తున్న జాన్ బషీర్ వంటి వారు నాటకం పై అభిమానంతో న్యూబాంబే టైలర్స్ వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.
అసమర్థుడు నాటకం
అంబరుడు అనే ఒక పేరు మోసిన వ్యాపారికి ప్రవీణుడు అనే కొడుకున్నాడు. ప్రవీడు అతిగారాబంతో పెరగటం వల్ల చదువు సంధ్యలు అబ్బకపోగా స్నేహితులు చెప్పినట్టు వినే వాడు. ప్రవీణుడుకి పెళ్లి చేయటం కూడా ఇష్టం లేని అంబరుడు, భార్య సుభద్ర పోరు భరించలేక ఒక పరీక్ష పెడతాడు. ప్రవీణుడు ఆ పరీక్షని తరంగిణి అనే కంసాలి నారాయణ కూతురు సహాయంతో నెగ్గుతాడు. కానీ అంబరుడికి కొడుకు తెలివి తేటలతో పరిచయం ఉండటం వల్ల అది కొడుకు స్వయంగా చేయలేదనీ. ఎవరి సహాయం తీసుకుని ఆ పరీక్ష నెగ్గాడో కనుక్కుంటాడు. నేరుగా తరంగిణి వాళ్ళ ఇంటికి వెళ్లి తరంగిణితో ప్రవీణుడి వివాహం గురించి మాట్లాడతాడు. తరంగిణి తల్లిదండ్రులు సంతోషంగా ఒప్పుకుంటారు. స్నేహితుల మాటలు వినే ప్రవీణుడు తరంగిణి కుటుంబం కేవలం ఆస్తి కోసమే పెళ్లికి ఒప్పుకుందని భావించి మామ కంసాలి నారాయణ దగ్గరకి వెళ్ళి ఒక షరతు పెడతాడు. ఆ షరతుకి ఒప్పుకుంటేనే పెళ్లి అంటాడు. ఆ షరతు ఏంటంటే రోజు తరంగిణిని 7 సార్లు చెప్పుతో కొట్టడం. ఆ ఆలోచన ప్రవీణుడుకి వచ్చిన ఆలోచన కాదని తరంగిణి గ్రహించి పెళ్లికి ఒప్పుకుంటుంది, పెళ్లికి ఒప్పుకున్న తరంగిణి చెప్పు దెబ్బలను ఎలా తప్పించుకుంది? పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్న భర్తని తన పెంపుడు కుక్క సహాయంతో ఎలా రక్షించుకుంది. మూరు?డు తలబిరుసు ఉన్న భర్త ప్రవీణుడికీ ఎలా బుద్ధి వచ్చేలా చేసింది అన్నదే కథ.
ముద్దా ఘాతక్ హై
పంతొమ్మిది మంది అమ్మాయిలు ఆజాది.. ఆజాది... ఆజాది... అంటూ ఒక్క సారిగా నినదిస్తుంటే... చూసే వారందరి రోమాలు నిక్క బొడుచుకుంటాయి. ఎందుకు వీళ్ళకు ఆజాది. ఎవరి నుండి కావాలి ఆజాది. 'వివక్ష నుండి ఆజాది... మహిళలను అణిచి వేస్తున్న మనుధర్మ శాస్త్రాల నుండి ఆజాది... పక్షపాత బుద్ధి నుండి ఆజాది... సాంప్రదాయాల పేరుతో ఆడపిల్లకు సంకెళ్ళు వేస్తున్న వారి నుండి ఆజాది... ' కోరుకుంటున్నారు.
వీరంతా హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల అమ్మాయిలు. అందరూ అదే కళాశాలలో వివిధ కోర్సులు చదువుతున్నారు. మన దగ్గర వీధి నాటికలకు పెద్దగా ఆదరణ లేదు. చూసేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపరు. వీరు తమ కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతో ఓ థియేటర్ క్లబ్‌గా ఏర్పడి అప్పుడప్పుడు పోటీల్లో పాల్గొంటారు. 2018 ఆగస్టులో హైకోర్టు వారు వీళ్ళను లింగ వివక్షపై ఓ నాటిక ప్రదర్శించాల్సిందిగా అడిగారు. ఆ సందర్భంగా రాసుకున్నదే ఈ 'ముద్దా ఘాతక్ హై'. బహిరంగంగా నాటిక ప్రదర్శించడం అదే మొదటి సారి. అప్పటికే వీధి నాటికల పట్ల అవగాహన ఉన్న నిష్టా దీని బాధ్యత తీసుకుంది. అమ్మాయిలపై జరుగుతున్న హింస, దాడులు, వివక్షను ప్రశ్నిస్తూ కొన్ని సీన్లు తయారు చేసింది. తనే దానికి దర్శకత్వం కూడా వహించింది. చివరకు హైకోర్టులో ప్రదర్శించారు. జడ్జీలకు, లాయర్లకు ఈ వీధి నాటిక ఎంతగానో నచ్చింది.
త్రిపుర శపథం
అస్మాక రాజ్యపు రాజుకి కళల పట్ల మక్కువ ఎక్కువ. చిత్రలేఖనం, సాహిత్యం, నత్యం లాంటి కళలతో ఆ రాజ్యం విరాజిల్లుతుండేది. చిత్రకారుడైన యువరాజు రాజ్యపు వ్యవహారాలను నడపటంలో సమర్ధుడు. ఆ రాజ్యానికి వచ్చిన ఒక చిత్రకారుడు మహారాజుకు ఒక చిత్రాన్ని బహుమతిగా ఇస్తాడు. అబ్బురపడిన ఆ రాజు వేట నుంచి తిరిగి వచ్చిన యువరాజుకి ఆ బహుమతిని అందిస్తాడు. ఆ చిత్రంలో ఉన్న అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలోపడిపోతాడు. వివాహం చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అని తీర్మానించుకుంటాడు. ఆ అమ్మాయిని ఎలా అయినా వెతకమని వేగుల వాళ్ళని వివిధ దేశాలకు పంపుతాడు. కానీ ఆమె వివరాలు ఏవీ దొరకవు. తనతో మాట్లాడటానికి వచ్చిన మహామంత్రిని కోపంతో ఉరిశిక్ష వేయాలని ఆదేశిస్తాడు. ఆ విషయం తెలిసిన మంత్రి కూతురు త్రిపురకి తెలిసి యువరాజుని ప్రశ్నిస్తుంది. కానీ యువరాజు కోపం శాంతించదు. త్రిపుర రాజుని 6 నెలల గడువు అడుగుతుంది. ఆమెతో ఒక బృందాన్ని ఇచ్చి పంపుతారు. చివరకు ఆ అమ్మాయి త్రిశాల అని, ఒక దేశపు యువరాణి అని తెలుసుకుంటుంది. జీవితంలో పెళ్ళే చేసుకోనని నిశ్చయించుకున్న త్రిశాలకు రాజ్యంలో స్త్రీ పక్షపాతి అనే పేరు. త్రిపుర ముందు ఒక పెద్ద సవాలు. త్రిశాలని పెళ్ళికి ఒప్పించటం. త్రిపుర తన తెలివితేటలతో త్రిశాల హదయాన్ని గెలుచుకుంటుంది. త్రిపుర రాజ్యానికి వచ్చేసరికే మంత్రి ఉరికొయ్య మీద ఉరివేయబడ్డానికి సిద్ధంగా ఉంటాడు. త్రిపుర యువరాజు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించి అతడికి బుద్ది వచ్చేట్టు చేస్తుంది. మంత్రి స్థానంలో త్రిపుర ఆ దేశపు ప్రధాన మంత్రిగా నియమితురాలు అవుతుంది. యువరాజు త్రిశాల కలుస్తారు.
ఆల్ఫా
నాగరిక అనాగరిక ప్రపంచాల మధ్య, నాగరిక మానవుడి విధ్వంస ప్రవత్తి ముందు, కాలం ముందుచూపుతో వ్యవహరిస్తే, అదే మా కథ 'ఆల్ఫా'. ప్రపంచ వినాశకారియైన ఎవరూ ఊహించని అణుబాంబుని కనిపెడతాడు ఒక సైంటిస్ట్. అది కనిపెట్టాక ప్రపంచంలో జరిగే వినాశనాన్ని ఊహించుకుని భయపడతాడు. తను కనిపెట్టిన ఆ బాంబు వల్ల ఈ ప్రపంచం నాశనం కాకూడదు అనుకుని దానికి పశ్చాత్తాపంగా టైం మెషీన్ ని కనిపెడతాడు. ఆ టైం మెషిన్ లో బాంబు ఫార్ములాను. సాంపుల్ ని గతం లోకి పంపిస్తాడు. ఆ బాంబ్ ఫార్ములా పెట్టే టైం మెషీన్ లో ప్రయాణం చేసి వచ్చి నాగరికత మొదలుకాని కాలంలో పెద్ద గుట్ట గూడెం పరిసరాల్లోని అడవిలో పడుతుంది. సూరీడు, జాంబడు అనే ఇద్దరు యువకులు పెద్ద గుట్ట గూడెం మనుషులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటంది. అలాంటి ఇద్దరూ ఒక రోజు అమ్మోరి పండగలో గొడవ పడతారు. అప్పుడే పెద్ద వెలుగుతో ఆ గూడెం పక్కన అడవిలో ఏదో పడ్డ పెద్ద శబ్దం. వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ పెట్టెలను తీసుకువస్తారు? ఇంతకూ ఆ పెట్టెలోని వస్తువులను సూరీడు జాంబడు యేం చేశారు? కాలయంత్రం నిజంగా ఉందా? బద్ద శత్రువుల్లాంటి సూరీడు, జాంబడు ఉన్నటుండి గొప్ప స్నేహితులు ఎలా అయ్యారు? ఇంతకూ ఆ సైంటిస్టు ఆశించింది జరుగుతుందా? ఇవ్వన్నీ తెలుసుకోవాలంటే 'ఆల్ఫా' నాటకం చూడాల్సిందే.
విరాట్
'ఏ మనిషి కూడా తన యిష్టప్రకారం ఆ పనుల నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే వీలు లేదు. నీ బుద్ధికి అహంకారం పడితే నీ కర్మలకు నీవే కర్తవు కావగలననుకుంటావు. నీకు అమతం అయినది మరొకడికి విషం అవుతుంది. అందువల్ల నీ ధర్మం ఏదో తెలుసుకుని ఆచరించు.' ఈ మాటలు విరాట్ నవలలో సాలెవాడి భార్య చెపుతుంది. ఈ సాక్షాత్కారం కలగటానికి 'విరాట్' అనే వ్యక్తికి జీవితకాలం ఖర్చు చేయాల్సి వచ్చింది.
బుద్ధుడు భూమి మీద అవతరించడానికి ముందు జరిగిన కథ ఇది. వీరవాఘ రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించినప్పుడు మహారాజుకి అండగా నిలబడి రాజ్యాన్ని కాపాడిన ధీశాలి విరాట్. అంతటి బలశాలి ధీశాలి తన అన్నని ఆ యుద్ధంలో మతునిగా చూసి ఖడ్గాన్ని వదిలేసాడు విరాట్. రాజు తనని ప్రధాన మంత్రి చేస్తా అన్నా ఒప్పుకోక న్యాయ మూర్తిగా ఉంటానన్నాడు. న్యాయాధిపతిగా ఉండి ఇచ్చిన ఒక తీర్పు అతనికి మళ్లీ తన అన్న కళ్ళని గుర్తు చేసింది. నిలదీసి ప్రశ్నించే తన అన్న కళ్ళు తనని జీవితాంతం వెంటాడాయి.
అలా వెంటాడిన కళ్ళు తనని యే గమ్యం చేర్చాయి.? తన జీవితానికి అర్థం దొరికిందా లేదా? విరాట్ జీవితం మనతో ఏం మాట్లాడుతుంది అన్నదే ఈ కథ సారాంశం.
-అనంతోజు మోహనకృష్ణ, 8897765417