Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినీరంగం మొదట్లో కథల కోసం తెలుగు సాహిత్యాన్ని ఆశ్రయించిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ రోజుల్లో సాహితి విలువలున్న నాటకాలు, నవలలు సినిమాలుగా తెరకెక్కగా, క్రమక్రమంగా తెలుగు సినిమాలకి- సాహిత్యానికి మద్య ఉన్న లంకె తెగిపోయి ఇపుడు అడపాదడపా మాత్రమే సినిమా కథల కోసం సాహిత్యాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది.
70 వ దశకం వరకు తెలుగు సినీ రంగంలో గొప్ప సినీమాలు వచ్చాయంటే గొప్ప సాహిత్య, సంగీత కారులు ఈ రంగంలో పనిచేయడం ఒక కారణమైతే, అచ్చతెలుగు ప్రాంతీయతతో వచ్చిన చిత్రాలు రసజ్ఞుల హదయాల్ని పండించేవి. దానికి కారణం బి. ఎన్. రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం, వేదాంతం రాఘవయ్య, కె. వి. రెడ్డి, ఎల్. వి. ప్రసాద్, వంటి దర్శకుల సామాజిక బాధ్యత ఇందుకు దోహద పడిందని చెప్పాలి. ఆ తర్వాత సాహిత్యానికి దూరమైన తెలుగు సినిమా ఇతర భాషలు, విదేశీ చిత్రాలు రంగరించి రూపొందించడం కారణం అని చెప్పాలి. నవలని లేదా నాటకాన్ని చదివి అర్థం చేసుకుని, దానిని సినిమా 'స్క్రీన్ ప్లే'కి, అనుగుణంగా తిరగరాసి, సాహిత్యంలోని ఆత్మని 'మిస్' చేయకుండా తెరపై ఆవిష్కరించాలంటే చాలా విద్వత్తు, సాహితీ-సినిమా రంగాలపై సమానమైన పట్టు దర్శక, రచయితలకు అవసరం. కానీ, నేటి తెలుగు దర్శకులలో చాలా మందికి అంత పరిజ్ఞానం కానీ, సాహితీ అభినివేశం కానీ లేవు. దీనివల్ల తెలుగు సాహిత్యం దారి, తెలుగు సినిమా దారి వెరయ్యాయి.
తెలుగు సాహిత్యం-సినిమా అనుబంధం
సినిమా రంగం కథల కోసం సాహిత్యాలపై ఆధారపడటం, తెలుగు సాహిత్యం తన కథలను లిఖిత రూపం నుంచి దశ్య రూపంలోకి విస్తరణ కోసం సినిమాపై ఆధారపడటం అనే 'పరస్పరాధారిత ధోరణి' ఈ క్రింది రూపాలలో కనిపిస్తుంది.
తెలుగు సాహిత్యంలోనూ, రంగస్థలం లోనూ ప్రజాదరణ పొందిన నాటకాలను సినిమాలుగా తెరకెక్కించారు. తొలి భారతీయ చిత్రాన్ని 1910 లో ఆర్. జి. టోర్నీ స్టేజ్ మీద నడుస్తున్న పౌరాణిక నాటకాన్ని నడుస్తున్నట్టే చిత్రీకరించి దానికి 'పుండరీక్' అని పేరు పెట్టాడు. అలాగే తొలి టాకీ సినిమా 'భక్త ప్రహ్లాద', 'పాదుకా పట్టాభిషేకం' చిత్రాలను కూడా చిత్రకరించడం ఉదాహరణగా చెప్పవచ్చు. నాటకాలను సినిమా చిత్రీ కరణకి అనుకూలంగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించడం పరిపాటి. 1939 లో వచ్చిన 'వర విక్రయం', 1955లో వచ్చిన 'కన్యాశుల్కం' ఈ విధంగానే తెరకెక్కాయి. ఆయా నాటకాలలోని ప్రజాదరణ పొందిన ఘట్టాలనో, పద్యాలనో, అంకాలనో మాత్రమే వాడుకుని, సినిమా కథని తమ సొంతంగా అల్లుకోవడం చేస్తుంటారు. చిలకమర్తి 'గయోపాఖ్యానం', 'పాండవోద్యోగ విజయాలు' లోని పద్యాలను 'పాండవ వనవాసం' వంటి సినిమాలకు ఈ రకంగానే ఉపయోగించుకున్నారు. సినీ కథల కోసం సాహిత్యంలోని నాటకాలను కాకుండా నవలలను ఆశ్రయించడం కూడా కద్దు. ఈ ధోరణి తెలుగు సినిమాలలో నవలా చిత్రాల శకాన్ని ఆవిష్కరించింది. నవలలపై ఆసక్తిని కొనసాగిస్తూనే, కథ, కథానిక, నవలిక వంటి ఇతర సాహితీ ప్రక్రియలలో వచ్చిన కథలను తీసుకుని వాటిని సినిమాకి అనుకూలంగా కథావిస్తరణ చేయడం, కొత్త సీన్లను అల్లుకోవడం, 'ధోషగుణం' అనే చలం కథని 2004లో 'గ్రహణం' పేరుతో పూర్తి స్థాయి కథచిత్రంగా తీయడం దీనికి ఉదాహరణ.
తెలుగు సినిమాకి-తెలుగు సాహితీ ప్రక్రియలకు మధ్య 'ఎడం' పెరిగిన దశ. 1990 దశకం తర్వాత కొత్తరకం ప్రేక్షకులలో తెలుగు సాహిత్య అధ్యయనం తగ్గిపోవడం, వారికి ఇంగ్లీషు వంటి ఇతర భాషా సాహిత్యాల సాంగత్యం లభించడం, అదే సమయంలో తెలుగు పాపులర్ సాహిత్యంలో పేరెన్నికగన్న సాహిత్య కషి జరగకపోవడం కారణంగా చెప్పవచ్చు. తెలుగు సాహితీ సష్టి సినిమాలను దష్టిలో పెట్టుకుని, సినిమాల కోసమే జరగడం! ఇప్పటి సాహిత్యం అంతా సినిమాకు 'నఖలు'లా ఉండటం, సినిమా తరహా వర్ణన, శైలినే అనుకరించడం ప్రస్తుత పరిణామం. సినిమా కథలే తిరిగి సాహిత్యం వైపుగా 'వెండితెర నవలలు' అనే పేరిట సాహితీ రూపాన్ని పొందడం! 'మాయాబజార్ మల్లీశ్వరి, ఇద్దరు మిత్రులు, ఇటీవలి శ్రీరామరాజ్యం' వంటి సినీ నవలలే దీనికి ఉదాహరణగా చూడవచ్చు.
నాటక సాహిత్యం-సినిమా
ప్రాచీన అలంకారికులు సాహిత్య రూపాలన్నింట్లోనూ కావ్యం, కవిత అత్యుత్తమంగా కీర్తించారు. అలాంటి కావ్యాలన్నింట్లోనూ నాటకమే రమ్యం (కావ్యేశు నాటకమ్ రమ్యమ్) అన్నారు. అంతేగాక ఒకడుగు ముందుకేసి అసలు సాహితీ ప్రస్థానం యొక్క అంతిమ లక్ష్యం నాటకమే ('నాటకాం తాహి సాహిత్యమ్') అని కూడా వర్ణించారు. అలా సాహిత్యంలో ప్రాధాన్యతని సాధించిన నాటకం తెలుగు సినీ రంగానికి కూడా తనదైన సజనాత్మక సహాయాన్ని అందించింది. దీనివల్లే చాలా నాటకాలు సినిమాలుగా రూపాంతరం చెందాయి. తొలి నాళ్లలో పౌరాణిక నాటకాలు, తర్వాత చారిత్రక నాటకాలు, ఆ తర్వాత సాంఘిక నాటకాలెన్నో తెలుగు వెండితెరపై దశ్యరూపాన్ని సాధించాయి. అలా తెలుగు సినిమాలో దాదాపు 60 పైగా సినిమాలు నాటకాల పునాదులపై వెండితెర విన్యాసాలు చేసాయి.
సినిమాలుగా వచ్చిన నాటకాలు
కాళ్లకూరి నారాయణరావు 'చింతామణి, వరవిక్రయం' నాటకాలు 1933, 39లలో సినిమాలుగా రాగా; గురజాడ 'కన్యాశుల్కం' 1955లో; శూద్రకుడి 'మచకటికం' 1967లో; 'వసంతసేవ' పేరుతో, గణేష్ పాత్రో 'పావలా, కొడుకు పుట్టాల' 1975 లో 'నాకూ స్వతంత్రం వచ్చింది' పేరుతో సినిమాగా వచ్చింది. దాసం గోపాలకష్ణ 'చిల్లరకొట్టు చిట్టెమ్మ' 1977లో; సి,ఎస్. రావు 'ఊరుమ్మడి బతుకులు' 1977లో; 'ప్రాణం ఖరీదు' 1978లో; పరుచూరి వేంకటేశ్వరరావు 'మరో భారతం' 1979లో 'కలియుగ భారతం'గా; 'ఈ పిల్లకు పెళ్ళావుతుందా?' 1983లో; 'సమస్యా నీకు నూరేళ్ళు' నాటకం 1985 లో 'శ్రీ కట్న లీలలు' పేరుతో; 1987లో 'ఇదిగో ప్రశ్న? ఏది జవాబు!' 'అగ్నిపుత్రుడు' పేరుతో సినిమాలుగా వచ్చాయి. యండమూరి 'కుక్క' 1980లో; పరుచూరి బ్రదర్స్ 'దారితప్పిన ఆకలి' 1982లో 'ఈ చరిత్ర ఏ సిరాతో'; 1983లో కొడాలి గోపాలరావు 'లంకె బిందెలు'; 1985లో వి.ఎస్. కామేశ్వరరావు 'ఈ మంటలారపండి' నాటకం 'వందేమాతరం' పేరుతో; 1987లో గొల్లపూడి మారుతీరావు 'కళ్లు'; 1991లో పల్లేటి లక్ష్మీకులశేఖర్ 'తపస్సు' నాటకం 'ప్రేమ తపస్సు' పేరుతో; 1991లో శ్రీరాజ్ 'కాలధర్మం' 'కలికాలం' పేరుతో; 1994లో ఇసుకపల్లి మోహనరావు 'మర్యాదస్తులకో నాటకం' 'ఆమె' పేరుతో; 2000 సంవత్సరంలో ఎల్.బి.శ్రీరాం 'ఒంటెద్దు బండి' 'అమ్మో ఒకటో తారీఖు' పేరుతో సినిమాగా వచ్చింది.
సినిమాలుగా వచ్చిన నవలలు
తెలుగు సినీ పరిశ్రమలో సినిమాలకు నవలలే ఆధారంగా నిలిచాయి. అత్యధికంగా యండమూరి వీరేంద్రనాథ్ 16నవలలు చిత్రాలుగా రూపొందాయి. వీటిలో 'రాక్షసుడు, ఛాలెంజ్, అభిలాష, ఆఖరిపోరాటం, మరణ మదంగం, సంపూర్ణ ప్రేమాయణం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్' తదితర చిత్రాలు బాక్సాపీస్ దగ్గర విజయం సాదించాయి. మల్లాది వెంకట కష్ణమూర్తి 12 నవలలు సినిమాలు తెరకెక్కగా వాటిలో 'రేపటి కొడుకు, ఇదేనా న్యాయం, శ్రీవారి శోభనం, నీకూ నాకూ పెళ్ళంట, రెండు రెళ్లు ఆరు' చిత్రాలు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. యద్దనపూడి సులోచనారాణి 11 నవలల్లో 'మీనా, జీవన తరంగాలు, ప్రేమ సింహాసనం, సెక్రటరీ, ప్రేమలేఖలు, బంగారు కలలు, అగ్నిపూలు, రాధాకష్ణ' సినిమాలు విశేష ప్రేక్షాకాదరణ పొందాయి. ముప్పాళ్ల రంగనాయకమ్మ 4నవలల్లో 'బలిపీఠం, గోరింటాకు, కష్ణవేణి' చిత్రాలు విజయవంతమయ్యాయి. పొత్తూరి విజయలక్ష్మి 3 నవలల్లో 'శ్రీ వారికి ప్రేమలేఖ, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం'; మల్లిక్ 3 నవలల్లో 'పరుగో పరుగో, వివాహ భోజనంబు'; ఆరేకపూడి కౌసల్యదేవి 2 నవలల్లో 'ప్రేమనగర్' చిత్రాలు సక్సెస్ నమోదు చేసుకున్నాయి. ఆదివిష్ణు, చలం, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, పి. శ్రీదేవి, చల్లా సుబ్రహ్మణ్యం, కొమ్మనాపల్లి గణపతిరావు, జి.వి. అమరేశ్వర్ రావు, వంశీ, కొలపల్లి ఈశ్వర్, కాళీపట్నం రామారావు, దాశరథి రంగారావు, కిషన్ చందర్, తమిరిశ జానకి, డి. రామేశ్వరి, అంపశయ్య నవీన్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మొదలైన రచయితల ఒక్కో నవల సినిమాలుగా రాగా, వాటిలో 'ఏకవీర, ఆహా! నా పెళ్ళంట, ఓ వర్షం కురిసిన రాత్రి, రెండిళ్ళ పూజారి, సితార, చిల్లర దేవుళ్ళు, మా భూమి, న్యాయం కావాలి' సినిమాలు ప్రజాదరణ పొందాయి.
తెలుగు సాహిత్యంలోని నవలలను సినిమాలుగా మలచడం అనేది 1970, 1980 దశకాలలో ఓ ఉద్యమంలా నడిచిన చరిత్ర. ఇది తెలుగు సినిమా ప్రస్థానంలో ప్రముఖ ఘట్టం. అప్పట్లో 'నవలా చిత్రాలు' ట్రెండ్‌లా ఏర్పడటమేకాక అ సినిమాలలో నటించిన హీరోకు 'నవలా నాయకుడు' అని, హీరోయిన్ కు 'నవలా నాయిక' అని ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. పైగా నవలా చిత్రాలలో నటించడం అంటే మేథో చిత్రాలలో నటించడంగా ఆ హీరో, హీరోయిన్ లకు మేథో నటులుగా విశిష్ట ఆదరణ లభించేది. మొదట్లో నవలా నాయకుడు టైటిల్‌ను అక్కినేని సాధించగా, ఆ తర్వాత ఆ క్రెడిట్ ని శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి దక్కించుకున్నారు. హీరోయిన్లలో మాత్రం 'నవలా నాయిక' అంటే వాణిశ్రీ అనే ముద్ర పడిపోయింది.
సాహిత్యానికి దూరమైన తెలుగు సినిమా
ఇప్పుడు సాహిత్యానికి దూరమైన తెలుగు సినిమా హాలీవుడ్ చిత్రాలను, పర భాష చిత్రాలను దంచి వడ్డిస్తోంది. అంతే కాకుండా, టీవీ వచ్చాక దశ్యంతో అక్షర విన్యాసం నిలిచి పోయింది. టీవీ తెర దశ్యాలు తెలుగు సాహిత్యాన్ని దూరం చేశాయి. ప్రపంచాన్ని శాసిస్తున్న కల్పనాశక్తీ, సజనాత్మకత అంతా కేవలం టీవీ సీరియళ్ళ పాలబడి పోయి, వంటింటి సీరియల్స్ తో సాహిత్యాన్ని విడచి టీవీ సీరియళ్ళకే అతుక్కుపోయారు తెలుగు పాఠకులు. దీంతో సాహిత్యానికి పాఠకుల్లేకపోయాక, సినిమాలెందుకని పరిశ్రమ నవలలతో సినిమాలు తీయడం మానేసింది. ఏ విషయమైనా ఏదో ఒక రూపంలో స్క్రీన్ పై చూడాల్సిందే తప్ప, చదివి తెలుసుకునే ఓపిక లేదు. ఇప్పుడు ఏ సినిమా దర్శకుడికైనా ఒక కొత్త నవల బాగుందని ఆ నవలని సినిమా తీస్తే బాగుంటుందని చెపితే, ఆ చెప్పిన వాడిని హీనంగా చూసే పరిస్థితి. వాళ్ళకి ఇంకా నవలలు, నాటకాల గురించి మాట్లాడేవారంటే చిన్న చూపే. అది లోక్లాస్ యాక్టివిటీ అనుకుంటారు. కానీ, తాము తీసే సినిమాలకే ఆ కథాకథన సూత్రాలు, పాత్ర చిత్రణ నియమాలు, సంఘటనలు, వర్ణనలు సమస్త వ్యాసంగం లాంటి టెక్నిక్ అంతా కూడా ఆదిలో నవలా సాహిత్యమే నేర్పిందనే చరిత్ర అతడికి తెలియదు. ఈ రోజుల్లో ఏమీ తెలియనివాడే గొప్ప దర్శకుడు. ఇందులో అతని తప్పేమీ లేదు. సాహిత్యాన్ని మూలకు తోసి, ఈనాటి సమాజమే ఈ పరిస్థితి కల్పించింది. ఇక్కడే కాదు, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా మలయాళంలో గతంలో సగానికి పైగా సినిమాలు సాహిత్యం ఆధారంగానే వచ్చేవి. సాహితీ పరులు సినిమాలకు పని చేసేవారు. ఆ సినిమాలు జీవంతో తొణికిసలాడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. సాహిత్యాన్ని దూరంగా ఉంచడమే కాదు, సాహితీ కారులు స్క్రిప్టులు రాయడం లేదు. ఇది క్యాంపస్ సెలెక్షన్ల కాలం. ఏ జీవితానుభవం లేక నేరుగా క్యాంపస్‌ల నుండి వచ్చేస్తున్న వాళ్ళతో సినీ పరిశ్రమ నిండిపోతుంది. వాళ్ళకు ఈ రంగంలోకి వచ్చాక సినిమాని, కళని, జీవితాన్ని అద్యయనం చేద్దామన్న ఆసక్తీ ఉండటం లేదు. సాహిత్యంలోని కథాకథనం సినిమాల్లో ప్రాణం పోసుకుని, నాట్యంలోకి, నాటకంలోకి, సినిమాల్లోకి వ్యాపించిందని, చరిత్ర అనే కళారూపం లేక సాహిత్యమే లేదని, సాహిత్యం లేక సినిమా లేదని తెలుసుకోలేకపోతున్నారు. ఇది సినిమాల మీద చాలా చెడు ప్రభావం చూపుతోంది.
సాహిత్యం ఓ తరగని గని
నిజానికి తెలుగు సాహిత్యంలో ఎన్నో సాహితీ విలువలు ఉన్న రచనలు ఉన్నాయి. రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర మాండలికాలలో వచ్చిన కథ, నవలా సాహిత్యం నిండా గుండెల్ని తడిమేసే మానవీయ కథనాలున్నాయి. నైజాంకు వ్యతిరేకంగా చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎన్నోన్నో వీరోచిత ఘట్టాలున్నాయి. స్వాతంత్రోద్యమ సమయంలో వచ్చిన నవలలను 'పీరియడ్ ఫిల్మ్'గా తీయడానికి తగినట్లుగానే ఉన్నాయి. వాణిజ్య అంశాలు అనే ఆటంకాన్ని పక్కనబెట్టి నిజమైన మానవ జీవన చిత్రణని తెరమీద ఆవిష్కరించాలనుకునే దర్శకులకు తెలుగు నవలా సాహిత్యం, తెలుగు సాహిత్యం ఓ తరగని గని అనడంలో సందేహం లేదు. తెలుగు సాహిత్యంలో కథల కొరత ఉందని పదే పదే చెప్పే సినీ నిర్మాత, దర్శకులు, హీరోలు ఒక్కసారి హాలీవుడ్, కొరియన్, థారు సినిమాలను పక్కన పెట్టి, తెలుగు సాహిత్యం వైపు దష్టి సారిస్తే తెలుగు సాహిత్యంలో కథలు లేవనే వారికి తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది.
- పొన్నం రవిచంద్ర, 9440077499