Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి దృశ్యం ఎన్నో రంగులతో నిండి వుంటుంది. రకరకాల రంగులతో ప్రకృతి చిత్రం గీయడం ప్రకృతి దృశ్యానికి న్యాయం చేసినట్టు అవుతుంది. అజంతా చిత్రం లోనూ, బాగ్ గుహల చిత్రాలలో రంగుల దృశ్యాలు చూశాం. మధ్య యుగాలలో రాతి గోడలపై, కాగితంపై, తాటి ఆకులపై చిత్రం గీయడం అభివృద్ధి చెందాక, ప్రకృతి దృశ్యాలను మరింత అందంగా తీర్చిదిద్ది చిత్రాలు గీశారు కళాకారులు. కానీ రంగులేవీ దిద్దకుండా శిల్పంలో కూడా అంతే అందంగా ప్రకృతి దృశ్యాన్ని చూపగలగటం భారతీయ
శిల్పకారుల
నైపుణ్యం.
మధ్య భారతదేశంలోని ఉదయగిరి గుహల్లో వరాహరూపం గురించి మాట్లాడినప్పుడు, ఆ గోడపై గంగ, యమున నదుల నీటిని అలల రూపంలో చెక్కి చూపారు. ఆ అలలో ఎంతోమంది రుషులు, మునులు నిల్చుని నమస్కరిస్తున్న దృశ్యంలో వారు వరాహ రూపంలోని విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నారా? గంగ యమున సంగమమైన ప్రయాగకు నమస్కరిస్తున్నారా అనే రెండు భావాలూ కలిగేటట్టు చెక్కారు. అలాగే గుప్తుల రాజ్యం గంగ, యమునల మధ్య విస్తరించిన పెద్ద రాజ్యమనీ, రాజు ఆ ప్రదేశాన్నంతా కాపాడాడనీ, ఇన్ని అర్థాలు చూపగలుగుతూ శిల్పకారులు ఆ ప్రకృతి దృశ్యాన్ని చూపగలిగారు. అలాగే దేవఘర్, విష్ణు మందిరంలో చెక్కిన గజేంద్రమోక్షం శిల్పంలో, అలలతో నీటి కొలను, చక్కటి తామరలు, నీటిలో నుండి పైకి లేచి నిల్చున్న నాగరాజు పడగ రూపం చూపిస్తూ, నీటి దృశ్యాన్ని అందంగా చెక్కారు.
బౌద్ధంలోని జాతక కథలు చెక్కినప్పుడు, ఆ కళలన్నింటా ప్రకృతి దృశ్యాలు నిండి వుంటాయి. అందులో ఎన్నో కథలు, అడవి, అడవి జంతువులు, నది దాటించిన కోతి, ఏనుగులు, జింకలు, పావురాలు ఇలా ఎన్నో విషయాలు చూపుతూ ప్రకృతి దృశ్యాలను కథాపరంగా విభజిస్తూ, వివరించి చెక్కారు.
భారతీయ శిల్పకారులు కథావస్తువును ఎంత చక్కగా చెక్కారో, అంతే పదార్థ నైపుణ్యం కూడా సంపాదించారు. ఏ ఆకారమూ లేని రాతిని చెక్కి, అక్కరలేని భాగాన్ని తొలచి అందమైన ఆకృతులను తెస్తారు. అలాగే లోహంతో కానీ, మట్టితో కానీ శిల్పం తయారు చేసేటప్పుడు ఏమీ లేని శూన్యంలో పదార్థం పేర్చి ఆకారాలు తీసుకువస్తారు. భారతీయ శిల్పకళలో రాతి శిల్పం, లోహ శిల్పమే కాదు, మట్టి ఇటుకల శిల్పాలు కూడా అంతే ప్రముఖ స్థానం సంపాదించాయి. మట్టితో శిల్పాలు, కుండలు చేసి బట్టీలో కాల్చినందువలన ఎక్కువ కాలం నిలిచి వున్నా, వీటికి పెళపెళ పగిలే అవకాశమూ ఎక్కువ. కానీ నిలిచి వున్న కొన్ని శిల్పాలు, మందిరాలు మనకు చరిత్ర కథలు వివరిస్తాయి. ఉత్తర ప్రదేశ్‌లోని భీతరగామ్లో, క్రీ.శ. 5వ శతాబ్దంలో కట్టిన ఒక ఇటుక మందిరం నిలిచి వుంది. ఇది మట్టిని జోడించి ఇటుకలతో కట్టిన మందిరం. క్రిందటి శతాబ్దంలో పడిన పిడుగుపాటుకు కొంత పాడైనా, మనకు విషయ వివరణ అర్థం అవుతుంది. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో కట్టిన ఈ మందిరం గోడల్లో బయటవైపు, చిన్న మందిరాలలాగా చెక్కబడ్డ ఖానాలలో శిల్పాలు, తోరణాలు కనిపిస్తాయి.
ఉత్తర ప్రదేశ్‌లోనే, అహిచ్ఛత్ర అనే ప్రదేశంలో ఎర్రమట్టితో కట్టిన మందిరంలో నిలువెత్తు ఆకారమున్న గంగ, యమున విగ్రహాలు కనిపిస్తాయి. ఇదీ క్రీ.శ. 5వ శతాబ్దపు ఆఖరి దశ లేదా క్రీ.శ. 6వ శతాబ్దపు మొదటి దశలో కట్టిన శివ మందిరం. ఈ రెండు విగ్రహాలు మందిర ద్వారానికి అటూ ఇటూ భక్తుల వైపు తిరిగి నిలిచి వుంటాయి. గంగ మకరంపై, యమున తాబేలుపై నిలిచి వుండగా, వారికి ఛత్రం పట్టిన పరిచారిక నిలుచుని వుంటుంది. వారి చేతిలో కుండ, అందమైన చీర మడతలతో హుందాగా నిలిచిన విగ్రహాలివి. నదీ దృశ్యానికి ఒక మానవాకారం ఇచ్చి అందంగా తయారు చేసిన ఊహాశిల్పాలివి. ఈ రెండు శిల్పాలను ఇప్పుడు నేషనల్ మ్యూజియం, ఢిల్లీలో భద్రపరిచారు.
ఇంకా ఎన్నో ఎర్రమట్టి విగ్రహాలు గుప్తుల కాలానికి సంబంధించినవి దొరికాయి. ఉత్తర ప్రదేశ్, క్రీ.శ. 5వ శతాబ్దానికి సంబంధించిన గరుడ వాహనంపై విష్ణురూపం ఎడమ చేతితో శంఖం ఊదుతూ యుద్ధం ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నట్టున్న మట్టి శిల్పం ఇది. అంటే ఆకాశ దృశ్యాన్ని శిల్పకారులు చిత్రించారు. మరో మట్టి శిల్పం రామలక్ష్మణులు ఏదో సంభాషిస్తూ కూర్చున్నట్టు, ఒక తోరణపు పలక మధ్యలో కూర్చుని వుంటారు. ఇది బహుశా ఏ గోడలోని అలంకారమైనా అయివుండవచ్చు. ఇదీ ఉత్తర ప్రదేశ్, క్రీ.శ. 5వ శతాబ్దానిదేను. ఇది రాక్ఫెల్లర్ వారి వద్ద ఉండగా, గరుడ వాహన విష్ణు శిల్పం బ్రూక్లిన్ మ్యూజియం న్యూయార్క్‌లో భద్రపరిచారు. ఇలా స్థలం గుర్తుపట్టలేని మట్టి శిల్పాలన్నీ భీతరగామ్, లేదా అహిచ్ఛత్రకు చెందినవని తేల్చారు. గరుడుడి వుంగరాల జుట్టు, ప్రతీ శిల్పం యొక్క జారిన చెవులు చూస్తే ఈ శిల్పకారులు, రాతి శిల్పం చెక్కిన పద్ధతే అవలంభించారని తెలుస్తుంది.
అంతే కాదు తలపై జుట్టు ముడి, ముఖం, శరీరం చెక్కిన రూపాలు చూస్తే బుద్ధుడి రూపాలు, ఈ శిల్పాల మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి.
బీహార్‌లోని ఆపసాద్ అనే ప్రదేశంలో ఒక గుట్టలా పడి వున్న స్థలాన్ని తొలిస్తే రామాయణానికి సంబంధించిన కొన్ని దృశ్యాల శిల్పాలు కనిపించాయి. ఈ స్థలం గుప్తుల సమయం తర్వాత వచ్చిన ఆదిత్య సేనుడు పాలించిన క్రీ.శ.7వ శతాబ్దపు స్థలం. ఇక్కడ గుప్తుల కాలంలోని ఎర్రమట్టి శిల్పాలను పోలిన ఒక శిల్పం, సున్నం ఇసుక పేర్చి చేసిన ర్బషషశీ శిల్పం, శుంశుపా వృక్షం కింద అశోకవనంలో వున్న సీతని చూపారు. శిల్పంలో ఒక వృక్షం చెక్కి మొత్తం అశోకవాటికలో సీతకథ చూపిన నైపుణ్యం శిల్పకారులది.
ఎర్రమట్టి మందిరాలలో ముఖ్యమైనది, బుద్ధగయలోని మహాబోధి మందిరం. ఈ మందిరాన్ని మొదట అశోకుడి కాలంలో నిర్మించినా, ముఖ్యమైన నిర్మాణం గుప్తుల కాలంలో జరిగింది. ఇదీ గుప్తుల కాలంలో కట్టిన దేవఘర్, ఉత్తర ప్రదేశ్‌లోని మందిరంలాగా పంచాయత మందిరం. కానీ ఆ తరువాత ఈ మందిరాన్ని ఎన్నోసార్లు మరమ్మత్తులు చేయడం వలన ఏ విషయం ఏ కాలానిది అని గుర్తుపట్టడం కష్టం. గుప్త రాజులు కళలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వటమే కాక సర్వమత సమానత్వం అనుసరించారు. రాతి, ఎర్రమట్టి శిల్పాలతో పాటూ లోహపు శిల్పాలు ఆ కాలానికి చెందినవి చౌసొ బీహారులో దొరికాయి. అవి రిషభనాధుడనే జైన తీర్థంకరుడివి. హుందాగా వున్న శరీర సౌష్టవంతో చేతులు మోకాళ్ళ వరకు సాగి వున్న విగ్రహం, పట్నా మ్యూజియంలో భద్రపరిచారు. గుప్తుల కాలంలోని ఏ కళ చూసినా, శిల్పం, నిర్మాణకళ అన్నీ ఒక స్వేచ్ఛాపూర్వక సృజనాత్మకత కనిపిస్తుంది.
క్రీ.శ 6వ శతాబ్దం మొదలు గుప్తుల సామ్రాజ్యానికి చివర అయింది. క్రీ.శ. 500 సంవత్సరంలో బుద్ధగుప్తుడు జీవించిన కాలం. ఆ తరువాత గుప్త సామ్రాజ్యం ముక్కలైంది. అందుకు కారణం వారి సామంతులే అయిన వాకాటకులు. అలాగే విదేశీయులైన హూణులు. ఆపై గుప్తు రాజులు పోషించిన కళలు వాడిపోయినా, ప్రాంతీయంగా ఎన్నో కళాస్థావరాలు ప్రాణం పోసుకుని, మరిన్ని పద్ధతులలో కళలు వికసించాయి. ఒక విధంగా దక్షిణ ఆసియా ఖండంలో కళలకు మరో యుగం మొదలైంది. వీటికి మూలమైన గుప్తుల కాలంలోని కళా పద్ధతులు, కథా వస్తువులు పునాదుల లాగా పనిచేస్తాయి.
మధ్య ప్రదేశ్‌లోని ఎరాన్ అనే ప్రదేశంలో హూణుల శిలాశాసనం చూపే 375 సెం.మీ ఎత్తు వున్న ఒక వరాహ శిల్పం 4 కాళ్ళతో వరాహ రూపంలోనే చెక్కబడి వుంది. ఇది తోరమాన హూణుడి రాజ్య పరిధిలోని శిల్పం అని శిలాశాసనం వలన అర్థం అవుతుంది. తన దంతంతో ఎత్తిన భూమి స్త్రీ ఆకారం. ఆ వరాహం యొక్క 4 మీటర్ల పొడవున్న శరీరమంతా రుషి మునులు మానవాకారంలో నిల్చుని, వరాహ రూపంలోని విష్ణువుకి నమస్కరిస్తుంటారు. ఇది స్వతంత్రంగా నిలుచోబెట్టిన గుండ్రటి శిల్పం. ఉదయగిరి గుహల్లో గుప్తుల కాలంలో చెక్కిన వరాహరూపం మానవాకారం. అయితే ఎరాన్లోని ఈ 4 కాళ్ళ వరాహం గురించి ఒక సందేహ వాదన వుంది. ఇది హూణులు నిర్మించినదే. కానీ హూణులు విగ్రహారాధనకు, హిందూ ధర్మానికీ విరుద్ధులు. ఈ శిల్పం వున్న మందిర నిర్మాణం ఒక రాజకీయ ఎత్తు అయి వుండవచ్చని అభిప్రాయం. ప్రస్తుతం ఈ వరాహరూపం నిలిచి వున్న మందిరం శిథిలమైంది. తొరమానుడి కొడుకు మిహిరకులుడు రాజ్యం చేస్తున్నప్పుడు క్రీ.శ. 530 లో యశోధర్మన్ అనే రాజు ఈ హూణుడిని ఓడించి మధ్య భారతం అయిన ఈ మాల్వా ప్రాంతాన్ని విడిపించి, మళ్ళీ మళ్ళీ హిందూ కళలను వెనక్కు తెచ్చాడు. అక్కడి మాండోసర్ ఒక పెద్ద కళాసంస్కృతుల స్థావరంగా మారింది.
తూర్పు భారతదేశంలో మగథలో బౌద్ధం, జైన మతాల వలన అక్కడ కళలు మళ్ళీ మరో పద్ధతిలో మొదలయ్యాయి. బౌద్ధం ఆసియా దేశాలకు పాకి వారి మద్దతు ఇక్కడికి రావడం మొదలైంది. నలంద విశ్వ విద్యాలయం అందుకు నిదర్శనం. ఇది క్రీ. శ. 7 వ శతాబ్దపు హర్షవర్ధనుడి కాలంలో ప్రాముఖ్యం పొందిన బౌద్ధ విద్య, భిక్కుల స్థావరం అయినా, మొదట ఆరామ స్థలంగా అశోకుడు పునాదులు వేయించాడు. ఆపై బౌద్ధ స్థావర ముఖ్య ప్రదేశంగా కుమార గుప్తుడు (క్రీ.శ.415 - 455) పునాదులు వేశాడు.
పశ్చిమ భారతంలోనూ మరో పద్ధతిలో మైత్రక రాజులు పాత కొత్తల మేళవంగా కళలకు పునాది వేశారు. క్రీ.శ. 575 - 600 లలో గోప్ అనే సౌరాష్ట్రలోని మందిరం ఇందుకు ఉదాహరణ. ఇందులో కుషాన, గాంధార, గుప్త పద్ధతులతో పాటు కొన్ని కాశ్మీర ఆకృతులు కనిపిస్తాయి. ఈ ప్రాంతం ఈ పద్ధతులన్నీ రుచి చూసింది. మైత్రక రాజ్యం యొక్క వలభి, తూర్పులోని నలంద రెండూ విద్యకు విశ్వవిద్యాలయాలు. ఈ పశ్చిమ భారతంలో గుప్తుల కాలం తరువాత గుజరాత్‌కి ఉత్తరాన సామలాజీ, మరియు మహారాష్ట్రలోని పరేల్‌లోని కళా స్థావరాలు ప్రాముఖ్యం వహించాయి ఈ రెండు స్థలాలలో చెక్కిన శిల్పాలలో పోలికలూ కనిపిస్తాయి. ఇది క్రీ.శ. 6వ శతాబ్దపు మాట. సొమలాజీలోని నీలకంఠ మహదేవుని మందిరంలోని విశ్వరూప విష్ణు 4 ముఖాలు, 8 చేతులు, అనంత శయన సర్పం మీద కూర్చుని వుండగా, అతని శిరస్సు నుండి ఆయుధ పురుషులు, శివ, బ్రహ్మ, సూర్య ఇంద్ర రూపాలు, దశావతారాలు వెలికి వస్తూ చెక్కబడింది క్రీ.శ. 6వ శతాబ్దపు శిల్ప నైపుణ్యానికి, విశ్వరూప ప్రకృతి దృశ్యానికి ఇది పరాకాష్ట.
- డా||ఎం.బాలామణి, 810671 3356