Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనకాలాన పురివిప్పి నర్తించిన సిద్దాంత నిబద్దతా వాదానికి భిన్నంగా వస్తుస్వేచ్చకు పీట వేసినవాడు ఆడెపు లక్ష్మీపతి. ఏకముఖ దృష్టికి బదులుగా బహుళత్వానికి చాప పరిచాడు. వస్తు ప్రాధాన్యతను ఎలుగెత్తిన వేళ, శిల్ప ప్రాముఖ్యతను చాటినాడు. అన్ని అస్తిత్వాలకు అతీతంగా, మనుషుల కష్టాలకు స్పందించి, మానవీయ స్పందనల్ని కథలుగా మార్చాడు. వస్తువు, శైలి, శిల్పం ఈ మూడు సమపాళ్ళలో ఉంటేనే కథ రాణిస్తుంది. ఈ విషయాన్ని నూటికి నూరుపాళ్ళు నమ్మి, కథలు రాసిన రచయిత ఆడెపు లక్ష్మీపతి. జీవితసమస్యల్ని వస్తువుగా, పరిష్కార ప్రయత్నాల్ని శిల్పంగా, భావ వ్యక్తీకరణల్ని శైలిగా చేసుకొని కథలు రాశాడు. 'నాలుగు దృశ్యాలు' కథా సంపుటిలో ఈ విధానం స్పష్టంగా కనపడుతుంది. కథకు జీవితం ముడిసరుకు. అది సమాజంలో పరచుకొని ఉంది. తవ్వుకున్న వాళ్ళకు తవ్వుకున్నంత దొరుకుతుంది. ప్రధానంగా ఈయన మధ్యతరగతిపై తన దృష్టిని సారించాడు. సామాజిక పరిణామంలో ఈ తరగతి ప్రధానపాత్ర పోషించింది. అదే సమయంలో తనలో తాను అనేక మార్పులకు, ఘర్షణలకు లోనయింది. ఇందులో ప్రభావశీలురైన వ్యక్తులు, అసమర్థులు, తటస్తులు, గాలివాటం వ్యక్తులు, ఇలా అనేక రకాల వాళ్ళు కనపడతారు. అలాంటి జీవితాలపై రచయిత టార్చిలైట్ వేశాడు. ఆ వెలుతురులో వాళ్ళ జీవితాలను ప్రదర్శనకు పెట్టాడు.
మధ్యతరగతి వ్యక్తులు పొదుపరులు. వీరు ప్రతిరూపాయిని ఎంత ఆచితూచి ఖర్చు చేస్తారో, దాని పరిణామలు ఎలా ఉంటాయో 'అనులోమం' కథలో కనపడుతుంది. తమ కంటే క్రిందివారైన రిక్షావాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళ దగ్గర చూపిన పిసినారితనం, షాపింగ్ మాల్స్ లాంటి వాటిల్లో చూపలేక తండ్లాడుతుంటారు. ఈ గుంజాటనను కథీకరించాడు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు, పై తరగతి జీవన విధానాన్ని అనుకరించబోయి బోర్లాపడుతుంటారు. తన తాహతుకు మించి కొడుకును కాన్వెంటులో చదివించి, షావుకారు దగ్గర అప్పుచేయడం, దాన్ని తీర్చలేక అదే షావుకారు దగ్గర కొడుకును పనికి కుదర్చడం 'పుట్టినరోజు' లో చూస్తాం. సమాజంలోని అన్ని వర్గాలలో ప్రేమలు, ఆప్యాయతలు, ఈర్ష్య, ద్వేషాలు ఉంటాయి. వీటిని చిత్రించే క్రమంలో సమస్త సమకాలీన సమస్యల్ని చిత్రణ చేసిన కథ 'ముసల్దానిముల్లె'. బస్సు ప్రయాణం నేపథ్యంగా చేసుకొని, కథలో ఒక మినీ ప్రపంచాన్ని సృష్టించాడు. సామాజిక దొంతరల మధ్యగల వెసులుబాటును ఉపయోగించుకొని, తన కోపాన్ని, ద్వేషాన్ని వెళ్ళగక్కి, ఇతరులను అణచివేసే మనుషులుంటారు. దళితుడి వృత్తి సంబంధ పనిని అడ్డుకొని, వారిని ఆకలిచావుకు గురిచేయడం 'రాబందులు' కథలో కనిపిస్తుంది. మనుషులుచేసిన ఇలాంటి పనినే, కొంచెం ఇటు అటుగా రాజ్యం చేసిన విషయాన్ని 'ఆక్రోశం' కథలో ప్రస్థావించాడు. కల్లోల తెలంగాణలో 'మిస్సింగ్‌కేసు'లు ఎక్కువగా నమోదయ్యాయి. మిస్సింగ్ కేసులు, శవాలుగా దొరికాయి. వ్యక్తిని పోలీసులు తీసుకెళ్ళడం, ఆ తరువాత మిస్సింగ్ కేసు నమోదు, కాకతీయ కాలువలో వ్యక్తి శవంగా తేలడం, ఇదొక క్రమం. ఈ క్రమాన్ని చిత్రించిన కథ 'ఆక్రోశం'. ఇది పోరాట కాలపు కథ. పోరాటనేపథ్యం కలిగిన మరో కథ 'బంధ్'. చిన్న వ్యాపారులపై దౌర్జన్యం, బడుగు బలహీనుల కష్టాలు, నష్టాలు ఇందులో కనపడుతాయి. అనేక కారణాలతో, ఉన్నత తరగతి కుటుంబాల్లోని యువతీ యువకులు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలను కోల్పోవడం వల్ల డ్రగ్ఎడిక్ట్లవుతున్నారు. ఈ తతంగంలో తాము ఏమి కోల్పోతున్నామో ఎరుక కలిగించే కథ 'నిశ్చలనచిత్రం'. పెళ్లి చూపులు అనేవి మానసిక వ్యభిచారం అనుకునే స్త్రీ పాత్ర, తన కిష్టమైన జీవితాన్ని తానే ఎంచుకొని హాయిగా బతకవచ్చని నమ్మిన స్త్రీ పాత్రల జీవితమే 'వ్యభిచారం' కథ. 'మలుపు' కథలో సునీత పాత్ర ద్వారా సమాజంలో రెండోపెళ్ళి చేసుకునే భర్తల్లో పరివర్తనను ప్రవేశపెట్టాడు. ఈ దశలో వైవాహిక సుఖం కన్నా, తల్లీబిడ్డల అనుబంధమే ప్రధానం అంటాడు. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని 'స్టాండర్డ్' కథలో వినిపిస్తాడు. ఈ మూడు కథల్లో వైవిధ్యం, సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. 'నాలుగు దృశ్యాలు' సంపుటిలోని పదిహేడు కథలు, అన్ని రకాల వస్తువులను కలిగి ఉన్నాయి. వాటిని అందించడంలోను రచయిత పలురకాల రీతులను ఎన్నుకొన్నాడు.
రంగు, రూపు, గుణము వీటి పరంగా మనుషులు అనేక రకాలు. వ్యవహారంలో మనిషి పలురీతులుగా ప్రవర్తిస్తాడు. మనిషి ఎన్ని రకాలుగా వ్యవహరించినా, సహజంగా అతనిదైన గుణం ఒకటి ఉంటుంది. అదే అతని నైజం. అది అతణ్ణి నడిపిస్తుంది. నడకే అతని శైలి. పదిమందిలో అతణ్ణి పట్టించేది శైలి మాత్రమే. అలాగే రచనా శైలిని గమనించి రచయితను గుర్తుపట్టవచ్చు. శైలి అనగానే భాష మాత్రమే గుర్తుకొస్తుంది. భాష ఒక్కటే శైలి కాదు. పదము, వాక్యము, వర్ణన, పోలిక, అలంకారాదులన్నీ ఇందులోనివే. వీటన్నింటిలోకి భాష ప్రథమంగా నిలుస్తుంది. లక్ష్మీపతి రచనా శైలి విలక్షణమైనది. అది అతణ్ణి సమకాలీనుల్లో విలక్షణ రచయితగా నిలిపింది. అలాంటి శైలిని సంతరించుకోవడం వెనుక అకుంఠిత కృషి ఉంది. ఇతని జ్ఞానస్థాయి కథల్లో కదులుతుంది. దాని ద్వారా శైలి రూపుకట్టింది. సాధారణంగా రచయితలు పాత్రోచిత భాష, ప్రామాణిక భాష, వాడుక భాషను ఉపయోగిస్తుంటారు. పాత్రలను వాడుక భాషకు వదిలి కథనాన్ని ప్రామాణిక భాషలో సాగించడం ఒక పద్ధతి. కథ మొత్తం ప్రామాణిక భాషలో కొనసాగించడం మరొక పద్ధతి. అందుకు భిన్నంగా కథ మొత్తం వాడుక భాషలో రాయడం ఇంకొక పద్ధతి. ఈ మూడు పద్ధతుల్లో లక్ష్మీపతి కథలు రాశాడు. ఈ మూడింటిలోను ప్రామాణిక భాషకు పెద్దపీట వేశాడు. తన ఆంగ్ల పరిజ్ఞానం ఇందుకు కారణమైంది. విషయాన్ని విపులీకరించాలనే తపన నుండి కథనం పుడుతుంది. అందుకు వర్ణనలు దోహదపడతాయి. అవి ఇతని కథల్లో ఎక్కువ. ఫలితంగా దృశ్యీకరణ సాధ్యమైంది. వర్ణనల్లో కవిత్వం చిందేసిది. కాస్మోపాలిటన్ సంస్కృతి అక్కడ సోషలిజం నీడవలె ఉన్నది అనడంలో అవగాహనా స్థాయి అవగతమవుతుంది. రచయితకు వచనంపై ఉన్న పట్టు తెలుస్తుంది. పాఠకులకు వర్ణనలు ప్రతి కథలో తారసపడుతాయి. రచయిత పరిశీలనా శక్తికి ఇలాంటివి సాక్ష్యాలుగా నిలుస్తాయి.
'ముసల్దాని ముల్లె' పెద్దకథ. ఇందులో అనేక పాత్రలు, రకరకాల మనస్తత్వాలు, విభిన్న సంభాషణలు, తీరొక్క సమస్యలు. ఎవరి లోకం వారిది. వీళ్ళందరిని బస్సులో కుక్కి, కథ నడిపాడు రచయిత. కథంతా మాటల మయం. కథలో మాండలికం, ప్రామాణికం పోటీపడ్డాయి. ఒక వైపు చిన్న వాక్యాలు. మరోవైపు పేరాలకు పేరాలు కనిపిస్తాయి. కథకుడి ఆంగ్ల సాహిత్య అభినివేశం ప్రవహిస్తుంది. అందుకే ''జేమ్స్ జాయిస్, వర్జీనియావుల్ఫ్, టాల్‌స్టారు, మామ్, కుష్వంత్‌సింగ్, అబ్బాస్, ముల్కరాజ్ ఆనంద్ మొదలగు విదేశీ, స్వదేశీ కలాల మీదుగా నడిచొచ్చిన రచయిత ఆడెపు లక్ష్మీపతి'' అని ఏ.కె. ప్రభాకర్ అన్నాడు. వచనం కొత్తదారులు తొక్కింది. అమాయకపు ముసలిది ఆలోచింప జేస్తుంటే, ఆర్థిక ప్రసంగం ఆకట్టుకుంటుంది. గొడవలు, ఫిర్యాదులు, లొల్లి, తోపులాట, జ్ఞాన ప్రదర్శన, కథంతా పరచుకొని ఉన్నాయి. స్థానీయత, నాటకీయతలతో కథ పండింది. కథలోని బస్సు ప్రయాణం లోకాన్ని కళ్ళకు కడుతుంది. బస్సులోని మనుషులు తమ తమ ఇండ్లకు పోయే ఆత్రుత, రోజంతా వాళ్ళు పడిన యాతన కథలోని వాతావరణం ద్వారా తెలుస్తుంది. కొన్ని గంటల బస్సు ప్రయాణంలో వ్యక్తుల బతుకు వెతల్ని పాఠకుల ముందుంచాడు. వెతల కారణాల్ని కూడా తెలిపాడు. బస్సు ప్రయాణం నేపథ్యంగా తీసుకొని మినీ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ కథ రచయిత రచనా శైలికి ఉదాహరణంగా నిలుస్తుంది.
''చలిగాలి రివ్వుమని వీస్తూ మంచు సూదుల్ని శరీరం పైకి విసురుతోంది'', ''పరిసరాలు విశాలమైన కాన్వాసు మీద చిత్రించిన సర్రియలిస్టు పెయింటింగుల్లా వున్నాయి.'' లాంటి వాక్యాలు, ''మగువేగా మగవారికి మధుర భావన'', ''తన్హా ఇసీపే జీనాయె కోఈబాత్ హై'' లాంటి తెలుగు, హిందీ పాటలు, ''సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధకే శరణ్యే త్య్రంబకే'' లాంటి పంక్తులు, ''మార్నింగ్ వాకర్స్ ఆర్ ఆఫెన్ బిటెన్ బైడాగ్స్'' లాంటి లైన్లు కథల్లో తరచుగా కనపడతాయి. వాక్యాల్లో కవిత్వం జాలువారుతుంది. కథల్లో ఆత్మాశ్రయరీతి కనపడుతుంది. ఆ సమయంలో తాత్త్విక బోధన జరిగింది. కథను ఎప్పుడూ కొత్తరీతుల్లో నడపాలనే తపన గల లక్ష్మీపతి, కథ కథకు ఒక తీరును ఎంచుకున్నాడు. అదే అతని శైలి. ఇలాంటి శైలితో అతడు సమకాలీన కథారచయితల్లో విశిష్టుడిగా నిలిచాడు.
వైరుధ్యాల మధ్య ఘర్షణ వల్ల కదలిక, కదలిక చేత నడక, నడక నుండి జీవితం, జీవితం ఆసరాగా కథ, కథ కోసం కథనం పుడతాయి. ఇదంతా ఒక క్రమం. కథలో ఈ క్రమం శిల్పగా భాసిస్తుంది. విషయాన్ని ఆసక్తిగా, అర్థవంతంగా సంవిధానం అనేక పోకడలు పోయింది. కొత్తగా చెప్పాలనే తపన, శిల్పంతో ప్రయోగాలు చేయించింది. 'స్టాండర్డ్' అనే కథలో పురుషస్వామ్య దృక్పథంతో భర్త, స్త్రీవాద దృక్పథంతో భార్య కనపడతారు. ఈరెండు పాత్రల మధ్య వైరుధ్యం కథను ముందుకు నడిపించింది. 'ప్రతిబింబాలు'లో ఉన్నత వర్గ కుటుంబ స్త్రీ, తనఇంట్లో పనిచేసే కిందివర్గపు స్త్రీ పట్ల అనుమానం, చిన్నచూపు కలిగి ఉంటుంది. ఆమె మానసికస్థితి, ఆమెలోని హిపోక్రసీ, పనిమనిషి కొడుకు ప్రాణం తీసేవరకు వెళ్తాయి. ముగింపు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఇద్దరు వ్యక్తుల మద్య గల తారతమ్యం కథను నడిపించింది. ఇలాంటిదే 'పుట్టినరోజు' కథ. పేద, ధనిక విద్యార్థుల మధ్య గల బేధాన్ని, వారి ప్రవర్తన ద్వారా విశదీకరిస్తాడు. అందుకు కథనాన్ని ఆశ్రయించాడు. ముగింపు పై అధిక శ్రద్ద కనపరిచాడు. 'విశిష్టగురుత్వం' వర్ణనతో మొదలవుతుంది. వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, కర్మసిద్దయోగ, విశిష్టాహారం, బాబాజీల గురించి ఇందులో విస్తృతంగా చెప్పడం వల్ల వ్యాసధోరణి కొంత వచ్చి చేరింది. కాని విషయ వైవిధ్యం వల్ల కథకు పఠనయోగ్యత కలిగింది.
మనిషి మెదడు ఆలోచనల పుట్ట. అవి నిరంతరం చలిస్తూ, మనిషిని పరిగెత్తిస్తూ కూర్చోబెడుతూ ఊపిరాడకుండా చేస్తుంటాయి. కాలంతో పోటీ పడుతూ ఒకటెనుకొకటి ప్రవాహంలా పోటెత్తుతుంటాయి. అలా గొలుసుకట్టుగా సాగే ఆలోచనా పరంపరను అక్షరాల్లోకి తర్జుమా చేస్తే చైతన్యస్రవంతి శిల్పంగా వెలుగొందుతుంది. లక్ష్మీపతి రాసిన 'జీవన్మృతుడు' చైతన్య స్రవంతి శిల్పంలో సాగింది. ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపించే తీరు, ఆ క్రమంలో మధ్య, కింది తరగతులు నలిగిపోయే రీతిని చిత్రించాడు. హిపోక్రసీ, ఫాల్స్ప్రిస్టేజి మనుషుల్లో ఎలా తిష్టవేసాయో 'భార్య', 'అధికారి' మొదలగు పాత్రల ద్వారా ప్రదర్శించాడు. వస్తువు కింద పడి మనిషి మరణిస్తున్న దృశ్యాన్ని ఆవిష్కరించాడు. అమానవీయత, పరాయీకరణ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పట్టి చూపాడు. ఇదంతా 'వస్తువు' అనే విభాగం కిందికి వస్తుంది. కథ నడిచిన విధానం 'చైతన్య స్రవంతి' పద్ధతిలో ఉంది.
వాక్యంనడక, పదధ్వని, అక్షరాలఅల్లిక, కథల్లో పరచుకొని ఉన్నాయి. ఆలోచనలు, అభిప్రాయాలు, జ్ఞానస్థాయి, భౌతిక స్థితి, బౌద్ధిక గతి, భావజాలం, ఘర్షణ, మున్నగునవి వ్యక్తిపై వేసే ప్రభావాలు కథల్లో కనపడతాయి. సుప్తచేతనలో సంచరించే ఆలోచనలను ఉన్నదున్నట్టుగా, నగంగా 'చేతన' మార్గం పట్టించి దానికి అక్షరాల తొడుగును వేశాడు. దానివల్ల దాపరికం లేని 'మానవుడు' ఆవిష్కరింపబడ్డాడు. దారితెన్ను లేక, తొలి-తుది లేక ఎటు పడితే అటు నడయాడే మనసు చేసే ఫీట్లు ఎన్నో, అన్ని రకాల విషయాలు కథలోకి వచ్చి చేరడం ఈ శిల్పప్రత్యేకత. చవరికి అసంగతం అనిపించినా, కథ నిడివి పెరిగినా, అర్థం చేసుకోవడంలో క్లిష్టత కలిగినా, ఇందులోని నవీనత ఈ రీతిని నిలబెట్టింది. 'తిర్యగ్రేఖ' ఇదే కథా సంవిధానంతో సాగింది. 'రేప్'కు గురి కావడాన్ని పిచ్చికుక్క కాటుతో పోల్చి, సమాజంలో మానభంగం చుట్టూ ఉన్న అపోహల్ని ఖండించాడు. రచయిత ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేశాడు. స్థానికతకు ప్రాముఖ్యత నిచ్చాడు. ''దుప్పటున్నంత మేరకు కాళ్ళు చాపుకోవాలి'' అనే తాత్వికతను ఒంటపట్టించుకున్న కథలివి. ప్రయోగశీలతతో వెలుగులీనుతున్న కథలివి.
- డా|| బి.వి.యన్.స్వామి, 9247817732