Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరికి శానత్తం బాగుంటది. శానత్తం అంటే గార్వం అన్నట్టు. పెండ్లి చేసుకుంటున్నంక ఆలు మొగలు ఏదో పని చేసుకోవాలె లేకుంటే సంసారం నడవది కదా. అట్లనే కొత్తగ పెండ్లి అయినంక తొక్కు నూరుకరాపో పిల్లా అని పెనిమిటి అంటే ఆమె 'రోలు తే మొగడా, రోకలి తే మొగడా రోలు కాడికి నన్ను ఎత్తుకపో మొగడా' అని అన్నదట. అంటే తొక్కు కావాలంటే రోలు ఆయన ఎత్తుకరావాలె, రోకలి కూడా తీసుకరావాలె, లేస్తే సరిపోలేదా ఆ రోలు కాడికి తనను ఎత్తుక పోవాలెనన్నట్లు గార్వ పడ్డదట. ఇసోంటి వాల్లను 'గార్వాల గన్నె మొగన్ని తన్నె' అని కూడా అంటరు. నీవే చెయ్యాలె ఎవలకు చెయ్యరాదు అంటే మీది మీదికి పోతరు కొందరు. గిట్లనే వాల్లను 'అమ్మమ్మ నీ ఉచ్చ మందులకు కావాలె అంటే చింత చెట్టు ఎక్కి చిమ్మిచ్చి పోసిందట' అనే సామెత కూడా ఉన్నది. అమ్మమ్మ అంటే ముదుసలి అమ్మను ఏదో కావాలెనంటే తను ఊకున్నదా, దొరకకుంట చింత చెట్టు ఎక్కినట్లు అని నానుడి వాడుతరు
అట్లనే మొగుల్ల మీద కూడా మస్తు సామెతలు ఉన్నయి. 'ఏరికోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నిండట' అంటరు. గా పిలగాడే కావాలె మంచిగున్నడు అని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నదట ఎనుకటికెవలో. అప్పుడు ఆ వైనాల పెండ్లి పిలగాడు అన్ని వంకలే పెట్టి తాపతాపకు లొల్లి పెట్టుకుంటండట. అసోంటోల్లను ఎగిరెగిరి తంతండట అని అంటరు. సామెతలు బహు మస్తుగా ఉంటయి. ఒక సామెత చెప్పితే కథ మొత్తం అయిపోవుడే. ఈ సామెతలకు ప్రజలే రచయితలు. పరంపరగా తమ నోటి నుండే వారసత్వంగ వస్తుంటయి ఒక తరం నుంచి మరో తరం దాక. ఇవి పల్లె సంస్కృతిలో భాగం. వీటిని వాడటం వల్లనే మనం అందరం పరిరక్షించుకోవచ్చును.
- అన్నవరం దేవేందర్, 9440763479