Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడో 8 దశాబ్దాల క్రిందటి (1934 నాటి) గొప్ప సాహితీ సంస్థను తన భుజాలకెత్తుకుని కార్యకర్తగా, కావ్యకర్తగా, జర్నలిస్ట్‌గా, కవిగా, సాహితీమేఖల ప్రధాన కార్యదర్శిగా పున్న అంజయ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. సాహితీ మేఖల వ్యవస్థాపకులు అంబటి పూడి వెంకటరత్నంశాస్తి, 1922 నాటికే షబ్నవీస్ వేంకట రామ నర్మింహారావు తొలి తెలుగు పత్రిక 'నీలగిరి' నల్గొండలో ప్రారంబించారు. రైతాంగ సాయుధ పోరాట కాలానికి ముందే రావి నారాయణరెడ్డి సహకారంతో హరిజనుల కోసం పాఠశాల కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు, నిరంతర జన చైతన్యం ఈ ప్రాంతం సొంతం.
42 వ్యాసాలున్న ఈ పుస్తకానికి దేవరాజు మ హారాజు చక్కటి విలువైన ముందు మాట రాశారు. నల్గొండ జిల్లాలో శతక కవులు- ఒక పరిశీలన (పేజీ 24) వ్యాసంలో పాల్కురికి సోమన తర్వాత కవి నాగేంద్రుడు 'రమాధీశ్వరా శతకం' రాశాడు. 1926లో వావిళ్ళ వారు ప్రచురణ; 9వ ఏటకే వరదరాజస్తుతి, శ్రీరంగ శతకాలు రాసిన కవి మరింగంటి సింగరాచార్యులు లాంటి ఎన్నో విషయాలు రాసిన కృష్ణ పత్రికలో ప్రచురణైన వ్యాసం ఇది.
నల్గొండ జిలాలో పత్రికారంగం (పేజీ 28)వ్యాసంలో చలం కథలు ప్రచురణకు భయపడే కాలంలో ఆయన కథ ప్రచురించిన 'నీలగిరి' పత్రిక - శేషాద్రి రమణ కవులు, మాడపాటి, సురవరం, కంభంపాటి, గంగలశాయిరెడ్డి, బూర్గుల లాంటి వారి సాహిత్య రచనలు. కాంచనపల్లి చిన వెంకట రామారావుపై రాసిన వ్యాసం (పేజీ 36) ఏలే యల్లయ్య సిద్ధాంతి (పేజీ 61) చిత్ర విచిత్రంగా నల్లగొండ చిత్రసీమ అనే వ్యాసంలో (పేజీ 65) ప్రత్యూష, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, కాంతారావు, శంకర్, ప్రభాకర్‌రెడ్డి, వేణుమాధవ్, పొట్టి వీరయ్య, ఎం. వెంకట నర్మింహాచార్యులు చందాల కేశవదాసు గురించిన విశేషాలు బాగున్నాయి.
దాదాపు 41 సాహితీ సాంస్కృతిక రంగ సంస్థలు, వ్యక్తులు, వారి గురించిన విలువైన సమాచారంతో వున్న అంజయ్య పరిశోధనాత్మకంగా రాసిన వ్యాస సంపుటి ఈ పుస్తకం.
విద్యావేత్త చినవెంకటరెడ్డి, ప్రజాపోరు నాటికల రివ్యూ, తెలంగాణ ఉద్యమంలో నల్గొండ, దాశరథ అగ్నిధార, 1949, తొలిగా ప్రచురించిన సాహితీ మేఖల తెలుగు వెన్నెల, పెన్నూ గన్నూ పట్టిన సుద్దాల, డా||దేవులపల్లి రామానుజరావు వ్యాసాలు రిఫరెన్సుగా నిలుస్తాయి. విలువైన పుస్తకం ఇది.
- తంగిరాల చక్రవర్తి , 9393804472