Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గజ్జెల రామకృష్ణ' తొలి కవితా సంకలనం 'దీపముండగానె'. వృత్తి జీవితంలోని ఆర్తిని, దైన్యాన్ని వ్యక్తీకరించడంతో పాటు బతుకులో అంతుచిక్కని కోణాలను స్పృశిస్తోంది. పోగుపోగుకూ కలల మగ్గం మీద కవితా ఊహల భావాలను, అద్భుత కవనాలుగా నేయగల నేర్పరి అయిన కవితా హృదయం ఈ సంపుటిలో ప్రతిబింబిస్తోంది. ''కట్టె కొట్టినా... బొమ్మ చెక్కినా... చెప్పు కుట్టినా.. డప్పు మోగించినా... బట్ట ఉతికినా. మగ్గం నేసినా'' అంటూ తెలంగాణ సీమలో బహుజనుల బాధలు, ఛిత్రమైన జీవన కథనాలు, ఉప్పు, నిప్పు, శ్రమ, ప్రేమా బతుకు వాస్తవాలను రామకృష్ణ కళ్ళకు కట్టింప చేస్తారు. ఆకాశంపైకి చూస్తూ చిగురు పిట్టలు ఎప్పుడొస్తాయని 'దిగులు పూసిన చెట్టు' ఈ సంపుటిలో కనబడుతుంది. రాత్రి పగలూ కలలు అద్ది నేసిన చీర అమ్మకం బజారులో గాజుబొమ్మలా 'మగ్గం పాడుతున్న చేదు గానం' హృదయాన్ని కదిలిస్తుంది. ఆశలు ఆశయాలు నిద్రమత్తులో జారిపడకుండా తూరుపువాకిట ఎర్రటి సరుకు కాగడా మండించి అంటూ ఆకాశాన్ని 'అమృతధార' కవితలో సాక్షాత్కరింపజేశారు. పట్నం గది నిండు పుస్తకాల నడుమ బందీ అయినా అప్పటికప్పుడు అప్పగింతల పాలయినా, నాన్నగుండె బెంగపడే కొండంత ఎడబాటు 'కూతురు పద్యం' కలవరం కలిగిస్తుంది. 'నెమలిపాదాలు' కవితలో అరవైఏండ్లుగా పాదరక్షలు లేని నాన్న నడక పాట మౌనవేదన వినిపిస్తుంది. 'చౌరస్తాలో పెద్దపులి' కవితలో అది మేక అంటే నేనొప్పుకోను, ఖాళీ కడుపు కాలినప్పుడు ఎదురు తిరగడం నేర్వాల్సిన గొప్పపాఠం దర్శింపజేశారు. 'పంజరం' కవితలో నగరానికి నేనొక వలస పక్షిని అంటూ రామకృష్ణ నగరం మాయల ఫకీరులా నవ్వుకుంటుంది అంటూ పెదవులపై నవ్వు పతంగులు ఎగరేయలేనంటారు. 'వాడిని చూస్తే గుర్తుకొస్తుంది' కవితలో ఎండలో నిప్పులా, వానలో నదిలా, చలిలో మంచులా కాలాన్ని కాలువలా దాటుతున్న వీధుల్లో తిరిగే నిర్భాగ్యున్ని చూపిస్తారు. గుడ్డిదీపం, కట్లపాము, సాలెగూడు, నల్లకుక్క, గాలిపటం, చిలుక రెక్క, రెక్కల గుర్రం, ఒక్క రూపాయి ఈసంపుటిలో ఒదిగిన ఏ కవిత అయినా 'గజ్జెల రామకృష్ణ' అద్భుత కవితాక్షరాలకు ప్రాణం పోసి వెలకట్టలేని కానుకగా తన్మయింపజేస్తున్నాయి.సామాజిక వేదనను ప్రతిభావంతంగా కవితాక్షరాలుగా అల్లిన 'గజ్జెల రామకృష్ణ' అభినందనీయులు
- జయసూర్య, 9014948336