Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం. 1948లో ఆ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భవించింది. ఈ సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 7 కి ఆ సంస్థ ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ రోజుకున్న ప్రాధాన్యత ఏంటంటే.. ఆరోగ్య వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమిస్తూ కార్యాచరణ ద్వారా భవిష్యత్తుని మెరుగుపరుచుకునేలా సమాయత్తమవడానికి అందరం నడుం బిగించాలి.
ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ థీమ్ 'అందరికీ ఆరోగ్యం'. ఈ మాట కొత్తది కాదు. 1978లో కజికస్తాన్లో 'ఆల్మా ఆటా ప్రకటన'లో ఈ నినాదం వినిపించింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ దీనికి కట్టుబడి ఆరోగ్య వ్యవస్థలో ఎన్నో మార్పులను సూచించాయి. కానీ 90వ దశకం నాటికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మాట కొట్టుకుపోయి, ప్రజారోగ్యం స్థానంలో కార్పొరేట్ వైద్యం వేనూళ్ళుకుంది. కరోనా పెనుముప్పు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను కుదిపేసింది. అది లేవనెత్తిన సవాళ్ళతో 'అందరికీ ఆరోగ్యం' అనే మాట మళ్ళీ గుర్తొచ్చింది. ప్రజారోగ్యం, ప్రాథమిక ఆరోగ్య సేవలు, ఫ్యామిలీ మెడిసిన్, అందరికీ అందుబాటులో వైద్యం, ఇంటింటికీ వైద్యం అంటూ పలు రకాల సేవలు ముందుకొస్తున్నాయి.
వైద్యంలో సమన్యాయం లేదా ఈక్విటీ లేకపోవడం అనేది దాదాపు మూడు దశాబ్దాలుగా చూస్తున్నాం. విద్య, వైద్యం ఉచితంగా అందవలసిన చోట ప్రజల జేబులు చిల్లు పడే విధంగా వ్యాపారమైపోయి, ఈ సమన్యాయం దెబ్బతిని పోయింది. కరోనా కల్పించిన భయానక వాతావరణంలో శవాలు గుట్టలు గుట్టలు పేరుకుపోయాక ఈ నిజం మరింత స్పష్టమయింది. అందుకే ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య సేవల గురించి, ప్రజారోగ్యం గురించి మళ్ళీ చర్యలు ప్రారంభమై 'అందరికీ ఆరోగ్యం' అనే నినాదం ముందుకొచ్చింది.
ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలంటే నాలుగు అంచెలు పాటించాలి. 1 మూల్యాంకనం లేదా ఇవాల్యూయేషన్, 2. విధానాభివృద్ధి, 3. వనరుల కేటాయింపు, 4. వసతుల సౌలభ్యం. ఇవి అందుబాటులోకి రావడం లేదా ఏక్సెస్. అంటే ప్రజారోగ్య కార్యాచరణలో భాగంగా ఆనారోగ్య కారణాలని బేరీజు వేసుకోవాలి. అన్నీ వర్గాల వారి ఆరోగ్య స్థాయిని అంచనా కట్టాలి. మూలాలు అర్థమయ్యాక ప్రభుత్వాలు ఆ కారణాలని అరికట్టే విధంగా విధానాలని రూపొందించి వాటిని బలోపేతం చేయాలి. దానికి తగిన వనరులని సమకూర్చుకుని అన్ని ప్రజారోగ్య సేవలని, కార్యక్రమాల్ని విజయవంతం చేయాలి.
ఈ క్రమంలో సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ, రాజకీయ బేధాలన్నీ అధిగమించి, వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలి. విధానాల రూపకల్పనతో పాటు వాటి అమలులో చిత్తశుద్ధిని కనపరుస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి.
ఆరోగ్య వ్యవస్థకి ప్రాథమిక ఆరోగ్య సేవలే పునాదిగా వుండాలి. ఎలాంటి తేడాలు లేకుండా వైద్యం అనేది ప్రాథమిక హక్కుగా అందరూ పొందగలగాలంటే, అత్యున్నత స్థాయిలో వారి ఆరోగ్యం మెరుగుపడాలంటే, ప్రాథమిక ఆరోగ్య సేవలు ముమ్మరంగా అమలు కావాలి. అప్పుడే వ్యాధుల నియంత్రణ, నివారణ, ఆరోగ్య మెరుగుదల, వైద్య సేవల విస్తరణ, పునరావాసం, ఉపశమన సేవలు సవ్యంగా అమలవుతాయి.
అందరినీ కలుపుకుంటూ, అందరికీ సమానంగా అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే అత్యున్నత ఆరోగ్య సేవల వల్ల ప్రజలు భౌతికంగా, మానసికంగా, సామాజికంగా మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కుటుంబ ఆరోగ్య వ్యవస్థ అంటే ఫ్యామిలీ డాక్టర్లు ఎంతో అవసరమని క్యూబా వంటి దేశాలు దశాబ్దాలుగా రుజువు చేస్తుంటే, కరోనా కాలంలో మిగిలిన దేశాలు కూడా దీని ప్రాధాన్యతను గుర్తించాయి.
మెరుగైన ఆరోగ్య సేవలతో పాటు సామాజిక పరిరక్షణ, మంచినీటి సౌకర్యం, అందరికీ మెరుగైన ఆహారం, పారిశుద్య సేవలు, తల దాచుకునే గృహ వసతి, ఉచిత విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి అన్ని రకాల భద్రత వుంటేనే అందరికీ ఆరోగ్యం సాధ్యమవుతుంది.
45 ఏళ్ళ తర్వాత మళ్ళీ 'అందరికీ ఆరోగ్యం' అనే నినాదం ముందుకు రావడం ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ ప్రపంచ దేశాలని ఆ దిశగా హెచ్చరించడం ప్రజారోగ్యం మెరుగుదలకి నాంది కాగలదని ఆశిద్దాం.
- డా|| నళిని
9441426452