Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ మెదడులో ఏర్పడే కొన్ని వ్యత్యాసాల వల్ల వచ్చే అభివృద్ధి వైకల్యం. పసిపిల్లల్లో 9 నెలలు వచ్చినప్పటినుంచి మెంటల్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందుతూ వుంటుంది.
యునైటెడ్ స్టేట్స్‌లోని 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (సి.డి.సి) సంస్థ తన నివేదికలో 2020 సంవత్సరానికి ప్రతి ముప్పై మంది పిల్లల్లో ఒకరికి ఎ.ఎస్.డి. వున్నట్టు ప్రకటించింది.
ఎ.ఎస్.డి. అంటే 'ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్'. ఎ.ఎస్.డి. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో నాలుగు రెట్లు అధికంగా వున్నట్లు సి.డి.సి. పేర్కొంది.
ఇప్పటికీ పిల్లల్లో ఆటిజం లక్షణాల్ని నాలుగు సంవత్సరాల వయసు వచ్చాకే గుర్తించడం జరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఆటిజంని నిర్థారించడానికి సరైన పరీక్షా విధానాలు గానీ, వైద్య పరమైన గుర్తింపు పద్ధతులు గానీ లేకపోవడమే.
ప్రారంభదశలోనే పిల్లల్లో ఆటిజాన్ని గుర్తించగలిగితే వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, మెంటల్ డెవలప్మెంట్ వంటి వాటిని కొంత మెరుగుపరచడానికి అవకాశం ఎక్కువగా వుంటుంది.
ఆటిజం అంటే ఏంటి? దానికి కారణాలు ఏంటి?
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది మెదడులో ఏర్పడే కొన్ని వ్యత్యాసాల వల్ల వచ్చే అభివృద్ధి వైకల్యం (డెవలప్ మెంటల్ డిజెబిలిటీ).
పసిపిల్లల్లో 9 నెలలు వచ్చినప్పటినుంచి మెంటల్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందుతూ వుంటుంది. వ్యక్తుల్ని గుర్తుపట్టడం, నవ్వడం, మాటలకి స్పందించడం, అనుకరించడం, ఎమోషన్స్‌ని వ్యక్తపరచడం వంటి నైపుణ్యాలు, సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఎ.ఎస్.డి. వున్న పిల్లల్లో ఈ లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. వీరిలో కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, సోషల్ ఇంటరాక్షన్, గ్రహణశక్తి చాలా తక్కువగా వుంటుంది.
ఈ ఆటిజానికి గల కారణాలను శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. జన్యుపరమైన అంశాలు కారణం కావచ్చనేది నిపుణుల అంచనా. అలాగే తల్లిదండ్రులకి 45- 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత పుట్టిన బిడ్డలకి కూడా ఆటిజం వచ్చే అవకాశాలు వున్నాయని చెపుతున్నారు. ఎ.ఎస్.డి. వున్న తోబుట్టువును కలిగి వున్న పిల్లలకి కూడా ఆ లక్షణాలు రావచ్చని కూడా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ చిన్నపిల్లల్లో ఏర్పడే ఈ ఆటిజంకు గల కారణాలను తెలుసుకోవడానికి విస్తృతమైన పరిశోధనలు జరపాల్సిన అవసరం ఎంతో వుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
లక్షణాలు :
పిల్లలు కొంత ఊహ వచ్చినప్పటి నుంచి కొత్త విషయాల్ని తెలుసుకోవడం, అనుకరించడం, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చేస్తుంటారు. వాటినే 'మైల్ స్టోన్స్' అంటాం.
ఆటిజం వున్న పిల్లలు ఈ మైల్ స్టోన్స్‌ని రీచ్ అవలేరు. సాధారణమైన పిల్లల్లో కనిపించే మెంటల్ డెవలప్మెంట్ వీరిలో కనిపించదు.
ప్రధానంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లలకి ఆరు నెలల వయసు వచ్చినప్పటి నుండి వారి ప్రతి కదలికనూ గమనిస్తూ వుండాలని 'అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్' (ఎ.ఎ.పి.) సూచిస్తోంది.
ఆటిజంని ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే వారి మేధో అభివృద్ధి (మెంటల్ డెవలప్మెంట్) కాలక్రమేణా మెరుగుపడేందుకు అవకాశం వుంటుంది.
ఆటిజం లక్షణాలు కొంతమందిలో 12 నెలల వయసుకి కనిపిస్తే, మరికొందరిలో 24 నెలల తర్వాత బయటపడవచ్చు.
తల్లిదండ్రులు గమనించాల్సిన లక్షణాలు :
- ఐ కాంట్రాక్ట్ సరిగా లేకపోవడం
- 9 నెలల వయసులో పేరుపెట్టి పిలిచినా స్పందించకపోవడం
- 9 నెలల వయసులో సంతోషం, విచారం, కోపం, ఆశ్యర్యం వంటి భావ వ్యక్తీకరణ ప్రదర్శించలేకపోవడం
- 12 నెలల వయసులో సాధారణ ఇంటరాక్టివ్ గేమ్స్ ఆడకపోవడం
- 12 నెలల వయసులో 'బైబై', 'హైఫై' వంటి సంజ్ఞలను ఉపయోగించకపోవడం
- 15 నెలల వయసులో వాళ్ళు ఇష్టపడే బొమ్మల్ని, ఆట వస్తువుల్ని చూపించలేకపోవడం
- 24 నెలల వయసులో ఎదుటివారి సంతోషాన్ని, దు:ఖాన్ని గమనించి స్పందించలేకపోవడం
- 36 నెలల వయసులో ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవాలనే ఇన్టెన్షన్ లేకపోవడం
- 36 నెలల వయసులో రంగులని, ఆకృతులని (షేప్స్) గుర్తించలేకపోవడం
- 48 నెలల వయసులో సాధారణంగా మిగిలిన పిల్లలు అనుకరించినట్టు టీచర్ని, తల్లిదండ్రుల్ని, సూపర్ హీరోల్ని అనుకరించడం గానీ, వాళ్ళలా నటించడం గానీ చేయలేకపోవడం
- 60 నెలల వయసులో సంగీతం, డాన్స్, కొత్త ఆటలు నేర్చుకోవడం, కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి.
పిల్లల్లో ఇలాంటి లక్షణాల్ని తల్లిదండ్రులు గమనించినట్లయితే వెంటనే నిపుణులని సంప్రదించాల్సిన అవసరం వుంది.
ఆటిజం వున్న పిల్లల్లో హైపర్ యాక్టివ్నెస్ ఉండే అవకాశం కూడా ఉంది. అంతే కాదు, వారు కొన్ని పనులను చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడే సందర్భాల్లో ఒక్కొక్కసారి సాధారణ పిల్లల కన్నా ఎక్కువ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.
ఎలా నిర్థారిస్తారు?
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పిల్లలు ఎదుగుతున్న సమయంలో వారికి 'డెవలప్మెంటల్ అండ్ బిహేవియర్ స్క్రీనింగ్ 'ని సిఫార్స్ చేస్తోంది.
కేవలం ఎ.ఎస్.డి. వున్న పిల్లలకే కాకుండా ప్రతి పిల్లవానికి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకూ ఈ డెవలప్మెంట్ స్క్రీనింగ్ చేయించడం మంచిదని ఎ.ఎ.పి. పేర్కొంది. దానివల్ల ఆటిజం లక్షణాల్ని ప్రాధమిక దశలోనే గుర్తించవచ్చు.
స్క్రీనింగ్ చేయించవలసిన వయసుని ఈ క్రింది విధంగా నిర్థారించారు...- 9 నెలలు,- 18 నెలలు,- 24 నెలలు,- 30 నెలలు,- 36 నెలలు,- 42 నెలలు,- 60 నెలలు.
ఈ స్క్రీనింగ్ ద్వారా పిల్లల మానసిక ఎదుగుదల, శారీరక కదలికలు (బాడీ లాంగ్వేజ్) వయసుకి తగ్గట్టుగా అభివృద్ధి చెందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు అవకాశం వుంటుంది.
ఒక్కొక్కసారి ఆటిజం లక్షణాలు తక్కువ స్థాయిలో వున్నప్పుడు ఆ లక్షణాలు వారు కౌమారదశలో వున్నప్పుడు గానీ, లేదా వారికి పెద్ద వయసు వచ్చాక గానీ బయటపడే అవకాశం వుంటుంది.
స్క్రీనింగ్ ఎవరు చేస్తారు?
ఈ స్క్రీనింగ్ అనేది నిపుణుల ద్వారా చేయాంచాలి. డెవలప్మెంటల్ పీడియాట్రీషియన్స్, చైల్డ్ న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను స్క్రీనింగ్ కోసం సంప్రదించాలి.
వాళ్ళు తల్లిదండ్రులకి ఒక క్వశ్చనీర్ని ఇస్తారు. దానిలో పిల్లవాడి స్కిల్స్ అండ్ ఎబిలిటీస్కి సంబంధించిన అనేక ప్రశ్నలు వుంటాయి. వాటికి తల్లిదండ్రులు స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలి. వాటి ద్వారానే నిపుణులు పిల్లవాని గురించిన పూర్తి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆ సమాచారాన్ని బట్టి పిల్లవానిలో ఎ.ఎస్.డి. లక్షణాలు వున్నాయా? లేవా? వుంటే ఏ స్థాయిలో వున్నాయనే విషయాన్ని నిర్థారణ చేస్తారు.
నిపుణుల సలహాలను బట్టి పిల్లవాడి మానసిక అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాన్ని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, క్లాస్ టీచర్స్ అందించాల్సి వుంటుంది.
చికిత్స అనేది మందులతో పాటు ఎక్కువ శాతం సాధన ద్వారా, అభ్యాసం ద్వారానే అందిస్తారు.
ప్రవర్తనా పరమైనవి (బిహేవియర్), మానసిక అభివృద్ధి (మెంటల్ డెవలప్మెంట్), విద్యాపరమైనవి (ఎడ్యుకేషనల్), సామాజిక సంబంధమైనవి (సోషల్ రిలేషనల్), మానసిక సంబంధమైనవి (సైకలాజికల్)... ఇలా అనేక అంశాలకి సంబంధించిన చికిత్సలు అందుబాటులో వున్నాయి.
ఆటిజం పిల్లల కోసం ప్రత్యేకమైన తరగతి గదులు కూడా ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు కూడా వారితో పాటు తరగతులకు హాజరయినట్లయితే ఇంటి దగ్గర కూడా పిల్లలకి ఏ విధంగా అభ్యాసం చేయించాలనే దానిమీద వారికి అవగాహన ఏర్పడుతుంది. ఇది ఎంతో ప్రదానమైన అంశంగా గుర్తించాలి.
కొన్ని పట్టణాల్లో ఆటిజం వున్న పిల్లల తల్లిదండ్రులు ఒక అసోసియేషన్‌గా ఏర్పడి పిల్లల అభివృద్ధి గురించి పరస్పరం చర్చించుకుంటున్నారు. తద్వారా ఒకరి నుంచి ఒకరు కొత్త విషయాలు తెలుసుకుని, వాటిని తమ పిల్లల అభివృద్ధి కోసం అమలుచేస్తున్నారు. అంతేకాదు, తమ పిల్లలకి నృత్యం, సంగీతం, పెయింటింగ్ వంటి కళలలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం, వాళ్ళతో వేదికలమీద ప్రదర్శనలు ఇప్పించడం చేస్తున్నారు. వీళ్ళు కూడా సాధారణ పిల్లలకి ఏ మాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. అలా చేయడం వల్ల తమ పిల్లలు ఎంతో ఉత్సాహంగా వుంటున్నారని, వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా అభివృద్ధి చెందుతున్నాయని ఆ తల్లిదండ్రులు చెప్పడం అభినందనీయం.
సమాజం బాధ్యత ఏమిటి?
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక మానసిక ఎదుగుదల సమస్య అన్న విషయాన్ని మనందరం గ్రహించాలి. దానికి ఇతర ఎలాంటి పేర్లూ పెట్టకూడదు.
అటువంటి పిల్లలకి సమాజం కూడా తన సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఎంతైనా వుంది.
అదెలాగంటే.... ఆటిజం వున్న పిల్లల గురించి మనకు తెలియని అనవసర చర్చలు చేయకూడదు.
వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల దగ్గర అక్కర్లేని సానుభూతి మాటలు మాట్లాడకూడదు.
ఆ పిల్లలు ఏ చిన్నపని చేసినా దాన్ని అభినందించాలి. దానివల్ల వారికెంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది.
మన చుట్టుపక్కల ఆటిజం పిల్లలు వున్నట్లయితే మన పిల్లల్ని వాళ్ళతో కలిపి ఆడుకోమని ప్రోత్సహించాలి. అది కేవలం ఒక మానసిక సమస్యే అని, వాళ్ళకి మనందరి సహాయ సహకారాలు అవసరమనే భావన పిల్లల్లో కలిగేలా వారిని ఎడ్యుకేట్ చెయ్యాలి.
అప్పుడే పసిపిల్లల్లో ఏర్పడే ఆటిజం అనే మానసిక రుగ్మత ఆ పిల్లల పాలిట, వారి తల్లిదండ్రుల పాలిట శాపంగా మారకుండా వుంటుంది.
(ఏప్రిల్ 2 వరల్డ్ ఆటిజం ఎవేర్నెస్ డే సందర్భంగా)
- గోపలూని అమ్మాజి,7989695883
హ్యూమన్ సైకాలజిస్ట్