Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కె.వి.ఎన్.ఎల్. ప్రసన్న కుమారి
వీరిది శిల్ప సమన్విత కవిత్వం. సామాజిక స్పృహకు విడాకు లివ్వకుండా అభ్యుదయ భావాలతో కవిత్వం రాయడం వీరిలోని మరో విశేషం అంటారు ఎలనాగ. వ్యంగ్యం చమత్కారం, హేళన, ఆర్ధ్రత కనిపిస్తాయి. ''స్వేచ్ఛా గగన గమ్య గమన చైతన్య ఝరిని కలగనడం మానదు ఈ కవిత్వం'' అంటారు సిద్ధార్థ.
ఒక్కో కవిది ఒక్కొక్క రహస్య భాష. ఆ రహస్య భాష తెలిసిన లబ్ద ప్రతిష్టులైన కవి నిజం శ్రీరామమ్మూర్తి అంటారు నాగరాజు రామస్వామి. ఇంకా రంగనాథం, సిద్ధార్థ, తాడి ప్రకాష్, డా||సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అవినాష్ గౌడ్ గార్ల ముందు మాటలు కవి కవిత్వాన్ని పాఠకులకు పరిచయం చేస్తాయి.
'జైలు స్వప్నం' కవితలో ఓ చోట కవి ఇలా అంటారు (పేజీ 28) ''సూర్య కారాగ్రాల నుంచి తాకే లేలేత వేడి హరితానికి పాకడం బోధిస్తుంది, పరుచుకున్నంత మేర ఫలపుష్పభరితం కావాలని, పక్షుల పశువుల ఆకలి కూడా తీర్చాలని చెబుతుంది. యోధుల కవచాలుగా అడవులను కనమంటుంది'' అనే పై వాక్యాల్లో రహస్యం సంవేదనాత్మక సందేశం నర్మగర్బ వ్యాఖ్య కనిపిస్తాయి. ప్రేమ తత్వాన్ని కవిత్వీకరించడం చాలా కష్టం. అది తాకని చోటు రోబోటు కవితలో (పేజీ 103) ఒక చోట కవి ఇలా రాశారు ''లోకాతీతమైనది దేహ తీతం కానిది/ ఆస్తి కంటే ముందు అవతరించింది/ లింగ సంగమానికి పూర్వమే పురుడు పోసుకుంది/ ఆ దృశ్య స్పర్శకే వుద్భవిస్తుంది/ తోడెంత లోతైనదో అంత ప్రీతైనదోరు ప్రేమ'' అంటారు కవి.
ప్రపంచీకరణ వస్తు వినియమ మార్కెట్ సంస్కృతిపై 'సంత' కవితలో కవి ఒక చోట చక్కటి అభివ్యక్తితో ఇలా రాశారు... ''మాటు కాసిన నిశ్శ్రమల స్విగ్గీలు వోలాల వలల చేపలమై/ భ్రమానందస్వాములమై/ లోతు యెరుగని ఊబిలో నిరంతరం ఈదుతూ స్పృహ కోల్పోయే బాహువులమై/ సంపాదించే రూపాయిని శాసించలేని చవటలమై పర్యాటక, హిందుత్వాల విష చమురు నింపిన లక్షద్వీపాలమై/ ఓటరేసిన దగ్ద నాసికలమై'' అంటారు. ఇలా అన్ని కవితలూ ఆలోచింపజేస్తాయి.
బూడిద చెట్ల పూలు, రచయిత : నిజం (గార శ్రీరామ్మూర్తి), పేజీలు : 134, వెల : 150/-, ప్రతులకు : నిజం ప్రచురణలు
ఎ- 26, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ - 500033, సెల్ : 9848351806.