Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జ్వలిత, 9989198943
'న స్త్రీ స్వాతంత్య్రమర్హతే' అన్న కుట్రను గుర్తించి స్త్రీలకు అక్షర జ్ఞానాన్ని అందించిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే. బ్రాహ్మణీయ ధర్మశాస్త్రకర్తలు స్త్రీల పట్ల దురుద్దేశంతో, స్వార్థంతో విద్యకు దూరం చేసేందుకు, 'స్త్రీ విద్య, అనర్థదాయకమని, మహా పాపమని, స్త్రీ చదువు వల్ల పురుషులకు ఆయుక్షీణమనే మూఢ ప్రచారాలను కొనసాగిస్తున్న కాలంలో, 'మనువు చెప్పేది అబద్ధం, నమ్మకండి, భయపడకండి, స్త్రీలంతా చదువుకోండి, మీకు నేను అండగా ఉంటాను' అని ధైర్యాన్ని చెప్పాడు. స్వయంగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యనేర్పి, మొదటి ఉపాధ్యాయురాలిగా చేసి, స్త్రీ విద్యకు కృషి చేశాడు.
1984లో బెహరంజీ మెర్వాంజీ మలబారి అనే పారసీ సంఘసంస్కర్త ఒకరు బాల్య వివాహాలు, బలవంతపు వైధవ్యాల గురించి ఆనాటి వైస్రారు లార్డ్ రిప్పన్ కు రెండు సూచనాత్మక పత్రాలను సమర్పించారు. వాటిని ప్రముఖ సంఘసంస్కర్తలకు, సామాజిక కార్యకర్తలకు కూడా పంపారు. ఆ సూచనాత్మక పత్రాలపై జ్యోతిబాపూలే అనుకూలంగా స్పందించాడు. ఆనాటి బ్రాహ్మణ వితంతువుల దుర్భర పరిస్థితి పట్ల ఆయన ఎంతో సానుభూతి వ్యక్తపరిచాడు.
ఇప్పటికీ జ్యోతిబాపూలే దంపతులను వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణ స్త్రీల కోసం 139 సంవత్సరాల క్రితమే ఎంత కృషి చేశాడో తెలుసుకోవలసిన అవసరం ఉంది. బి.ఎం. మలబారి సూచనాత్మక పత్రాలకు జ్యోతిరావు పూలే స్పందన రెండు రకాల ప్రాధాన్యతను కలిగి ఉన్నది. మొదటిది ఆయన బ్రాహ్మణలకు వ్యతిరేకి కాదు. బ్రాహ్మణీయ వ్యవస్థ కుట్రను కూల్చివేయడం వల్ల శూద్ర, అతిశూద్ర కులాల వారే కాక మొత్తం సమాజం విమోచన సాధించవచ్చని పూలే విశ్వసించాడు. రెండవ కారణం బ్రాహ్మణీయ ధర్మశాస్త్ర కర్తలు స్త్రీల పట్ల దురుద్దేశంతో కూడిన రాతలు రాశారని ప్రకటించడం. ఈ అభిప్రాయాలు ఆధునిక భారతదేశ చరిత్రలో లింగ వివక్షను వ్యతిరేకించిన తొలి తరం వ్యాఖ్యలుగా చెప్పవచ్చు. అందుకే భారతదేశపు మొట్టమొదటి స్త్రీవాది జ్యోతిబాపూలే. మలబారి నోట్స్‌పై పూలే వ్యక్తీకరించిన రెండు అభిప్రాయాలు ఆనాటి స్త్రీ సమస్యలపై ఆయనకున్న అవగాహనకు అద్దం పడతాయి.
నిమ్నకులాలకు బ్రాహ్మణ వితంతువులకు విద్యా అవకాశాలు(మొదటి నోట్స్ పై స్పందన): సార్వజనీన విద్య అనేది జ్యోతిబా పూలే ప్రతిపాదన. బాల్యవివాహాలను నిరోధించడానికి బలవంతపు వైధవ్యాలను నిర్మూలించడానికి విద్య అవసరమని పూలే గుర్తించాడు కనుకనే నిమ్నకులాలకు, శూద్రాతి శూద్రులకు విద్యా అవకాశాలు కల్పించాలని చెప్పాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి సంఘసంస్కర్తల ప్రయత్నాల వల్ల బెంగాలీ హిందువులు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు కొన్ని సూచనలను ఇచ్చారు. అవి అన్ని వర్గాల వారికి, అంటే శూద్రులు అతిశూద్రులు ఇతరులందరికి సార్వత్రికంగా ప్రయోజనకరంగా లేవని అభిప్రాయపడ్డాడు పూలే. నాటి దేశంలో మధ్యస్థాయి కిందిస్థాయి కులాల నిమ్నకులాల మూలవాసులలో బాల్య వివాహాల వల్ల స్త్రీలకు కలిగే నష్టాన్ని, హింసను నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచనలు చేశాడు.
బాల్య వివాహం వల్ల భర్తగా మారిన బాలుడు యుక్త వయసు వచ్చిన తర్వాత చిన్నతనంలో కట్టుకున్న భార్యని ఇష్టపడక తనకిష్టమైన స్త్రీని వివాహం చేసుకునేవాడు. అట్లా మూడు నాలుగు వివాహాలు చేసుకునేవాడు. ఆ విధంగా నిత్యం కుటుంబాలలో గొడవలతో అశాంతి ఉండేది.
మరొక సమస్య వివాహ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే భార్యగా మారిన బాలికకు సరైన తిండి, గుడ్డ, గౌరవం లభించేది కాదు. ఆమెను తల్లిదండ్రులను కలవనిచ్చేవారు కాదు. అటువంటి బాలికలు ఆకలితో బక్క చిక్కి ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకునేవారు. 'రాత్రి పగలు వయసుకు మించి చాకిరీ చేసే అమెరికన్ బానిస కన్నా కష్టమైన బతుకు ఆమెది' అని జ్యోతిబాపూలే అభిప్రాయపడ్డారు. వీటన్నింటికీ అవిద్యే కారణం కనుక విద్యావకాశాలు లేని శూద్రులు అతిశూద్రుల కొరకు ప్రభుత్వం కొన్ని తప్పనిసరి చర్యలు తీసుకోవాలని కోరాడు పూలే.
ఆనాటి అగ్రవర్ణస్తులుగా పిలువబడే హిందువులు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలలో నిండిపోయి మధ్యస్థాయి క్రింద స్థాయి కులాల వారిని రాజకీయ మత సంబంధ విషయాలలో తప్పుతోవ పట్టిస్తున్నారని గ్రహించి, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాడు. వివాహ వయసు బాలురకు 19 ఏళ్లు బాలికలకు 11 ఏళ్లు ఉండాలని, అంత కంటే చిన్న వయసులో జరిగే వివాహాలను నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఆ నిషేధాన్ని అతిక్రమించిన ఇరుపక్షాల వద్ద నుండి పన్నులు వసూలు చేసి, దానిని ఆయా కులాల విద్యాభివృద్ధి కోసం ఉపయోగించాలన్నాడు. (ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు చేశాడు) అయితే ఆ చదువు బ్రాహ్మణ పంతుళ్ళ ద్వారా జరగకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. అట్లా ఎందుకన్నాడో కూడా వివరించాడు. బ్రాహ్మణ పంతుళ్ళు విద్యార్థుల మెదళ్ళలో చదువు చెప్పే నెపంతో తప్పుడు మత విలువలను నింపుతున్నారని, దానివల్ల విద్య వలన కలిగే చైతన్యాన్ని, జ్ఞానాన్ని పొందలేక గందరగోళం పాలవుతారని, హెచ్చరించాడు. ఆనాటి దురుపదేశాల వల్ల సింధ్యాలు హౌల్కర్లు మోసపోయారు. నేటికీ సాగుతున్న దురుపదేశాల వల్ల బహుజనులు ఐక్యం కాలేకపోతున్నారు. బీసీలు, మైనారిటీలు నష్టపోతున్నారు. కానీ 2023 లో కూడా చదువు పేరుతో విద్య పేరున మత బోధనలతో ద్వేషాలను పెంచుతున్నారు. పట్టాలు పుచ్చుకున్న విద్యావేత్తలు కూడా గందరగోళంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. మద్యం మత్తులో మతం మత్తులో జోగుతూ తమ భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నారు.
బ్రాహ్మణ స్త్రీ బలవంతపు వైధవ్యం పై పూలే అభిప్రాయం: ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ పక్షపాతంతో స్వార్థంతో మగవాళ్లకు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకునే అనుమతినిచ్చింది. ఆ విధంగా మగవారు చెడు ప్రవర్తనకు లోనయ్యే అవకాశం కలిగిస్తున్నదంటూ, విచ్చలవిడిగా సానివాడల్లో జొరబడే భర్తల గురించి చెప్పాడు పూలే. విచ్చలవిడిగా తిరిగి సుఖ వ్యాధులకు గురైన భర్తలు, ఆ వ్యాధులను భార్యలకు కూడా అంటించి, వారికి మరింత దుస్థితిని కలిగిస్తారన్నాడు. భర్తల రోగాలు వైద్యానికి లొంగనప్పుడు తమపై తామే తమ నమ్మకాన్ని పోగొట్టుకొని భార్యలను అనుమానించి హింసిస్తున్నారు. ఇంటి నుండి గెంటుతున్నారు. వయసులో కామపిశాచాలుగా ఉన్న ఆ వ్యక్తులే వయసు మళ్లిన తర్వాత ధర్మ ప్రవర్తకులుగా మారి డబ్బిచ్చి, దేవాలయాలలో నాట్యాలు చేయించడం, పాటలు పాడించడం ద్వారా దేవదాసి వ్యవస్థను పోషిస్తూ, సిగ్గు లేకుండా తమ కోరికలను తీర్చుకుంటున్నారు' అని వివరించాడు.
అటువంటి దుర్మార్గుల మరణంతో చిన్న వయసులోనే భార్యలు బాల వితంతువులుగా మారి జీవితకాలం నరకం అనుభవిస్తున్నారు. ఆమెను విధవను చేసే తంతు మరింత హింసాత్మకంగా ఉండేది. అలంకారానికి బొట్టుకు దూరం చేసి జుట్టు గొరిగించి అందవికారంగా మార్చి ఆకలితో మార్చడంతో పాటు, అనేక రకాలుగా అవమానపరుస్తున్నారు. ఎటువంటి ఉత్సవాల్లో గాని, వివాహాల్లో గాని పాల్గొనే అవకాశం ఉండదు. అనేక వివక్షలకు లోనయ్యేవారు. ఆ విధంగా వారి ప్రమేయం లేకుండా బాల్యవివాహాలను చేసి బలవంతపు వైధవ్యాన్ని కలిగించి, ఆ బాలికలను నేరస్తుల కంటే, జంతువుల కంటే నీచంగా చూసేవారు.
నాటి ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ నిస్సహాయురాలైన బ్రాహ్మణ వితంతువులను ఘోరమైన నేరాలు చేసే నీచస్థితికి దిగజార్చిందని చెప్తూ.. కాశీబాయి ఉదంతాన్ని వివరించాడు పూలే. ఇనాం కమిషన్ అధికారి అయిన రావు సాహెబ్ సదాశివ బల్లాల్ గౌండే అనే బ్రాహ్మణ మిత్రుని ఇంట్లో 'కాశీబాయి' అని బ్రాహ్మణ వితంతువు వంట పని చేసేది. అందగత్తె గుణవంతురాలైన పేద కాశీబాయిపై బ్రాహ్మణవాడ లోని బ్రాహ్మణుడొకడు కన్ను వేశాడు. మొదట జాగ్రత్త పడినా తర్వాత ఆమెను లోబర్చుకున్నాడతడు. గర్భవతి అయిన ఆమె లోకనిందకు భయపడి, కడుపు పోగొట్టుకోవడానికి విషపూరిత మందులు మింగి ఫలించక, ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ సమాజంలోని అవమానాలకు భయపడి, వివేకం కోల్పోయి, ఆ బిడ్డను కత్తితో పొడిచి చంపి, యజమాని ఇంట్లో చేదబాయిలో పడేసింది. విషయం తెలిసి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు తీర్పు ప్రకారం నేరస్తురాలైన ఆమెకు యావజ్జీవ జైలు శిక్ష పడింది. కాశీబాయిని ఆ దుశ్చర్యకు ప్రేరేపించింది ఆర్య బ్రాహ్మణ వ్యవస్థలో స్వార్థపూరిత వివక్ష పూరిత 'శీలం అనేది స్త్రీలకు మాత్రమే అవసరం' అనే ప్రచారం.
ఇది జరిగిన తర్వాత జ్యోతిబా పూలే పూనాలోని తన ఇంటి ఆవరణలో అనాధ శిశువుల వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా అది బ్రాహ్మణ అనాథ శిశువుల కోసమే రూపొందించాడు. ఆ సమాచారాన్ని బ్రాహ్మణ వీధుల్లో నోటీసులుగా అంటించాడు. ఆ తర్వాత కాలంలో ముప్పైఐదు మంది వితంతువులు ప్రసవించగా, ఐదు మంది శిశువులు మాత్రమే బ్రతికారు. ముప్పై మంది శిశువులు తల్లులు మింగిన మందుల కారణంగా మరణించారు. ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ సృష్టించిన బలవంతపు క్రూర ఆచార ఫలితమే ఇది. అందుకని బలవంతపు వైధవ్యం అని నిరంకుశ విధానాన్ని తొలగించేందుకు ప్రయత్నించమని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు పూలే. అదే విధంగా బ్రాహ్మణ వితంతువులకు జుట్టు తొలగించేందుకు మంగలి వారిని అనుమతించవద్దని సూచించాడు.
పై సూచనలను బట్టి జ్యోతిబాపూలే స్త్రీల కోసం కులంతో సంబంధం లేకుండా అందరి స్త్రీల కోసం ఎంత కృషి చేశాడో తెలుస్తోంది.
మహారాష్ట్రలోని పూనె పట్టణంలో గోవిందరావు పూలే, చిమనాబాయి పూలే దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించి మన విముక్తి కోసం తపించి, శ్రమించి 1890 నవంబర్ 28న మరణించిన మహనీయుడు సదా స్మరణీయుడు.
దాదాపు రెండు శతాబ్దాల క్రితం జన్మించిన మహాత్ముడు చూపించిన మార్గాన్ని ఇప్పటికీ అనుసరించలేక, అవగాహన లేక అనైక్యతతో బలహీనపడి బానిసలుగా బతుకులీడుస్తున్నాం.
మహా దార్శనీకుడైన మహాత్మా జ్యోతిబాపూలే చేసిన మరికొన్ని పనులు:
షతన ఇంట్లోనే అనాధ శిశువులకు(బ్రాహ్మణ వితంతు సంతానానికి) వసతి గృహం ఏర్పాటు. షబ్రాహ్మణ వితంతు శిశువును దత్తత తీసుకోవడం. షదళిత బాలికల ప్రత్యేక పాఠశాల నెలకొల్పాడు. షసావిత్రి బాయి పూలేకు చదువు నేర్పి, టీచర్ గా మలిచాడు. ఆమె తొలి భారతీయ ఉపాధ్యాయురాలు. షమద్యపానం జీవితానికి అనర్ధ అని బోధించి, దాని నిషేధానికి కృషి చేశాడు. షపొదుపు ప్రాధాన్యతను వివరించాడు. షఇంగ్లీష్ చదువుల ప్రాధాన్యతను ప్రచారం చేశాడు. షప్రజాస్వామ్యం యొక్క అవసరాన్ని వివరించాడు. షఅన్ని రంగాల్లో అందరూ సమానంగా ఎదగాలని ఆశించాడు. షఅన్ని రకాల వివక్షలను వ్యతిరేకించాడు. షస్త్రీ విముక్తి కోసం కృషి చేశాడు.
అందుకే జ్యోతిబాపూలే మహాత్ముడు. భారత దేశ సమగ్ర సామాజిక విప్లవకారుడు. మహాత్మా జ్యోతీరావు పూలే కలలు కన్న వివక్ష లేని, కుల మత రహిత సమాజ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరగాలి. అదే వారికి మనం అర్పించే నివాళి.