Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలల కలవరింతలకు లోను చేసే సందర్భాలు చాలామంది అనుభవాల్లో అంతర్భాగమే. ఆ కలలకు సంబంధించిన పలు అంశాల్ని కవిత్వీకరిస్తూ 'కలల పరిమళం' శీర్షికన జ్యోత్స్నప్రభ ఓ అందమైన కవిత రచించారు. అదే శీర్షికన 36 కవితలతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఆర్ద్రమైన భావాలకు అందమైన వ్యక్తీకరణలు ఎన్నో ఉన్నాయి ఈ కవితా సంపుటిలో. 'హృదయం కందిన విషయం పెదవులు చెప్పకనే తెలుసుకోవాలి' అంటారు. నదికీ, హృదయానికీ ఉన్న అంతర్గత సంబంధాన్ని ఒక కవితలో రమ్యంగా చెప్పారు. కాలపరిమళం, కల-కలవరింత, ఒక చెలిమికోసం, మధూదయం, నడిచే పూలపొదలు, వేకువపాప మొదలైన కవితలు మరల మరల చదవాలనిపిస్తాయి. హృదయ సౌకుమార్యం ఉట్టిపడే ఈ కవిత్వం చదవడం పాఠకునికి చక్కటి అనుభవం.
పిల్లల్ని ఆకట్టుకునే నాటికలు
పఠనయోగ్యమూ, ప్రదర్శనయోగ్యమూ అయిన పిల్లల నాటికల్ని డా|| అమృతలత రాశారు. వాటిని 'చుక్కలలోకం చుట్టొద్దాం' శీర్షికన పుస్తకంగా వెలువరించారు. పాఠశాలల్లో ప్రదర్శించాలను కునేవారికి ఉపయుక్తమైన నాటికలివి. సరళమైన భాషలో, పిల్లలకు సులువుగా బోధపడేలా రాసిన తీరు ఆకట్టుకుంటుంది. పిల్లల జీవితంలో భాగమైన ఇతివృత్తాల్ని నాటికలుగా మలిచారు. స్కూల్డే, బస్టాండ్, టీవీ న్యూసెన్స్, ట్యూషన్స్, హాలిడేస్, ప్రెజెంటేషన్స్ వంటి నాటికలు ప్రదర్శిస్తే పిల్లలు ఇష్టంగా చూస్తారు. వీటిని తొలుత పత్రికల్లో అచ్చు వేశారు. ఇప్పుడు పుస్తకంగా వచ్చాయి. పిల్లలతో నాటికలు వేయించాలనుకునేవారు చదవాల్సిన పుస్తకమిది.
- శశాంక