Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపరెహే...
మగ జన్మ, ఆడ జన్మ అని మానవ జన్మను రెండుగా విడగొట్టి చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరం. ఇద్దరు పరస్పర పూరకాలు, వ్యతిరేకులు కారు. ఒకే తల్లి కన్నబిడ్డలు వివక్షకు, అదీ, తల్లిదండ్రుల చేతుల్లో, గురికావడం కడు శోచనీయం. ఆడ, మగ వ్యత్యాసం ఇంట్లోనే ప్రాణం పోసుకొని, సమాజంలోకి మహావృక్షమై వెళ్తుతున్నది. మార్పు తల్లిదండ్రుల దృక్పథంలో రావాలి. మానసిక విప్లవం వచ్చిననాడు ఏ విప్లవం అవసరం లేకుండానే, స్త్రీ కి పురుషుడితో సమాన స్థానం లభిస్తుంది. మహిళా దినోత్సవం స్థానే పురుషుల దినోత్సవం కూడా వస్తుందేమో! తగ్గుతున్న స్త్రీ జననాలు ఆ దిశలో ఆలోచింప చేస్తున్నవి. 'పోరు జాడల్లోంచి...' కవర్ స్టోరీ స్త్రీ సమానత్వం దిశలో జరుగుతున్న కృషిని సవివరంగా అందించింది. అందరికంటే తాగుబోతు గొప్పని రుజువు చేసి, పోలీస్ బ్రదర్స్... వెంకట సామి, రామ సామిలకు చుక్కలు చూపించి దాచి వుంచిన బైకు మీద వుడాయించిన తాగుబోతు (ఎవరు గొప్ప)... సూపరహే!!.
- పంజాల నరసయ్య, ఈసిఐఎల్, హైదరాబాదు
మహిళా ఉద్యమ ప్రగతి తెలిసింది
ఈవారం కవర్ స్టోరీ అద్భుతంగా ఉంది. మహిళా దినోత్సవం మార్కెట్ చేతుల్లోకి ఎట్లా వెళ్లిందో చెబుతూనే మహిళా హక్కుల ఉద్యమం ఏ విధంగా ఎదుగూ వచ్చిందో చెప్పింది. మీటూ కాంపెయిన్ ప్రభావం మన దేశంలో అంతగా ఎందుకు లేదో చక్కగా వివరించారు రచయిత. చట్టాలు స్త్రీల హక్కులను రక్షించడంలో విఫలంచెందినట్లు నిరూపించే వివరాలు చాలా ప్రయోజనకరం.
- కవిత, మంచిర్యాల
మనసు దోచుకున్నది
అందాల నటి శ్రీదేవి మరణం ఎంతో బాధించింది. ఆమె మరణం చుట్టూ చెలరేగిన వివాదాలు భౌతిక దేహం స్వదేశం రాకుండా జాప్యం కలిగించినందుకు బాధపడ్డాం. ఎట్టకేలకు ముంబయిలో అధికారిక లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలను జరపడం కొంతలో కొంత సంతోషాన్ని ఇచ్చింది. ఈ విషాద సమయంలో శ్రీదేవి గురించి 'జారిపోయిన ఓ అద్భుత కల...' మనసు దోచుకుంది. రచయితకు మా ధన్యవాదాలు
- జి.ఏసుపాదం, వరంగల్; ఎమ్.శ్యామల, యాదగిరి గుట్ట
అతి ప్రాచీన సంబంధం
మన ప్రాచీన సింధు నాగరికతకు మార్గదర్శి వంటిది మరో నాగరికత ఉందని, అది సింధు నాగరికత కన్నా ముందు విలసిల్లిందని తెలిసి ఆశ్చర్యపోయాం. ఆఫ్గనిస్థాన్ ప్రాంతానికి, మన భారత దేశానికి సంబంధాలు ఇంత ప్రాచీనమని ఇప్పటివరకు తెలియదు. షార్ -ఇ-శోఖ్తాలో బయటపడిన చాలా వస్తువులను మన సింధు నాగరికత ప్రాంతాల్లో దొరికిన వస్తు విశేషాలు పోలి ఉండటం ఈ రెండు నాగరికతల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నది.
- కె.కోటేశ్వరరావు, ఘటకేశ్వర్, హైదరాబాదు