Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగా అనగా ఓ అడవి. అడవి ఉన్నాక చెట్లూ పుట్టలూ గుట్టలూ పొదలూ పులులూ పుట్రలూ ఉండాల్సిందే కదా. అనగా అనగా దట్టమైన ఆ అడవిలో ఓ పారే ఏరూ ఏటి గట్టున గుబురు పొదలూ ఆ పొదల్లోపల ఓ బలిసిన తోడేలూ ఉన్నది కదా.
తోడేలు ఏటి గట్టునే తన రెసిడెన్స్గా మార్చుకుంది. ఆకలయినప్పుడల్లా అడవంతా కలయతిరగడం గాలించడం వేటాడ్డం అలసి పోవడం దేనికని ఈ చోటు సెలెక్ట్ చేసుకుని సెటిలయిపోయింది. ఏరన్నాక ఏట్లో నీరున్నాక చిన్నదో చితకదో బలిసిందో బక్క పలచనిదో ఏదో ఓ జీవం నీరు తాగడానికి ఏట్లోకి రాక తప్పదు కదా. అట్లా వచ్చిన జంతువు మీదకి అదాట్టుగా లంఘించి, పీక పట్టుకుని తన ఇంటిదాకా ఈడ్చుకు వచ్చేది తోడేలు. అప్పటికి ఆ ప్రాణి పంచప్రాణాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మిగిలుండేది కాదు. ఆ తర్వాత తోడేలుకి లంచూ డిన్నరూ మిగిలితే మర్నాటి బ్రేక్ పాస్టూ పూర్తయ్యేవి.
ఇట్లా ఆట్టే కష్టపడకుండా ఎంతో ఈజీగా జిందగీ గడిపేస్తుండడం వల్ల తోడేలుకు 'ఒబేసిటీ' ప్రాబ్లమ్ రానే వచ్చింది మరి రాక తప్పదు కదా. హాయిగా ఆనందంగా జాలీగా జల్సాగా కులాసాగా బతుకుతున్న తోడేలుకు సమీపంలోనే ఏట్లో ఈత్తూ, చేపల్ని ముక్కుతో లాగి నోట్లోకి విసిరేస్తూ అరగడానికి స్విమ్ చేస్తూ అప్పుడప్పుడూ అలా ఎగురుతూ గిరికీలు కొడుతూ బతికేస్తున్నది ఓ పొడుగు ముక్కు పొడుగు కాళ్ళ కొంగ.
తోడేలూ కొంగా ఒకే బస్తీలో వుంటున్నా ఇరుగూ పొరుగూ జీవులే అయినా తోడేలు కొంగను పట్టించుకునేది కాదు. ఇది మనకి ఓ పంటికిందికి రాదు దీంతో మనకేం పనిలేదు అని చిన్న చూపు చూసేది తోడేలు. అంత దూరంలో తోడేలుని చూసి ఇది మనకు డేంజర్ కదా ఏమరుపాటుగా ఉంటే లైఫ్ రిస్కు కాదు గదా అనుకునేది. అయితే తన పక్కనించి నడిచి పోతూ తనవైపే చూడని తోడేలంటే కొంగకి భయం క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీనికి తన బాడీలోని లోఫ్యాట్ మాంసం రుచించదేమో అందుకే కేర్లెస్గా ఉంది. ఇదీ మన మంచికే వీ ఆర్ గుడ్ నైబర్స్ అనుకుంది కొంగ.
ఓ ఆదివారం ఉదయం నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటూ ఇవాళ సండే కదా ఏదైనా స్పెషల్గా తింటే బావుంటుంది అనుకుంది తోడేలు. ఎవరయినా ఏదయినా అనుకుంటే అన్ని సార్లూ జరగకపోవచ్చు కానీ ఒక్కోసారి జరగవచ్చు కదా. తోడేలు మనసులో అనుకున్నట్టుగా ఓ అడవి పంది తోడేలు లంచ్ టైంకి ఏటిగట్టుకు ముక్కుతూ మూల్గుతూ వచ్చింది. అప్పటికే ఏదో పెద్ద జంతువు దాన్ని అటాక్ చేసినట్టుంది ఒంటి మీద గాయాల్తో ఒలికిపోతున్న ఊపిరితో గొంతు తడుపుకుందామని వచ్చింది. తోడేలు హుషారుగా విజిలేస్తూ రన్ రాజా రన్ అనుకుంటూ పరుగెత్తుకు వచ్చింది.
నేనిప్పుడు నీతో ఫైట్ చెయ్యలేను నన్ను ఒదిలెయ్యి అన్నది అడవి పంది. షట్ యువర్ మౌత్. నీకూ నాకూ ఫైటింగా? జస్ట్ ఈటింగే అంటూ దాని మీదకు జంప్ చేసింది తోడేలు. అప్పటికే ఒలికిపోతున్న అడవి పంది ఊపిరి పూర్తిగా కళ్ళు తేలేసింది.
బాగా బలిసుందిది. నాల్రోసుల్దాకా ఇల్లు వదిలి రానక్కర్లేదు అనుకుంటూ అడవి పందిని ఆయాసపడుతూ లాక్కెళ్ళింది తోడేలు. కొందరికి ఎంత తింటున్నా యింకా యింకా తినాలనే వుంటుందేమో తిండియావ అలాంటిది. రోజూ తింటూనే ఉన్నా ఆబగా ఆత్రంగా వెనకా ముందూ చూడకుండా పళ్ళ ఫోర్కుని పంది మాంసంలోకి గుచ్చింది తోడేలు. ఇక ఆగలేదు ఎటూ చూళ్ళేదు.
ఉన్నట్టుండి తోడేలు నోటికి తాళం పడింది. దాని గొంతుక కేదో అడ్డం పడింది. వెక్కిళ్ళు మొదలైనవి. గొంతులో ఇరుక్కున్న ఎముక అడ్డం తిరిగింది. లోపల్కి పోదూ ఇవతలకి రాదు. బయటికి కక్కేద్దామని తెగ ప్రయత్నించింది తోడేలు. ఎముక ససేమిరా ఇవతలకి రానే రానని మొరాయించింది. ఇక కార్డియాక్ అరెస్ట్ తప్పదని ప్రాణాలు నిలబెట్టుకోడానికి ఏటిగట్టుకు పరుగెత్తింది. ప్రాణం పోతున్నదని దాని మెదడు చురుగ్గా పనిచేసింది. ఏటి గట్టున జపం చేసుకుంటున్న కొంగని అరిచి గీపెట్టి నోరు తెరిచి దీనంగా సైగ చేసింది. అస్పష్టంగానే అయినా నా ప్రాణాలు నిలబెడితే నీకు విలువైన బహుమానం ఇస్తానని ప్రామిస్ చేసింది తోడేలు.
కొంగ పొడవాటి ముక్కున్న తలని తెరిచి వున్న తోడేలు నోట్లో దూర్చి దాని గొంతుకి అడ్డం పడ్డ ఎముకని లాఘవంగా ఇవతలకి లాగేసింది.
బతుకు తోడేలా అని ఊపిరి పీల్చింది తోడేలు. 'మిషన్ సక్సెస్' అయింది మరి విలువైన బహుమానం కోసం నిలబడుతుంది కొంగ. ఏంటి ఇంకా నా ఎదుట నిలబడ్డావు ఎంత ధయిర్యం అన్నది తోడేలు. నా బహుమానం అని నసిగింది కొంగ. నీ ప్రాణమే నీకు నేనిచ్చే విలువయిన బహుమానం. నా నోట్లో తల దూర్చి బయటకి వచ్చిన ఏకైక ప్రాణివి నువ్వు పో... బతికి పో... అని నవ్వింది తోడేలు.
రాజకీయ నాయకుడి లాంటిది తోడేలు. ఓటరు లాంటిది కొంగ. నాయకుడు లాంటి తోడేలు ప్రాణాలు నిలబెట్టిన ఓటరు లాంటి కొంగకు విలువయిన బహుమానం దాని ప్రాణమే!!
- చింతపట్ల సుదర్శన్, 9299809212