Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''49 ఏండ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినాసరే, నేను చావుకు భయపడటం లేదు. అలాగని త్వరగా మరణించాలనీ నేను భావించటం లేదు.. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి. మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అనేవి కట్టుకథలు. మరణం అంటే మరణమే. వేరే నిర్వచనం లేదు. స్వర్గం, నరకం అనేవి మరణం అంటే భయపడే వారికోసం అల్లినవి. మనిషి మెదడు కూడా కంప్యూటర్ లాంటిదే. కంప్యూటర్ విడి భాగాలు పాడైన తర్వాత అది పని చేయదు.. మనిషి కూడా అంతే. మనిషి అవయవాలు పని చేయటం ఆగిన తర్వాత మెదడు పని చేయటం ఆగిపోతుంది. తర్వాత ఏమీ ఉండదు. మరణించే లోపు మన శక్తి సామర్థ్యాలను తెలుసుకుని వాటిని వినియోగిస్తూ జీవితాన్ని గడపాలి. మనం చేసే ప్రతి పనీ అత్యున్నతంగా ఉండాలి''
ఇలా చెప్పిందెవరో కాదు.. సైద్ధాంతిక, హేతుబద్ధత కల్గిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.
1942 జనవరి 8 జన్మించిన స్టీఫెన్ హాకింగ్ 2018 మార్చి 14న ఉదయం తన నివాసంలో 76 ఏండ్ల వయస్సులో మరణించారు. గడచిన ఆయన గతం ఏమాత్రం సౌఖ్యంగా లేదు. 49 ఏండ్లుగా ఆయన మృత్యువుతో పోరాడాడు. కానీ అతని ఆలోచన ముందు మరణం మోకరిల్లింది. విజ్ఞాన రంగంలో అతని అశేషమైన కృషికి కాలం సలామ్ చేసింది. అచేతనమైన తన శరీరంతోనే ఎన్నో పరిశోధనలు, మరెన్నో ఆవిష్కరణలు చేశాడు పెద్దమనిషి.. క్షణ క్షణం మృత్యువుతో పోరాడుతూ.. ప్రపంచంలోని అశాస్త్రీయ పోకడలను హెచ్చరిస్తూ జీవితం చివరి క్షణం వరకూ విలువైన సందేశాలనిచ్చాడు.
స్టీఫెన్ విద్యాభ్యాసం, పరిశోధనలు ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్‌లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఆయన తండ్రి లండన్‌లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. అక్కడే ఉన్న హైగేట్స్లో స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని ప్రారంభించాడు. 1950లో సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేరాడు. గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని తండ్రి దాన్ని వ్యతిరేకించటంతో కెమిస్ట్రీలో చేరాడు. 1959లో స్టీఫెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. అప్పుడు అతని వయస్సు 17 ఏండ్లు. తర్వాత పీహెచ్డీ కోసం 1962లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లాడు. అప్పటి నుంచి అతని పరిస్థితి మారిపోయింది. అతను నరాల వ్యాధితో బాధపడుతున్నట్టు 1963లో వైద్యులు నిర్ధారించారు. సరిగ్గా యవ్వన ప్రాయంలో వచ్చిన వ్యాధి స్టీఫెన్‌ను వీల్‌చైర్‌కు పరిమితం చేసింది. కదలని కాళ్లు, సహకరించని శరీరం, వాయిస్ సింథసౖౖెజర్ లేనిదే మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అయినా కుంగిపోలేదు. అతని ధైర్యం, నిలకడ, మేధోసంపత్తి అనేక ఆవిష్కరణలకు దారి తీసింది. 1974లో అతను ప్రతిపాదించిన 'హ్యాకింగ్ రేడియేషన్' ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి తీసుకొచ్చింది. 1988లో 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం' పుస్తకం కోటికి పైగా కాపీలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. 1998లో ఆ రికార్డు గిన్నిస్ బుక్‌లో నమోదైంది. 2014లో స్టీఫెన్ జీవిత విశేషాలతో జేమ్స్ మార్ష్ అనే డైరెక్టర్ 'ద థియరీ ఆఫ్ ఎవరీథింగ్' సినిమా తీశారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డుతో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.
ఆదర్శం ఆయన జీవితం..
మరణం అనివార్యం. 76 ఏండ్లకు స్టీఫెన్‌ను అది ఆవరించింది. గడిచిన కాలంలో స్టీఫెన్ ఎప్పుడూ మరణం గురించి ఆలోచించలేదు. అచేతనంగా పడి ఉన్న శరీరాన్ని చూసుకుని ఎప్పుడూ బాధపడలేదు. కనీసం కదలలేని స్థితిలో కూడా ఆయన అంతరిక్ష పరిశోధనలు చేశాడంటే ఆయన ఆశయం ఎంతో దృఢమైనది, ఉన్నతమైనది. ఆశయాలు, లక్ష్యాలను ఛేదించటంలోనే స్టీఫెన్ జీవితం గడిచిపోయింది. చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచించే యువత ఒక్కసారి స్టీఫెన్ హ్యాకింగ్ జీవితాన్ని చదవాలి. చావడానికి ఎన్నో మార్గాలను ఎంచుకునే వ్యక్తులు బతకడానికి ఒక్క మార్గాన్నైనా వెతుక్కోవాలి. స్టీఫెన్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం.
- వినోద్ మామిడాల