Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషులంతా ఎవరికివాళ్ళు ఏకాంత ద్వీపాలవుతున్నారు. మానవ సంబంధాలన్ని డబ్బు సంబంధాలుగా మారిపోతున్నాయి. కుటుంబసభ్యుల మధ్యనే ఎడం పెరుగుతోంది. బంధువులు, చుట్టపక్కాలంటే ఎవరో పిల్లలకు తెలియని స్థితి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, మామయ్యలు, బాబాయిలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అంటే దగ్గరి బంధువులు. కాని వారంతా దూరపు బంధువులుగా, ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చిపోయేవారిగా భావించే ధోరణి చూస్తున్నాం. దీనికి భిన్నంగా కుటుంబసభ్యుల మధ్య బంధాలు బలపడాలని, తమ తరంతోపాటు తమ తర్వాతి తరం పిల్లల మధ్య కూడా బలమైన బంధాలు నెలకొనాలని ఆశిస్తున్నారు కొందరు. ఆ కొందరిలో ఓ అరుదైన కుటుంబం చెన్నూరి వారిది. గత కొంతకాలంగా వీరంతా తరచుగా నెలకొకసారయినా కలుస్తున్నారు. కష్టం సుఖం కలబోసుకుంటున్నారు, మంచీచెడూ తెలుసుకుంటున్నారు. ఎవరు ఎక్కడున్నా ఒకరికొకరు బలమైన తోడు అనే భావాన్ని ప్రోది చేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో అనురాగం, ఆప్యాయతలు నెలకొనడం కోసం ఇలాంటి కలయికలు ఉపయోగపడతాయి. పదుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. సొంత అక్కాచెల్లెళ్ళ మధ్యన, బంధువుల మధ్యన చిచ్చుపెట్టే టీవీసీరియల్స్కు భిన్నంగా నిజమైన ఆత్మీయతలే వెల్లివిరిసే కుటుంబ సంబంధాల్లోని ఆర్ద్రత బలమైంది. చెన్నూరి వారి కుటుంబాన్ని చూస్తే ఇలాంటి ఆత్మీయ బంధాలే మనుషుల మధ్య బలపడాలన్న ఆకాంక్ష కలుగుతుది. అందుకే చెన్నూరి కుటుంబ కలయికల ఉత్సవ సందర్భం ఎందరికో స్ఫూర్తి. వారి ఆత్మీయ కలయికలు మరెందరికో ప్రేరణనిస్తాయన్న ఉద్దేశంతో అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
చెన్నూరి కుటుంబం గత రెండేండ్ల నుంచి ప్రతి నెలా ఫ్యామిలీ గెట్‌టూ గెదర్ నిర్వహించుకుంటున్నారు. మొదట్లో ఈ సంప్రదాయం కేవలం మహిళలకు మాత్రమే కిట్టీపార్టీ రూపంలో ఉండేది. ఆ కుటుంబానికి చెందిన కూతుళ్ళు, కోడళ్ళు మాస సమావేశం జరిగేది. మెల్లమెల్లగా ఈ కుటుంబ కలయికలో మగవారు భాగస్వాములు అయ్యారు. ఆ తర్వాత పిల్లలు. అలా మొదలైన ఈ గెట్‌టూ గెదర్ ఇప్పుడు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తర్వాత గెట్‌టూ గెదర్ ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తారనే ఆత్రుత ఆ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంటుంది.
ఎంత దూరంగా ఉన్నా
ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాదు చెన్నై, పూనె, ఢిల్లీ, బోంబే మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న వారు కూడా అప్పుడప్పుడు ఈ గెట్‌టూ గెదర్‌లో పాలు పంచుకుంటున్నారు. అంత దూరం నుండి కేవలం ఈ గెట్టే గెదర్ కోసమే వస్తున్నారంటే వారంత బంధాలను ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది. వీరందరూ గతంలో అన్ని కుటుంబాల మారిగానే పెండిండ్లకు, పెద్ద పెద్ద ఫంక్షన్లకు మాత్రమే కలుసుకునేవారు. ఉద్యోగాల కోసం దూరం పోయిన వారికి మేనత్త, పిన్ని, బాబాయి, పెద్దమ్మ పిల్లలు ఎలా ఉంటారో, ఏం చేస్తారో కనీస అవగాహన ఉండేది కాదు. ఇలా గెట్‌టూ గెదర్ పెట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత దూరంగా ఉండేవారు మూడు నెలలకో, ఆరు నెలలకో కచ్చితంగా వచ్చి తమ బంధువులు, రక్తసంబంధీకులందరినీ కలిసి సరదాగా గడిపి పోతుంటారు.
చెన్నూరి టైమ్స్
చెన్నూరి వారిది చాలా పెద్ద కుటుంబం. అందరూ కలిసి 150 మంది వరకు ఉంటారు. అయితే గత కొన్నేండ్ల కిందటి వరకు ఒకరింట్లో ఒకరికి ఏం జరుగుతుందో సమాచారం సరిగ్గా తెలిసేదికాదు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం ఉండేది కాదు. అందుకు 'చెన్నూరు టైమ్స్' అనే పేరుతో ప్రతి నెలో ఓ పత్రికను తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే జర్నలిస్టుగా ఉండి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన సుబ్బారావు దీని బాధ్యతలు తీసుకున్నారు. బంధు వర్గంలో ఎవరి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా, పుట్టినరోజు, పెండ్లి రోజు ఏదైనా దానికి సంబంధించిన ఫొటోలను అందరూ సుబ్బారావుకు పంపేవారు. ఆయనకు సమాచారాన్ని సేకరించి పత్రికలో ప్రచురించి బంధువులందరికి పంపేవారు. ఇలా బంధువులందరికి ఒకరి ఇంట్లో మరొకరికి ఏం జరుగుతుందో సమాచారం తెలిసేది. మొదట బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చిన ఈ పత్రిక తర్వాత కలర్లో కొంత కాలం నడిచింది. ఒక కుటుంబం ప్రత్యేకంగా ఓ పత్రిక తీసుకురావడం బహుశా ఇదే మొదటిది.
టెక్నాలజీ వచ్చిన తర్వాత
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన తర్వాత వాట్సాప్ ద్వారా సమాచారం ఒకరికొకరు అందుకుంటున్నారు. దాంతో చెన్నూరు టైమ్ అవరసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఆనందం, బాధ, శుభకార్యాలు ఏవైనా వాట్సాఫ్ ద్వారా ఒకరి గురించి ఒకరు సమాచారాన్ని తెలుసుకుంటూ తమ కుటుంబాన్ని మరింత దగ్గర చేసిన వాట్సాఫ్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. కవితలు కూడా పెడుతుంటాం.
టూర్లకు కూడా వెళతారు
ఈ కుటుంబం కేవలం గెట్‌టూ గెదర్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అందరూ కలిసి టూర్లకు, కార్తీక భోజనాలు వెళుతుంటారు. వీరు తమ సొంత ఊరు కృష్ణాజిల్లాలోని బందర్ దగ్గర చెన్నూరు. దీన్ని వదిలి ఎన్నో ఏండ్లు గడుస్తుంది. తాతల కాలం అప్పుడు వీరంతా అక్కడ ఉండేవాళ్ళు. తర్వాత ఉద్యోగం, చదువుల రీత్యా అందరూ హైదరాబాద్ వచ్చేశారు. ప్రస్తుతం అక్కడ తమ వారు ఎవ్వరూ లేకపోయినా సొంత ఊరుపై మమకారంతో అప్పుడప్పుడు వెళ్ళి చెన్నూరుతో అనుబంధం పెంచుకుంటున్నారు. తమకు సాధ్యమైనంత వరకు ఆ ఊరి అభివృద్ధిలో కూడా పాలుపంచుకోవాలని వీరి కోరిక.
బంధాలను బలపరుచుకోవాలని
మా తాతయ్య చెన్నూరు వెంకట సుబ్బారావుకు నలుగురు పిల్లలు. వాళ్ళు అందరూ కలిసి ఉండేవారు. వాళ్ళ పిల్లలగా మేమంతా కూడా కలిసే పెరిగాం. అన్నదమ్ముల పిల్లలమైన ఇంట్లో పెద్దన్నయ్యకు గౌరవం ఇస్తాం. మా తర్వాత మా పిల్లలు కూడా మాకులా కలిసి మెలిసి పెరగాలని మా కోరిక. అయితే చదువులు, ఉద్యోగాల వల్ల అందరూ ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. దూరం దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరని కనీసం నెలకు లేదో రెండు నెలలకైనా దగ్గర చేయాలనే మేం ఈ గెట్టూగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. జర్నలిస్టుగా ఉండడం వల్ల చెన్నూరు టైమ్స్ నడపడం సులభమయింది. ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత సమాచారం మరింత వేగంగా అందుతుంది.
- సి.వి. సుబ్బారావు, తెలుగు టైమ్స్
పదిలపరుచుకుంటున్నాం
యాభై ఏండ్ల నుంచి ఢిల్లీలో ఉన్నాను. కానీ మా వాళ్లందరూ హైదరాబాద్‌లో ఉన్నారు. మాది చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి పెరిగాం. పెండ్లి తర్వాత చాలా మిస్ అయ్యా. ఢిల్లీలో ఉండడం వల్ల మరీ దూరం పెరిగింది. ఇప్పుడు మా అబ్బాయి ఢిల్లీలో ఉన్నా మేము మాత్రం హైదరాబాద్ వచ్చేశాం. నెలకు ఒకరి ఇంట్లో ఇప్పుడు అందరం కలుసుకుంటున్నాం.ఈ విధంగా బంధాలను పదిలపరుచుకుంటున్నాం. మేం ఎలాగైతే మా చిన్నతనాన్ని ఎంజారు చేశామో అలాగే మా పిల్లలు కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలి. ముఖ్యంగా తమ కజిన్స్ గురించి తెలుసుకుంటున్నారు.
- రావినూతల వరలక్ష్మి, ఇంటి పెద్ద కూతురు
అభిమానంగా ఉంటాం
మా నాన్నకు నలుగురు పిల్లలు. వాళ్ళ నలుగురికి పది మంది మగపిల్లలు, పది మంది ఆడపిల్లలం మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం. గతంలో ఫంక్షన్స్ వస్తేనే కలుసుకునేవాళ్ళం. ఒకరింటికి ఒకరు వెళ్లడానికి కుదిరేదికాదు. దాంతో ఇలా ఏర్పాటు చేసుకున్నాం. ముందు మా అక్కచెల్లెళ్ళం అందరం అనుకున్నాం. మా వదినలు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. మా ఇంట్లో ఎవరి ఎవరు సొంత వదినో తెలుసుకోవడం చాలా కష్టం. అందరం అంత కలిసిమెలిసి ఉంటాం. చాలా సంతోషంగా ఉంది.
- పాలకోడేలు. రాజేశ్వరి, మరో కూతురు
మనసుకు ఆహ్లాదంగా...
ఇంటికి నేను పెద్ద కోడలిని. మాది అందమైన కటుంబం. ఈ కుటుంబంలోకి అడుగుపెట్టి 48 ఏండ్లు అవుతుంది. ఇలాంటి కుటుంబంలోకి రావడం చాలా సంతోషం. అందమైన రాక్షసులు మా ఆడపడుచులు. రిటైర్ అయిన తర్వాత ఇలా కలుసుకోవడం మనసుకు కాస్త ఆహ్లాదంగా ఉంది.
- చెన్నూరి లలిత
కష్టమైనా సుఖమైనా
ఇలా కుటుంబం మొత్తం కలవడం మా నాన్న గారి అన్నదమ్ముల నుంచే మొదలయింది. చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబాన్ని చూస్తూ పెరిగాం. సెలవులకు అందరి ఇండ్లకు వెళ్ళే వాళ్ళం. పెద్దమ్మలు, పిన్నులు అవకాయ, పప్పు, నెయ్యి కలిపి అన్నం ముద్దలు పెడుతుంటే కమ్మగా తినేవాళ్ళం. కాని అలాంటి వాతారవణం మా పిల్లలకు లేదు. అందుకే మా ఈ చిన్ని ప్రయత్నం.
- వి. సరస్వతి
కుటుంబమే మా బలం
మా అత్తగారి తరపున ఎవ్వరూ లేరు. అన్నదమ్ముల్లో ఒకరి కూతురిని నేను. మేం గెట్‌టూ గెదర్ అంటూ ఇలా వస్తుంటే మా చుట్టుపక్కల వారందరూ ఆశ్చర్యంగా అడుగుతుంటారు. సినిమాలకు, టూర్లకు అందరం కలిసి వెళుతుంటాం. ఈ వయసులో ఇంత ఉత్సాహంగా ఉంటే అందరూ ఆశ్చర్యపోతారు.
- బాల సత్యవతి
గర్వపడుతున్నాను
నాకు ఆరోగ్యం అంతగా బాగుండదు. కానీ వీళ్ళను ఇలా చూస్తుంటే నాకు బలం, ధైర్యం. చెన్నూరు కుటుంబంలోకి కోడలిగా వచ్చినందుకు గర్వపడుతున్నా. ఎవరి పుట్టిన రోజైనా ఓ కవిత రాసి వాట్సాఫ్‌లో పెడుతుంటాను.
- చెన్నూరి బాలా త్రిపుర సుందరి
అందరి ఇండ్లల్లో జరిగితే
ప్రస్తుత కాలంలో అన్నీ చిన్న కుటుంబాలే. ఎవరికి వారే అయిపోయారు. అందరూ కలుసుకోవడం చాలా తగ్గిపోయింది. చెన్నూరి వారిది చాలా పెద్ద కుటుంబం. అందరూ ఎలాంటి అలమరికలు లేకుండా నెలకు ఒకసారి ఇలా కలిసి సంతోషంగా ఉంటారు. వీరితో నెలకు ఒకరోజు ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. పది మంది కలవడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా పోతాయి. ఇలాంటివి అందరి ఇండ్లల్లో జరిగితే మానవ సంబంధాలు బలంగా ఉంటాయి.
- రావినూతల సత్యనారాయణ, ఇంటి అల్లుడు
మనం అనే భావన పెరుగుతుంది
ఇలా కలవడం వల్ల మనుషుల మధ్య బంధాలు పెరుగుతాయి. మనం అనే భావన పెరుగుతుంది. పిల్లలకు ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. చిన్న చిన్న కుటుంబాలుగా అవుతున్న ఈ సమయంలో మేం ఇలాంటివి పెట్టుకోవడం వల్ల నలుగురి స్ఫూర్తిగా ఉన్నామనే భావన వస్తుంది. మా కుటుంబంలో చాలా మంది రాయగలరు. కానీ తొందరగా బయటపడవు. వాట్సాఫ్ పెట్టిన తర్వాత తమకు తోచినవి రాసి పెడుతుంటారు. వాటిని నేను సరదాగా ఫేస్బుక్లో పెడుతుంటాను. ఇలాంటివి అరుదై పోతున్నాయని చాలామంది కామెంట్స్ పెడుతుంటారు.
- సి.ఎస్ రాంబాబు
నవ పథాన చెన్నూరీయం...
అప్యాయత, అనురాగాల
ఆనంద కోలాహలాలకు
కూడలి...
''చెన్నూరి'' వారింటి లోగిలి!!!
అమృతం కన్నా తీయనిది...
కుటుంబం సభ్యుల
ఆత్మీయ కలయిక
లోని మధురిమ!!!
ఆదర్శ ప్రాయమైన
మేలు కలయికలోనే
దాగి ఉంది...
అనిర్వచ నీయమైన
ఆత్మీయతా భరోసా!!!
కుటుంబ బంధాలకు,
బాధ్యతలకు
ప్రాధాన్యతనిచ్చే ఈ కుటుంబం
''కలసి ఉంటే కలదు సుఖం''
అనే పెద్దల మాటకు
''అగ్ర తాంబూలం''
ఇస్తుంది!!!
ఉమ్మడి కుటుంబ
జీవనశైలికి
ప్రత్యామ్నాయంగా
'నెల నెలా సమావేశాలు'
అంటూ ఒక
''కొత్త ఒరవడి'' ని
సృష్టించింది!!!
సాంప్రదాయం, సాద్గోష్ఠి
చురుకైన ఆట పాటలు
ఉత్సాహం, ఉల్లాసాలకు
చిరునామా
ఈ సమావేశ లోగిలి!!!
ఒక వినూత్న రీతిలో,
తమదైన ప్రత్యేక బాణీలో
వివిధ రకాల రుచులతో
అతిథులను అలరించే
ఈ 'మహిళా మణు'లందరు
'పాకశాస్త్ర' ప్రావీణులే!!!
దైనందిన ఈ రంగులమయ
జీవితంలో...
కల్మషమెరుగని మనసులతో
అన్యోన్య భావనలతో
కలసి మెలసి,
''ఆనందంగా జీవించాలి''
అనేదే వీరి 'ధ్యేయం'!!!
పెద్దలు ఆచరించి చూపిన
'ఐకమత్య జీవన'
మార్గాన్ని అనుసరించడమే...
ఉరకలు వేసే నేటి
''చెన్నూరి యువత''తో
సహా వీరందరి
లక్ష్యం!!!
-బాలాత్రిపురసుందరి
మళ్ళీ దగ్గరయ్యాం
పెండ్లి తర్వాత కుటుంబానికి కాస్త దూరమయ్యాము. ఇప్పుడు ఈ గెట్‌టూ గెదర్తో దగ్గరయ్యాం. అందరం కలుసుకో గలుగుతున్నాం. ముఖ్యంగా మా పిల్లలు కలుసుకుంటున్నారు. వదినలు బయట నుండి వచ్చారనే ఫీలింగ్ ఉండదు. అందరం కలిసి ఒకే తల్లి పిల్లల్లా కలిసి మెలసి సరదాగా ఉంటాం.
- వి. లక్ష్మీ
ఎదురు చూస్తుంటాను
మా అమ్మ వాళ్ళది కూడా జాయింట్ ఫ్యామిలీ. అయితే అందరం కలిసి ఉండటానికి కుదిరేది కాదు. నాకు పెండ్లయి ఆరు నెలలు. బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తాను. అత్తారింటికి వచ్చిన తర్వాత ఇలా అందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరి మధ్య రిలేషన్స్ పెరుగుతాయి. గేమ్స్ ఆడుకుంటాం. వర్క్ లైఫ్ నుంచి నెలల ఒక రోజు ఒత్తిడి నుండి దూరంగా ఉంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరిని వదిలి వెళ్ళాలంటే కాస్త కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్ట్ పార్టీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటాను.
- తటవం ఉజ్వల, మూడోతరం కోడలు
- సలీమ, 9490099083