Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుయ్యో మొర్రోవ్ అంటూ మూలుగుతున్నది కూలిపోయిన ఇంటి అరుగు మీద కుక్క.
ఏమైందేవిటి? మనుషుల్లా కుయ్యో మొర్రోవు అని మొత్తుకుంటున్నావు అనడిగింది గాడిద.
ఏం మనుషులకే వుందా కుయ్యో మొర్రోవు మనే హక్కు, మొత్తుకునే అధికారం. అసలు ఈ లోకం వున్నది ఒక్క మనుషులకోసమేనా? కుక్కలకి స్థానం లేదా? అంది కుక్క కోపంగా కుయ్యో మొర్రోవులు కొనసాగిస్తూనే.
ఏవిటి డాగీ అంత కోపంగా వున్నావు. ఏ పురాతన కాలం నుంచి మీ వాళ్ళు మనుషులకి విశ్వాసంగా సేవలు మొదలు పెట్టారో కదా! నువ్వివ్వాళ మనుషుల మీద విసుక్కుంటున్నావు. కారణమేమిటో నాతో చెప్పవా ప్లీజ్! అంది కుక్కని అనునయిస్తూ గాడిద, ఆ అరుగు మీద సగం దాని నివాసం కూడా.
ఏం చెప్పాలి డాంకీ! రోజురోజుకీ వీళ్ళ ఆగడాలు మితిమీరుతున్నాయి. చూస్తున్నావుగా ఊరంతా ఒకే రంగు జండాలు, బ్యానర్లు, మైకులు, హడావిడి. ఏదో సభ అన్నావు నువ్వు రాత్రి కుక్క మూలుగుకి కొంచెం రెస్టు ఇచ్చి.
ఓ అదా! రోజూ న్యూస్ పేపర్లు నముల్తాను గనక విషయాలు తెలుస్తుంటాయి. అబ్బో పెద్ద జనసభ, మహాజన సభ! అక్కడ్నించే వస్తున్నానిప్పుడు అంది గాడిద పళ్ళల్లో ఇరుక్కున్న ఓ దినపత్రిక కాగితాల్ని నాలుకతో పీకుతూ.
ఆ సభే! నా కొంప ముంచింది. కుయ్యో మొర్రో అని ఏడిచేట్టు చేసింది అంది తోకలేపడానికి కూడా ఓపిక లేని కుక్క.
అసలు సంగతేమిటో చెప్పకుండా 'యూ ట్యూబ్' పోస్టింగులా డొంక తిరుగుడు తిప్పకు అంది గాడిద.
ఏం చెప్పను... రోడ్డుకి ఈ పక్కా ఆ పక్కా దుకాణాలు మూసేశారా. అందులో మాంసం కొట్టు కూడా ఉంది కదా! ఎగిరొచ్చి రోడ్డు మీద పడే ఎముక ఒక్కటీ లేదు కదా. అందుకని ఆకలికి తోకముడుచుకు రోడ్డు పక్కన పడుకున్నా. అబ్బబ్బా ఎన్ని బస్సులు ఎన్ని ట్రాక్టర్లు ఎన్ని కార్లు చూసి చూసి కళ్ళు తిరిగిపోయేయనుకో. ఆ బస్సుల్లో వచ్చేవాళ్ళ ఆనందం చెప్పలేననుకో. ఒకటే ఇకఇకలు పకపకలు. పాటలు, డాన్సులంటూ నడుం తిప్పడాలు, వుండి వుండి వెర్రికేకలు. ఏ బస్సులో నుంచో కారులో నుంచో బిర్యానీ పొట్లం వచ్చి నా ముందు వాలదా అని నాలుకతో చొంగ కారుస్తూ వున్నా. సడన్గా ఒక వస్తువేదో వచ్చి నా ముందు ఢామ్మని పడింది. ఆకలిగొని వున్న కుక్కని కదా నాలుక్కాళ్ళమీద లగెత్తా. సడన్గా వెనక కాలుని ఏదో గుచ్చుకుని రక్తం బొటబొటా కారింది అంది కుక్క కుయ్యిమంటూ.
కొంపదీసి ఏ ఖాళీ సారా సీసా పగిలిన ముక్కో కదా గదా అంది గాడిద.
ఎంత కరెక్టుగా చెప్పావు గాడిద గూరూ! బస్సుల్లో సీట్లల్లో కూచున్న వాళ్ళకి ప్లాస్టిక్ గ్లాసుల్లో మందూ జగ్గుల్లో నీళ్ళు సప్లయి చేశారు హుషారుగా సభకి రావాలని. ఎవడో ఖాళీ సీసాని కిటికీలోంచి రోడ్డుమీదికి విసిరి కొట్టాడు. అది మరేదో అని ఆశపడి వెళ్ళిన నాకు తగిన శాస్తే జరిగింది. బోలెడు రక్తం కారింది. నొప్పి కాలు కింద పెట్టనిస్తే కదా! మూడు కాళ్ళ మీద అరుగు మీదికి చేరాల్సి వచ్చింది అంది కుక్క.
తాగితే తాగారు ఊగితే ఊగారు బంగారు తెలంగాణలో ఆ మాత్రం ఎంజారు చెయ్యాల్సిందే! కానీ స్వచ్ఛభారత్ అన్నారు కదా సీసాలు అలా విసిరేయకుండా పొడి చెత్త డబ్బాలో వేయచ్చు గదా అంది గాడిద.
స్వచ్ఛ భారతా! ఆ మాట చెప్పే కళ్ళజోడు సరిగ్గా చూశావా స్వచ్ఛ ఉన్న చోట భారత్ లేదు భారత్ వున్న చోట స్వచ్ఛ లేదు. వదిలెయ్యి. ఈ తలనొప్పి తెలీకుండా వుండటానికి ఆ సభ విశేషాలు తెలిస్తే చెబుదూ అని గాడిదని రిక్వెస్టు చేసింది కుక్క.
ఏం చెప్పను పేపర్ వెయిట్లంత కళ్ళూ హైబ్రీడ్ అరటి పండు తొక్కంత చెవులూ ఉండబట్టి సభ చివర వున్న మైకు కింద కూచుని విన్నాను కంటికి కనపడింది చూశాను. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనుకునే వాళ్ళూ, ఆలస్యం అమృతం విషం అని భయపడేవాళ్ళూ పెద్ద ఎత్తున తిరునాళ్ళు జరిపించారు. జనం ఇరగబడ్డారనుకో. రాజు తల్చుకుంటే బిర్యానీ పొట్లాలకు, బీరు బ్రాందీ విస్కీలకు, నోట్ల కట్టలకు కొదవా అంది గాడిద.
ఇంతకీ విషయమేమిటో అడిగింది కుక్క కాలు నొప్పి కాస్త మరిచిపోయి.
నైరుతీ తురుపవనాల్ని జూన్లో కాకుండా డిసెంబర్లో లాక్కురాలేమా అంటున్నారు. ప్రజల కోసం ఏమేం చేశారో దండోరా వేశారు అంది గాడిద చెవులు దులుపుకుంటూ.
ఏయేం చెయ్యలేదో చెయ్యలేకపోయారో ఎందుకు చెయ్యలేకపోయారో చెప్పారా ఎవరైనా అంది కుక్క అమాయకంగా.
మళ్ళీ కిరీటం పెడితే ఏమేం చేస్తారో చెప్పారు. ఈ పార్టీ వాళ్ళు చెయ్యలేకపోయిన వాటిని గురించి మరో పార్టీవాళ్ళు కదా సభ పెట్టి చెప్పాల్సింది అంది గాడిద.
కిరీటం వున్న పార్టీ వాళ్ళకి సభ జరుపుకోవడానికి దొరికినంత తేలిగ్గా పర్మిషన్లూ అవీ వేరే పార్టీ వాళ్ళకి చిక్కుతాయా? అయినా జనం అంతా ఈ వైపునే వుంటే ఆ వైపు సభలకి ఎవరు వస్తారులే అంది కుక్క.
నీకూ పాలిటిక్సు బాగానే అర్ధం అవుతున్నట్టుంది. జనం సంగతి నీకు తెలీదు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తే ఏ పార్టీ అయినా, ఏ జెండా అయినా, ఏ సభ అయినా ఒకటే. హుషారుగా ఊగుకుంటూ వస్తారులే అంది గాడిద.
జనానికే కాదు నాయకులకీ అంతేకదా! ఏ పార్టీ టిక్కెట్టు దక్కితే అదే వారి పార్టీ, వారి జెండా, పదవే అజెండా అంది కుక్క.
సభల దారి సభలదీ, ఓట్ల దారి ఓట్లదీ, నాయకుల దారి నాయకులదీ, ప్రజల దారి ప్రజలదీ అంది గాడిద ఆవలిస్తూ.
- చింతపట్ల సుదర్శన్, 9299809212