Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాన్ని ఎలాగైనా సరే నాశనం చెయ్యాలి అంది ఆమె. దాని అంతు చూడాల్సిందే! చూడకపోతే నా కొంప కొల్లేరయిపోతుంది. కొంప కూలిపోతుంది అందామె పళ్ళు నూరుతూ. అయితే చంపేస్తే సరి అంది పక్కన వున్న విలన్ నెంబర్ టూ. అదే ఎలాగ చంపడం అని ఆలోచిస్తున్నా అన్నది ఆమె. ఎలాగేముందమ్మా ముఖం మీద పులిపిరీ బోడిగుండూ బుర్రమీసాలూ వున్నవాణ్ణి పిలుచుకు వస్తాను అన్నది నంబర్ టూ విలన్. ఎంత డబ్బయినా సరే పని జరిగిపోవాలి 'అది' చచ్చి తీరాలి అంది ఆమె.
ఆమె తన శత్రువుని ఫినిష్ చేసెయ్యాలనుకుంటున్నది. ఆమె ఎవరు? ఆమె శత్రువు ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరిని చంపాలనుకుంటున్నది?
ఆమె తల్లి! ఆమె చంపాలనుకుంటున్నది తన కన్న కూతుర్నే!!
ఎలాగైనా సరే వాళ్ళని ఒకటిగా వుండనీయను అందామె కనుబొమ్మలు ముడేస్తూ కళ్ళు ఎగరేస్తూ. ఈ లోకంలో నేను చెయ్యాల్సిన పనంటూ ఏమీ లేదు ఈ ఒక్కటి తప్ప. ఇది జరిగి తీరాల్సిందే. వాళ్ళు కల్సి నవ్వకూడదు. కల్సి మాట్లాడరాదు. కల్సి నవ్వరాదు. వాళ్ళని వేరు చెయ్యడం కోసం నేను ఏమైనా చేస్తాను, చేసి తీరతాను అంది ఆమె ముఖం నిండా కసినీ నలుపు రంగునీ ములుముకుని. వాళ్ళని విడదీయడానికి వాళ్ళ ప్రాణాలు పోయినా నా ప్రాణాలు హుష్కాకి అయినా సరేనని కొంగు బిగించింది ఆ వీరవనిత.
ఆమె తనకు దక్కకుండా పోయిన మొగవాడికోసం వాడి కొంప అంటించి బూడిదయ్యాక ఆర్పేయడం కోసం రడీ అయిపోయింది. ఆమె విడదీయాలనుకున్నది ఓ భార్యనీ ఓ భర్తనీ.
ప్రేమ గుడ్డిదీ మూగదీ చెవిటిదీ అని అప్పుడప్పుడు రుజువవుతుంటుంది. అలాంటప్పుడు కులమూ మతమూ పేదా రిచ్చీ రంగూ రుచీ వాసనల సంబంధం వుండదు. అయితే పరువు అనే బరువు ఉన్నవాళ్ళు ఎప్పుడూ దీన్ని స్వాగతించలేరు, హర్షించలేరు. క్లాప్సు కొట్టలేరు. అందువల్ల ఇంటి కోడలయిన పనిమనిషిని నానా హింసలూ పెట్టాలని ఆమె అంతు చూడాలని డిసైడైపోతుంది ఓ పరువుకు ప్రాణం తీస్తే యిచ్చే మహిళ.
విడదీయడమే ఆదర్శం. ఎన్ని ఏళ్ళయినా ఎంత దగ్గరగా ఒకరికి ఒకరు కల్సి వున్నా వాళ్ళు ఇద్దరూ ఒకరికి ఒకరు ఏమౌతారో తెలియడానికి వీల్లేదు. ఏ నిమిషమూ ఒదలకుండా వెంటే వుండి వారిని విడదీయడమనే ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఓ పడుచు పడే పాట్లు మామూలువేం కాదు. ఆమె విడదీయదల్చుకున్నది ఎవరినో కాదు ఓ తండ్రినీ ఆ తండ్రి కూతుర్నీ!
మనిషన్నాక జీవితంలో ఓ లక్ష్యంతో బతకాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి సాహసించాలి. అత్తంటే ఉత్త అమాయకపు ఆడమనిషి కాదు. ఆడపులి. పులికి లేడి ఎంతో 'లేడీ' అయిన కోడలు అత్తకు అంతే. పులిపంజా విసిర్తే లేడి మెడవాల్చేస్తుంది. మరి అత్త? కోడల్ని చంపాలనుకున్న అత్త ఊరుకుంటుందా? తేనెలాంటి విషం యిచ్చో అరుగుమీద ఆయిల్ పోసో సాంబారులో బల్లి వేసో చంపాల్సిందే మరి. తన సొంత కొడుకు భార్యని అనగా తన కోడల్ని కడతేర్చాలని అనేక ప్లాన్లు అమలు చేస్తుంది అత్త.
ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్న పాట రాకపోయినా అదే అయిడియాతో అన్నల మీద ప్రేమతో, ఒకడి మీద ద్వేషం పెంచుకుని, ఏదో ఓ కేసులో ఇరికించి జైలుకి పంపాలని ప్లాన్లు గీస్తుంది ఓ విలన్ లేడీ. ఆమె జైలుకి పంపాలనుకుంటున్న వ్యక్తి ఆమె భర్తే! ఆ భర్త భార్యే ఆమె!
కుంకుమపువ్వు చెవిలో పెట్టడం, ఏ మాసంలోనైనా కార్తీకదీపం వెలిగించడం, కథలో రాజకుమారికి చెమటలు పట్టించడం, చిలకబోనులో కోయిలమ్మను బంధించడం, చంపడమే లక్ష్మీకళ్యాణం అని భావించడం, అగ్నిసాక్షిగా సొంత కొంపకి నిప్పంటించడం తెలుగు టీవీ సీరియళ్ళ గొప్పతనం. ఆడవాళ్ళే దుష్ట దుర్మార్గ 'ప్రతినాయికలు'గా కన్నార్పకుండా చూసేవారి కంట్లో పొడుస్తుండడం వాటి ప్రత్యేకత!
- చింతపట్ల సుదర్శన్,
9299809212