Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మారుతున్న సవాళ్ల వల్ల కొన్ని సందర్భాలలో సంతోషంగా, ఆశావాద దృక్పథంతో ఉండడం కష్టమే. ఎవరు మాత్రం సంతృప్తిగా జీవించడానికి ఇష్టపడకుండా ఉంటారు? అలా ఉండాలని అందరూ కోరుకునేదే.. కానీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని సంతోషంగా ఉండే ఆలోచన, సమర్థత అందరికీ ఎందుకు రావడం లేదు? ఏదైతేనేం.. సంతోషంగా ఉండే ఆ రహస్యం మన చుట్టూనే ఉంది. సహజ సిద్ధంగా పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా అందుతుంది. సరైన మానసిక స్థితి, ఆలోచనా విధానం మనకు అందుబాటులోనే ఉంటే ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? సాధ్యమైనంత సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే.. సరైన పోషకాలు కలిగిన భోజనం తీసుకోలేకపోవడం వల్ల కావచ్చు.. డిప్రెషన్‌ను దూరం చేసే కొన్ని పోషకాలు, విటమిన్ల గురించి తెలుసుకుందాం..
కాల్షియం : కాల్షియం మన శరీరంలో ఎక్కువగా వ్యాపించి ఉన్న మినరల్. ఇది దృఢమైన ఎముకలు, ఆరోగ్యకరమైన రక్తాన్ని అందిస్తుంది. డయాబెటిస్‌ను దూరంగా ఉంచడానికి ఇదొక మంచి పోషకం. కాల్షియం తక్కువగా ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహిళలు ఎదుర్కొనే పీఎంఎస్ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా కాల్షియం సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశోధనలు వెల్లడించాయి. అందువల్ల మహిళలకు సరైన కాల్షియం మోతాదు తప్పనిసరిగా అందాలి.
ఉండే పదార్థాలు : ఫ్రోజెన్కాలే, తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగు, ఆకుకూరలు
క్రోమియం : క్రోమియంను శరీరంలో కొత్తగా కనుగొన్నారు. జీవక్రియలో దీని పాత్ర కీలకం. డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. ఈ పోషకాన్ని తగిన మోతాదులో తీసుకోకపోతే శరీరంలోని ఇన్సులిన్ పనితీరు మందగించి, డయాబెటిస్ సంబంధిత సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. వినికిడి లోపం, అధిక రక్త పోటు సంబంధిత సమస్యలకూ దారి తీస్తుంది. క్రోమియం మెదడులోని నాడీవ్యవస్థలోని సెరటోనిన్, మెలటోనిన్, నోరెపినెప్రైన్ స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల మానసిక స్థితిలో మార్పులు ఏర్పడతాయి.
ఉండే పదార్థాలు : సీమకోడి మాంసం, బంగాళదుంపల గుజ్జు, సంపూర్ణ గోధుమతో తయారైన మఫిన్స్, గ్రేప్ జ్యూస్, బ్రొకొలీ
ఫోలేట్ : ఫోలేట్‌ను ఫోలిక్ యాసిడ్ లేదా బి9 అని కూడా అంటారు. ఇది సరైన మానసిక స్థితిఉండడానికి కీలకమైన పోషకం. శరీరంలో కొత్త కణాలు ఏర్పడడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. సెరటోనిన్‌ను అదుపులోఉంచుతుంది. సెరటోనిన్ మెదడుకు నరాలకు అనుసంధానంగా వ్యవహరిస్తుంది. శరీరంలో సరైన స్థాయిలో ఫోలేట్ లేకపోతే సెరటోనిన్ స్థాయి పెరిగి అలసటకు కారణమవుతుంది.
ఉండే పదార్థాలు : అవకాడో, బ్రెస్సెల్ స్ప్రౌట్స్, స్పియర్ యాస్పాగరస్, అలసందలు, పాలకూర
ఐరన్ : మనిషి మనుగడకు శరీరంలో ఐరన్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుంది. కండరాల దృఢత్వానికి దోహదపడుతుంది. ఈ పోషకం మానసికంగా బాగుండడానికి చాలా అవసరం. తక్కువ స్థాయిలో ఐరన్ ఉండడం అంటే మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టే.. ఐరన్ లోపం పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. యుక్త వయసు వచ్చిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఉండే పదార్థాలు : సీమకోడి మాంసం, సోయాబీన్స్, ఓట్ మీల్, గొడ్డు మాంసం
మెగ్నీషియం : శరీరానికి అవసరమైన మినరల్స్‌లో మెగ్నీషియం కీలకమైంది. దీని మోతాదు తక్కువగా ఉంటే ఒత్తిడి అధికమవుతుంది. మానసిక సంఘర్షణ, చిరాకు ఏర్పడుతుంది. మానసిక స్థితిని సరిగా ఉంచే సెరటోనిన్ సమస్థాయిలోఉండడానికి దోహదపడుతుంది.
ఉండే పదార్థాలు : చిక్కుళ్ళు, పల్లీలు, జీడిపప్పు, పాలకూర, బాదం
ఒమెగా 3ఎస్ : మెదడు ఆరోగ్యానికి ఒమెగా 3ఎస్ ఫ్యాటీ యాసిడ్ ముఖ్య భూమిక పోషిస్తుంది. మానసిక సంఘర్షణను తగ్గించి, మెదడు తీరును మెరుగుపరుస్తుంది. ఆత్మహత్య ఆలోచన, మానసిక ఒత్తిడులను నివారించడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శక్తివంతంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.
ఉండే పదార్థాలు : పాలకూర, ఫిల్లెట్ అట్లాంటిక్ సాల్మన్ చేప, చియా గింజలు, చైనీస్ బ్రొకొలీ
విటమిన్ బి6 : మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి బి6 విటమిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వల్ల కూడా నాడీ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. శరీరంలో బి6 స్థాయి తగ్గిపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మానసిక కుంగుబాటు, అస్థిర ఆలోచనలు వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అంతేకాదు మహిళల్లో ప్రసవానంతరం వచ్చే నిరాశను తగ్గించేందుకు పోషకాలతో నిండిన బి6 విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
ఉండే పదార్థాలు : ఎముకలు చర్మం లేని చికెన్ బ్రెస్ట్, సాల్మన్ చేప, శెనగలు
విటమిన్ డి : విటమిన్ డి ఆరోగ్య పరిరక్షణకు, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుంది. విటమిన్ డి కలిగిన పదార్థాలను కాల్షియం సంబంధిత ఆహారంతో కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. పురుషులు, స్త్రీలలో నిరాశను దూరం చేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. సూర్యకాంతి ఒంటి మీద పడకపోతే విటమిన్ డికి సంబంధించిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే శారీరంగా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఉండే పదార్థాలు : పాలు, పుట్టగొడుగులు, స్వార్డ్ ఫిష్ (కత్తి చేప), సాల్మన్ చేప, గుడ్లు, పెరుగు
విటమిన్ బి12 : ఎర్ర రక్తకణాల పెరుగుదలకు, నరాల సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విటమిన్ బి12 తప్పనిసరిగా తీసుకోవాలి. సరిగా తీసుకోకుంటే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంది. అలసట పెరిగి మానసిక సామర్థ్యం తగ్గుతుంది. ఇవన్నీ మానసిక రుగ్మతకు చిహ్నాలు.
ఉండే పదార్థాలు : చీజ్, ఫిల్లెట్ సాకీ సాల్మన్, ఫిల్లెట్ రైన్బో ట్రౌట్,గుడ్లు, మాంసం
జింక్ : ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచడంలో జింక్ ఎక్కువగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. తగిన మోతాదులో తీసుకోకపోతే వెంట్రుకలు రాలిపోవడం, ఎనీమియా, ఆకలి మందగించడం, మానసిక సమస్యలు, తక్కువ రోగ నిరోధక శక్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శాఖాహారులు మాంసాహారుల కంటే 50 శాతం అధికంగా జింక్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాల్సిఉంటుందని ఈ మధ్య వెల్లడైన పరిశోధనల్లో స్పష్టమైంది.
ఉండే పదార్థాలు : చీజ్,వేయించినకాజు, వేయించిన గుమ్మడికాయ విత్తనాలు
సమస్య వచ్చినపుడు ఎదుర్కొనడం కంటే రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే సమస్యను కొంతమేర తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
- అంకం రమాదేవి