Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏర్పరుచుకున్న జీవిత లక్ష్యానికి అనుగుణంగానే అంతర్గత సామర్థ్యం పెరుగుతుంది. ప్రతిభ వెలికి వస్తుంది. ఈ ప్రక్రియకు వయస్సుతో సంబంధంలేదు. మనకున్న ప్రతిభలో చాలా తక్కువ శాతాన్నే వినియోగించుకుంటున్నాం. పూర్తి స్థాయిలో ప్రతిభకు సానబెట్టి, ఆచరణలో పెట్టినట్లయితే ఈ అద్భుత ప్రపంచం మరింత ముందుకు వెళుతుంది. సహజ వనరులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయి. ప్రజల కనీస అవసరాలు తీరుతాయి. అక్షరాలా ఇది వాస్తవం. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తికి తావులేదు.
లక్ష్యం ఏర్పరుచుకోగానే సరిపోదు. ఆ లక్ష్యాన్ని ఆచరణలో పెట్టినపుడే అది సాకారమవుతుంది. అందుకే ఈ ప్రపంచానికి కారణాలు చెప్పేవాళ్లు కాదు, కార్యాలు చేసేవాళ్లు కావాలి. తత్వ్తవేత్తలు ఈ ప్రపంచాన్ని వివిధ రకాలుగా మాత్రమే వర్ణించారు. కానీ దానిని మార్చాలన్న మంచి సూక్తిని మార్కిస్టు మహోపాధ్యాయుడు కారల్‌మార్క్స్ ఏనాడో చెప్పారు. ఆచరణీయమైన ఈ వాస్తవం తెలియక అనేక మంది నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ బతుకింతే అని సరిపెట్టుకుంటున్నారు. పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నవారు ధనవంతులవుతారని, పాపం చేసుకున్నవారు పేదలుగా మిగిలిపోతారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అజ్ఞానం అనే అంధకారంలోకి ప్రజలను నెడుతున్నారు. తమ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు పూర్వ జన్మ, మరో జన్మ అంటూ ఏమీ లేవు. మనకున్నది ఒక్కటే జన్మ. ఈ పుట్టుకను సంపూర్ణంగా వినియోగించుకుందాం. అర్థవంతమైన జీవితాన్ని గడుపుదాం. ఈ ప్రపంచ పురోభివృద్ధికి మన వంతు సహకారాన్ని అందిద్దాం. మరణించిన తరువాత ప్రజలు గుర్తు చేసుకునేలా మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం.
మన లక్ష్యానికనుగుణంగా సామర్థ్యం ఎలా పని చేస్తుందో ఒక సారి పరిశీలిద్దాం. ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు. అదే దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ కొంచెం ఎత్తుగా వుంది. సైకిల్ని దాని పైకి ఎక్కించలేకపోతున్నాడు. ఆ సమయంలో మీరు అటునుండే నడుచుకుంటూ వెళ్తున్నారు. సహాయపడమని ఆ పిల్లవాడు అర్థించాడు. వెంటనే మీరు స్పందించారు. అదే సమయంలో అక్కడికి ఒక స్కూటరిస్టు వచ్చాడు. ఆయన వాహనంలో పెట్రోల్ అయిపోయింది. స్పీడ్ బ్రేకర్ ఎక్కించేందుకు ఆయన శక్తి సరిపోలేదు. అపుడు మీ సహాయాన్ని అతను కూడా అర్థించాడు. ఈ సారి మీరు కొద్దిగా ఎక్కువ బలాన్ని ఉపయోగించారు. స్కూటర్ వెళ్లిపోయింది. అదే సమయంలో అక్కడికి ఒక కారొచ్చింది. ఇంజన్లో లోపంతో ఆగిపోయింది. సమీపంలో ఒక మెకానిక్ ఉన్నాడు. అక్కడ వరకు కారు తోయమని ఆ వాహనదారుడు అడిగారు. దానిని తోసేందుకు మూడవసారి మీరు బలాన్ని ఇంకాస్త ఎక్కువ ఉపయోగించాల్సి వచ్చింది. ఆ సమయంలో రెండు చేతులతో నెట్టారు. సైకిల్, స్కూటర్, కారు.. మూడు వాహనాలకూ సాయం చేశారు. వివిధ సందర్భాల్లో లక్ష్యానికనుగుణంగా మీలోని శక్తి వెలికి వచ్చింది. వాహన దారుల ప్రయోజనాన్ని మీరు నెరవేర్చారు. మిత్రమా.... ఈ ఫార్ములా నిత్య జీవితానికీ వర్తిస్తుంది.
స్పష్టమైన లక్ష్యాలు లేకుండా బతకటమనేది, దట్టమైన పొగమంచులో వాహనం నడపడం లాంటిది. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం అంటే పొగమంచును తొలగించుకోవడమే. జీవితమనే వాహనాన్ని జాగ్రత్తగా నడుపుకోవడమే. పుట్టుకతోనే నిక్షిప్తమై ఉన్న శక్తి అసాధారణమైనది. ఎలాంటి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా, దానిని సాధించగల సామర్థ్యం అంతర్గతంగా ఉంటుంది. మీకేం కావాలో, దాన్నెలా సాధించుకోవాలో స్పష్టంగా తెలుసుకునేందుకు అవసరమైన సమయాన్ని వెచ్చించటం మీ బాధ్యత. నిర్ణయించుకున్న లక్ష్యాల పట్ల స్పష్టత ఉంటే, జీవితాన్ని చక్కగా గడిపేందుకు కావలసిన శక్తి సాధించగలుగుతారు. ప్రపంచంలో సగటు మనిషి తనలోని 10 శాతం శక్తినే ఉపయోగించుకుంటున్నాడు. మిగిలిన 90 శాతం శక్తి వృధాగా పోతున్నది. దానిలో కనీసం ఇంకా 20 శాతం ఉపయోగించుకోగలిగినా గొప్ప మార్పు వస్తుంది.
- జి గంగాధర్ సిర్ప,
9010330529