Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ పాఠశాలకు ఆ చెట్టు మరింత అందాన్నిచ్చింది. ఆ చెట్టు వయసు సుమారు రెండు వందల సంవత్సరాలుంటుందని అందరూ అనుకునేవారు. విద్యార్థులు ఆ చెట్టుని ఒక గుడి లాగా భావించేవారు. పరీక్షలు జరిగే రోజులలో ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుని, ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షా హాలులోకి ప్రవేశించేవారు.
అర్ధ సంవత్సర పరీక్షలు ముగిశాయి. బడికి శెలవులు ఇచ్చారు. ఆ రోజు వాతావరణంలో మార్పులు వచ్చింది. కొద్దికొద్దిగా పడిన చినుకులు జోరందుకుని మూడు రోజులు భారీ వర్షం కురిసింది. మూడోరోజు బలంగా వీచిన గాలికి బడి ముందున్న ఆ పెద్ద చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. వర్షం పూర్తిగా నిలిచి పోయాక ఊరివారందరూ కూలిపోయిన ఆ చెట్టుని చూడటానికి వచ్చారు. బడి పిల్లలందరూ గుమికూడి బాధగా ఆ చెట్టు వైపు చూశారు.
పదవ తరగతి విద్యార్థులందరూ పడిపోయిన ఆ చెట్టు గురించి చర్చించుకుంటున్నారు. స్కూల్ హెడ్మాస్టర్ వేరు ఊరిలో ఉండటం వల్ల రాలేకపోయారు. బడిలో ప్రవేశించే దారికి అడ్డంగా ఆ చెట్టు పడివుండటం వల్ల ఇద్దరు వ్యక్తులు రంపం ,గొడ్డలి తీసుకొని వచ్చారు.
పదవతరగతి విద్యార్థులు ఒక్కసారిగా వారికి అడ్డంగా నిలబడి ''దయచేసి ఎవరూ ఈ చెట్టుకొమ్మలను నరకొద్దు'' అన్నారు.
''ఈ చెట్టుని ఇలా వదిలేస్తే దారికి అడ్డంగా వుండి రాకపోకలకు ఆటంకం అవుతుంది'' అన్నాడు ఆ వ్యక్తి.
''ఆ చెట్టును మరలా నాటుదాం'' అన్నారు విద్యార్థులు.
వారి మాటలకు అక్కడున్న వారందరూ నవ్వారు.
వారి నవ్వును పట్టించుకోకుండా ''మీరు మాకొక్క అవకాశం ఇవ్వండి.ప్లీజ్'' అంటూ అభ్యర్థిస్తున్నట్టుగా చేతులు
జోడించారు. అక్కడకు వచ్చిన స్కూల్ మాస్టర్లతో తమ నిర్ణయాన్ని తెలిపారు. వారి ప్రయత్నానికి అడ్డు చెప్పకుండా సరేనంటూ అంగీకరించారు.
ఆఫీస్ ముందు గుమికూడిన విద్యార్థులను కలెక్టర్ చూసి లోనికి పంపమని ఆదేశించారు. విద్యార్థులందరూ కలెక్టర్ ఆఫీస్‌లోనికి ప్రవేశించారు. విద్యార్థులు తమ కోరికను చెప్పారు.
''బాబూ.. పడిపోయిన చెట్టును క్రేన్‌ని ఉపయోగించి తిరిగి మరోచోట నాటించాలనే మీ ఉద్దేశ్యం గొప్పది. కానీ జిల్లాలో చాలాచోట్ల పడిపోయిన చెట్లను తొలగించడానికి వున్న క్రేన్లన్నింటినీ పంపించాం'' అన్నారు కలెక్టర్.
''సార్, మేం క్రేన్ కోసం ప్రయత్నిస్తే ఇదే సమాధానం వచ్చింది. మీరు తలచుకొంటే మా ఊరికి క్రేన్ పంపడం పెద్ద సమస్య కాదు'' అన్నారు విద్యార్థులు.
''బాబూ క్రేన్ ఒక్కటి మాత్రం వస్తే సరిపోదు. చాలా మంది పనివారు కావాలి'' అన్నారు కలెక్టర్.
''సార్, మా బడి విద్యార్థులు, మాస్టర్లు, మా ఊరి ప్రజలందరూ కలసి ఇప్పటికే పడిపోయిన చెట్టుకు కొద్దిదూరంలో పెద్ద గుంత తవ్వి వుంటారు. ఎటువంటి సహాయం కావాలన్నా వారు చేస్తారు'' అన్నారు విద్యార్థులు.
కలెక్టర్ వెంటనే ఆ ఊరికి ఒక క్రేన్ పంపడానికి అంగీకరించారు. విద్యార్థులలో ఒక అబ్బాయి ''సార్, మీరు తప్పుగా అనుకోనంటే ఒక చిన్న సలహా చెప్పమంటారా?'' అన్నాడు.
చెప్పమన్నట్టుగా తలా ఆడించారు కలెక్టర్.
''సార్ పడిపోయిన చెట్లను నరికి తొలగించే బదులు, వాటిని వేరొక చోట నాటించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా'' అన్నాడు.
కలెక్టర్ ఒక్కసారిగా కుర్చీలోనుండి లేచివచ్చి ఆ విద్యార్థిని ప్రేమగా దగ్గరగా తీసుకొని ''నీది చాలా చాలా మంచి ఆలోచన. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో అదొక పెద్ద సమస్య కాదు. వాటికి తగ్గ నిధులు, వాహనాలు ఏర్పాటు చేసుకొని ఉంచుకోవాలి. విద్యార్థులైన మీ ఆలోచనతో మీ ఊరిలో కూలిపోయిన చెట్టు నాటడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ముందుముందు కూలిన ప్రతి చెట్టుని నాటడానికి నాంది అవుతుంది'' అన్నారు కలెక్టర్.
- ఓట్ర ప్రకాష్‌రావు,
09787446026