Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేరె సప్నోంకి రాణి కభ్ ఆయేగితూ...', 'కభీ కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆతా హారు', 'పర్దేశి యోన్సే నా అఖియా మిలానా..' ఇలా ఒకటేమిటి హిందీ సినిమాకు సంబంధించి అనేకానేక సినిమాల్లోనూ, పాటల్లోనూ కాశ్మీరీ అందాలు వెల్లివిరుస్తాయి. అలనాటి సినిమాల్లో ప్రేమ, రోమాన్స్లకు కాశ్మీర్ పర్యాయపదం. అక్కడి అందమయిన దృశ్యాలు దాల్‌లేక్ నీలిదనం, చెట్ల పచ్చదనం, హిమాలయాల తెల్లని మెరుపు ప్రధాన నేపథ్యాలుగా అప్పటి సినిమాలు రూపొందాయి.
స్వాతంత్య్రానంతర కాలం నుంచి బాలీవుడ్ సినిమాకు లవ్, రొమాన్స్‌లు ప్రధాన ఇతివృత్తాలు. అందుకే కాశ్మీర్ అప్పటి చలన చిత్రకారులకు స్వర్గధామంగా నిలిచింది. జంగ్లీ, కాశ్మీర్ కి కలీ, జబ్ జబ్ ఫూల్ ఖిలే, కభీ కభీ, ఆప్ కీ కసం, బాబీ, సిల్ సిలా, బెతాబ్ ఇలా ఎన్నో సినిమాలు కాశ్మీర్ అందాల్ని అందిపుచ్చుకొని ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ కాలంలో సినిమా వాళ్లకు కాశ్మీర్ అంటే కేవలం లొకేషన్లు మాత్రమే తప్ప అక్కడి జీవన పరిస్థితులు, అక్కడి స్థానిక నటులు తదితర అంశాలేవీ పట్టేవి కావు. నిజానికి కాశ్మీర్ నుంచి బాలీవుడ్లో ఎదిగి వచ్చిన నటులు అతి స్వల్పం. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకప్పటి హీరో రాజ్‌కుమార్ (కుల్‌భూషణ్ పండిట్) నీల్ కమల్ నుంచి అనేక సినిమాల్లో హీరోగా నటించి తనదయిన ప్రత్యేక సంభాషణల ఒరవడితో నిలదొక్కుకున్న నటుడు రాజ్ కుమార్. ఇంకా కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళల్లో అనుపమ్ ఖేర్, రాజ్ జుత్సి, రాహుల్ భట్, ఆర్కే రాయినా, ఎంకే రాయినా, రోహిత్ రాయినా, ఆమిర్ బషీర్, లలిత్ పరిమో, సోని రాజ్ దాన్ లాంటి వాళ్ళు కొంత నిలదొక్కుకున్నారు. తొలిరోజుల్లోనే సప్రూ, అతని కొడుకు తేజ్ సప్రూ, జీవన్ అతని కుమారుడు కిరణ్ కుమార్‌లు బాంబే సినిమాల్లో స్థానం సంపాదించుకున్నారు. కాని అత్యధిక శాతం కాశ్మీర్ కేవలం అందాలకే పరిమితమయింది. తర్వాతి కాలంలో కాశ్మీర్లో పెల్లుబికిన ఉగ్రవాదం లాంటి సమస్యల మీద సినిమాలు తీసినప్పటికీ ఆయా సినిమాల్లో కాశ్మీరీ పాత్రలక్కూడా బాంబే నటులే నటించడం చూసాం. కేవలం పఠాన్ పాత్రలకు మాత్రమే కొంతమంది కాశ్మీరీ కళాకారులకు అవకాశమొచ్చేది. అవే కాదు రోజా, దిల్ సే, మిషన్ కాశ్మీర్, యహా, చాహా, రాక్‌స్టార్, హైదర్, హారు వే, ఫనా లాంటి అనేక సినిమాలు కాశ్మీర్ నేపధ్యంలో వచ్చినప్పటికీ వాటిల్లో హిందీ తదితర ప్రధాన నటులే తప్ప కాశ్మీరీ నటీనటులకు అవకాశాలే రాలేదు.
నిజానికి మొదట్లో కాశ్మీరీ భాషా చలన చిత్రాల నిర్మాణం కూడా కాశ్మీర్లో జరిగింది. అట్లా వచ్చిన మొట్టమొదటి కాశ్మీరీ సినిమా 'మైంజ్ రాత్' 1964 లో విడుదలయింది. జగజీ రాం దర్శకత్వం వహించారు. ఇది ఉర్దూ, కాశ్మీరీ భాషల్లో విడుదలయిన ద్విభాషా చిత్రం. తర్వాత 1972 లో కాశ్మీరీ కవి మహజూర్ జీవిత చరిత్ర ఆధారంగా 'షాయర్ ఎ కాశ్మీర్ మహ్జార్' సినిమా వచ్చింది. దర్శకుడు ప్రభాత్ ముఖర్జీ జమ్మూకాశ్మీర్ సమాచార శాఖ సహకారంతో ఈ సినిమాను రూపొందించారు. తర్వాత నాలుగు దశాబ్దాలకు కాశ్మీరీ సినిమా 'బాబాజీ' రూపొందింది. జ్యోతి సారూప్ దర్శకత్వం వహించిన 'బాబాజీ' కాశ్మీర్లో విడుదల కాలేదు. తర్వాత 'ఇన్హలాబ్' చిత్రం 1989లో నిర్మాణ మయినప్పటికీ అప్పటి ఆందోళనకర పరిస్థితుల్లో అది విడుదల కాలేదు. అప్పటినించి కాశ్మీరీ సినిమా ఉనికే లేకుండా పోయింది.
కాశ్మీర్ ఉగ్రవాదం, తిరుగుబాటు, చొరబాటు తదితర కారణాల వల్ల కేవలం నిర్మాణంలోనే కాదు ప్రదర్శన రంగం కూడా తీవ్ర ప్రభావానికి లోనయింది. 1989 లో వచ్చిన ఆందోళనకర పరిస్థితుల వల్ల కాశ్మీర్లో సినిమా టాకీసులన్నీ మూసేశారు. అందులో రాజధాని శ్రీనగర్‌లోని ఏడు థియేటర్లు కూడా మూసివేతకు గురయ్యాయి. ఫలితంగా కాశ్మీర్లో సినిమా నిర్మాణం కాదు వీక్షణం కూడా కరువయింది. దాంతో డిజిటల్ పైరసీ పెరిగిపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ చొరవతో 1996లో బ్రాడ్వే, రీగల్, నీలం లాంటి సినిమా హాళ్ళలో 'కరీబ్' లాంటి సినిమాలు ప్రదర్శితమయ్యాయి. కాని 2015 తర్వాత సినిమా హాళ్ళన్నీ మళ్ళీ మూతబడ్డాయి. కాని బషీర్ బద్గామీ, సిరాజ్ కురేషీ లాంటి వాళ్ళు రూపొందించిన టెలివిజన్ సినిమాలు నిర్మాణమవుతున్నాయి.
డాక్యుమెంటరీ విభాగంలో కాశ్మీర్ కొంత విజయాన్ని సాధించింది. అశ్విన్ కుమార్ రూపొందించిన 'పంపోష్', 'ఇన్‌శా అల్లా' డాక్యుమెంటరీలు కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యాయి.
ఇట్లా నిర్మాణ, ప్రదర్శనా రంగాల్లో కాశ్మీరీ సినిమా కుదేలయినప్పటికీ ఇటీవలి కాలంలో కాశ్మీరీ నటీనటులు సినిమాల్లో రాణిస్తూ తమ ఉనికి చాటుకుంటున్నారు. ప్రధాన స్రవంతి సినిమాలయిన 'నోట్ బుక్, హమీద్, లైలా మజ్నూ' లాంటి సినిమాల్లో కాశ్మీరీ నటులయిన మీర్ సర్వర్, మావుజం భట్, వికాస్ కుమార్ లాంటి నటులు ప్రధాన భూమికలను పోషించారు.
ప్రధాన స్రవంతి కంటే ఇండిపెండెంట్ సినిమాల్లో కాశ్మీరీ నటులు ముఖ్య భూమికలను పోషిస్తూ తమ సమస్యల్ని, తమ కథల్ని తామే తెరపైన ఆవిష్కరిస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఆమిర్ బషీర్ తీసిన 'హారుద్', మూసా సయ్యీద్ తీసిన 'వాలీ ఆఫ్ సెయింట్స్', డేనిష్ రెంజు తీసిన 'హాఫ్ విడో', హుసేన్ ఖాన్ రూపొందించిన 'కాశ్మీర్ డైలీ'. ఈ సినిమాల్లో కాశ్మీరీ జీవన సమస్యలు ప్రధాన ఇతివృత్తాలు కావడమే కాకుండా కాశ్మీరీల పాత్రల్ని స్థానిక నటీనటులు నటించడం ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇట్లా స్వతంత్రంగా సినిమాల నిర్మాణానికి ఉత్సాహవంతులు, కళాకారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ సమస్య కేవలం నిర్మాణమే కాదు, పంపిణీ ప్రదర్శన రంగాల్లో కూడా తీవ్రమయిన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. సినిమాహాళ్ళు మూసేసిన నేపధ్యంలో విడుదలక్కూడా నోచుకోని స్థితి వుంది. ఇక అశ్విన్ కుమార్ లాంటి దర్శకులు అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి రూపొందించిన 'నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్' లాంటి సినిమా సెన్సార్ కోరల్లో చిక్కుకొని, 8 నెలలపాటు నిలిచిపోయి, దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించింది. అశ్విన్ కుమార్ 'నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్' సినిమాను క్రౌడ్ ఫండింగ్ (సామూహిక పెట్టుబడి) తో నిర్మించాడు. అశ్విన్ కిక్ స్టార్టర్ వేదికగా అర్థించి డెబ్బై అయిదు వేల పౌండ్ల ఫండింగ్‌ని సాధించాడు. ఇట్లా మొత్తం మీద కాశ్మీర్ సినిమారంగం నిర్మాణ ప్రదర్శనా రంగాల్లో తీవ్రమయిన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారం ప్రోత్సాహకాలు కరువై సొంతంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నది. అదికూడా కొంతమంది ఔత్సాహికుల చొరవ అంకిత భావమే కాశ్మీరీ సినిమాకు ఊపిరి పోస్తున్నది.
అట్లాగే ప్రధాన స్రవంతి సినిమారంగం కాశ్మీర్ అందాల్ని మాత్రమే కాకుండా, తమ భాషా సినిమాని కూడా ప్రోత్సహించాలని కాశ్మీరీ దర్శకులు, కళాకారులూ కోరుకుంటున్నారు.
- వారాల ఆనంద్,
9440501281