Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయరామరాజు చంద్రగిరి రాజ్యాన్ని పాలించేవాడు. కొద్దికాలంలోనే ఆయన పాలన రామరాజ్యంలా వుందని ప్రజలు చెప్పుకున్నారు. రామరాజుకి చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందువల్ల తన రాజ్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించుదలచుకొన్నారు. పట్టణాలలో ఉన్న న్యాయాధికారి సమక్షంలో చిత్రలేఖనపోటీలు నిర్వహించి మొదటి మూడు బహుమతులు పొందిన చిత్రలేఖనములను రాజభవనమునకు పంపమని ఉత్తరువులు జారీ చేశారు. అలా తనదగ్గరకు వచ్చిన చిత్రాలలో ఉత్తమ చిత్రాన్ని ఎన్నిక చేసి గొప్ప బహుమతిని ఇవ్వదలచుకొన్నారు.
రాజు గారి ఆజ్ఞ ననుసరించి అన్ని పట్టణాలలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. న్యాయాధికారులు ఎంపిక చేసిన మొదటి మూడు బహుమతుల చిత్రలేఖనములను రాజుగారి దగ్గరకు పంపారు. పార్వతీపురం నుండి వచ్చిన మొదటి మూడు బహుమతులు పొందిన చిత్రలేఖనములు చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు. 'మొదటి బహుమతి పొందిన చిత్రలేఖనం కన్నా రెండు, మూడు బహుమతులు పొందిన చిత్రలేఖనాలు ఇంకా గొప్పగా ఉండటం గమనించారు. పార్వతీపురం న్యాయాధికారి ఎందుకిలా చేసాడని కోపంగా అనుకొన్నాడు మహారాజు.
మహామంత్రిని పిలిపించి ఆ చిత్రలేఖనాలు చూపించి ''పార్వతీపురం న్యాయాధికారికి మంచి పేరు ఉందికదా, ఎందుకిలా పొరపాటు చేశారు'' అడిగాడు.
''మహారాజా ఇప్పుడే ఆ న్యాయాధికారిని రమ్మని కబురంపుతాను'' అన్నాడు మహామంత్రి.
మహారాజు రమ్మన్నారన్న కబురందగానే పార్వతీపురం న్యాయాధికారి వచ్చాడు. మొదటి బహుమతికి ఎన్నిక చేసిన చిత్రాన్ని చూపిస్తూ ''ఏ ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని ఎంపిక చేసారు'' కోపాన్ని దిగమింగుకొని సాధారణ గొంతుతో అడిగాడు మహారాజు.
''మహారాజా, అతని కష్టాన్ని చూసి మొదటి బహుమతి ఇచ్చాను'' అన్నాడు న్యాయాధికారి.
''కష్టమైతే నాతో చెబితే అతనికి ధన సహాయం చేసేవాడిని కదా. బాగా చిత్రలేఖనం చేసిన ఆ రెండు మూడు బహుమతి పొందిన పిల్లలు ఎంత బాధపడివుంటారో తెలుసా?'' అన్నాడు మహారాజు.
'నేను మొదటి బహుమతి ఆ అబ్బాయికి ఇవ్వకుంటే, రెండు మూడు బహుమతులు పొందినవారితో పాటు మా ఊరి వారందరూ నన్ను న్యాయాధికారిగా వుండే అర్హతలేని వ్యక్తిని అనుకునేవారు'' అన్నాడు న్యాయాధికారి.
''ఏమిటి మీరంటున్నది? ఈ చిత్రానికి మొదటి బహుమతి ఇవ్వడానికి కారణమేమిటి?'' మహారాజు.
''మొదటి బహుమతి పొందిన ఆ అబ్బాయి రెండు చేతుల్లేని వికలాంగుడు. చిత్రాన్ని కాళ్లతో వేసాడు మహారాజా'' అన్నాడు న్యాయాధికారి.
న్యాయాధికారిని పొరపాటుగా అర్థం చేసుకున్నందుకు మనసులోనే క్షమాపణ చెప్పుకొన్నాడు మహారాజు. పార్వతీపురంలో కాళ్లతో చిత్రం వేసిన చిత్రాన్ని, రాజ్యంలో ఎన్నికయిన ఉత్తమ చిత్రంగా మహారాజు ప్రకటించారు.
- ఓట్ర ప్రకాష్ రావు,
09787446026